మళిస్తుంది.. రియా సంజిత ఉప్పలపాటి విషయంలో ఇది అక్షరాలా నిజం. ఓ వైపు చదువులో విశేష ప్రతిభ కనబరుస్తూనే మానవాళి మనుగడను ప్రమాదంలో పడేస్తున్న పర్యావరణ కాలుష్యంపై యుద్ధం ప్రకటించింది. 16 ఏళ్ల ప్రాయంలోనే ‘ఇన్మై బ్యాక్ యార్డ్’ పేరుతో ఓ పుస్తకం రాసింది. ఆయిల్ రిఫైనరీల నుంచి వెలువడే ఉద్గారాలు ఈ ప్రకృతికి ఎంతటి హాని తలపెడుతున్నాయో అందులో వివరించింది. అంతేకాదు.. ‘ఫరెవర్ ఎర్త్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి కాలుష్య నివారణకు కృషి చేస్తున్న రియా ఎన్నో అవార్డులు, మరెన్నో ప్రశంసలు అందుకుంది.
రియా తల్లిదండ్రులు ఉప్పలపాటి సుహాస్- డాక్టర్ మధురిమ (ఎండీ). వీరికి ఇద్దరు అమ్మాయలు రియా సంజిత, ఈషా సుప్రియ. అమెరికాలోని అట్లాంటాలో వీరి కుటుంబం స్థిరపడింది. సుహాస్‌కు పలు వ్యాపారాలు ఉండగా, డాక్టర్ మధురిమ ఆంకాలజిస్ట్. రియా, ఈషాలు ఇద్దరూ అక్కడే పుట్టి పెరిగారు. రియా 12వ తరగతి పూర్తిచేసి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చేరగా, ఇషా వాల్టన్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది.
16 ఏళ్ల ప్రాయంలోనే పరిశోధన:
అట్లాంటాలోని వాల్టన్ హైస్కూల్లో సీనియర్ గ్రేడ్ పూర్తి చేసుకున్న రియాకు చిన్నప్పటి నుంచి చదువంటే ప్రాణం. ఎప్పుడు చూసినా పుస్తకాలతోనే కుస్తీపడుతూ ఉంటుంది. అంతేకాదు, సామాజిక అంశాలపైనా అవగాహన ఎక్కువ. పెరిగిపోతున్న కాలుష్యం మానవాళిని ఎంతగా భయపెట్టబోతున్నదీ తెలుసుకుని మనసు చివుక్కుమనేది. వాతావరణ కాలుష్యం ఆర్థిక వ్యవస్థపైనా, సామాన్యులపైనా ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న దానిపై 16 ఏళ్ల ప్రాయంలోనే అధ్యయనం ప్రారంభించింది. ‘ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆన్ ఎకానమీ’ పేరుతో పరిశోధన చేసింది. రియా పరిశోధనకు ప్రొఫెసర్లు అచ్చెరువొందారు.