అమెరికాలో కమ్మవారి కీర్తిప్రతిష్ఠలు హిమాలయాలంత ఎత్తుకు ఎదుగుతున్నాయి. అగ్రరాజ్యంలో అడుగుపెట్టి తెలుగు నేల కీర్తిబావుటా ఎగురవేస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఈ జాబితాలో తాజాగా డాక్టర్ శ్రీనివాస్ ముక్కామల చేరారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (AMA) చైర్మన్‌గా ఎన్నికై మొత్తం దేశానికే గర్వకారణంగా నిలిచారు. 16 జూన్ 2021లో ఏఎంఏ చైర్మన్‌గా ఎన్నికైన శ్రీనివాస్ ముక్కామల ఈ పదవికి ఎన్నికైన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు.
డాక్టర్ ముక్కామల అసలు పేరు శ్రీనివాస్ అయినప్పటికీ బాబీగానే ఆయన చిరపరిచితులు. బోర్డ్ సర్టిఫైడ్ ఓటోలారిన్జాలజిస్ట్ అయిన డాక్టర్ బాబీ హెడ్ అండ్ నెక్ సర్జన్. జూన్ 2017లో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు ఎన్నికయ్యారు. మిచిగన్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన బాబీ.. మిచిగన్‌లోని ఫ్లింట్‌లో ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న ఒకే ఒక్కరు కావడం గమనార్హం.
కృష్ణా జిల్లా తోట్లవల్లూరుకు చెందిన కీర్తిశేషులు అన్నే వెంకట్రామయ్య, అప్పమ్మగార్లకు మనవడు అయిన బాబీ.. మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ ఆసుపత్రి వ్యవస్థాపక చైర్మన్ ముక్కామల అప్పారావు, సుమతి దంపతులకు 1971లో అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో జన్మించారు. మూడేళ్ల వయసు వరకు మిచిగన్‌లోని ఫ్లింట్‌లో పెరిగారు. బాబీ తల్లి సుమతి ముక్కామల 1978 నుంచి 2000వ సంవత్సరం వరకు ఫ్లింట్‌లో చిన్నపిల్లల వైద్య నిపుణురాలిగా (పిడియాట్రిక్స్)గా ప్రాక్టీస్ చేశారు. తండ్రి అప్పారావు ముక్కామల కూడా ఫ్లింట్లోనే 1975 నుంచి 2020 వరకు రేడియాలజీని ప్రాక్టీస్ చేశారు.
డాక్టర్ అప్పారావు ముక్కామల మిచిగన్ స్టేట్ మెడికల్ సొసైటీకి 2007-2008 మధ్య అధ్యక్షుడిగా పనిచేశారు. 2020-2021 మధ్య ఇదే సొసైటీకి బాబీ కూడా అధ్యక్షుడిగా సేవలు అందించారు. మిచిగన్ స్టేట్ మెడికల్ సొసైటీకి గత 150 సంవత్సరాలలో తండ్రీకొడుకులు అధ్యక్షులుగా సేవలు అందించడం ఇదే తొలి సారి. ఈ సంస్థలో 15 వేల మంది ఫిజీషియన్లు ఉన్నారు.
రెసిడెన్సీ నుండి ఏఎంఏలో చురుకుగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ ముక్కామల.. ఏఎంఏ యంగ్ ఫిజీషియన్స్ విభాగానికి గతంలో మిచిగన్ ప్రతినిధిగా వ్యవహరించారు. అలాగే, ఏఎంఏ ఫౌండేషన్ ‘ఎక్స్‌లెన్స్ ఇన్ మెడిసిన్’ లీడర్షిప్ అవార్డు అందుకున్నారు. ఏఎంఏ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌కు గత 13 ఏళ్లుగా మిచిగాన్ ప్రతినిధి బృందం సభ్యుడిగా ఉన్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్‌కు ఎన్నికయ్యారు. 2016 నుండి 2017 వరకు దానికి చైర్మన్‌గా పనిచేశారు.
1970 నుంచి 2020లో రిటైర్ అయ్యే వరకు డాక్టర్ అప్పారావు ఏఎంఏలో యాక్టివ్‌గా ఉన్నారు. 2007 నుంచి 2010 వరకు తండ్రీ కుమారులు అప్పారావు, బాబీ ఒకే సమయంలో ఏఎంఏ కౌన్సిల్స్‌కు సేవలు అందించారు. ఏఎంఏలో నాయకత్వ పాత్రలతోపాటు 2011 నుంచి డాక్టర్ ముక్కామల మిచిగన్ స్టేట్ మెడికల్ సొసైటీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడిగా, గత రెండేళ్లుగా బోర్డు చైర్మన్‌గా, దాని అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే జెనెసీ కౌంటీ మెడికల్ సొసైటీ (జీసీఎంఎస్) అధ్యక్షుడిగానూ పనిచేశారు. ప్రస్తుతం జీసీఎంఎస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు.
డాక్టర్ బాబీ భార్య నీతా కులకర్ణి కూడా వైద్యురాలే. ఆమె ప్రసూతి వైద్యురాలు-గైనకాలజిస్ట్ (ఎండీ). ఫ్లింట్ పట్ల తమ అంకితభావానికి నిదర్శనంగా 2012లో వారు ఫ్లింట్‌లోని మిచిగాన్ యూనివర్సిటీలో ఎండోవ్డ్ హెల్త్ ప్రొఫెషన్స్ స్కాలర్షిప్లను స్థాపించారు. డాక్టర్ బాబీ, నీతా దంపతులకు డెవెన్, నిఖిల్ అనే ఇద్దరు కవల కుమారులు ఉన్నారు. డెవెన్ చికాగో యూనివర్సిటీలో చదువుతుండగా, నిఖిల్ మిచిగన్ యూనివర్సిటీలో చదువుతున్నారు.