ఈ- గేమ్స్‌ ఆడుతున్నారా.. మీకో షాకింగ్ న్యూస్! వీటితో ఆరోగ్య సమస్యలే

G1

మెడ, వెన్ను నొప్పులతో ఇబ్బంది పడుతున్న నవతరం
రోజుకు 5-6 గంటలు నిమగ్నం కావడమే కారణం : డాక్టర్లు
ఆన్‌లైన్‌లో గేమింగ్‌ పోటీలు కూడా..
ఒంటికి వ్యాయామాలు చాలా మంచిది. క్రీడలతో చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది అని చాలామంది చెబుతారు. ఆరు బయట ఆడుకుంటున్నప్పుడు తమకు ఫలానా చోట గాయమైందని, అయినాసరే, తనకు ఇప్పటికీ ఆ ఆటలు ఆడటం ఇష్టమని చెబుతుండడం సర్వ సాధారణంగా చూస్తుంటాం. ఇప్పటి నవతరం కూడా ఆటలు ఆడుతుంది. కానీ మునపటిలా కాదు. ఏకంగా 5-12 గంటలు రాత్రనకా, పగలనకా కష్టపడిపోతుంటారు. అంతేనా… ఇందులోనూ గాయాల బారిన పడతారు. కాకపోతే కాస్త విభిన్నంగా. మెడ పట్టేయడం, చేతుల నొప్పులు, వేళ్లు బిరిసుగా మారడం, కాళ్లనొప్పులు, వెన్నునొప్పి. ఇవి చాలదన్నట్లు కళ్ల సమస్యలు, ఊబకాయం లాంటివి అదనం. అదేంటి ఆటలాడితే ఇన్ని సమస్యలా అని అంటే, మరి వీరు ఆడేది ఈ-గేమింగ్‌ అనే సమాధానం వస్తుంది.
చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు కోట్లాది గేమ్స్‌ అందుబాటులో ఉన్నట్లే. కరోనా మహమ్మారి వచ్చిన తరువాత గేమింగ్‌ కంటెంట్‌ గణనీయంగా వృద్ధి చెందడమే కాదు… గేమర్లు కూడా అంతే సంఖ్యలో వృద్ధి చెందుతున్నారు. ఈ-గేమింగ్‌తో ఇప్పుడు గాయాల బారిన పడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందంటున్నారు వైద్యులు. జనరల్‌ ఫిజీషియన్ల దగ్గర తమ సమస్యలను విన్నవించి చికిత్స పొందుతున్న వారు మాత్రమే కాదు అర్థోపెడిషియన్లు, హెడ్‌ అండ్‌ నెక్‌, స్పైన్‌ స్పెషలి‌స్ట్‌ల దగ్గర కూడా కన్సల్టేషన్స్‌ పెరుగుతున్నాయి.

పురుషులతో దీటుగా మహిళలు…

మామూలుగా యువతరంతోపాటుగా చిన్నారులకు గాడ్జెట్స్‌ అంటే మక్కువ. కాస్త ఖాళీ దొరికితే గేమ్స్‌ ఆడేందుకు కుస్తీలు పడుతుంటారు. అలాంటి వారికి లాక్‌డౌన్‌ ఆనందాన్నే తీసుకువచ్చింది. గత ఏడాది విద్య కూడా ఆన్‌లైన్‌కు చేరడంతో క్లాస్‌ల సంగతి ఎలాగున్నా యూట్యూబ్‌లో గేమింగ్‌ వీడియోలు చూస్తూ గడిపేసిన గడుగ్గాయిలూ ఉన్నారు. మగవారితో పోటీగా మహిళలు కూడా ఇదే రీతిలో ఇక్కడ సమయం వెచ్చిస్తున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. క్యాజువల్‌ గేమ్స్‌తో మానసికోల్లాసం, వినోదం లభిస్తుందంటున్న మహిళలు పోటీ క్రీడలలో కూడా పాల్గొనడానికి అంతే ఉత్సాహం చూపుతున్నారని కూడా ఆ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఉత్సాహమే 2019లో 5.6 బిలియన్‌ మొబైల్‌ గేమ్‌ అప్లికేషన్స్‌ భారతదేశంలో డౌన్‌లోడ్‌ అయితే గత ఏడాది కాలంలో దానికి రెట్టింపు అప్లికేషన్స్‌ డౌన్‌లోడ్‌ అయ్యాయని టెక్నాలజీ సంస్థలు పేర్కొంటున్నాయి.

మితిమీరితే మతి పోతుంది..!

కరోనా వచ్చిన తరువాత భయపడే వారు ఎంతమంది ఉన్నారో… అంతకు మించిన ఆనందంతో తమకు లభించిన సమయాన్ని ఆస్వాదిస్తున్న వారూ ఉన్నారు. మరీ ముఖ్యంగా నవతరం అయితే గాడ్జెట్స్‌ లేదంటే టీవీలకే అతుక్కుపోతుందని చెప్పనవసరమే లేదు. వినోదం, ఆహ్లాదం, టైమ్‌పాస్‌, పోటీ.. ఇలా భిన్న కారణాలతో గేమింగ్‌ ఆడుతున్నారు. దానితో పాటు సమస్యలనూ కొని తెచ్చుకుంటున్నారు. రోజూ కనీసం 2-3 గంటలు ఆడే వారు మెడ నొప్పులతో బాధపడుతున్నారంటున్నారు స్పైన్‌ అండ్‌ పెయిన్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్‌. తన దగ్గరకు రోజూ 2-3 కేసులు ఇవే ఉంటున్నాయని తెలిపారు. గాడ్జెట్స్‌కు ఎక్కువ సేపు అంటిపెట్టుకోవడమే ఇందుకు కారణమని అన్నారు. బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసన్‌ నిర్వహించిన ఓ అధ్యయనంలో రమారమి 5-10 గంటలు ఈ-గేమింగ్‌ ఆడే వారికి చేతులు, మణికట్టు నొప్పి, మెడ, వెన్ను నొప్పి సమస్యలు అధికంగా వస్తాయని తేల్చింది. సరిగా కూర్చోకపోవడం కారణంగా మెడ, వెన్నుముక, భుజాల నొప్పులు రావడం వీరిలో అతిసహజమని వైద్యులు అంటున్నారు.
కళ్లు అలిసిపోయాయన్నది ఎక్కువ మంది చేసే ఫిర్యాదు. ఇక ఈ గేమర్లలో మరో సమస్య నిద్రలేమి. స్ర్కీన్స్‌ నుంచి వెలువడే బ్లూ లైట్‌ కారణంగా స్లీప్‌ హార్మోన్‌ మెలటోనిన్‌ తగ్గిపోతుందని, దాని వల్ల అధిక శాతం మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని వారు వివరించారు. సమస్యల నుంచి బయట పడాలంటే ఆరోగ్యవంతమైన గేమింగ్‌, రొటీన్‌తో పాటుగా జీవనశైలి మార్చుకోవడమూ అవసరమేనని డాక్టర్‌ శ్రీనివాస్‌ చెబుతున్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇప్పుడు ఓ వ్యసనంగా మారిపోతోంది. కొంతమంది ఎక్కువగా వీటిని ఆడుతున్నారు.. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఫోన్లు పట్టుకుని కూర్చోవడం కాకుండా అందరూ సరదాగా గడపటానికి ప్రయత్నిస్తూ ఓ రొటీన్‌ ఏర్పరుచుకుంటే ఈ-గేమింగ్‌ సమస్యల నుంచే కాదు.. కరోనా భయాల నుంచి కూడా బయట పడవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌ గేమింగ్‌కు అతుక్కుపోతున్న యువత

గత సంవత్సర కాలంగా మల్టీ ప్లేయర్‌ గేమింగ్‌కు మక్కువ పెరగడంతో పాటుగా గేమర్స్‌ ఒకరితో ఒకరు పోటీ పడటం కూడా పెరిగింది. ఇవి చాలదన్నట్లు అత్యధిక సంఖ్యలో కాలేజీలు, పాఠశాలల విద్యార్థులు ఈ-స్పోర్ట్స్‌లో పోటీలూ ఆడుతున్నారు. అదీగాక ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ టోర్నమెంట్‌లూ భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి. దీనితో సిస్టమ్స్‌కు అంటిపెట్టుకుపోతున్న నవతరం వ్యాధుల బారిన పడుతోంది. గతంలో క్రీడా గాయాలకు చికిత్స ఎలాగైతే అందించామో ఈ-గేమర్స్‌కు కూడా అటువంటి చికిత్సనే అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. తాను రోజుకు కనీసం నాలుగైదు గంటలు గేమ్స్‌ ఆడుతుంటానని గతంలో పబ్‌జీ, ఇప్పుడు ఫౌజీ, ఏదైనా సరే ఇంట్రెస్టింగ్‌గా ఉంటే చాలు అని అన్నాడు ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థి వంశీ. అన్నట్లు ఇతను గతంలో పబ్‌జీ నిర్వహించిన గేమింగ్‌ పోటీలోనూ పాల్గొన్నాడు.

మనవాళ్ల గేమింగ్‌ తీరు ఇలా ఉంది..!

మనవాళ్ల గేమింగ్‌ తీరు గురించి ఫిక్కీ వెల్లడించిన అంశాలేమిటంటే..
– ఫాంటసీ గేమ్స్‌పై ఆదరణ గణనీయంగా వృద్ధి చెందుతుందుతోందిప్పుడు. దీనికి తోడు ట్రాన్‌జాక్షన్‌ ఆధారిత గేమ్స్‌లో నగదు గెలుచుకునే అవకాశాలు ఉండటంతో వాటి పట్ల కూడా ఆదరణ పెరుగుతోంది. లావాదేవీల ఆధారిత గేమ్స్‌ 50% వృద్ధి చెందితే, ఫాంటసీ స్పోర్ట్‌ గేమ్స్‌ 118% వృద్ధి చెందాయి.
– మొబైల్‌ ఫోన్లపై క్యాజువల్‌ గేమ్స్‌ పరంగా 20% వృద్ధి నమోదవుతుంది. 41% మంది రేసింగ్‌ గేమ్స్‌ ఆడుతుంటే, క్యాజువల్‌ గేమ్స్‌ 47% మంది, స్ట్రాటజీ గేమ్స్‌ 61% మంది, పజిల్స్‌ పట్ల 44%మంది ఆసక్తి చూపుతున్నారు.
– 55% మంది తమ స్నేహితులు సూచించిన గేమ్స్‌ ఆడుతున్నారు.
– మనవాళ్లలో 31% మంది గేమింగ్‌ను స్ట్రెస్‌ రిలీవర్‌గా భావిస్తుంటే, 10% మంది ఇతర కారణాలతో ఆడుతున్నారు.
– మన భారతీయులు సరాసరిన రోజుకు 28 నిమిషాల సమయం గేమింగ్‌పై వెచ్చిస్తున్నారు. 76% మంది రోజుకు కనీసం రెండు సార్లు ఫోన్లపై గేమింగ్‌ ఆడుతున్నారు.
– 58% మంది డిన్నర్‌ అయిన తరువాత గేమ్స్‌ ఆడుతున్నారు.

G2

Share: