పెళ్లి వేడుకలకు మళ్లీ గండం

pelli

మే 1 నుంచి ప్రారంభం కానున్న వివాహాల సందడి
ఇప్పటికే మండపాలు, ఈవెంట్లకు అడ్వాన్సులు చెల్లింపు
కొవిడ్‌ విజృంభణతో పరిమితి సంఖ్యలోనే అనుమతులు?
వధూవరుల తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళన
వేడుకల ఏర్పాట్లపై ప్రభావం.. వివిధ వర్గాల ఉపాధికి గండి
కరోనా మహమ్మారి ప్రభావం మరోసారి వివాహాది శుభ కార్యక్రమాలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. 70 రోజులపాటు శుక్రమూఢమి కొనసాగి మే 1వ తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ వేడుకలపై కూడా కరోనా ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కల్యాణ మండపాలు, విందు వినోదాలతోపాటు అనేక ఈవెంట్ల నిర్వహణకు లక్షల్లో అడ్వాన్సులు చెల్లించినవారు ఇప్పుడు ఆగండి.. కాస్త వేచి చూద్దామంటూ సందేశాలు ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా గతేడాది మార్చి 3వ వారం నుంచి కరోనా ఎఫెక్ట్‌తో ఆరు నెలలకుపైగా పెళ్లిళ్లకు బ్రేక్‌ పడింది. తరువాత ముహూర్తాలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. ఇక 2021 జనవరి మూడో వారం నుంచి శుక్రమూఢమి కారణంగా పెళ్లిళ్లు, శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు వంటి వాటికి ముహూర్తాలు లేవు. ఇప్పుడు వైశాఖమాసంలో మే 1వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో ముందస్తుగానే వధూవరుల తల్లిదండ్రులు భారీగా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. అమలాపురం పట్టణంతోపాటు కోనసీమవ్యాప్తంగా ఉన్న కల్యాణ మండపాలు, ఫంక్షను హాళ్లు, హోటళ్లతోపాటు షామియానాలు, పూల డెకరేష న్లు, వంట పనివారలు, అనేక రకాల ఈవెంట్లకు అధిక మొత్తాల్లో అడ్వాన్సులు చెల్లించి ఖరారు చేసుకున్నారు.
మే, జూన్‌ నెలల్లో పెద్ద సంఖ్యలో ముహూర్తాలు ఉండడంతో కొన్ని వందల పెళ్లిళ్లకు నిర్ణయాలు జరిగాయి. గతంలో కరోనాతో వాయిదా పడ్డ పెళ్లిళ్లు సైతం ఈ ముహూర్తాల్లో అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించుకున్నప్పటికీ కరోనా మరో సారి వారి పాలిట శాపంగా మారింది. మూఢం ఉన్న మూడు నెలలు మౌనంగా ఉన్న కరోనా ముహూర్తాలు ప్రారంభమయ్యే సమయానికి విజృంభించడం తమకు శాపంగా మారిందంటూ కల్యాణ మండపాల యజమానులతోపాటు వివిధ ఈవెంట్ల మేనేజర్లు ఆవేదన చెందుతు న్నారు. లక్షల్లో అడ్వాన్సులు చెల్లించామని, ఇప్పుడు తిరిగి ఇమ్మన్నా వచ్చే పరిస్థితి లేదని వధూవరుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కరోనా నిబంధనలు పాటించాలంటూ అధికారులు ఆదేశాలిస్తుండడంతోపాటు కొన్నిచోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేయడం వల్ల పెళ్లిళ్లు ఎలా జరుగుతాయనే ఆందోళన ఇరువర్గాల బంధుమిత్రుల్లో నెలకొన్నాయి.
గతేడాది కరోనా పరిస్థితులను ప్రత్యక్షంగా చూడడంతోపాటు ప్రస్తుతం తీవ్రరూపం దాల్చుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెళ్లిళ్లు నామమాత్రం గానే జరుపుకునేందుకు సిద్ధం కావాల్సిందిగా అధికారులు సూచిస్తు న్నారు. ఇప్పటికే దేవుళ్ల కల్యాణాలు, శ్రీరామనవమి వేడుకలు వంటివి రద్దు అయిన నేపథ్యంలో పెళ్లిళ్లపై కూడా కరోనా ఆంక్షలు తీవ్ర ప్రభా వం చూపనున్న దృష్ట్యా వివాహ వేడుకలతో ముడిపడి ఉన్న అన్ని వర్గాలవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోసారి తామంతా నష్ట పోవలసి వస్తుందంటూ ఆయా వర్గాలవారు ఆవేదన చెందుతున్నారు.

Share: