స్వధర్మ యోగం-అనువైన వృత్తిలో ఎనలేని ఆనందం – డాక్టర్ సి.వి. రావు

Drc

ప్రియ మిత్రులారా..!

అణువంత సూక్ష్మజీవి ఆధునిక ప్రపంచాన్ని గడగడలాడించి కాలచక్రాన్ని- ‘‘కోవిడ్ ముందు-కోవిడ్ తర్వాత’’గా విభజించాల్సి వచ్చిన పరిస్థితిని తెచ్చిపెట్టింది. లక్షలాదిమంది మరణించడంతో బాటు అనేక దేశాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యింది. ముడిసరుకు అందుబాటులో లేక అనేక సంస్థలు ఉత్పత్తి చేయలేకపోయాయి. కొనుగోలుదారుల చేతుల్లో డబ్బులు ఆడక ఉత్పత్తి చేసిన దానిని సైతం అమ్ముకోలేక మూతపడిపోయాయి. రాకపోకలపై ఆంక్షలు విధించడంతో అనేక పరిశ్రమలు నష్టపోయాయి. పర్యవసానంగా అనేకానేక సంస్థలు ఉద్యోగులను పని నుండి తొలగించడంతో లక్షలాదిమందికి ఉపాధి పోయింది. ఉద్యోగులు మాత్రమేనా, వృత్తిపనివారు, కళాకారులు, బడుగు వ్యాపారస్తులు అందరూ సంపాదించే అవకాశాలు కోల్పోయారు. వస్తువులు అమ్ముడు పోనప్పుడు వాటికి మరమ్మతులు చేసేవారి సేవలు వినియోగించుకునే వారెవరు?
వస్తూత్పతిలో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేని వాళ్లంటూ ఎవరూ ఉండరు. ఆ సరుకు తయారీ కోసం సాంకేతిక జ్ఞానం, అమ్మకం కోసం వాణిజ్య పరిజ్ఞానం, ప్రచారం కోసం భాషా పరిజ్ఞానం.. వీటన్నింటికీ మానవ వనరులే ఆధారభూతం. అదే విధంగా వస్తు వినిమయం కూడా మనుషుల ద్వారానే జరుగుతుంది. వస్తువులకు సంబంధించిన సేవలు అందించేవారూ మనుషులే. వారి వారి నైపుణ్యం బట్టి ఆయా రంగాలలో రాణిస్తారు. జీవనోపాధి ఆర్జించుకుంటారు. కరోనా వైరస్ కారణంగా కార్యకలాపాలు స్తంభించండంతో ఈ వినియమవృత్తం దెబ్బతింది.
దీని కారణంగా ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు హరించుకుపోతాయి అని భయపడి బెంగపెట్టుకుందామా? పరిస్థితులు మారినప్పుడు వాటికి అనుగుణంగా మారగలిగేవాడికి ఎప్పుడూ ఢోకా ఉండదు. టేప్ రికార్డులు వున్నంత కాలం అవి రిపేరు చేసేవాళ్లుండేవారు. అవి మూలనపడ్డాక వాళ్లేమైపోయారు? వీడియో కాసెట్టు రిపేరర్లుగా అవతారమెత్తారు! ఇప్పుడు అవీ పోయాయి. ఇంకో రకమైన సర్వీసులోకి వెళ్లి వుంటారు. వేసవిలో చలివేంద్రం పెట్టి గడించినవాడు వర్షాకాలంలో రెయిన్‌కోట్‌లు అమ్మి గడిస్తాడు. కరోనా అనంతరం కూడా మనుషులుంటారు. వాళ్లకి అవసరాలు వుంటాయి. కొత్త అవసరాలేమిటో గ్రహించి, అవి తీరిస్తే కొత్త రకమైన జీవనోపాధి అమరుతుంది. ఉద్యోగం కానీ, స్వయం ఉపాధి కానీ, వృత్తిపని కానీ- అవసరానికి, కాలానికి అనుగుణంగా మారుతూ, పని చేసే తీరులో ఇతరుల కంటే మెరుగ్గా వుండేవారికి సంపాదన తప్పకుండా ఉంటుంది. జీవితంలో ఎదుగుతారు. పనితనం, నిజాయితీ రెండూ కలగలిస్తేనే ఉద్యోగ ధర్మం అనిపించుకుంటుంది. ఇక్కడ ఉద్యోగం అంటే వేరే వారి వద్ద జీతానికి కొలువు చేయడం అనే అర్థంలో వాడడం లేదు. తమ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని సంపాదించే అందరూ ఇదే కోవకు చెందుతారు. వేరేవారి వద్ద పనిచేసే ఉద్యోగులలో అభద్రతాభావం అనునిత్యం పెరుగుతున్న ఈ రోజుల్లో స్వయం ఉపాధి బాట పట్టడం యువతకే కాదు, సమర్థత గలవారందరికీ అనువైనది. వారిపై ఇలాంటి సంక్షోభ సమస్యల ప్రభావం తక్కువనే చెప్పొచ్చు. ఎవరైనా సరే, వృత్తిలో రాణింపు అనేది ముఖ్యం. అలా రాణించాలంటే ముందుగా ఆ వృత్తి తన స్వభావానికి, అభిరుచికి, శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా వుందా లేదా అనేది తేల్చుకోవాలి.

నేను ఏ వృత్తిలో రాణిస్తాను?

‘నో దై సెల్ఫ్’ అంటారు ఇంగ్లీషువారు. నిన్ను నీవు తెలుసుకో అనే మాట వినడానికి ఎంతో సులభంగా అనిపించినా ఆచరణలో చాలా కష్టం. ‘నేనెవరిని? ఎక్కణ్నుంచి వచ్చాను? ఎక్కడికి వెళతాను?’ అనే వేదాంతపరమైన ప్రశ్నలకు సమాధానం ఎంత కష్టమో ఇదీ అంతే కష్టం. నా గురించి నేను తెలుసుకోవడం అంటే నా బలమేమిటి? నా బలహీనత ఏమిటి? నేను ఎందుకు పనికివస్తాను? ఫలానా దానిలో నాకు ఆసక్తి వుందా లేదా? ఆసక్తి ఉన్నా శక్తి చాలుతుందా? కావలసిన శక్తి సమకూర్చుకోవడానికి ఎంతకాలం పడుతుంది? ఇవన్నీ అంచనా వేసుకోవాలి. ఈ బేరీజు వేసుకోవడం కూడా సకాలంలో, సత్వరంగా, పుణ్యకాలం గడిచిపోక ముందే వేసుకోగలగాలి. నడివయసు వచ్చాక ‘నేను ఏరోప్లేన్ పైలట్ కావాల్సింది’ అనుకుంటే ఏం లాభం?
తనకు అనుగుణమైన పని-దీన్నే స్వధర్మం అంటారు-తెలుసుకున్నాక దానినే అంటిపెట్టుకుని సాధన చేయాలి. మధ్యలో మరొకటి ఆకర్షణీయంగా అనిపించి, అడ్డదారిలో దాన్ని సాధించవచ్చని అనుకుని దీన్ని వదిలిపెడితే రెంటికి చెడ్డ రేవడి అవుతారు. దీనిలోనే చావో రేవో తేల్చుకోవాలి అన్నంత పట్టుదలతో ఈ వృత్తిలో మునిగి తేలాలి. ఈ విషయాన్నే పెద్దలు భగవద్గీతలో కృష్ణుడి ద్వారా చెప్పించారు.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్,
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః (3:35)
తా: చక్కగా అనుష్టింపబడిన పరధర్మము కంటే, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు! పర ధర్మము భయము కొల్పునది. ఆచరణకు అనుచితమైనది.
వినడానికి ఇదేదో సనాతన ధర్మంలా, చాదస్తపు ప్రవచనంలా అనిపించినా ఈ కాలానికీ వర్తిస్తుంది. ఇక్కడ గ్రహించవలసినది ఒకటుంది. గుణము అంటే ఇక్కడ కారెక్టర్ అని కాదు. ప్రభావము అని. మందు గుణం చూపించింది అంటాం కదా, ఆ అర్థంలో ఇక్కడ ఉపయోగించారు. స్వధర్మం ఆచరిస్తున్నప్పుడు దాని ప్రభావం అంటే ఫలితం వెంటనే కనపడక పోవచ్చు. కనబడినది మన ఆశలకు అనుగుణంగా లేకపోవచ్చు. అంతమాత్రం చేత దాన్ని విడిచి పెట్టకూడదు. సాధన చేయాలి. సాధించాలి. ఎందుకంటే ఫలితం త్వరగా వస్తుందని మరొక వృత్తిలోకి దూకితే, దానిలో మనకు నేర్పులేక అక్కడ విఫలం కావచ్చు. సైకిలు మరమ్మతు చేసేవాడు, సైకిళ్ల వాడకం తగ్గగానే స్కూటరు రిపేరులోకి, వాటి వాడకం తగ్గగానే మోటార్ సైకిలు మరమ్మత్తుకి వెళ్లవచ్చు. కారు మెకానిక్‌గా మారితే మార్కెట్లో కొత్త మోడల్ రాగానే దాని సంగతి గ్రహించి, ఆ పనీ చేపట్టవచ్చు. ఎందుకంటే వాహనాల మరమ్మత్తు అనేది అతని వృత్తి. అనుకున్నంత ఆదాయం రాలేదని దానిని వదలి అతను ఏ స్వర్ణకార వృత్తికో, బట్టల నేతకో మారితే దెబ్బతింటాడు. ఇదీ భావం.
ఈ రోజుల్లో రకరకాల రంగాల్లో ఎంతో బాగా రాణించిన వాళ్లను మీరు ఓసారి గమనించండి. వాళ్లందరూ లాటరీ టికెట్ కొని అదృష్టవంతులు కాలేదు. నచ్చిన రంగంలో కష్టపడి, కిందామీదా పడి, దాన్నే అంటిపెట్టుకుని, క్రమేపీ ఉన్నతస్థాయికి వచ్చిన వాళ్లే! ‘‘మేము కష్టపడకుండానే అభివృద్ధిలోకి వచ్చాము’’ అని చెప్పగలిగేవారున్నారా? ‘అనేక ఇబ్బందులను అధిగమించి ఈ స్థితికి చేరాం’ అంటారు. ఇక్కడే అసలు గుట్టు ఉంది. అన్ని ఇబ్బందులు అన్నాళ్లు ఎందుకు పడ్డారు వాళ్లు? ఆ వృత్తి అంటే వాళ్లకు అపారమైన ప్రేమ వుంది గనుకనే కష్టాలు ఓర్చుకున్నారు. వారసత్వ సౌలభ్యం ఉన్న వారికి ప్రవేశం సులభమే కానీ, నిలదొక్కుకోవాలంటే వృత్తిని ప్రేమించాలి. లేకపోతే రాణించలేరు. రవీంద్రనాథ్ టాగూరు కుమారుడు రచయిత కాలేదు. మహమ్మద్ రఫీ కుమారుడు గాయకుడు కాలేదు. అభిరుచి, నైపుణ్యం అనేవి వ్యక్తిగతమైనవి.
– డాక్టర్ సి.వి.రావు రచించిన ‘స్వధర్మయోగం-అనువైన వృత్తిలో ఎనలేని ఆనందం!’ అనే పుస్తకం నుంచి

drc1

Share: