నటశేఖర కృష్ణ మొదటి నుంచీ మహానటుడు యన్టీఆర్ కు వీరాభిమాని. బాల్యంలో యన్టీఆర్ *పాతాళభైరవి* చూసి ముగ్ధుడైన కృష్ణ తరువాత రామారావు సినిమాలు చూస్తూ ఆనందించసాగారు. ఓ సారి అక్కినేని నాగేశ్వరరావును ప్రత్యక్షంగా చూడటంతో కృష్ణలోనూ చిత్రసీమలో ప్రవేశించాలన్న అభిలాష కలిగింది. అలా చిత్రసీమలో ప్రవేశించిన కృష్ణ ఆరంభంలో బిట్ రోల్స్ చేశారు. తరువాత ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన *తేనె మనసులు*ద్వారా ఓ హీరోగా పరిచయమయ్యారు కృష్ణ. ఆ తరువాత *గూఢచారి 116* కృష్ణకు హీరోగా మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత కృష్ణ పలు చిత్రాలలో హీరోగా నటించినా, అవేవీ ఆయనకు స్టార్ డమ్ సంపాదించిపెట్టలేదు. తొలి నుంచీ యన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకున్న కృష్ణ తాను కూడా సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి, తమ అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించాలని ఆశించారు. అందుకు ఆయన తమ్ములు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు కూడా ఉత్సాహంగా రంగంలోకి దిగారు. అలా *పద్మాలయా ఫిలిమ్స్* సంప్థ నెలకొల్పి తొలి ప్రయత్నంగా *అగ్ని పరీక్ష* నిర్మించారు. ఆ సినిమా పరాజయం పాలయింది. అయినా అన్నదమ్ములు నిరాశ చెందలేదు. మరింత ఉత్సాహంగా అప్పటి దాకా తెలుగు సినిమా రంగంలో రానటువంటి జానర్ లో ఓ సినిమా రూపొందించాలని కృష్ణ,ఆయన సోదరులు భావించారు. అప్పటి దాకా మాస్ ను యన్టీఆర్ భలేగా ఆకట్టుకొనేవారు. ఆయన నటించిన పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలు ఆబాలగోపాలాన్నీ అలరించేవి. సాంఘికాల్లో సైతం కేవలం కుటుంబ కథా చిత్రాలలోనే కాకుండా ‘దొరికితే దొంగలు’ వంటి సైంటిఫిక్ మూవీతోనూ, ‘లక్షాధికారి’ లాంటి థ్రిల్లర్ తోనూ అలరించారు. అందువల్ల యన్టీఆర్ టచ్ చేయని కథాంశంతో ముందుకు సాగాలని కృష్ణ సోదరులు ఆలోచించారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ లో విశేషాదరణ పొందే కౌబోయ్ మూవీస్ బాణీలో ఓ తెలుగు చిత్రాన్ని తెరకెక్కించాలని ఆశించారు. ప్రముఖ రచయిత ఆరుద్ర కొన్ని హాలీవుడ్ కౌబోయ్ మూవీస్ ఆధారంగా తెలుగు నేటివిటీకి తగ్గ కౌబోయ్ కథను రూపొందించారు. అదే ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఈ చిత్ర నిర్మాణంలో కృష్ణ సోదరులు ఏ మాత్రం రాజీపడలేదు. కథానుగుణంగా రాజస్థాన్ ఎడారిలో చిత్రీకరణ జరపడంలో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చారు. ఇక ఈ సినిమాకు ఆదినారాయణరావును సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. ఆదినారాయణరావు తన సొంత చిత్రాలకు మాత్రమే సంగీతం సమకూర్చుకొనేవారు. అయితే ఆయన నిర్మించిన ‘అమ్మకోసం’ చిత్రంలో కృష్ణ నటించడమే కాదు, నిర్మాణ వ్యవహారాల్లోనూ ఆయన సోదరులు సహాయం అందించడంతో ఆదినారాయణరావు ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రానికి సంగీతం సమకూర్చడానికి అంగీకరించారు.
పలు కౌబోయ్ మూవీస్ కలబోత…
హాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన *మెకనాస్ గోల్డ్, ద గుడ్, ద బ్యాడ్ అండ్ ది అగ్లీ, ఫర్ ఏ ఫ్యూ డాలర్స్ మోర్* చిత్రాల కలగలపుగా *మోసగాళ్ళకు మోసగాడు* చిత్రకథను రూపొందించారు ఆరుద్ర. ఆయనకు చరిత్రలో మంచి పట్టు ఉండడంతో మన బొబ్బిలి సంస్థానానికి చెందిన ఓ కథను ఇందులో అనువుగా చొప్పించారు. అలా ముస్తాబయిన *మోసగాళ్లకు మోసగాడు* 1971 ఆగస్టు 27న విడుదలై విజయఢంకా మోగించింది.
మన కౌబోయ్ కథ…
బొబ్బిలి యుద్ధం జరిగే సమయంలో బ్రిటిష్ వారికి దక్కకుండా జమీందారులు తమ సంపదను ఓ చోట దాస్తారు. ఆ గుట్టు తెలిసిన కొత్వాల్ ను నిధి రహస్యం చెప్పమని చంపేస్తారు. ధర్మంకోసం పోరాడే కొత్తాల్ కొడుకు కృష్ణ ప్రసాద్ ఈ విషయం తెలుసుకొని వారిని అంతమొందించడానికి పూనుకుంటాడు. అతనికి నక్కజిత్తుల నాగన్న అనే దొంగ తోడవుతాడు. రాధ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. వీరితో కలసి తన కన్నవారిని కడతేర్చిన దుండగుల వేటకు బయలు దేరతాడు. అనుకున్నట్టుగానే అందరినీ చంపుతూ ముందుకు సాగుతాడు. చివరకు నిధిని సాధిస్తారు. నక్కజిత్తుల నాగన్నను చివరకు ఓ చెట్టుకు వేలాడదీసి అతను చేసిన మోసానికి శిక్ష అంటారు. చివరకు కృష్ణ ప్రసాదే నాగన్నను బంధ విముక్కుణ్ణి చేసి వెళ్లడంతో కథ ముగుస్తుంది. మధ్యలో పలువురు విలన్లు, వారి బారి నుండి హీరో తప్పించుకోవడం, వారిని అంతమొందించడం అన్నీ ఆసక్తికరంగా సాగాయి. తెలుగువారి తొలి కౌబోయ్ చిత్రంగా *మోసగాళ్ళకు మోసగాడు* విశేషాదరణ చూరగొంది.
ఈ చిత్రానికి రచనతో పాటు కొన్ని పాటలు కూడా ఆరుద్ర రాశారు, మిగతావి అప్పలాచార్య పలికించారు. ఆదినారాయణ రావు స్వరకల్పనలో రూపొందిన *కోరినది నెరవేరినిది…* అనే పాట డ్యూయట్ గా అలరించింది. *ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా…* పాట కామెడీతో ఆకట్టుకుంది. *కత్తిలాంటి పిల్లా…* అనే పాట కవ్విస్తుంది. *గురిని సూటిగా…* అనే పాట, *తకిట ధిమితక…* పాట కూడా అలరించాయి. ఇక ఆరుద్ర రాసిన సంభాషణలు సైతం ఆకట్టుకున్నాయి.
యన్టీఆర్ అభినందన!
కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈ చిత్రంలో గుమ్మడి, నాగభూషణం, సత్యనారాయణ, ముక్కామల, ధూళిపాల, జ్యోతిలక్ష్మి, ప్రభాకర్ రెడ్ది, నగేశ్, రావు గోపాలరావు ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి వి.ఎస్.ఆర్.స్వామి ఫోటోగ్రఫి భలేగా ఆకట్టుకుంది. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో రూపొందిన తొలి కౌబోయ్ మూవీ *మోసగాళ్ళకు మోసగాడు* మాస్ ను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కౌబోయ్ సినిమాలు తెలుగువారికి కొత్తగా అనిపించడంతో బాలలను విశేషంగా ఆకట్టుకుంది. కృష్ణ సోదరులు పడ్డ కృషికి తగ్గ ఫలితం దక్కింది ఈ సినిమా పెద్ద హిట్ గా నిలచింది. తొలి సినిమాతో చూసిన నష్టాలను సైతం ఈ సినిమా లాభాలు పూడ్చి వేశాయి. మాస్ మూవీస్ లో వరైటీ రోల్స్ పోషిస్తూ సాగుతున్న యన్టీఆర్ సైతం కృష్ణ సోదరుల ప్రయత్నాన్ని అభినందించారు. ఆ తరువాత కృష్ణతో ఇతర నిర్మాతలు సైతం కౌబోయ్ మూవీస్ నిర్మించడం ఆరంభించారు.
ఈ సినిమా తరువాత ఇతర సంస్థల వారు సైతం కృష్ణతో అనేక కౌబోయ్ మూవీస్ నిర్మించారు. దాంతో తెలుగువారి కౌబోయ్ హీరోగా కృష్ణ సక్సెస్ రూటులోసాగిపోయారు.
కృష్ణ నటవారసుడు మహేశ్ బాబు తరువాతి రోజుల్లో *టక్కరిదొంగ* అనే కౌబోయ్ మూవీలో నటించాడు. ఈ చిత్రం పతాక సన్నివేశంలో కృష్ణ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆయనను ఉద్దేశించి, మహేశ్ బాబు *ఆయన మోసగాళ్లకు మోసగాడు* అని చెప్పడం అభిమానులను ఎంతగానో ఆనందింప చేసింది. ఏది ఏమైనా తెలుగునాట కౌబోయ్ మూవీస్ కు క్రేజ్ సంపాదించిపెట్టిన *మోసగాళ్ళకు మోసగాడు* యాభై ఏళ్ల క్రితం చేసిన హంగామాను అభిమానులు ఇప్పటికీ గుర్తు పెట్టుకొనే ఉన్నారు.