“చట్టం ఎవరి చుట్టమూ కాదు – ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. న్యాయం ఎవరి అబ్బ సొమ్మూ కాదు కోరినట్టుగా ఉపయోగించుకోవడానికి.” – ఇవేవో సినిమా డైలాగుల లాగా అనిపించవచ్చు. ఆ సినిమా చూసిన జనం అప్పట్లో ఈలలు, కేకలు వేసి ఉండవచ్చు. కానీ, నేడు ఈ దేశంలో న్యాయం, చట్టం అన్నవి ఇంకా బతికే ఉన్నాయి అనడానికి నిదర్శనంగా సర్వోన్నత న్యాయస్థానం ఓ తీర్పు వెలువరించింది. అందులో సుప్రీమ్ కోర్టు జస్టిస్ ఎన్.వి.రమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేసిన నిరాధారపూరితమైన అంశాలను సుప్రీమ్ కోర్టు కొట్టి పారేసింది. ఈ అంశాలన్నీ కావాలని, అదేపనిగా జస్టిస్ రమణపై బురదచల్లే ప్రయత్నంలో భాగంగా చేసినవేనని సర్వోన్నత న్యాయస్థానం విశ్వసించింది. ఏ జస్లిస్ ఎన్.వి.రమణపై బురద చల్లాలని ప్రయత్నించారో, అదే న్యాయమూర్తిని త్వరలో సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించమని ప్రస్తుతం సుప్రీమ్ కోర్టు ఛీఫ్ జస్టిస్ గా ఉన్న ఎస్.ఏ.బోబ్డే న్యాయశాఖకు సిఫారసు చేయడం విశేషంగా మారింది. ఏ సర్వోన్నత న్యాయమూర్తికి ఎన్.వి.రమణను అభిశంసయిస్తూ జగన్ రెడ్డి లేఖ రాశారో, అదే ఛీఫ్ జస్టిస్ బోబ్డే, రమణను తరువాతి ఛీఫ్ జస్టిస్ గా ఎంపిక చేయమని సిఫారసు చేయడం కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ విషయంలోనే ఆరంభంలో పేర్కొన్న వాక్యాలను గుర్తు చేసుకోవడమైనది.
ఆలోచించండి!
జస్టిస్ ఎన్.వి.రమణను ఏదో విధంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి కాకుండా చేయాలని, ఆయన సామాజిక వర్గానికే చెందిన కొందరు కంకణం కట్టుకున్నారు. ఒకప్పుడు తాము అదే సుప్రీమ్ కోర్టులో ఉండగా, తాము ఆ పదవిలోకి రాకుండా ఎన్.వి.రమణ అడ్డుకున్నారని వారి వాదన. నిజంగా మీలో ఆ సత్తాయే ఉంటే, రమణ కాదు కదా, ఎవరు అడ్డుకున్నా, తమరు కోరుకున్న పదవిలో ఉండేవారు. ఇప్పుడు మీరంతా కలసి రమణను సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి కాకుండా చేయడానికి ఎన్ని ఎత్తులు వేసినా, ఆయనకు ఎలా ఆ పదవి దక్కుతూ ఉందో, అదే మాదిరి ఆ రోజున మీకూ ఆ పదవి దక్కి ఉండేదేమో కదా! మీరు విజ్ఞులు, ఎంతో విద్యాధికులు ఈ విషయంలో మరోలా కాకుండా, కాసింత మనసు పెట్టి ఆలోచించండి!
అయినప్పటికీ సదాలోచనలకు తావీయకుండా కసితో, కక్షతో జగన్మోహన్ రెడ్డి చెంతన చేరి, జస్టిస్ రమణపై ఉన్నవిలేనివి చెప్పి, ఆయనకు పదవి రాకుండా చేయాలని పెద్ద ఎత్తు వేశారు. అందుకు ఏ మాత్రం ఆలోచించకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జస్టిస్ రమణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఏ లాంటి ఆధారాలు లేకుండానే సుప్రీమ్ కోర్టు ఛీఫ్ జస్టిస్ బోబ్డేకు లేఖ రాశారు. పైగా, ఆ లేఖను బహిర్గతం కూడా చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నవారిపై అభియోగాలు చేసే సమయంలో వెనకా ముందూ ఆలోచించకుండా ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం బహుశా భారతదేశ చరిత్రలో ఇదే మొట్ట మొదటి సారేమో!
ఇంతకూ ఏమిటి అభియోగం!?
జస్టిస్ ఎన్.వి.రమణకు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మధ్య స్నేహం ఉండడమే వారి అభియోగం. వారిద్దరి మధ్య స్నేహం కారణంగానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో పలుతీర్పులను రమణ ప్రభావితం చేశారని, తద్వారా ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పులు వెలువరించిందని ఓ అభియోగం. మరోటి ఏంటంటే, అమరావతి రాజధానిగా ఏర్పాటవుతుందని ముందే తెలిసిన జస్టిస్ రమణ కూతుళ్ళు అక్కడ చవకగా స్థలాలు కొనుగోలుచేశారని, అందుకు చంద్రబాబు సహకరించారని. ఈ విషయంలోనూ సరైన ఆధారాలు చూపలేకపోయారు. రమణ కూతుళ్ళు ఎక్కడైనా చట్టపరమైన, న్యాయపరమైన అడ్డంకులులేని స్థలాలు కొనుగోలు చేసే హక్కు వారికి ఉంది. వారు కొన్నారు కాబట్టి, అందులో చంద్రబాబు, రమణ కలసి ఘోరాలో, నేరాలో చేసినట్టుగా చిత్రీకరించడమే విడ్డూరం!
ఇక ఈ నాయకులను, వారి చెంతన చేరిన వారిని అభిమానించేవారు కొందరు చంద్రబాబు, రమణ ఒకే సామాజిక వర్గానికి చెందినవారని చాటింపు వేశారు.. అందువల్ల కూడా గత ప్రభుత్వం అక్రమాలు చేసిందని, వాటిలో రమణ జోక్యం కూడా ఉందని వారి వాదన. నచ్చనివారిపై ఎన్ని మాటలైనా నిష్టూరంగా మాట్లాడుతుంటారు. కానీ, తాము కూర్చున్న పదవికి తగిన గౌరవం ఇవ్వాలన్న జ్ఞానం ఉండాలి కదా!
ఎవరు ఎంతలా లేఖలు రాసినా, ఏమని అభియోగాలు చేసినా, ఎన్.వి.రమణ నిజాయితీ పరుడు అని సర్వోన్నత న్యాయస్థానం తీర్మానించింది. అంతేకాక, ఆయన పేరునే తదుపరి ప్రధాన న్యాయమూర్తి పదవికి కూడా సూచించడం రమణకు న్యాయవ్యవస్థలో ఉన్న గౌరవాన్ని తెలుపుతోంది.
తెలుగువారంతా గర్వించవలసిన సమయం!
నిజానికి తెలుగువారందరూ ఎన్.వి.రమణ సుప్రీమ్ కోర్టు ఛీఫ్ జస్టిస్ కాబోతున్నందుకు గర్వించవలసిన సమయమిది. ఎందుకంటే దాదాపు 55 సంవత్సరాల తరువాత ఓ తెలుగువ్యక్తి సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతున్నారు. ఇది తెలుగువారందరికీ గర్వకారణం. 1966లో కోకా సుబ్బారావు సుప్రీమ్ కోర్టు ఛీఫ్ జస్టిస్ గా నియమితులైన తొలి తెలుగువారు. ఆయన తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకు ఓ తెలుగు వ్యక్తికి ఆ పదవి దక్కుతున్నందుకు ఎంతో సంతోషించతగ్గ అంశం. కానీ, నేడు ఆంధ్రప్రదేశ్ అంతటా కులతత్వం వేళ్ళూనుకుపోయి, ఇతర కులాలవారికి ఉన్నత పదవులు దక్కితే సంతోషించలేని కుసంస్కారం తాండవిస్తోంది. తమ కులంవాడు ఉన్నత పదవులు అధిరోహిస్తే సంబరాలు చేసుకోవడం, ఇతరులకు ఉన్నత పదవులు దక్కితే విచారించడం విజ్ఞులైన వారు పాటించతగ్గవి కావు. ఇప్పటికయినా, విజ్ఙతతో ఆలోచించి, ఏప్రిల్ 24న సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎన్.వి.రమణను అభినందించే దిశగా అందరూ ఆలోచిస్తే మంచిది. ఆ తీరున పరివర్తన చెందిన ప్రతిమనిషినీ అభినందించి తీరవలసిందే!
న్యాయమే గెలిచింది!
ఓ వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధానన్యాయమూర్తి కాబోతున్నారు అన్న విషయం తప్పకుండా దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించే విషయమే! కానీ, తెలుగునేలపై జన్మించిన ఎన్.వి.రమణ అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నత పదవిని అధిరోహించనున్న సమయంలో ఆయన రాష్ట్రానికే చెందినవారు, ముఖ్యంగా కొందరు ఆయన సామాజిక వర్గానికే చెందినవారు అసంతృప్తులై ఉండడం గమనార్హం! కానీ, మునుపెన్నడూ లేని విధంగా ఎన్.వి.రమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభియోగపత్రం రాయగానే, ఆయనకు ఛీఫ్ .జస్టిస్ అయ్యే యోగం ఉందా లేదా అన్న అంశంపైనా పలువురు పలు రకాల వ్యాఖ్యలు చేశారు. యూ ట్యూబ్ ఛానల్స్ ఉన్న కొందరు మేధావులు, అందునా న్యాయకోవిదులు రమణపై ఏపీ సీఎమ్ రాసిన లేఖపై చర్చోపచర్చలు జరపడం మరింత విడ్డూరం. ఇవన్నీ చూసిన తెలుగువారికి రమణకు ఛీఫ్ జస్టిస్ అయ్యే యోగం ఉందా లేదా అని కొట్టుమిట్టాడారు. చివరకు న్యాయమే గెలిచింది అన్నట్టుగా ఎన్.వి.రమణ మన కాబోయే ఛీఫ్ జస్టిస్ అని తేలగానే, దాదాపు దేశవ్యాప్తంగా అత్యధికులలో ఆనందం వెల్లి విరిసింది. ఇంత ఉత్కంఠ గతంలో ఏ సుప్రీమ్ కోర్టు ఛీఫ్ జస్టిస్ ఎంపిక విషయంలో జరిగి ఉండదనీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంతకూ ఎవరు ఈ ఎన్.వి.రమణ!?
ఇంతలా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సుప్రీమ్ కోర్టు సీనియర్ న్యాయమూర్తి ఎన్.వి.రమణ ఎవరు? ఈ అంశంపై ఆసక్తి కలిగిన వారందరూ మార్చి 24న సోషల్ మీడియాలో ఆయన వివరాల కోసం సర్చ్ చేశారు. ఆయన ఎవరు? ఏ తీరున న్యాయమూర్తిగా పదోన్నతులు పొందుతూ వచ్చారు? ఆయనపై ఏపీ సీఎమ్ రాసిన లేఖలోని అభియోగాలేమిటి? అన్న అంశాలను నవతరం పౌరులు ఆసక్తిగా తెలుసుకోవడం మరింత విశేషంగా మారింది.
కృష్ణాజిల్లా వాసి…
ఎన్.వి.రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకటరమణ. నూటికి నూరుపైసల తెలుగువారు. 1957 ఆగస్టు 27న కృష్ణాజిల్లా పొన్నవరంలో ఓ వ్యవసాయ కుటుంబంలో రమణ జన్మించారు. ఆయన తండ్రి నూతలపాటి గణపతిరావు, తల్లి సరోజిని. కంచికర్లలోని ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన రమణ, తరువాత అమరావతిలోని ఆర్.వి.వి.ఎస్. కాలేజీలో బి.ఎస్సీ. పట్టా పుచ్చుకున్నారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1983 ఫిబ్రవరి 10న స్టేట్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. న్యాయవాద వృత్తిని అప్పటి నుంచీ ఆరంభించారు.
న్యాయస్థానాల్లో…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా రమణ కెరీర్ ఆరంభమయింది. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర ట్రిబ్యునళ్ళలోనూ ప్రాక్టీస్ చేశారు. సుప్రీమ్ కోర్టులోనూ కేసులు వాదించారు. రాజ్యాంగ పరమైన కేసులను వాదించడంలో దిట్ట అనిపించుకున్నారు. క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర జలసంబంధిత కేసులు వాదించడంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేటుగా వ్యవహరించారు. కేంద్రప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ గానూ, అలాగే హైదరాబాద్ లో రైల్వేస్ కు కూడా స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్నారు. అదనపు అడ్వకేట్ జనరల్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన రమణ 2000 జూన్ 27న శాశ్వత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. దేశవిదేశాల్లో జరిగిన పలు సదస్సుల్లో ఎన్.వి.రమణ ప్రసంగించారు. ఆయన ప్రసంగాల్లో భావిన్యాయవాదులకు ఉపయుక్తమైన ఎన్నో అంశాలు చోటు చేసుకొనేవి.
2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు రమణ. 2014 ఫిబ్రవరి 17న సర్వోన్నత న్యాయస్థానంలో జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సుప్రీమ్ కోర్టులో ఛీఫ్ జస్టిస్ బోబ్డే తరువాత అంతటి సీనియర్ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బోబ్డే తరువాత సుప్రీమ్ కోర్టు ఛీఫ్ జస్టిస్ పదవికి అన్ని విధాలా ఎన్.వి.రమణ అర్హులు. ఈ కారణంగానే ఆయనపై వచ్చిన లేఖ, అందులోని నిరాధారమైన అభియోగాలను తోసిపుచ్చుతూ కేంద్రన్యాయశాఖకు సిఫారసు చేశారు. ఏప్రిల్ 24న రమణ సుప్రీమ్ కోర్టు ఛీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేయనున్నారు. ఆయన ఆ అత్యున్నత పదవిలో 2022 ఆగస్టు 26 వరకు కొనసాగుతారు. అంటే ఆ రోజుకు రమణకు 65 సంవత్సరాలు పూర్తవుతాయి.
నేరచరిత గల రాజకీయ నాయకుల కేసుల విచారణను త్వరితగతిని పూర్తిచేసే బెంచ్ కు రమణ నేతృత్వం వహిస్తున్నారు. రమణ కెరీర్ లో ఎన్నో కీలకమైన తీర్పులు వెలువరిచారు. ఆయన తీర్పులు సామాన్యులను దృస్టిలో ఉంచుకొని చేసేవారని, ఆ తీర్పులను బట్టే తెలుస్తోంది. 13 సంవత్సరాల కాలంలో దాదాపు అరవై వేల కేసులను ఆయన పరిష్కరించారు. ముస్లిమ్ రిజర్వేషన్లపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంలో రమణ ఒకరు. మిగతావారి అభిప్రాయంతో రమణ విభేదించారు. కులాలు, మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం వల్ల సమాజంలో విభేదాలు తలెత్తుతాయని రమణ గట్టిగా విశ్వసించారు. రిజర్వేషన్లు ఎప్పుడూ ఆర్థిక అసమానతల ఆధారంగానే ఉండాలని ఆయన భావించారు.
తెలుగంటే ప్రాణం…
ఎన్.వి.రమణకు మాతృభాష తెలుగంటే ప్రాణం. ఓ న్యాయవాదిగా ఆంగ్లంపై ఎంతో పట్టు ఉన్నా, ఇంగ్లిష్ పదసంపద ఎంత తెలిసినా, ఆయన అవసరమైతే తప్ప ఇంగ్లిష్ లో మాట్లాడరు. తెలుగులోనే తెలగువారు తీర్పులు ఇవ్వాలనీ సూచించారు. మాతృభాషలో మాట్లాడడం ఎంతోమంచిదనీ చెప్పేవారు. తెలుగువారిని తెలుగులోనే పకలరించేవారు. ఇలాంటి భాషాభిమాని, తెలుగునేల ముద్దుబిడ్డ ఎన్.వి.రమణ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగానూ తనదైన బాణీ పలికిస్తారని ఆశించవచ్చు.
న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తూ ప్రవర్తించేవారిని, ఆ వ్యవస్థను సైతం లెక్కచేయని వారిని, రమణ హయాములోనైనా తగిన విధంగా శిక్షించాలని, అందుకు తగ్గ చర్యలు ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే చేపడతారని ఎందరో న్యాయవ్యవస్థ పట్ల గౌరవం ఉన్నవారు ఆశిస్తున్నారు. వారి అభిలాషను రమణ ఏ తీరున నెరవేరుస్తారో చూడాలి.