ఉన్నతంగా రూపొందాలన్న ఆకాంక్షను అందరూ ఎందుకు ఆదరించరు? తాము అతి సామాన్యులమని, ఉన్నతంగా ఎదగాలని కోరుకోవడం సరికాదని, ఈ విషయం ఎవరికైనా చెబితే అవహేళన చేస్తారని, అంతులేని ఆశతో స్వర్గానికి నిచ్చెనలు వేస్తున్నామని చిన్నచూపు చూస్తారని అత్యధికశాతం మంది భయపడుతుంతారు. ఈ కారణంతోనే ఉన్నతంగా ఎదగాలన్న ఆలోచనలను తొలిదశలోనే తుంచి వేస్తారు.
ఉన్నతంగా ఎదగాలన్న ఆలోచనే ఎవరికైనా ఉన్నతంగా ఎదగడానికి రాచబాటవేస్తుంది. అయితే తమ ఆలోచనలు సరైనవో కావో తెలుసుకోవడమెలా?
అసలు ఉన్నతమైన లక్ష్యాలేవి? ఆ లక్ష్యాల వెనుక దాగివున్న
ఉద్దేశ్యాలను అనుసరించే అవి ఉన్నతమైనవో కాదో నిర్ణయించవచ్చు. చుట్టూవున్నవారందరూ తన గొప్పదనాన్ని గుర్తించాలని, జీవితాన్ని వైభవంగా గడపాలని, అందుకే తాను కోట్లు సంపాదించాలని ఒకతను కలలు కంటాడు. తానేదైనా పెద్ద పదవి పొందితే అందరూ తనను గౌరవిస్తారని, భయం భయంగా మసులుకొంటారని వేరొకతను ఆశిస్తాడు. తాను ఎలాగోలా గొప్ప పేరుప్రఖ్యాతలు సంపాదించకలిగితే తన సామర్థ్యం అందరికీ తెలిసి వస్తుందని, తనకో మంచి గుర్తింపు వస్తుందని ఇంకొకతను భావిస్తాడు. ఇటువంటి వారి ఆలోచనలన్నీ తమ స్వీయప్రయోజనాల చుట్టే పరిభ్రమిస్తుంటాయి. ఇటువంటి వారు తమ లక్ష్యాలను జేరుకోవడం కోసం అవాంఛనీయమైన పనులకైనా పాల్పడడానికి వెనుకాడరు.
ఇందుకు భిన్నంగా ఇతరులకు ప్రయోజనం కలిగించడమెలాగని, ఇతరులకు ఉపకరించే రీతిలో తమ ప్రతిభా సామర్థ్యాలను తీర్చిదిద్దుకోవడమెలా అని ఆలోచించేవారు తాము ఎంచుకొన్న రంగంలో ఉన్నతంగా ఎదగకల్గుతారు. వారే నాడు ఆశించి ఎరుగని సంపద, పేరు ప్రఖ్యాతులు కూడా అయాచితంగా వారికి లభిస్తాయి. అంతేకాదు, లక్షలాదిమందికి ప్రయోజనం కలిగించడమెలా అని ఆలోచించే వ్యక్తి
ఉన్నతంగా ఎదగగల అవకాశాలను సులభంగా అందిపుచ్చుకో కలుగుతాడు. ఇందుకు భిన్నంగా తన స్వీయప్రయోజనాల గురించే ఆలోచించే వ్యక్తి ఆ ఆలోచనల మధ్య బందీ అయిపోయి, ఈ విశాల ప్రపంచంలో తాను అందుకోగల స్థానాన్ని అవగతం చేసుకోలేడు.
రాజారావు, మోహన్ ఇద్దరూ ప్రతిభావంతులైన కంప్యూటర్ ఇంజినీర్లు. ఇద్దరూ కలసి ఒక సాఫ్ట్వేర్ సంస్థను నెలకొల్పారు. మొదటి రెండు సంవత్సరాలలో ఆ సంస్థ అనేక నష్టాలు, ఇబ్బందులు చవిచూడడంతో ఇద్దరూ ఇబ్బందిపడ్డారు. దీని ద్వారా తాను కోట్లు సంపాదించాలనుకొంటే ఇలా అయ్యిందని రాజారావు అనుకొనేవాడు. ఇందుకు భిన్నంగా అనేక క్రొత్త ఉత్పత్తులు రూపొందించి, వివిధ కంపెనీల అవసరాలను తీర్చడానికి తాము మరింత కృషి చేయాలని మోహన్ భావించే వాడు. తాము ఇంతగా కష్టపడుతున్నా రాని లాభాలు, రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు సునాయాసంగా సంపాదించకల్గుతున్నారని, కోట్లు సంపాదించాలన్న తన లక్ష్యాన్ని అందుకోవాలంటే ఈ సాప్ట్వేర్ కంపెనీ లాభంలేదని రాజారావు ఒక నిర్ణయానికి వచ్చాడు.
రాజారావు కంపెనీ నుండి విడిపోయి రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అతికొద్ది సమయంలోనే అత్యధికంగా ఎలా సంపాదించాలో చెప్పే మధ్యవర్తుల మాటలు విని, వారు చెప్పినట్లు పెట్టుబడి పెట్టి మొత్తం పోగొట్టుకోవడమే కాకుండా, అనేక కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరగాల్సిన దురవస్థ అతనికి ఎదురయ్యింది. ఇందుకు భిన్నంగా మోహన్ కొద్దికాలంలోనే నిలదొక్కుకొని తన సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దకలిగాడు. అతనికి అతి ప్రతిష్టాకరమైన కంపెనీల నుండి ఆర్డర్లు రాసాగాయి.
వీరు ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. తమ రంగంలో అతి ప్రతిభావంతులు. ఇద్దరిదీ జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్న లక్ష్యమే! కాని ఇద్దరి లక్ష్యాల వెనుక వున్న ఉద్దేశ్యాలు భిన్నమైనవి కావడంతో నిజజీవితంలో అవి వేర్వేరు జీవనగమనాల్ని సృష్టించాయి. తమ స్వార్థాన్ని గురించి తమ స్వీయప్రయోజనాలను గురించి ఆలోచించడంలో తప్పేముందని చాలామంది అమాయకంగా ప్రశ్నిస్తుంటారు. ఈ విశాల ప్రపంచంలో ఉన్నతంగా ఎదగగల అవకాశాలేమున్నాయని ఆలోచించడం మాని, స్వీయ ప్రయోజనాలకోసం తపించే వారు తమకు ప్రయోజనం కలిగే అంశాలేమున్నాయని మాత్రమే అన్వేషించడం ప్రారంభిస్తారు. చివరకు వారికి అవి కూడా లభించకపోవడంతో, వారు నిర్వేదంలో చిక్కుకుపోవలసి వస్తుంది.
తమ ప్రతిభాసామర్థ్యాలు, తమ గొప్పదనం, తమ పేరుప్రఖ్యాతులు నిరూపించుకోవడానికి, నిర్ధారించుకోవడానికి ఎవరైనా ఇతరులపై ఆధారపడవలసిందే! ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా జీవించే వ్యక్తికి ఇవేవీ లభించబోవు. అదేకోవలో నిరంతరం తన ప్రయోజనాలను గురించి మాత్రమే ఆలోచించేవారికి కూడా వీటిని పొందడం దుర్లభమవుతుంది. తోటి సమాజ అవసరాలను పట్టించుకోవడంలోనే తమ ఉన్నతి దాగుందని గుర్తించిన వారే అన్ని అవకాశాలను అందిపుచ్చుకో గలుగుతారు.
మహీపతి ఆదర్శప్రాయమైన రాజకీయనాయకుడు. నిరంతరం ప్రజల బాగోగుల్ని గురించే పట్టించు కొనేవాడు. అతి నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ పేదప్రజలకెలా మేలు చేయాలని ఎప్పుడూ ఆలోచించే వాడు. ప్రజలు కూడా ఈయన్ను విపరీతంగా అభిమానించేవారు. గతంలో జరిగిన మూడు ఎన్నికల్లో ఈయన అత్యధిక మెజారిటీతో గెలిచేవారు. ప్రతిపక్షానికి చెందిన వారు కూడా ఈయనను అమితంగా గౌరవించే వారు. అధికారులు కూడా ఈయన చెప్పినది అమలు జరిపే వారు. రాష్ట్రంలో ఈయన అనేక పదవులు పొందారు. ఆ పదవీ బాధ్యతల నిర్వహణలో కూడా ఎవరూ వేలత్తి చూపే ఆస్కారం వుండేది కాదు. తరువాత జరిగిన ఎన్నికల్లో వివిధ మార్గాల్లో విపరీతంగా సంపాదించిన యువకుడొకతను మహీపతికి ప్రత్యర్థిగా నిలబడ్డాడు. అతను విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేశాడు. మహీపతి ఊహించని రీతిలో ఘోరమైన పరాజయాన్ని పొందాడు. ఇన్ని దశాబ్దాలపాటు ప్రజల అభ్యున్నతి కోసం కృషిచేస్తే, తన స్వీయప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, అంకితభావంతో పనిచేస్తే, తానెందుకు ఓటమిపాలు కావల్సి వచ్చిందో మహీపతికి ఎంతకూ అర్థం కాలేదు.
రాజకీయ వ్యవస్థలో అన్ని విలువలు దిగజారిపోయాయి. అక్రమాలకు పాల్పడేవారే రాణించుతున్నారని గుర్తించినా, మహీపతి తాను ప్రజల అభిమానం పొందతున్నంతటిసేపూ వాటిని గురించి ఆలోచించడం అనవసరం అనుకొన్నాడు. తన పార్టీలో అనేక అక్రమాలు జరుగుతున్నా, తాను నిజాయితీతో వున్నంతటికాలం వాటిని పట్టించుకోనవసరం లేదను కొన్నాడు. ఉన్నత లక్ష్యం, అంకిత భావం, నిజాయితీతో కృషిసల్పేవారు కూడా, తమ లక్ష్యాలను తోటి సమాజంతో అనుసంధాన పరచుకోలేనప్పుడు వైఫల్యాలను ఎదుర్కోవలసి వుంటుంది. మహీపతి తన వంటి నిజాయితీ పరులతో కలసి అక్రమాలపై గళమిప్పితే ప్రజలు ఈయనను భిన్నంగా అర్థం చేసుకోకగలిగేవారు. తాము వేరు, తోటి సమాజం వేరు అని భావించడం సరికాదు. ఈ ప్రపంచమంతా ఎలాపోయినా తాము కోరినది తాము పొందడం ఎవ్వరికీ సాధ్యంకాదు.
మనకెవ్వరూ విరోధులు వుండగూడదనుకొంటే విద్వేషాలకు తావులేని సఖ్య సమాజాన్ని రూపొందించుకోవడానికి కృషి చేయాలి. నిజాయితీకి అగ్రస్థానం లభించాలంటే, అక్రమాలను నిరసించడం ప్రజలకు అలవాటు చేయాలి. తమనెవ్వరూ మోసగించ గూడదనుకొంటే, వంచన వలన ప్రయోజనం పొందలేని వ్యవస్థను నిర్మించుకోవాలి. ప్రజల అభిరుచులను, అవసరాలను, ఆకాంక్షలను సరిగా గుర్తించి, వాటితో తమ లక్ష్యాలను అనుసంధానపరచడం ద్వారానే జీవితంలో ఉన్నతంగా ఎదగడం సాధ్యపడుతుంది. తమ ప్రయోజనాలు, తోటి సమాజ ప్రయోజ నాలతో ముడిపడి వున్నాయని కీలక అంశాన్ని గుర్తించడం ద్వారానే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవడం సాధ్యపడుతుంది. ఉన్నత లక్ష్యం ఏర్పరచు కొన్నప్పుడు ఉన్నతంగా ఎదగడానికి రాచబాట ఏర్పడుతుంది.
`సి.నరసింహారావు
మనోవైజ్ఞానిక విశ్లేషకులు, 9866181388
మెయిల్:nrchallagulla@gmail.com
ఉన్నత లక్ష్యాలు ఏవి?
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021