‘ఐపీఎల్‌’పై నీలినీడలు

ipl

దేశంలో కరోనా మహమ్మారి జడలు విప్పి కరాళ నృత్యం చేస్తున్న వేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లు యథేచ్ఛగా జరుగుతుండడంపై దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు ప్రతిరోజూ లక్షలాది కేసులు, మరోవైపు ఆసుపత్రులలో ఆక్సిజన్, పడకలు దొరక్క పోతున్న వేలాదిమంది ప్రాణాలు. దేశం మొత్తం భయం గుప్పిట్లో చిక్కుకుని క్షణమొక యుగంలా గడుపుతుంటే బీసీసీఐ మాత్రం ఐపీఎల్ కొనసాగింపుకే మొగ్గు చూపుతుండడం సగటు భారతీయుడిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధించగా, ఢిల్లీ వంటి రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. కరోనా నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలంటూ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇంకోవైపు, భారత్ నుంచి వచ్చే విమానాలను పలు దేశాలు నిషేధించడం దేశంలోని పరిస్థితికి అద్దం పడుతున్నాయి. బయోబబుల్‌లో ఉంటూ ఇప్పటి వరకు ఏ భయమూ లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్న క్రికెటర్లలోనూ ఇప్పుడు కొవిడ్ భయం పట్టుకుంది. టీమిండియా స్టార్‌, ఢిల్లీ జట్టు స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ పేసర్‌ ఆండ్రూ టై, బెంగళూరు జట్టు ఆటగాళ్లు ఆడమ్‌ జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ వ్యక్తిగత కారణాలతో టోర్నీని వీడడం ఆటగాళ్లలో నెలకొన్న కరోనా భయాన్ని చెప్పకనే చెబుతోంది.

దేశంలో మొత్తం కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న వేళ టోర్నీ నిర్వహించడం అవసరమా? అన్న చర్చ మొదలైంది. తక్షణమే టోర్నీని నిలిపివేయాలంటూ సోషల్ మీడియాలోనూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే, బీసీసీఐ మాత్రం ఐపీఎల్ నిర్వహణకే మొగ్గుచూపుతుండడం గమనార్హం.

భారత్ నుంచి వచ్చే విమానాలను నిలిపివేసిన ఆస్ట్రేలియా.. ఐపీఎల్‌లో ఆడుతున్న ఆసీస్ ఆటగాళ్లు స్వదేశం రావాలంటే సొంత ఏర్పాటు చేసుకోవాలని తేల్చి చెప్పడంతో ఆటగాళ్లలో గుబులు మరింత మొదలైంది. అయితే, స్వదేశం వెళ్లేందుకు మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసీస్ మాజీ కెప్టెన్, ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వదేశం వెళ్లడం కంటే బయో బబుల్‌లో ఉండడమే క్షేమమని పేర్కొన్నాడు. బబుల్‌ వెలుపల అంతా ఆందోళనకరంగా ఉన్నమాట నిజమేనన్నాడు. కానీ కొన్ని గంటలపాటు ఆ పరిస్థితినుంచి బయటపడాలంటే టోర్నీ కొనసాగడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్‌లో ఆడుతున్న ఇంగ్లిష్ ఆటగాళ్లపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని పేర్కొంది. ఆటగాళ్ల ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని చెప్పుకొచ్చింది. అంతేకాదు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారతీయులకు సంఘీభావం కూడా తెలిపింది.

ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో ఇప్పటి వరకు 11 మంది ఆటగాళ్లు తప్పుకున్నారు. వీరిలో ఆడం జంపా, ఆండ్రూ టై, రిచర్డ్‌సన్‌, అశ్విన్‌, స్టోక్స్‌, ఆర్చర్‌, హాజెల్‌వుడ్‌, ఫిలిప్‌, లివింగ్‌స్టోన్‌, మార్క్‌వుడ్‌, మిచెల్‌ మార్ష్‌ ఉన్నారు. తన కుటుంబం కరోనాతో పోరాడుతుండడంతో, వారికి అండగా ఉండేందుకు టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు అశ్విన్ తెలిపాడు. ఆండ్రూ టై మాత్రం కరోనా భయంతోనే వీడుతున్నట్టు చెప్పాడు. భారత్‌లో పెరుగుతున్న కేసులతో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారని ఆ దేశానికి చెందిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మెంటార్‌ డేవిడ్‌ హస్సీ అంగీకరించాడు. తాము తిరిగి ఆస్ట్రేలియా వెళతామో, లేదోననే ఆందోళనలో వారు ఉన్నారని పేర్కొన్నాడు.

ఐపీఎల్ నిర్వహణను మీడియా సంస్థలు, క్రీడా విశ్లేషకులు కూడా తప్పుబడుతున్నారు. ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాలర్, కామెంటేటర్ గ్యారీ లినేకర్ కూడా ఐపీఎల్‌‌ నిర్వహణను తీవ్రంగా తప్పుబట్టాడు. భారత్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐపీఎల్‌ను నిర్వహించడం పెద్ద తప్పిదమేనని పేర్కొన్నాడు. క్రికెట్‌కు తాను పెద్ద అభిమానినే అయినా ప్రస్తుత ఐపీఎల్ నిర్వహణను సమర్థించలేనన్నాడు. ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ తీసే పరుగుల కంటే వేగంగా బయట జనం కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

గార్డియన్ పత్రిక అయితే ఐపీఎల్‌పై తీవ్ర విమర్శలు చేసింది. కాసులు కురిపించే వాటిని అస్సలు విమర్శించకూడదని, అందులోనూ ఐపీఎల్ అత్యంత పవిత్రమైనదని సెటైర్ వేసింది. ఆయా ఫ్రాంచైజీలకు బీసీసీఐ పంపిన ఈమెయిల్‌ను సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఎద్దేవా చేసింది. మరోవైపు, ఐపీఎల్‌లో ఆడుతున్న ఇంగ్లండ్ ఆటగాళ్లను వెనక్కి రప్పించాలంటూ క్రికెట్ బోర్డుపై విపరీతమైన ఒత్తిడి ఉందని డెయిలీ మెయిల్ పేర్కొంది.

Share: