ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ఇప్పటి వరకు సరైన మందులు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా మళ్లీ బూస్టర్ డోసు వేసుకోవడం తప్పదని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ వైరస్ బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం ఎలా? దీనికి శాస్త్రవేత్తలు చెబుతున్న సమాధానం.. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం. ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఒక్క కరోనా వైరస్ నుంచి మాత్రమే కాదు, మరెన్నో ఇతరత్రా జబ్బుల నుంచి కూడా బయటపడొచ్చు. మరి ఏం తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి కరోనా వైరస్ మనం భయపడుతున్నంత ప్రమాదకారేమీ కాదు. రోగ నిరోధకశక్తి తగినంత ఉంటే ఈ వైరస్ మనల్ని ఏమీ చేయలేదు. కరోనా బారినపడి మరణిస్తున్న వారిలో అత్యధికులు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే. దీనిని బట్టి ఇమ్యూనిటీ తగినంత ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం అంతంతమాత్రమేనని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వైరస్‌పై విజయం సాధించొచ్చని శాస్త్రవేత్తలు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఏం తినాలి?
కరోనాపై విజయం సాధించేందుకు పండ్లు, కూరగాయలను ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. ముఖ్యంగా చిరుధాన్యాలను, డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవడం వల్ల మరింత మేలు కలుగుతుంది. పుల్లగా ఉండే పండ్లను తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్-సి అందుతుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని గణనీయంగా పెంచుతుంది. నిమ్మ, దానిమ్మ, బత్తాయి, కమల, నారింజ వంటి పండ్లను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. అలాగే, ఆహారంలో అల్లం, వెల్లుల్లి విరివిగా వాడాలి. బొప్పాయి, గ్రీన్ టీ వంటి వాటికి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. మాంసాహారం విషయానికోస్తే చేపలు తినడం మేలు. బొచ్చలు, శీలావతి రకం వంటి చేపల్ని, పీతల్ని కూడా తీసుకోవచ్చు. పీతల్లో ఉండే జింక్ వంటి సూక్ష్మ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
వ్యాయామంతో వైరస్‌కు కట్టడి
రోగనిరోధక శక్తిని పెంచడంలో ఆహారం ఎంతగా తోడ్పడుతుందో, వ్యాయామం కూడా అంతే తోడ్పడుతుంది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళలో కాసేపు వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని దృఢంగా మార్చుకోవచ్చు. వ్యాధులను ఎదుర్కొనే శక్తి వ్యాయామం ద్వారా సమకూరుతుంది. అలాగే, ప్రతి రోజూ వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకోవాలి. కరోనా కాలంలో వేడి నీటిని తీసుకోవడం మరింత శ్రేయస్కరం. ఇక, వ్యక్తిగత శుభ్రత పాటించడం, చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవడంతోపాటు భౌతికదూరం పాటించడం, మాస్కులు ధరించడం చేస్తే కరోనా మనవైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయదు.