మానవజాతి అంతరించిపోవడం ఖాయమా?

m1

* ప్రపంచం ముగింట అతిపెద్ద సవాల్

అవును, ఇప్పుడు కరోనా వైరస్‌ను మించిన అతిపెద్ద ప్రమాదం ఒకటి ప్రపంచానికి పెను సవాల్ విసురుతోంది. 2045 తర్వాత మానవజాతి మనుగడ ప్రశ్నార్థం కాబోతుండడమే ఆ సవాలు. ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ. వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే విష వాయువులతోపాటు సబ్బులు, షాంపూలు, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల నుంచి తెలియకుండానే కాలుష్యం మనుషుల్ని చుట్టేస్తోంది. ఇది స్త్రీ, పురుషుల హార్మోన్ల పనితీరును పాడయ్యేలా చేసి పునరుత్పత్తి సామర్థ్యంపై తీవ్రమై దెబ్బకొడుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ షన్నా స్వాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన పరిశోధనలతో ఆమె రాసిన ‘కౌంట్‌డౌన్‌’ పుస్తకంలో ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది.

కాలుష్య భూతం దేశాలతో సంబంధం లేకుండా విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేసిన స్వాన్.. 1973 నాటి పురుషుల్లో వీర్యకణాల సంఖ్యతో పోలిస్తే ఇప్పటి పురుషుల్లో వీర్యకణాల సంఖ్య సగటున 60 శాతం మేర తగ్గిపోయిందని తన పరిశోధనల్లో తేలిందన్నారు. ఇది ఇలాగే కొనసాగుతూ పోతే 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య సున్నాకు చేరుకుంటుందని పేర్కొన్నారు. అదే జరిగితే పునరుత్పత్తి ఆగిపోయి, మానవ జాతి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.

ముఖ్యంగా.. ‘ఫరెవర్‌ కెమికల్స్‌’గా పేరొందిన పీఎఫ్ఏలు (పర్‌ఫ్లోరోఆల్కైల్‌, పాలీఫ్లోరోఆల్కైల్‌) ఎక్కువగా ఉండే వస్తువుల వాడకం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోందని స్వాన్ తెలిపారు. సాధారణంగా ప్లాస్టిక్‌ భూమిలో కలవాలంటే కొన్ని వందల, వేల ఏళ్లు పడుతుంది. అదే ఈ పీఎఫ్ఏలైతే పర్యావరణంలోగానీ, మానవ శరీరంలోగానీ ఎప్పటికీ కలవవు. అవన్నీ ఒకచోటికి చేరి శరీరానికి, భూమికి తీవ్ర హాని చేస్తుంటాయి. మనం వాడే షాంపూలు, రంగులు, కెమెరాలు, మరక పడకుండా నిరోధించే ఉత్పత్తులు(స్టెయిన్‌ రెసిస్టెంట్‌), నాన్‌స్టిక్‌ ఉత్పత్తులు(నాన్‌స్టిక్‌ పెనం, కడాయి వంటివి), ఫైర్‌ఫైటింగ్‌ ఫోమ్‌(అగ్నిప్రమాద సమయాల్లో మంటలను ఆర్పడానికి వాడే నురగ), ఫాస్ట్‌ఫుడ్‌ ప్యాకేజింగ్‌, పురుగుమందుల వంటివాటిలో పీఎఫ్ఏలు ఎక్కువగా ఉంటాయి.

m2

పీఎఫ్ఏల వల్ల స్త్రీలకూ ముప్పేనని షన్నా హెచ్చరించారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో సగటున 20 ఏళ్ల మహిళల పునరుత్పత్తి సామర్థ్యం.. వారి అమ్మమ్మ/నానమ్మలకు 35 ఏళ్ల వయసులో ఉన్న సామర్థ్యం కన్నా తక్కువగా ఉన్నట్టు తన పరిశోధనలో తేలిందని ‘కౌంట్‌డౌన్‌’లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రతి పురుషుడిలోనూ తమ తాతయ్యలతో పోలిస్తే సగటు వీర్యకణాల సంఖ్య దాదాపు సగమే ఉందన్నారు. దీన్ని అంతర్జాతీయ సంక్షోభంగా వర్ణించారామె. వీర్యకణాల సంఖ్య తగ్గడమే కాదు, పురుషాంగాలు, వృషణాల పరిమాణం సైతం నానాటికీ క్రమంగా కుచించుకుపోతూ వస్తోందని ఆమె హెచ్చరించారు. ఒకరకంగా ఇది పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిగా ఆమె అభివర్ణించారు.

పీఎఫ్ఏలు, ఫాలేట్స్‌, బైస్ఫెనాల్‌ ఎ.. ఇవి మనం నిత్యం వాడే అనేక ఉత్పత్తుల్లో ఉండే విష రసాయనాలు. ప్లాస్టిక్‌ను మృదువుగా, ఎటుపడితే అటు వంగేలా చేయడానికి ఫాలేట్స్‌ను వినియోగిస్తారు. ప్యాకేజింగ్‌, పిల్లల బొమ్మల తయారీలో ఎక్కువగా వాడతారు. పురుషులు ఈ ఫాలేట్స్‌కు ఎంత ఎక్కువగా గురైతే అవి అంతగా వీర్యకణాల సంఖ్యను, లైంగిక కోర్కెలను తగ్గిస్తాయి. మహిళల్లో అయితే చిన్నవయసులోనే రజస్వల కావడం, పెద్దయ్యాక గర్భస్రావాల ముప్పు ఉంటుంది.

ప్లాస్టిక్‌ను గట్టిగా చేయడానికి ‘బైస్ఫెనాల్‌ ఎ (బీపీఏ)’ను వాడతారు. ఏటీఎంలు, స్వైపింగ్‌ మెషీన్ల నుంచి వచ్చే రసీదుల్లో కూడా ఈ బీపీఏ ఉంటుంది. ఇది మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్‌లాగా వ్యవహరిస్తుంది. శరీరం దాన్ని ఈస్ట్రోజన్‌గా భావించి, తగినంత ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ను విడుదల చేయడం మానేస్తుంది. ఫలితంగా మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది. పురుషుల్లో ఇది వీర్యకణాల సంఖ్యను, లైంగిక కోర్కెలను తగ్గిస్తుంది. అంతేకాదు, అంగస్తంభన సమస్యలకు కూడా కారణమవుతుంది. గర్భిణులు ఈ రసాయనాలకు ఎక్కువగా గురైతే వాటి ప్రభావం గర్భస్థ శిశువులపైనా పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

యానోజెనిటల్‌ డిస్టెన్స్‌ (ఏజీడీ).. అంటే గుద భాగానికి, జననావయవాలకు మధ్య ఉండే తేడా. సహజంగా ఇది పురుషుల్లో ఎక్కువగా, స్త్రీలలో తక్కువగా ఉంటుంది. కానీ, ఫాలేట్స్‌కు ఎక్కువగా గురికావడం వల్ల ఈ ఏజీడీల్లో తేడాలు వస్తున్నాయని షన్నా స్వాన్‌ తెలిపారు. పురుషుల్లో ఈ దూరం తగ్గిపోతుండగా, మహిళల్లో పెరుగుతోంది. నవజాత శిశువుల్లో ఈ దూరాన్ని పరిశీలించడం ద్వారా భవిష్యత్తులో వారి పునరుత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేయొచ్చు. ఏజీడీ.. పురుషుల్లో తక్కువగా, మహిళల్లో ఎక్కువగా ఉంటే వారి పునరుత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంటుంది.

మానవజాతి మనుగడను ప్రశ్నార్థకం చేసే ఈ ముప్పును ఎదుర్కోవడం ఏ ఒక్కరి వల్లో కాదు. ప్రపంచం మొత్తం కలిసికట్టుగా పనిచేస్తేనే దీనిని ఎదుర్కోగలం. ఇందుకోసం పీఎఫ్ఏలు ఉండే ఉత్పత్తుల వినియోగాన్ని, దానితోపాటు వాటి తయారీని నిషేధించాలి. అలాగే, మన వంతుగా ప్యాకింగ్ చేసిన ఆహారానికి, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంటి భోజనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. టెఫ్లాన్ కోటింగ్ ఉన్న పాత్రలకు దూరంగా ఉండాలి. ప్లాస్టిక్ పాత్రల్లో మైక్రో ఒవెన్‌లలో వంటలు మానాలి.

Share: