భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు ఉన్నతమైన స్థానం ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చెక్కు చెదరనంత వరకు మన దేశంలో వృద్ధులు ఎంతో గౌరవంగా జీవించారు. ప్రపంచీకరణ, నూతన ఆర్థిక, సామాజిక అంశాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. ఉద్యోగాల వేటలో తల్లిదండ్రులకు పిల్లలు దూరం కావడంతో చిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి. కొందరు మాత్రం తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నా నేటి ఆధునిక నాగరికత వారిమధ్య విభజన రేఖ గీసింది. ఇంకొందరైతే తల్లిదండ్రులను బలవంతంగా వృద్ధాశ్రమాల్లో చేర్పించి చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత వారివైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
ముదిమి వయసులో తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సంతానమే వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం, చేయి చేసుకోవడం, ఇంటి నుంచి గెంటివేయడం వంటి వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. వయోధికులు సాధారణంగా తెలివైన వారిగాను, అనుభశీలురుగాను ఉంటారు. అయితే, శారీరకంగా, కొంతవరకు మానసికంగా దుర్భలంగా ఉంటారు. సమస్యలను అర్థం చేసుకుని పిల్లలతో సయోధ్యకు ప్రయత్నించేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ వారి మాటల పట్టించుకోకుండా వేధిస్తున్న ఉదంతాలే ఎక్కువ. అప్పటికీ కుటుంబ పరువును బయటపెట్టుకోలేని వారు తమలో తామే బాధను అనుభవిస్తూ నిశ్శబ్దంగా కుమిలిపోతూ ఉంటారు. ఫలితంగా పలు రకాల మానసిక, శారీరక వ్యాకులతకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
పెద్దలు ఇంట్లో ఉంటే పిల్లలకు తోడుగా ఉంటారు. వారికి అనాదిగా వస్తున్న మన సనాతన ధర్మం, ఆచార వ్యవహారాలు, నైతిక విలువలు నేర్పుతారు. వారి సందేహాలను తీరుస్తారు. అలాంటి చిన్నారులు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. కాబట్టి పెద్దలు సముపార్జించిన అపార జ్ఞానం తర్వాతి తరాలకు చేరేలా నేటి సమాజం కృషి చేయాలి. పెద్దలను ఈసడించుకోవడం, దుర్భాషలాడడం, వేధించడం, దాడిచేయడం, తోసివేయడం, హింసించడం, భోజనం పెట్టకపోవడం, వైద్య సేవలు కల్పించకపోవడం, స్వేచ్ఛను హరించడం వంటివి శారీరక వేధింపుల కిందికి వస్తాయి. అలాగే, వారిని బెదిరించి మోసగించడం, వారి వద్ద ఉన్నధనాన్ని, ఆభరణాలు, స్థలం, ఇల్లు, పొలం, భూములు వంటి వాటిని బలవంతంగా లాక్కోవడం వంటివి ఆర్థిక పరమైన వేధింపులు. కొన్ని చోట్ల ఒంటి మహిళలపై అకృత్యాలు జరగుతున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి.
వయోధికులపై వేధింపులను సామాజిక రుగ్మత, సాంఘిక దురాచారంగా పరిగణించాలి. ఈ తరహా అవగాహన వృద్ధులకు, యువతకు కల్పించడానికి ఐక్య రాజ్య సమితి జూన్ 15న వయోజనుల పై వేధింపులను కట్టడి చేసే దిశగా అవగాహన కల్పించే దినం (వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్‌నెస్ డే)గా పరిగణించాలని 2011లో పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా అన్ని దేశాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటుచేసి వృద్ధులకు యువతకు అవగాహన కల్పించాలని కోరింది.
వయోధికులపై వేధింపులను అరికట్టేందుకు భారతదేశం అనేక చట్టాలు చేసింది. వాటిలో ‘తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2007’ ముఖ్యమైంది. ఈ చట్టంలోని రెండో సెక్షన్ ప్రకారం వృద్ధులు, తల్లిదండ్రుల పోషణ బాధ్యత వారి పిల్లలది. సంతానం లేకపోతే సమీప వారసత్వ బంధువులది. సెక్షన్ 4 ప్రకారం తల్లిదండ్రులు, వృద్ధులు తమ పోషణ ఖర్చులను ఇవ్వాల్సిందిగా తమ పిల్లలను లేదా వారసత్వ బంధువులను అడిగే హక్కుంది. ఈ హక్కు కోసం రెవిన్యూ డివిజనల్ అధికారి నేతృత్వంలోని ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. దరఖాస్తు వచ్చిన 90 రోజుల్లోపు పోషణ ఖర్చుల చెల్లింపునకు ఆ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ చట్టంలోని 21వ సెక్షన్ ప్రకారం పోలీసులు వృద్ధుల ప్రాణాలకు, ఆస్తులకు సంపూర్ణమైన రక్షణ కల్పించాలి.
చట్టాలు ఉన్నా అధికార యంత్రాంగాల నిర్లక్ష్యం వల్ల పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. దీంతో వృద్ధుల హక్కులకు గ్రహణం పట్టింది. చాలా మంది వయోజనులకు చట్టాలపై అవగాహన లేకపోవడంతో తమపై జరుగుతున్న దౌర్జన్యాలను ఎవరి తోనూ చెప్పుకోలేక బాధితులుగా మిగిలి పోతున్నారు. అందుకే వయోధిక సంఘాలు ముందువరసలో ఉండి సాంఘిక సంస్థలను, యువతను కలుపుకొని ఒక సామాజిక ఉద్యమాన్ని నడపవలసిన అవసరం ఉంది. అందుకోసం ప్రతి వయోధికుడు సన్నద్ధం కావాలి. గ్రామాలు, పట్టణాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి వృద్ధులపై జరుగుతున్న వేధింపులను తక్షణమే ఆపి వేయాలని ప్రజలకు, యువతకు పిలుపివ్వాలి. వయోధికులకు వారికి గల హక్కుల గురించి తెలుపుతూ వేధింపులనుంచి రక్షణ కల్పించాలి. వృద్ధులైన తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే వృద్ధులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు కళ్లెం పడుతుంది.
– గణేశ్వర్‌బాబు వెల్లంకి
99482 25709
వృద్ధులపై దాడులకు కళ్లెం పడేది అప్పుడే!
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021