మీడియా పవర్ తెలుసుకొనేదెప్పుడో!?

K21

మీడియాకు, రాజకీయాలకు ఉన్న లంకె విడదీయరానిది. రాజకీయాల్లోనే కాదు నలుమూలల జరిగే సమాచారాన్ని జనానికి చేరవేయడానికి మాధ్యమం అవసరం. ఆ అవసరాలతోనే సాగితే, రాజకీయాల్లోనూ రాణించవచ్చునని గ్రహించిన నాయకుల బహుకొద్దిమంది. అందుకే కొందరు నాయకులు తమ సొంతగొంతు వినిపించడానికి సొంత పత్రికలు నడిపారు. ఈ సంప్రదాయం ఈ నాటిది కాదు. అదే విధంగా తెలుగునేలపై మీడియాకు ఉన్న పవర్ ను గుర్తించి, సొంతగా మీడియా హౌస్ నెలకొల్పారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి. ఆయన నెలకొల్పిన మీడియా హౌస్ కారణంగానే, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ముఖ్యమంత్రి కాగలిగారని అధిక సంఖ్యాకులు అంగీకరిస్తారు. ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు వెనుకబడి ఉన్నారనే చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీ కంటే ఎన్నో రెట్లు ముందుంది. ప్రతిపక్షంలోకి నెట్టవేయబడ్డ తెలుగుదేశం ఈ విషయంలో ఇప్పటికీ వెనుకబడి ఉండటం విచారకరం.

అదే అసలు కారణం…

విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టింది మొదలు తెలుగుదేశం పార్టీ ఇన్ సైడ్ వ్యవహారాలపై ప్రతిపక్ష వైసీపీ కన్నేసింది. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ చేసే తప్పిదాలను ఎండగట్టడంలో వైసీపీకి చెందిన సోషల్ మీడియా విజృంభించింది. ఇక ఆ పార్టీ సోషల్ మీడియా మరిన్ని అడుగులు ముందుకేసి అసభ్య, అశ్లీల, వినడానికి చదవడానికి కూడా అసహ్యం కలిగించే భాషల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనాయకుల కుటుంబాలపై రాతలు రాశారు. జగన్ రెడ్డిని అభిమానించేవారికి ఆ రాతలు మహదానందం కలిగించాయి. దీనిని బట్టే వారి మానసిక స్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారి అండతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కమ్మవారే అందరికన్నామిన్నగా లబ్ధి పొందుతున్నారని వైసీపీ ప్రచారం చేసింది. దానిని జగన్ రెడ్డి అభిమానులు గుడ్డిగా నమ్మడమే కాదు, ఇతరులనూ నమ్మించే ప్రయత్నం చేశారు. ‘అనగ అనగ రాగమతిశయమైనట్టు’ పదే పదే వల్లిస్తోన్న వారి మాటలను అమాయక జనం నమ్మారు. అందుకు వైసీపీకి సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడింది. ఇతరుల నుండి కమ్మవారిని వేరు చేయడమేకాదు, కమ్మవారిలోనూ యువతను వేరు చేయడానికి ‘కమ్మ, రెడ్డి కులాలకు కూడా కార్పోరేషన్స్ పెడతాం’ అనే మాయ మాటలు చెప్పారు. వైసీపీ వేసిన ఈ ఎత్తుగడలను ఎదుర్కోవడంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విఫలమయింది. ఇక తెలుగుదేశం నాయకులు నమ్ముకున్న పత్రికలు, ఛానెళ్ళు కూడా వారి పార్టీకి ఆట్టే మేలు చేయలేకపోయాయి. ‘ఈనాడు, ఆంధ్రజ్యోతి’ వంటి పబ్లిషింగ్ హౌసెస్ తెలుగుదేశం పార్టీకి దన్నుగా నిలుస్తాయని అందరూ అనుకుంటూ ఉంటారు. ఏ ప్రతికాధిపతి అయినా తాను అభిమానించే పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలుపడు. జనం దృష్టిలో తాను ‘జనం పక్షపాతిని’ అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందువల్ల కొన్నిసార్లు ఇలాంటి పబ్లిషింగ్ హౌసులు కూడా వాటిని నమ్ముకున్న పార్టీల సొంతగొంతుకను సరిగా వినిపించలేవు. అందుకే తమకంటూ ఓ సొంత మీడియా హౌస్ ఉండాలని కొందరు రాజకీయనాయకులు భావించి, ఆ దిశగా అడుగులు వేసి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి సొంత పత్రికలు, టీవీ ఛానెల్స్ లేవు. అయితే ఆ పార్టీని అభిమానించే మీడియా హౌసులు ఉన్నాయి. అంత మాత్రాన అవి జనాన్ని అన్ని వేళలా నమ్మించలేవు కదా!

భిన్న స్వరాలు…

ఇక తేలిందేమిటయ్యా అంటే, తెలుగుదేశం పార్టీ కంటే సోషల్ మీడియాలో వైసీపీ బలంగా ఉందని. ఇప్పుడు ఈ బలమైన సోషల్ మీడియాలోనే వర్గపోరు మొదలయిందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం చేపట్టడానికి సామాజిక మాధ్యమం అతిప్రధానమైన పాత్ర పోషించింది. దీనిని ఎవరూ కాదనలేరు. అలాంటి బలమైన వైసీపీ సోషల్ మీడియాలో వర్గపోరేంటి అని ఆశ్చర్య పోవచ్చు. జగన్ పాద యాత్ర చేస్తూండగా, వైసీపీ సోషల్ మీడియా యావత్తు విజయసాయి రెడ్డి కనుసన్నల్లో నడిచింది. పార్టీ విజయం సాధించిన తరువాత ఇకపై వైసీపీకి సోషల్ మీడియా అవసరం లేదని అన్నారు కొందరు. కానీ, అంతకుముందు అధికారికంగా వైసీపీకి పనిచేసిన సామాజిక మాధ్యమం తరువాత అనధికారికంగా పనిచేయడం మొదలెట్టాయి. వాటిని కూడా విజయసాయి రెడ్డి పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. అయితే వైసీపీలో ఇంటిపోరు మొదలయినట్టు పలు సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఓ సారి ముఖ్యమంత్రితో పాటు వాహనంలో ఎక్కిన విజయసాయి రెడ్డిని కిందకు దింపడం చూసి, తెలుగుదేశం పార్టీ అమాయక అభిమానులు చంకలు గుద్దుకున్నారు. పలు కేసుల్లో ఏ1గా జగన్మోహన్ రెడ్డి, ఏ2గా విజయసాయి రెడ్డి ఉన్నారు. ఇద్దరూ ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొని జైలు జీవితం కూడా గడిపి వచ్చారు. ఒకరి లొసుగులు మరొకరికి తెలుసు. ఈ నేపథ్యంలో జగన్, విజయసాయి మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయి అని అనుకుంటే పొరబాటే. ఎందుకంటే వారిద్దరూ ఒకే నాణ్యానికి చెరోవైపు లాంటివారు. వారిని విడదీయడం అంత సులువు కాదు. కానీ, పదవీ వ్యామోహం ఎంతటి వారినైనా విడదీస్తాయని కొందరు అంటున్నారు. అందుకు గతంలో యన్టీఆర్, నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ ను గుర్తు చేస్తున్నారు. అయితే ఇక్కడో విషయం గుర్తించాలి. యన్టీఆర్, నాదెండ్ల ఇద్దరికీ నేరచరిత్ర లేదు. కలసి వారిద్దరూ ఎవరి ఆస్తులూ దోచింది లేదు. కానీ, తండ్రి అధికారాన్ని అడ్గుపెట్టుకొని జగన్ వేల కోట్లు కొల్లగొట్టాడనే ఆరోపణతోనే జైలుకు వెళ్ళవలసి వచ్చింది. ఆ కేసుల్లోనే ఏ2గా విజయసాయి రెడ్డి కూడా కటకటాలు లెక్కపెట్టారు. కాబట్టి, జగన్, విజయసాయి ఇద్దరిలో ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడుచుకున్నా, ఇద్దరికీ నష్టమే! అయినప్పటికీ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో ఒకటి జగన్ సన్నిహితులైన సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలోనూ, మరోటి ఇంతకు ముందులాగే విజయసాయి పర్యవేక్షణలోనూ పనిచేస్తున్నాయట. అందుకే వైసీపీ సోషల్ మీడియాలో వర్గపోరు మొదలయిందనే వార్తలు వినవస్తున్నాయి. విజయసాయి రెడ్డిని వాహనంలో నుండి దించేసిన వీడియోను వైరల్ చేసింది కూడా వైసీపీలోని మరో సోషల్ మీడియానేనని చెబుతున్నారు.

K22

అరె… నిజమా!?…

జగన్ ఏ ముహూర్తానయినా కోర్టులో శిక్ష పడి, మళ్ళీ జైలుకు వెళ్ళవలసి వస్తే, ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయన భార్య భారతి అధిరోహించేలా అన్ని చర్యలూ తీసుకున్నారని సమాచారం. అలాకాకపోయినా, విజయసాయి రెడ్డి రూపంలో జగన్ కు ఓ ప్రతికూలశక్తి తయారవుతోందని, దానిని కేంద్రంలోని పెద్దలు పెంచి పోషిస్తున్నారనీ మరికొందరిమాట. అందువల్లే ఆ మధ్య అమిత్ షాను కలవాలనుకున్న జగన్ కు అపాయింట్ మెంట్ లభించలేదనీ చెబుతున్నారు. విజయసాయికి ఢిల్లీలో రోజు రోజుకూ పలుకుబడి పెరుగుతోందనీ అంటున్నారు. ఈ విషయంలోనే జగన్, విజయసాయి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయనీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయసాయిని జనంలో భ్రష్టు పట్టించడానికి వైసీపీకి చెందిన సోషల్ మీడియాలో కొన్ని సైట్స్ పనిచేస్తున్నట్టు వినికిడి. విజయసాయి రెడ్డిని స్త్రీలోలునిగా చిత్రీకరించే ప్రయత్నం సాగుతోందట. అందులో భాగంగానే వైజాగ్ కు చెందిన గెడ్డం ఉమ అనే అమ్మాయికి, విజయసాయికి మధ్య ఏదో ఉన్నట్టు విశేష ప్రచారం సాగుతోంది. ఈ అమ్మాయికి వైజాగ్ మేయర్ గా పట్టం కట్టిస్తానని విజయసాయి మాటిచ్చినట్టూ ఆ సైట్స్ లో కథనాలు వచ్చాయి. తనకు తెలియకుండా విజయసాయి ఇతరులకు మాట ఇవ్వడంపై జగన్ కినుక వహించినట్టూ తెలుస్తోంది. ఏది ఏమైనా విజయసాయిపై వైసీపీకే చెందిన కొన్ని సోషల్ మీడియా సైట్స్ కథలు, కార్టూన్లు ప్రచారం చేస్తున్నాయి. అసలు అమరావతి నుండి రాజధానిని తరలించాలన్న ఆలోచన కూడా విజయసాయి రెడ్డిదే అనీ ఇప్పుడు ప్రచారం సాగుతోంది. మూడు రాజధానుల ప్లాన్ విజయసాయిదేనని, ఆయనకు వైజాగ్ లో మంచి పట్టు ఉండడం వల్ల జగన్ కూడా సెక్రటేరియట్ ను అక్కడకు తరలించే ప్రయత్నం మానుకుంటున్నారనీ కొందరి మాట. ఆ మాటలకు బలం చేకూరుస్తూ ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలోని పలు ప్రాంతాల్లో చంద్రబాబు హయాంలో నిర్మితమైన భవనాల తీరును సందర్శించారు. ఒకప్పుడు అక్కడ బిల్డింగులను సెట్టింగ్స్ అనీ, అక్కడ శ్మశానం తప్ప ఏమీ లేవనీ మాట్లాడిన బొత్స స్వయంగా ఆ ప్రాంతాలలో పర్యటించడం విశేషంగా మారింది. దాంతో వైసీపీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

K23

ఎత్తు… అయింది చిత్తు…

తమ పార్టీలోనే భిన్నస్వరాలు వినిపిస్తూ ఉండడంతో, దానిని పక్కతోవ పట్టించడానికి అన్నట్టు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఎంపీ సుజనా చౌదరిని, ఏపీ ఎన్నికల కమీషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్, కామినేని శ్రీనివాస్ కలుసుకున్న సీసీ ఫుటేజ్ ను జనం ముందు నిలిపారు. విజయసాయి చాణక్యంతో ఆ ఫుటేజ్ ను దాదాపు అన్ని ప్రముఖ ఛానల్స్ పదే పదే ప్రసారం చేశాయి. తెలుగుదేశం పార్టీకి చెందినవని వైసీపీ శ్రేణులు ప్రచారం చేసే ఛానెల్స్ సైతం ఈ వీడియోలను పదే పదే ప్రసారం చేయడం గమనార్హం! ఆ ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఆ సామాజిక వర్గానికే చంద్రబాబు కూడా చెందడంతో ఏపీ స్థానిక ఎన్నికల వాయిదాలో కుట్ర జరిగింది అనే నాటకానికి తెరతీశారు. ఆ నాటకాన్ని ఎదుర్కోవడంలో తెలుగుదేశం శ్రేణులు విజయం సాధించలేక పోయాయి. అయితే ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనాచౌదరిని టార్గెట్ చేయడం సహించని ఆ పార్టీ ప్రముఖులు “ఓ ఎంపీని ఆయన మిత్రులు కలుసుకుంటే తప్పేంటని” ప్రశ్నించారు. అందుకు ‘రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ అధికారి, రాజకీయనాయకులను కలవడం తప్పే’అంటూ వైసీపీ శ్రేణులు సమాధానమిచ్చాయి. ‘నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజ్యాంగ పదవిలో ఉన్నారని మీరంటున్నారంటే, ఆయననే ఏపీ ఎన్నికల అధికారి అని మీరు అంగీకరిస్తున్నట్టే కదా’ అని ఏపీ బీజేపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. దాంతో ‘కుయ్యాకు దొంగా’ అన్నట్టు వైసీపీ శ్రేణులు మళ్ళీ నోరెత్తలేదు.

ఆటలో అరటిపండు…

ఇదిలా ఉంటే, వైసీపీలో వర్గపోరు పెరుగుతోందని, విజయసాయి రెడ్డికి అనుకూలంగా 30 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు కూడా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఆ ఎంపీలలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒకరనీ వినిపిస్తోంది. విజయసాయికి బీజేపీతో సత్సంబంధాలే ఉన్నాయి. దాంతో రఘురామకృష్ఱంరాజు బీజేపీలోకి దూకే అవకాశం ఉందనీ వినికిడి. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణంరాజు పార్టీని, పార్టీ నాయకుడు జగన్ పేరు ఎత్తకుండానే వ్యతిరేక ప్రకటనలు చేయడం మొదలయింది. దాంతో వైసీపీకి ప్రధాన కార్యదర్శి అయిన విజయసాయి రెడ్డి ద్వారానే రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీస్ ఇప్పించారు. రఘురామకృష్ణంరాజు తనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే, ఇండిపెండెంట్ గా కొనసాగుతూ బీజేపీకి మరింత సన్నిహితంగా ఉండవచ్చునని ఆశిస్తున్నారట. ఈయన విషయాలను కూడా మీడియా పదే పదే ప్రసారం చేస్తోంది. వైసీపీలో వర్గపోరుకు ఇదే నిదర్శనం అంటూ తెలుగుదేశం జనం చిందులు తొక్కితే కాళ్ళు నొప్పి పుడతాయే తప్ప. ఫలితం ఉండదు. మీరు ఎన్నుకున్నవారు ఎలా సాగుతున్నారో చూడండి అంటూ ప్రచారం సాగించాలి. ఇందులో వైసీపీ సోషల్ మీడియాకు దీటుగా వ్యవహరించగలగాలి.

కాస్త ఆలోచించాలి…

ఇప్పుడు చెప్పండి, రాజకీయాల్లో రాణించాలంటే ఓ సొంత మీడియా ఉండవలసిన అవసరం ఎంతయినా ఉందని అంగీకరించాల్సిందేగా! తెలుగుదేశం పార్టీని బలపరిచే మీడియా హౌసులు సైతం ‘నిమ్మగడ్డ, కామినేని, సుజనా కలయిక’ సీసీ ఫుటేజ్ ను పదే పదే ప్రసారం చేయడంలోని మతలబేమిటో ఆ పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదు. అది హాట్ న్యూస్ కాబట్టి వేశారని సర్దిచెప్పుకుంటే సరిపోదు. సొంత మీడియాకు, మనల్ని బలపరిచే మీడియాకు ఎంతో తేడా ఉందని తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియాలోకి అడుగుపెట్టినా, లాభం లేని పరిస్థితులు. కానీ, ప్రస్తుతం ఊపుమీదున్న సోషల్ మీడియాను బలపరచుకొనే అవకాశం ఉంది. నిజానికి వైసీపీకి ఉన్న సోషల్ మీడియా బలంతో పోలిస్తే, తెలుగుదేశం పార్టీకి అందులో సగం కూడా లేదని తెలుస్తోంది. కేవలం బూతులతో చెలరేగిపోయి, తమ పార్టీ అభిమానులను ఆనందింప చేయడంలో వైసీపీ సాగిన బాటలోనే పయనించినా లాభం లేదు. ఎందుకంటే, అలాంటి నీచమనస్తత్వం తెలుగుదేశం అభిమానులకు లేదు. కావున, సోషల్ మీడియాలో వాస్తవాలకు పెద్ద పీట వేస్తూనే, వైరి వర్గాల తప్పు దొర్లినప్పుడు దానిని జనంలోకి తీసుకుపోవడానికి విశేషంగా కృషి చేయాలి. ఈ విషయాన్నితెలుగుదేశం అధినాయకులు, పార్టీ శ్రేణులు పదే పదే ఆలోచిస్తే మంచిది.

K24

Share: