వెండితెరపై వెలిగిపోయే కళకారులను వారి దరి చేరిన పాత్రల్లో రాణింపచేయడంలో ప్రత్యేక పాత్ర పోషించేది ఇద్దరే ఇద్దరు – ఒకరు మేకప్ మేన్, రెండోవారు సినిమాటోగ్రాఫర్. ఈ ఇద్దరూ లేకుంటే ఎంతటి మహానటులకైనా తమకు లభించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడమన్నది అంత సులువు కాదు. ఎందరో కళాదర్శకులు నటీనటుల పాత్రలకు తగ్గ స్కెచెస్ వేస్తారు. ఆ స్కెచెస్ కు తగినట్టుగా ఆర్టిస్టులను తయారుచేయడం రూపశిల్పుల విధి! అలా ఎందరో నటీనటులను తన మేకప్ కళతో వారు పోషిస్తున్న పాత్రలకు తగ్గట్టుగా మలచిన ఘనుడు ప్రముఖ మేకప్ మేన్ జాస్తి మాధవరావు. మేరునగమంతటి మేటి మహానటుడు నందమూరి తారకరామారావు వంటి అందమైన నటునికి మేకప్ చేయాలన్న అభిలాష మేకప్ మెన్ అందరికీ ఉంటుంది. పైగా యన్టీఆర్ నటించిన సినిమాతోనే మేకప్ అసిస్టెంట్ గా చేరిన వారికి, ఒక్కసారైనా ఆ దివ్యమంగళరూపానికి తమ చేతుల మీదుగా మేకప్ చేయాలన్న అభిలాష ఉండడంలో తప్పేలేదు. రామారావు నటించిన బభ్రువాహన చిత్రంతోనే మేకప్ శాఖలో అడుగు పెట్టిన జాస్తి మాధవరావుకు కూడా యన్టీఆర్ కు ఒక్కసారయినా మేకప్ చేయాలన్న కోరిక ఉండేది. తాను అడుగుపెట్టిన మేకప్ రంగంలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ జాస్తి మాధవరావు తాను కోరుకున్నట్టుగానే మహానటుడు యన్టీఆర్ కు పలు సూపర్ డూపర్ హిట్ మూవీస్ లో మేకప్ చేసే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. కోరుకున్నది సాధించుకోవడంలో జాస్తి మాధవరావుకు సినిమా రంగమేమీ ఎర్రతివాచీ పరచి ఆహ్వానించలేదు. మరి సినిమా రంగంలో జాస్తి మాధవరావు ఎలా అడుగు పెట్టారు? సినిమా రంగానికి చెందిన 24 శాఖలుండగా, మేకప్ నే ఆయన ఎంచుకున్నారు?
ఈ ప్రశ్నలకు మాధవరావు ఇచ్చే సమాధానం ఒక్కటే- మూడక్షరాలు నన్ను చిత్రసీమలో ప్రవేశించేలా చేశాయి అంటారు. ఇంతకూ ఆ మూడక్షరాలు ఏవి అంటే – ‘తపన’ అని చెబుతారాయన. మాధవరావులో ఆ తపన ఎలా కలిగింది? ఆ తపనను ఆయనను ఎలా నడిపించింది? చిత్రసీమలో మాధవరావు ఎలా అడుగు పెట్టారు? తన తపనను ఎలా తీర్చుకున్నారు? తన తపనను తీర్చుకోవడమే కాదు, తన బంధువుల బాగోగులు సైతం చూసే స్థాయికి ఎలా చేరుకున్నారు? ఉన్నత శిఖరాలు ఎలా అధిరోహించారు? మేకప్ రంగంలో అనుభవం లేకున్నా ఎలా సంపాదించారు? అనుకున్నది ఎలా సాధించారు? ఇలాంటి అంశాలే కాదు, మరెన్నో తన జీవితంలోని విశేషాలను జాస్తి మాధవరావు కమ్మ వైభవం పాఠకుల కోసం పంచుకోనున్నారు. జాస్తి మాధవరావు అనుభవాలు, జ్ఙాపకాలు వింటూ ఉంటే, భావితరాలు సైతం స్ఫూర్తి చెందేలా ఉంటాయి. వాటిని ఆయన మాటల్లోనే ధారావాహికగా కమ్మ వైభవం అందిస్తోంది.
జాస్తి మాధవరావు మాటల్లోనే…
మా స్వస్థలం ఏలూరు. ఈ ఊరు అసలు పేరు హేళాపురి. మా ఊరికి ఓ విశిష్టత ఉంది. ఓ వైపు గోదావరి, మరోవైపు కృష్ణ – ఈ రెండు నదుల సంగమం జరిగేది మా ఊరిలోనే. విద్వత్తుకి, విజ్ఞతకు పెట్టింది పేరు ఏలూరు. భారతదేశంలో తొలి టాకీలుగా వెలసిన ఆలమ్ ఆరా, కాళిదాసు, భక్త ప్రహ్లాద ఈ మూడు చిత్రాలతోనూ సంబంధం ఉన్న ప్రఖ్యాత దర్శకులు ఎల్.వి.ప్రసాద్, ఆయన బావమరిది కె.బి.తిలక్ ఆదిగాగల ఎందరో సినిమా ప్రముఖులు మా ఊరు చుట్టుపక్కలవారే. ఎల్వీ ప్రసాద్ గారిది సోమవరపు పాడు, తిలక్ గారిది దెందులూరు. ఎల్వీ ప్రసాద్ కు తిలక్ మేనల్లుడు. తరువాత తిలక్ అక్కగారినే పెళ్ళి చేసుకో్వడం వల్ల బావమరిది కూడా అయ్యారు. అలాగే తిలక్ గారికి నేను మేనల్లుడినవుతాను. మా నాన్నగారు జాస్తి వెంకటరత్నం, అమ్మగారి పేరు పర్వతవర్ధనమ్మ. అమ్మగారికి వంద ఎకరాలుంటే, నాన్నగారికి ఇరవై ఎకరాలు ఉండేదట! మా నాన్నగారు, మా మేనమామ వంకినేని వెంకటరత్నంతో కలసి బట్టల షాపు నడిపేవారు. మా కన్నవారికి మేము ఏడుగురు సంతానం. ఇప్పుడు నేను, మా అక్క మాత్రమే ఉన్నాం. అదలా ఉంచితే, మా ఇంట్లో నాకంటే పెద్దవారందరికీ మా కన్నవారు జాతకాలు రాయించారు. ఆ రోజుల్లో జాతకాలు, నామకరణాలు ముహూర్తాలు చూసే పెట్టడం పెద్ద ఆచారం. కానీ, నాకు ఎందుకనో మా అమ్మానాన్న జాతకం రాయించలేదు. బహుశా, అప్పటికే బాగా చితికిపోయారేమో, నన్ను నష్టజాతకుడు అనుకున్నారు కాబోలు. మొత్తానికి నా జాతకం రాయించలేదు. మా పెద్దవారికి పొలాలు అయితే ఉండేవి కానీ, ఆ రోజుల్లో వరదలు వచ్చి కొట్టుకు పోతే, మాకు మిగిలేది ఆర్యభట్ట కనిపెట్టినదే! ఆ రోజుల్లోనే మా అమ్మగారికి ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రావీణ్యం ఉండేది. చుట్టుపక్కల ఊళ్ళవాళ్ళు ఆమె చేతి వైద్యం కోసం బారులు తీరేవారు. ముఖ్యంగా వంధ్యత్వంతో బాధపడుతున్న మహిళలు అమ్మ చేతి వైద్యంతో సంతానవంతులయ్యేవారు. ఆ విషయాన్ని చుట్టుపక్కల గ్రామస్థులు సైతం గొప్పగా చెప్పుకొనేవారు వర్ధనమ్మ చేతి చలవ అనే పేరయితే సంపాదించారు కానీ, తనకు తెలిసిన వైద్యంతో ఆమె సంపాదించింది ఏమీ లేదు. ఇలా సాగుతున్న గృహంలో నేను జన్మించాను.
మా ఏలూరులోని మునిసిపల్ హైస్కూల్ లోనే నా విద్య సాగింది. నేలకు పాతిక అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశంలో మా స్కూల్ ఉండేది. కోట దిబ్బపై మా పాఠశాల ఉండడం వల్ల కోటలో స్కూలు అన్న పేరు కూడా లభించింది. ఎవరైనా ఎక్కడ చదువుతున్నావురా అంటే – మునిసిపల్ హైస్కూల్ లో అని చెప్పినా, ఏదీ ఆ కోటలో స్కూల్ లోనేనా అనేవారు. ఇక నా అక్షరాభ్యాసం నా ఏడో ఏట జరిగింది. అప్పటి నుంచీ ఆ కోటలో స్కూల్ లోనే చదువు సాగింది. పద్నాలుగేళ్ళకే ఎస్.ఎస్.ఎల్.సి లో అడుగుపెట్టాను. మొదటిసారి ఫెయిలయ్యాను. రెండో ప్రయత్నంలోనూ అదే ఫలితం. మూడో సారి కూడా ఫలితం మారలేదు. అలా ఎస్.ఎస్.ఎల్.సి. పాసవ్వడానికి దండయాత్రలు చేస్తూండగా, ఏదో చేయాలి అన్న తపన నన్ను ఆవరించింది. దానిని తీర్చుకోవడానికి ఏదో ఒక పనిచేయాలి. చేయాలంటే ఏం చేయాలి? అన్న ప్రశ్న మొదలయింది. అప్పుడు మా అన్నయ్య జే.బీ.కే. చౌదరి దగ్గరకు వెళ్ళాను.
మా అన్నయ్య కథ చెబుతాను… మా అన్నయ్య జేబీకే చౌదరి 1953లోనే మదరాసు వెళ్ళారు. అప్పట్లో విశ్వశాంతి యు.విశ్వేశ్వరరావు తొలి ప్రయత్నంగా అంజలీదేవి, పుష్పలత నటించిన విప్లవ స్త్రీ అనే అనువాద చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రానికి అన్నయ్య పనిచేశారు. అంతకు ముందు అక్కినేని నాగేశ్వరరావు, జమున నటించిన నిరుపేదలు చిత్రానికి కూడా పనిచేశారు అన్నయ్య. ఆ చిత్రానికి తాతినేని ప్రకాశరావు దర్శకుడు. ఆయన వద్ద అసిస్టెంట్ గా చేసిన తరువాత విప్లవ స్త్రీ అనువాదంలో అన్నయ్య కూడా పాలు పంచుకున్నారు. ఆ తరువాత దీపావళి, సతీ సులోచన (ఇంద్రజిత్) * చిత్రాలు రూపొందించిన రజనీకాంత్ వద్ద అసోసియేట్ గా చేరారు అన్నయ్య. రజనీకాంత్ రూపొందించిన *కనకతార, వదినగారి గాజులు సినిమాలకు కూడా అన్నయ్య పనిచేశారు.
మా మావయ్య కూతురును ఎల్వీ ప్రసాద్ గారి పెద్దబ్బాయి ఆనందబాబుకు ఇచ్చారు. దాంతో చుట్టరికం బలపడింది. ఇక కె.బి.తిలక్ గారితోనూ మా అన్నయ్యకు ఎంతో చనువు ఉండేది. అందువల్ల నేను మదరాసు చేరగానే, అన్నయ్య నా చేయి పట్టుకొని తీసుకువెళ్ళి తిలక్ గారి ముందు నించోబెట్టారు. ఇదిగో మాధవ వచ్చాడు. ఏదైనా పనిలో మీరే పెట్టాలి అన్నారు అన్నయ్య. అందుకు తిలక్ గారు, నీకేం పని వచ్చునోయ్ అని అడిగారు. నేను ఏమీ రాదని ఉన్న విషయం చెప్పాను. అప్పుడు ఆయనే కాసేపు ఆలోచించి, మేకప్ లో మనవాడెవ్వడూ లేడురా… అక్కడ పెడదాం అన్నారు. తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో బెత్తం పట్టుకొని తిరిగిన దర్శకుడు కె.బి.తిలక్ అనే పేరుంది. ఆయన మాటంటే ఎంతోమందికి వేదవాక్కు. చప్పున ఒరే నరసింహులూ… అంటూ కేకవేశారు. వెంటనే ఖాకీ నిక్కరు వేసుకున్న ఓ నల్లటి ఆకారం ఆయన ముందు ప్రత్యక్షమయింది. వీడు మావాడే… వీడిని నీ దగ్గర పెట్టుకొని ట్రెయినింగ్ ఇవ్వరా… అన్నారు. ఆయన మాటకు ఎదురు చెప్పకుండా ఆ నరసింహులు అలాగే అన్నారు. అలా ఏమీ తెలియకపోయినా, సినిమారంగంలో మేకప్ డిపార్ట్ మెంట్ లో చేరిపోయాను. (వచ్చే సంచికలో మరికొన్ని విశేషాలు…)