పెరుగుతున్న జనాభా ` తరుగుతున్న ఉద్యోగావకాశాలు నాయకులు, ప్రభుత్వాల నిర్లిప్తత

K1

1901 సం॥లో భారతదేశపు జనాభా 21 కోట్లు. ప్రస్తుతం ఒక్క ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం జనాభాయే 22 కోట్లు. ఈ ఒక్క రాష్ట్రం జనాభా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో సమానం. 1975 సం॥లో అత్యయిక పరిస్థితి పాలనను ఇందిరాగాంధీ ప్రారంభించినప్పుడు మన దేశ జనాభా 58 కోట్లు. ఈ పెరుగుదల సాగితే, దేశం దారిద్య్రంలో మగ్గుతుందని ఎక్కువ మంది పిల్లలు బీద కుటుంబాలలోను, ముస్లిం కుటుంబాలలోను ఉంటున్నారని సంజయగాంధీ పంచ సూత్ర ప్రణాళికను (ఫైవ్‌ పాయింట్‌ ప్రోగ్రామ్‌)ను అమలు చేయ ప్రారంభించారు. అందులో ప్రధానమైన అంశం, బలవంతంగా కుటుంబ నియంత్రణ పురుషునకు (వాసెక్టమీ) చేయడం ద్వారా జబర్‌దస్తీగా అమలు చేయడం, ప్రతి రాష్ట్రానికీ లక్ష్యాలు నియమించారు. ఒక రాష్ట్రంలో రెండు వారాలలో 96,000 మందికి వాసెక్టమీ ఆపరేషన్‌ (కుటుంబ నియంత్రణ) చేశారు. ఈ సంఖ్యను ఇంత సమయంలో అధిగమించిన రాష్ట్రాలకు బహుమతులు ఇస్తామన్నారు. కొన్ని చోట్ల, విశేషించి ఢిల్లీిలో ముజఫర్‌నగర్‌లో వేలాది మంది ముస్లింలకు వయసు వివక్షత లేకుండా బలవంతంగా వాసెక్టమీ చేయించారు. వ్యతిరేకించిన వారిని కాల్చివేశారు. ఇది దారుణమైన విషయమైనా, జనాభా పెరుగుదల నియంత్రణకు సంజయ్‌గాంధీ, ఇందిరాగాంధీ నిరోధరాహిత్యంతో, ఎంత తీక్షణతో కుటుంబ నియంత్రణ అమలు చేశారో అది శ్లాఘనీయమైందే. దీని దుష్పరిణామం ఇందిరమ్మ పార్టీ ఓటమికి ఉత్తర భారతంలో ప్రధాన కారణమైంది. అయినప్పటికీ కుటుంబ నియంత్రణ కార్యక్రమం అవసరం అప్పటికన్నా, ఇప్పుడు ఇంకా అవసరం అవుతోంది. మన జనాభా ఇప్పుడు 135 కోట్లు. ఇందులో దారిద్య్ర రేఖకు క్రింద వున్న జనాభా దాదాపు 55 కోట్లు. సం॥నికి మన జనాభా కోటిన్నరకు పైగా పెరుగుతోంది. ఈ పెరుగుదలలో 90% సంపన్న వర్గాలలో కాక, ముస్లింలు, (ఎస్సీ, ఎస్టీ) షెడ్యూల్డ్ కులాలలో, షెడ్యూల్డ్ తెగలలో వుంటోంది. ఈ వర్గాలలోనే విద్య, ఉద్యోగార్హత తక్కువగా వుంటున్నాయి. ఇతర వర్గాలలో విద్యా ప్రమాణ పత్రాలు (సర్టిఫికెట్స్‌) ఉన్న వారిలో నైపుణ్యత బహు స్వ్గల్పంగా వుండడం మూలానా, వీరిలో కూడా నిరుద్యోగం ప్రబలుతోంది. ఉదా॥ ఐటి రంగంలో పట్టభద్రులయిన వారిలో 85% ఉద్యోగానికి అనర్హులుగా తేలింది. వీరు ఇతర రంగాలలోని పట్టభద్రులు, క్లర్కు, చివరకు గ్రూపు`డి ఉద్యోగాలకు కూడా ఎగబడుతున్నారు. ఒక వైపున డిగ్రీ ఉన్నవారు ఎక్కువవుతున్నా, వారికి నైపుణ్యం లేకపోవడంతో ప్రధానమంత్రిగారు అందరిలో నైపుణ్యాన్ని పెంచడానికి ఒక బృహత్‌ ప్రణాళికను ప్రారంభించారు.
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అనే ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ విభాగాన్ని కూడా నియమించారు. భారతదేశం జనాభాలో యువతీయువకులు ఎక్కువగా ఉన్నారు. వీరి వల్ల భారతదేశానికి ఎంతో మేలు జరగాలి. ఈ యువతీయువకులు భారతదేశానికి సంపదను సమకూర్చుతారు. ఇటువంటి యువతీయువకులు దేశానికి డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ అని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ, నైపుణ్య హీనులు కేవలం ప్రమాణ పత్రాలు ఉన్న వ్యక్తుల వల్ల డెమోగ్రాఫిక్‌ డిజాస్టర్‌ తప్పదని వివేకవంతులు చెబుతున్నారు. నైపుణ్య హీనతను అధిగమించడానికి భారతదేశంలో 2016 సం॥ నుండి 13,200 నైపుణ్య శిక్షణా కేంద్రాలను ప్రారంభించారు. 1800 రకాలైన వృత్తులలో నైపుణ్యశిక్షణ ఇస్తున్నారు. 2020 ఏప్రిల్‌ నాటికి రూ.5903.4 కోట్ల ఖర్చు చేశారు. ఏ సం॥లో ఎంత మంది ప్రశిక్షులయ్యారో వారిలో ఎంత మందికి ఉద్యోగం లభించిందో ఈ క్రింది పట్టికలో చూడండి.
సం॥ 2016`17 2017`18 2018`19 2019`2020
స్కిల్‌ ట్రైన్డ్‌ 2,23,885 21.54 లక్షలు 18.94. 25.35 లక్షలు
జాబ్స్‌ అబ్‌టైన్డ్ 280 4.53 ॥ 6.71 . 4.23 లక్షలు
ఇంతకు పూర్వం విద్యలేనివారు కేవల ప్రమాణ పత్రాలు పొందేవారు మాత్రమే అధికాధిక సంఖ్యలో నిరుద్యోగులుగా ఉండేవారు. ఇప్పుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ కింద ప్రశిక్షకులైనప్పటికీ, నిరుద్యోగులుగా ఉండవలసి వస్తోంది. ఇది మహా అపాయకరమైన పరిస్థితి. ద్రవ్యోల్బనం (ఇన్‌ప్లేషన్‌) ఆర్థిక వ్యవస్థని ఎలా సంక్షోభానికి నెట్టుతుందో ఎడ్యుకేటెడ్‌, స్కిల్డ్‌, అన్‌ఎంప్లాయిడ్‌ యువతీ యువకులు సమాజంలో అస్థిరతకు, సంఘర్షణకు, సంక్షోభానికి కారకులవుతారు. మనదేశం దురదృష్టం ఏమిటంటే 1975 సం॥లో కంపల్‌సరీ స్టెరిలైజేషన్‌ వల్ల ఆ యోజనను అమలు చేసిన పార్టీ ఓటమి, మన రాజకీయవేత్తను భయబ్రాంతులను చేసి కుటుంబ నియంత్రణావశ్యకతను ప్రబోధించకుండా నిరుద్యోగులకు, బీదలకు సానుకూలత కల్గించడానికి, ప్రభుత్వం సొమ్మును భిక్షగా వివిధ నామాలతో, సాంఘిక సంక్షేమం పేరుతో, సామాజిక న్యాయం పేరుతో, పార్టీలు ప్రభుత్వాలు పోటీపడి పంచుతున్నాయి. ఉదా॥ ఆంధ్రప్రదేశ్‌లో 2016 సం॥ నుంచి ముఖ్యమంత్రి సొంత పేరుతో ప్రభుత్వం సొమ్ము కానుకగా పసుపు కుంకుమగా వివిధ వర్గాలకు పంచారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వం ఒక్క సం॥లో రూ.41,000 కోట్లు వివిధ వర్గాలకు ముఖ్యమంత్రిగారి సొంత పేరున, వారి తండ్రిగారి పేరున పంచిపెట్టారు. ఈ పంపిణీ సగర్వంగా పదేపదే ప్రకటించుకుంటున్నారు. ఇంత సొమ్ము ఎక్కడ నుంచి వస్తోందంటే ప్రభుత్వాలు చేసిన అప్పు ద్వారా వస్తోంది. అంతేకానీ, పెరుగుతున్న జీడీపీ ద్వారా కాదు. పేదలు, నిరుద్యోగులు, తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. బాధ్యాతరహిత దారిద్య్రం కొనసాగుతోంది. దీనికి విరుగుడు కుటుంబ నియంత్రణ. ఏ కుటుంబంలోనైనా ఒక్కరి కన్నా ఎక్కువ సంతానం ఉండకూడదని చైనా 1970ల నుంచీ నిర్బంధంగా శాసించింది. ఫలితం జనాభా పెరుగుదల గణనీయంగా కట్టడి అయింది. 1992వ సం॥ వరకు చైనాలో తలసరి ఆదాయం భారతదేశం కన్నా తక్కువగా ఉండేది. కానీ, 20 సం॥లో జనాభా పెరుగుదలను నిర్బంధ పద్ధతిలో అరికట్టడం మూలానా ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రెండవ సూపర్‌ పవర్‌గా చైనా పరిణమించింది. ఇది మనకు గుణపాఠం కావాలి. సంపన్నులు ఒక బిడ్డతో సరిపెట్టుకుంటున్నారు. బీద, నిరుద్యోగులలోనే అధిక సంతానం ఉంటోంది. దీని నిరోధాన్ని ఇప్పుడు ప్రారంభించితే 20 సం॥ తర్వాత దాని ఫలాన్ని మనం చూస్తాము. అందుకే వెంటనే, సమగ్రమైన జనాభా నియంత్రణ ప్రణాళికను రచించి దీక్షతో అమలు చేయాలి. దేశంలో ఏ పాలసీ కూడా నిరంతరం కొనసాగ కూడదు. మన ఆర్థిక స్థితిని బట్టీ విద్య వైద్య రంగాలలో ఏ అభివృద్ధిని సాధిస్తున్నామో, ఆర్థికంగా ఎంత బలాన్ని పుంజుకుంటున్నామో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, జనాభా ప్రణాళికను రచించి, అమలు చేయాలి. అమితమైన జనాభా పెరుగుదల అరిష్టాన్ని కలిగిస్తుంది. అదృష్టాన్ని కాదు. (నాట్‌ డివిడెండ్‌ బట్‌ డిస్ట్రక్షన్‌) ఈ విషయాన్ని గురించి పదేపదే ప్రధాన మంత్రికి, ఇతర నాయకులకు, లేఖలు వ్రాస్తూ వస్తున్నాను. అంతేకాక, ఏ ముఖ్యమంత్రులైతే తమ పేరున ప్రభుత్వపు సొమ్మును కానుకలుగా పంచి పెడుతున్నారో వారి వద్ద నుంచి ఈ సొమ్మును వసూలు చేయాలని వ్రాస్తూ వస్తున్నాను. చివరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయవసి వస్తుందేమో.

Share: