లెజండరీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బొబ్బా ధర్మారావు

12

డాక్టర్ బొబ్బా ధర్మారావు.. నిన్నటి తరానికి చెందిన ప్రముఖ వైద్యుడు, గొప్ప టీచర్. ఈతరం తప్పకుండా తెలుసుకోవాల్సిన అతి కొద్దిమంది గొప్ప వైద్యుల్లో ఆయనొకరు. కృష్ణా జిల్లాలోని కౌతరం అనే చిన్న గ్రామంలో పుట్టిన ఆయన ఎదిగిన తీరు అసామాన్యం. హైదరాబాద్ విముక్తి తర్వాత నైజాం హెల్త్ సర్వీసెస్‌లో చేరిన డాక్టర్ ధర్మారావు సివిల్ సర్జన్‌గా, సూపరింటెండెంట్‌గా, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. డాక్టర్ ధర్మారావు సేవలకు మెచ్చిన కేంద్రం కార్డియాలజీ ఫెలోషిప్ కోసం అమెరికాలోని ప్రఖ్యాత జాన్స్ హాప్‌కిన్స్ ఆసుపత్రికి పంపించి గౌరవించింది.

121
కృష్ణా జిల్లా కౌతరానికి చెందిన బొబ్బా వెంకట్రామయ్య-బుచ్చమ్మ దంపతులకు ధర్మారావు ఆగస్టు 12, 1920లో జన్మించారు. వీరిది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. వెంకట్రామయ్య-బుచ్చమ్మ దంపతులకు జన్మించిన 8 మంది సంతానంలో ధర్మారావు అందరికంటే చిన్నవారు. ఆయనకు ఇద్దరు అన్నయ్యలు అనంత పద్మనాభయ్య(భార్య వడ్లమూడి శకుంతలమ్మ, కౌతరం), రంగారావు (భార్య వేగుంట కనకమ్మ, భోగాపురం, పశ్చిమగోదావరి), మరియు లక్ష్మీనరసమ్మ (భర్త యలమంచిలి సూర్యానారాయణ, కోనికి, పశ్చిమగోదావరి జిల్లా), రంగనాయకమ్మ (భర్త లింగం సత్యానారాయణ, బొమ్ములూరు, కృష్ణాజిల్లా), దుర్గమ్మ (భర్త చలసాని గంగయ్య (నూజెల్ల కృష్ణాజిల్లా), యశోదమ్మ (భర్త మాగంటి వెంకటరామదాస్, తమిర్సా, కృష్ణా జిల్లా), శకుంతలమ్మ (భర్త లింగం సత్యానారాయణ (బొమ్మలూరు, కృష్ణా జిల్లా) సోదరీమణులు ఉన్నారు. ధర్మారావు తండ్రి వెంకట్రామయ్యగారు ధర్మారావు చిన్నతన్నoలోనే చనిపోయారు. దీంతో ఆయన సోదరుడు రంగారావు ఆయనను చదివించారు. కౌతరం, మచిలీపట్నంలలో ప్రాథమిక, హైస్కూలు విద్యాభ్యాసం కొనసాగింది. అనంతరం ఆంధ్రా మెడికల్ కాలేజీలో చేరి ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేశారు.

నైజాం హెల్త్ సర్వీసెస్‌లో చేరిక

ఎండీ పూర్తి చేసిన డాక్టర్ ధర్మారావు హైదరాబాద్ విముక్తి తర్వాత 1948లో నైజాం హెల్త్ సర్వీసెస్‌లో చేరి హైదరాబాద్, జనగామ, నాందేడ్, జగిత్యాలలో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా పనిచేశారు. ఆ తర్వాత ప్రమోషన్‌పై హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం ఆయనను విశాఖపట్టణంలోని కింగ్‌జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)కు బదిలీ చేసింది. అప్పటికే ప్రముఖ జనరల్ ఫిజీషియన్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న డాక్టర్ ధర్మారావు సేవలను మెచ్చిన కేంద్ర ప్రభుత్వం 1960లో కార్డియాలజీ ఫెలోషిప్ కోసం ఎంపిక చేసి అమెరికాలోని బాల్టిమోర్‌లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత జాన్స్ హాప్‌కిన్స్ ఆసుపత్రికి పంపించింది.

వరంగల్ ఎంజీఎం తొలి సూపరింటెండెంట్‌గా..

వరంగల్‌లో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ మెమోరియల్ ఆసుపత్రి (ఎంజీఎం)కు తొలి సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం ధర్మారావును పంపించింది. ఆ తర్వాత అది బోధనాసుపత్రిగా అప్‌గ్రేడ్ అయి, కొత్తగా ప్రారంభమైన కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)కి అనుసంధానమైంది. తర్వాత ఈ కాలేజీకి డాక్టర్ ధర్మారావు ప్రిన్సిపాల్ అయ్యారు. వరంగల్‌లో ఏకంగా 11 ఏళ్లపాటు పనిచేసి స్టూడెంట్స్ నుంచి ఉన్నతాధికారుల వరకు అందరి ఆదరాభిమానాలను చూరగొన్నారు. తోటి సిబ్బంది, సహచరులు, విద్యార్థులు, రోగులతో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగేవారు. దశాబ్దాలు గడిచినా ఆయన సేవలను ఇప్పటికీ వీరంతా గుర్తు చేసుకుంటుండడం ఆయన మంచితనానికి, సేవాతత్పరతకు ఉదాహరణ. ఆయన అందించిన సేవలకు గుర్తుగా ధర్మారావు విగ్రహాన్ని ఎంజీఎం ఆసుపత్రిలో ప్రతిష్ఠించారు. 1975లో ఉస్మానియా మెడికల్ కాలేజీ మెడిసిన్ ప్రొఫెసర్‌గా రిటైరైన డాక్టర్ ధర్మారావు 6 మార్చి 1977న ముంబైలో వాస్క్యులర్ సర్జరీ తర్వాత కోలుకుంటూ తుదిశ్వాస విడిచారు.

పీవీకి ఫ్యామిలీ డాక్టర్‌గా..

ప్రముఖ వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న డాక్టర్ ధర్మారావు ఎంతోమంది ప్రముఖులకు ఫ్యామిలీ డాక్టర్‌గా సేవలు అందించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వంటి వారికి కుటుంబ వైద్యుడిగా సేవలు అందించారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ చెన్నారెడ్డికి మంచి స్నేహితుడు కూడా.

వైవాహిక జీవితం

పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలంలోని నాయుడుగూడేనికి చెందిన గారపాటి సాంబయ్య-వెంకటసుబ్బమ్మ దంపతుల కుమార్తె భానుమతీదేవిని 1947లో డాక్టర్ ధర్మారావు వివాహం చేసుకున్నారు. వీరికి కృష్ణసాగర్, సరోజని, డాక్టర్ విద్యాసాగర్, రాంసాగర్, విజయలక్ష్మి సంతానం. సివిల్ ఇంజినీర్ అయిన కృష్ణసాగర్-శ్యామల దంపతులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. కృష్ణసాగర్ అండ్ అసోసియేట్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. సరోజని-డాక్టర్ పోటు రంగనాథ ప్రసాద్ (కార్డియాలజిస్ట్) అమెరికాలోని ఫ్లోరిడాలో, డాక్టర్ విద్యాసాగర్ (కేన్సర్ స్పెషలిస్ట్)-శాలీ దంపతులు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. హార్డ్‌వేర్ ఇంజినీర్ అయిన రాంసాగర్-శాంతిలేఖ దంపతులు హైదరాబాద్‌లో నివసిస్తుండగా, విజయలక్ష్మి (అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ)- ఆచార్య కేతినేని వీరనారాయణ దంపతులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. జస్టిస్ రామినేని కౌశలేంద్రరావు (నాగపూర్ హైకోర్టు), ఎన్టీరామారావు వియ్యంకుడు దగ్గుబాటి చెంచురామయ్య (కారంచేడు)లు డాక్టర్ ధర్మారావుకు తోడళ్లుల్లు.

1211
ఆయన మాకు దేవుడు: డాక్టర్ మండవ పూర్ణచంద్రరావు ( రిటైర్డ్, సెంట్రల్ హెల్త్ సర్వీసెస్)
డాక్టర్ ధర్మారావు లెజండరీ డాక్టర్. గొప్ప టీచర్. ఆయన మాకు గురువుగా దొరకడం మా అదృష్టం. 1964 నుంచి 1968 వరకు ఆయన విద్యార్థిగా ఉండడం నాకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఆయన మంచితనాన్ని, సేవలను ప్రశంసించేందుకు మాటలు చాలవు. ఆయన మార్గదర్శకత్వంలో గడిపిన క్షణాలు ఇప్పటికీ మదిలో పదిలంగా ఉన్నాయి. ఆయన మాకు దేవుడిలాంటి వారు. తండ్రిలా ఆదరించారు. మెడికల్ సూపరింటెండెంట్‌గా ఆయన ఎప్పటికీ మా మదిలో నిలిచిపోతారు. డాక్టర్ ధర్మారావు శతజయంతి సందర్భంగా ఆయనకు ఇవే మా నివాళులు.

————–
డాక్టర్ ధర్మారావు అడుగుజాడల్లో: డాక్టర్ శివమోహన్‌దాస్ నాగళ్ల (రిజిస్ట్రార్ (రిటైర్డ్), ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ)
మా ప్రొఫెసర్, వైద్య విభాగం అధిపతి డాక్టర్ ధర్మారావు శిష్యుడిగా ఉండడం, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మెడిసిన్ నేర్చుకోవడం నా అదృష్టం. డాక్టర్ ధర్మారావు వివేకవంతుడు, సమర్థుడు. వాటికి మించి అద్భుతమైన గురువు. ఆయన ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు కదలాడుతూ ఉండేది. డాక్టర్ ధర్మారావు సమక్షంలో ‘ధర్మం’ ఎల్లవేళలా ఉంటుందని అప్పటి ఏపీ ఆరోగ్య కార్యదర్శి చెప్పడం నాకింకా గుర్తే. ధర్మారావు మరణం తర్వాత కేఎంసీ విద్యార్థులందరం కలుసుకుని ఆయన జ్ఞాపకార్థం ఎంజీఎం, కేఎంసీలలో డాక్టర్ ధర్మారావు, టి. లక్ష్మీనారాయణ విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గుంటూరుకు చెందిన ఓ శిల్పితో విగ్రహాలు చెక్కించాం. డాక్టర్ లక్ష్మీనారాయణ విగ్రహాన్ని కేఎంసీ ఎంట్రన్స్ హాలులో ఏర్పాటు చేయగా, ఎంజీఎం ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద డాక్టర్ ధర్మారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. వారిపై విద్యార్థులకు ఉన్న ప్రేమ, ఆప్యాయతలకు ఇది ప్రతీక.

1987లో కేఎంసీ విద్యార్థులందరం విజయవాడలో సమావేశమయ్యాం. ఈ సందర్భంగా ధర్మారావు పేరిట ‘డాక్టర్ బీడీఆర్ మెమోరియల్ ట్రస్ట్’ పేరుతో ఓ సంస్థను స్థాపించాలని నిర్ణయించాం. అలాగే, ‘డాక్టర్ బొబ్బా ధర్మారావు మెమోరియల్ వార్షిక ఒరేషన్ అవార్డు’ను కూడా ప్రకటించాం. 1988 నుంచి ప్రతి సంవత్సరం విశేష సేవలు అందించిన ప్రముఖ వైద్యుడికి ఈ అవార్డును అందిస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కేఎంసీ విద్యార్థులు ఆ రోజున సమావేశమై డాక్టర్ ధర్మారావు సేవలను గుర్తు చేసుకుంటాం. కేఎంసీ పూర్వ విద్యార్థులు, సహచరుల హృదయాల్లో ధర్మారావు ఎప్పటికీ నిలిచే ఉంటారు.
—————-
ఫోన్: 98489 17701

12111

Share: