ప్రపంచమా ఊపిరి పీల్చుకో!

222

అవును.. ఇది ఊపిరి పీల్చుకునే సమయమే. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న వేళ ఊపిరి పీల్చుకోవాలని చెప్పడం కొంత విడ్డూరంగానే అనిపించొచ్చు. అయితే, ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిన్నమొన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడిన కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, స్పెయిన్, ఇండోనేషియా వంటి దేశాల్లో కరోనా కేసులు ఎంత ఉవ్వెత్తుకు ఎగసి పడ్డాయో, ఇప్పుడు అంతే వేగంగా తగ్గుముఖం పట్టాయి. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో ఒకప్పుడు మొదటి స్థానంలో ఉన్న ఇటలీ ఇప్పుడు 15వ స్థానానికి పడిపోగా, ఫ్రాన్స్ 19, ఇండోనేషియా 24 స్థానాలకు పడిపోయాయి. ఇక, న్యూజిలాండ్ అయితే పూర్తిగా కోలుకుంది. తాజాగా అక్కడ కొత్తగా 2 కేసులు మాత్రమే నమోదు కాగా, యాక్టివ్‌గా ఉన్న కేసులు దేశవ్యాప్తంగా 23 మాత్రమే. ఇప్పుడీ దేశం 133వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్న అమెరికా, బ్రెజిల్, ఇండియాలోనూ త్వరలో పరిస్థితులు మెరుగుపడనున్నాయి. అమెరికాలో ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కొవిడ్-19కు కేంద్ర బిందువైన చైనా కూడా వైరస్‌కు బాగా అడ్డుకట్ట వేయగలిగింది. ఇప్పుడీ దేశం 27వ స్థానంలో ఉంది.

భారత్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. దేశంలో ప్రతి రోజూ సగటున 40 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా వందల సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. అయినప్పటికీ ఇది ఊపిరి పీల్చుకోవాల్సిన సమయమే. ఎందుకంటే, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ కేసుల సంఖ్య ఉవ్వెత్తుకి ఎగసిన తర్వాత తగ్గుముఖం పట్టాయి. భారత్‌కూ ఇదే వర్తిస్తుంది.

మరోవైపు, కరోనాను సమర్థంగా ఎదుర్కోగలిగే టీకాల అభివృద్ధిలో ప్రపంచం తలమునకలై ఉంది. వీటిలో చాలావరకు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ప్రయోగాల్లో ఉన్నాయి. కొన్ని ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. అంటే త్వరలోనే టీకా అందుబాటులోకి వస్తుందన్నమాట. ఇక, మనదేశం విషయానికొస్తే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కోవాక్జిన్’ టీకా కూడా క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. వీలైనంత త్వరగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ యెల్ల ప్రకటించారు. అంతేకాదు, సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరకే అందిస్తామని భరోసా ఇవ్వడం కరోనా చీకట్లో చిక్కుకున్న భారతావనికి వెలుగు రేఖ లాంటిదే.

దేశంలో కరోనా నిర్ధారిత కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాలు రేటు మాత్రం పెరగకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జూన్ 18వ తేదీ నాటికి దేశంలో మరణాల రేటు 3.33 శాతంగా ఉండగా, జులై 28 నాటికి ఇది 2.25కి తగ్గడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అలాగే, జూన్ నెల మధ్యనాటికి 53 శాతంగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 64 శాతం దాటిపోవడం పెద్ద ఊరట. ప్రతి రోజూ వేలాదిమంది రోగులు కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం.. దేశంలో జులై 29 నాటికి 15,31,669 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా, 9,88,029 మంది కోలుకున్నారు. 34,193 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 1,66,67,130 మంది కరోనా కోరల్లో చిక్కుకోగా, 97,03,211 మంది కోలుకున్నారు. 6,59,045 మందిని ఈ మహమ్మారి పొట్టనపెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో మరో ఒకటి, రెండు నెలల్లోనే ఏదో ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు కరోనా అత్యవసర చికిత్సలో వాడే ‘రెమ్‌డెసివిర్’ ఉపయోగం కూడా పెరిగింది. ఇప్పుడు కరోనా టీకాలు కూడా అందుబాటులోకి వస్తే కరోనా కరాళ నృత్యానికి ఫుల్‌స్టాప్ పడక తప్పదు.

Share: