చిత్రం భళారే విచిత్రం

44

ఒకప్పుడు తెలుగునాట మహానటుడు, మహానాయకుడు నందమూరి తారకరామారావు రాజకీయాల్లో అపూర్వ విజయం సాధించగానే, ఎంతోమంది నటీనటులు సైతం తామూ రాజకీయాల్లో రాణించగలమంటూ బీరాలు పోయారు. కొందరు విజయం సాఆధించారు. తరువాత చతికిల పడ్డారు. ఎవరూ కూడా యన్టీఆర్ స్థాయిలో రాజకీయాల్లో రాణించినవారు తెలుగునాట కనిపించలేదు. ఆ మాటకొస్తే కేవలం తొమ్మిది నెలల్లో పార్టీని నెలకొల్పి విజయకేతనం ఎగురవేసిన వారు ప్రపంచంలోనే లేరు. ఈ మాట చెబితే ‘ఆ ఏముంది… అప్పట్లో తెలుగు రాజకీయరంగంలో ఓ వ్యాక్యూమ్ ఉండేది. లేకుంటే యన్టీఆర్ కు కూడా ఆ స్థాయి విజయం సాధ్యమయ్యేది కాదు’ అనే మహానుభావులు ఈ నాటికీ ఉన్నారు. మరి ఏ వ్యాక్యూమ్ ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి నేరచరిత గల నాయకుడు కూడా తనపై పడ్డ దొంగ ముద్రను చెరిపేసుకొని , అఖండ విజయం సాధించగలిగారు? అదే చిత్రం అంటున్నారు జనం. మరింత విచిత్రం ఏమిటంటే, నేరస్థుడు అన్న ముద్ర ఉన్నాజగన్మోహన్ రెడ్డి లాంటి వారే ముఖ్యమంత్రిగా కాలేంది మేము కాలేమా అంటూ వర్దమాన రాజకీయ నాయకులు కొందరు తొడలు చరుస్తున్నారు. ఇది చూసేవారికి మరింత విచిత్రంగా కనిపించక పోదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకుల తీరు ఇలాగే ఉంది.

అరెరె… ఏమంటిరి ఏమంటిరి?

కాంగ్రెస్ పార్టీలో పేరున్న నాయకునిగా ఉన్న కన్నా లక్మీనారాయణను ఏరి కోరి, మరీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష/నిగా చేశారు. ఆయన బీజేపీ అసలు ఎజెండా అయిన హిందుత్వను ఏ నాడూ అద్భుతంగా మోసింది లేదు. తరువాతి రోజుల్లో పాలక వైపీపీపై విరచుకు పడడంతో కొంత వరకు రాణించారు. అయితే రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు కన్నా పాలకపక్షంపై విరచుకు పడుతున్నా, కొందరు అదే పార్టీకి చెందిన నాయకులు మాత్రం రెండు నాల్కల ధోరణినే అవలంభించారు. కన్నా, వైసీప నాయకుడు విజయసాయి రెడ్డి మధ్య సాగిన మాటల యుద్ధం కొత్తేమీ కాదు. అయితే కేంద్రంతో వైసీపీ పార్టీకి సత్సంబంధాలే ఉన్నాయని పలు అంశాల్లో తేటతెల్లమయింది. అయితే రాష్ట్రంలో వచ్చే సరికి వైసీపీని విమర్శించేందుకే బీజేపీ జై కొట్టింది. మరెందుకనో కన్నా లక్మీనారాయణను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుండి తొలగించి, ఆ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న సోమూ వీర్రాజును నియమించారు. కొత్త అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వీర్రాజు ఈ సారి ఎన్నికల్లో ఏపీలో తమ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఏ పార్టీ అధ్యక్షుడైనా అలాగే మాట్లాడతారు. అందులో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అదీగాక రెండోసారి కూడా అనూహ్య విజయం సాధించి బీజేపీ కేంద్రంలో అధికారం చెలాయిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు తొడలు చరచకుండా ఉండవని ఎలా భావిస్తాం?
సోమూ వీర్రాజు పదవి చేపట్టగానే, అధికార పార్టీ వైసీపీ కంటే, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశాన్ని ఎక్కువగా విమర్శిస్తూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన ఇటీవల ఓ ఛానల్ లో చర్చలో పాల్గొంటూ ఎంత సేపూ, ప్రతిపక్ష టీడీపీనే విమర్శిస్తూ వచ్చారు. అదీగాక మొన్నటి ఎన్నికల్లో కేవలం ఒక్కటంటే ఒక్క సీటు సంపాదించిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ను నెత్తికెత్తుకొని మాట్లాడారు. జనసేనాధిపతి రెండు చోట్ల పోటీ చేసి, రెండు చోట్లా అపజయం చవిచూసినా, ఈ సారి ఎన్నికల్లో జనసేన పొత్తుతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధిస్తుందని వీర్రాజు వీరలెవెల్లో సెలవియ్యడం చాలామందికి విచిత్రంగానే అనిపించింది.

లాభపడింది ఎవరు?

కొత్తగా బీజేపీ అధ్యక్షుడైన వీర్రాజు మాటల్లో తెలుగుదేశం ఓటు బ్యాంకును కైవసం చేసుకొనే ప్రయత్నం కనిపించింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయినా, 2019 ఎన్నికల్లో కోటి ఇరవై లకలకు పైగా ఓట్లు లభించాయి. కేవలం ఆ పార్టీ తరపున 23 మంది మాత్రమే గెలిచినా, ఓట్ల సంఖ్యను చూసి పరిశీలకులు సైతం అబ్బురపడ్డారు. బీజేపీ, జనసేన రెండు పార్టీలకు కలిపినా అందులో సగం ఓట్లు రాలేదు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో పాలక, ప్రతిపక్షాలను కాదని, తామే విజయం సాధిస్తామని ఘంటాపథంగా చెప్పడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయమేనని చెప్పక తప్పదు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీకి వ్యతిరేకంగా సాగింది. అదే ఆ రెండు పార్టీలు పోటీ చేసినప్పుడు బీజేపీ లాభపడడమే కాదు, టీడీపీ అధికారం రెండు సార్లు చేపట్టింది. ఈ కోణంలో బీజేపీకే జనాల్లో ఎక్కువ ఆదరణ ఉందని ఆ పార్టీ కొత్త అధ్యక్షుని అభిప్రాయం. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, 2004 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఈ విషయాన్ని విస్మరించడమే విడ్డూరం. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటంటే బీజేపీ రెండు సార్లు వరుసగా కేంద్రంలో అధికారం చేపట్టింది. కావున, ఏపీలోని బీజేపీ శ్రేణుల్లోనూ ఆశలు చిగురించడంలో సందేహం ఉండదు. అయితే 2019 ఎన్నికల్లోనూ కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. కానీ, ఆ పార్టీకి ఏపీలో ఒక్కటంటే ఒక్క సీటూ రాలేదు. దీనిని బట్టి తెలుగుదేశఃతో పొత్తు వల్ల బీజేపీ లాభపడిందా? లేక టీడీపీయా అన్నది తేటతెల్లమవుతుంది. ఈ విషయాన్ని తోసి పడేస్తూ ఏపీ జనం తెలుగుదేశం, వైసీపీ పార్టీలపై విసుగెత్తి ఉన్నారు కాబట్టి , రాబోయే ఎన్నికల్లో జనసేన తో కలసి బీజేపీ విజయం సాధిస్తుందని వీర్రాజు మాట. మరి తెలుగుజనం ఆ రెండు పార్టీలను కాదని, బీజేపీ-జనసేన కూటమికి ఓట్లు వేయడానికి ఈ రెండు పార్టీలు మునుముందు ఎలా సాగుతాయో చూడాలి.

Share: