సమ్మర్‌ను చల్లగా మార్చేద్దామిలా!

sa

ఈసారి వేసవిని తట్టుకోవడం కొంచెం కష్టమైన పనేనని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. సాధారణంతో పోలిస్తే రెండుమూడు ఎండలు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఎండలో బయటకు వెళ్తే శరీరం త్వరగా నిర్జలీకరణం అయిపోతుంది. ఫలితంగా శరీరంలో నీటి స్థాయులు తగ్గిపోతాయి. వాటితోపాటే పోషకాలు క్షీణిస్తాయి. దీంతో అలసట, వికారం, వాంతులు వంటివి వేధిస్తాయి. కొన్నిసార్లు వడదెబ్బకు కూడా గురయ్యే ప్రమాదం ఉంది. ఎండ కారణంగా శరీరం కోల్పోయిన పోషకాలను తిరిగి ఎలా పొందాలి? ఎండ వేడినుంచి ఎలా తప్పించుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందామా?

కీరదోశతో కూల్‌కూల్

వేసవిలో తప్పకుండా తీసుకోవాల్సిన వాటిలో కీరదోశ ఒకటి. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఇందులోని పీచుపదార్థాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. కీరదోశలోని ఫిసెటిన్‌ అనే రసాయన మూలకం మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. కీరదోశ ముక్కలను కళ్ల వద్ద పెట్టుకుంటే కళ్ల కింద ఉండే నల్లటి చారలు మాయమవుతాయి. ప్రతి రోజు కీరదోశను తినడం వల్ల బరువు తగ్గుతారు.

పుచ్చకాయతో నిర్జలీకరణ సమస్య పరార్

ఒకప్పుడు ఎండాకాలంలోనే దొరికే పుచ్చకాయలు ఇప్పుడు సంవత్సరమంతా కనిపిస్తున్నాయి. వీటిలో 92శాతం నీరు ఉంటుంది. వీటిని తింటే దాహం మటుమాయం అవుతుంది. నిర్జలీకరణ సమస్యకు పుచ్చకాయ చక్కని పరిష్కారం. అంతేకాదు, రక్తపోటును కూడా ఇది నియంత్రిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. పుచ్చకాయలో విటమిన్లు ఎ, సి, బి6లు జుట్టు, చర్మం, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని పీచుపదార్థాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

పోషకాలకు పెట్టింది పేరు స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ పోషకాలకు నిలయం. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే, పీచు పదార్థాలతోపాటు ఎ, సి, బి6, బి9,ఈ, కె విటమిన్లు ఉంటాయి. ఈ పండ్లలో 91శాతం నీరు ఉంటుంది. కొవ్వును తగ్గిస్తాయి. స్ట్రాబెర్రీ పండ్లలోని ఫెనోలిక్‌ రసాయన మూలకాలు క్యాన్సర్‌ను తగ్గించడంలో దోహదపడతాయి.

రోగ నిరోధకశక్తిని పెంచే కర్బూజ

రోగ నిరోధకశక్తిని పెంచడంలో కర్బూజ పాత్ర కీలకం. ఇందులోనూ నీరు 90 శాతం వరకు ఉంటుంది. విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి దృష్టిలోపం సమస్యలను తగ్గిస్తాయి. అలాగే, ఇందులోని కె, ఈ విటమిన్లు రక్త ప్రసరణను క్రమబద్ధం చేస్తాయి. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

దాహంతోపాటు ఆకలినీ తీర్చే బత్తాయి

వేసవిలో బత్తాయి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి దాహాన్నే కాదు, ఆకలిని కూడా తీరుస్తాయి. 88 శాతం నీటితో నిండే బత్తాయిలో ఉండే సి విటమిన్ రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని పోటాషియం గుండె పనితీరు మెరుగుపరుస్తుంది. పీచుపదార్థాలు శరీరంలో కొవ్వును తగ్గిస్తాయి. బత్తాయిలోని యాంటీ యాక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి.

జీర్ణవ్యవస్థను కాపాడే పైనాపిల్

జీర్ణవ్యవస్థను కాపాడడంలో పైనాపిల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పండులో ఉండే 87 శాతం నీరు దాహాన్ని తీర్చడమే కాదు, శరీరానికి మరెన్నో ప్రయోజనాలు ఇస్తుంది. ఈ పండులోని సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించివేస్తుంది. దెబ్బతిన్న కణజాలాలను నయం చేస్తుంది. పైనాపిల్‌లో ఉండే బ్రొమెలిన్ ఎంజైమ్ ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇందులోని బి విటమిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది.

Share: