డ్రాగన్ కంట్రీ చైనాలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని తన కబంధ హస్తాల్లో బంధించిన కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. అంతుబట్టని ఈ వైరస్‌ను ఎదుర్కోగలిగే టీకాను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. అయితే, ఈ విషయంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ (కొవాక్జిన్) ప్రి-క్లినికల్ దశను పూర్తిచేసుకొని మొదటి- రెండోదశ పరీక్షలకు అనుమతి సంపాదించింది. క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన వెంటనే టీకాను అందుబాటులోకి తీసుకొచ్చి కరోనాను తరిమికొట్టే ఆయుధంగా ఉపయోగించనున్నారు. కోవాక్జిన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ సంస్థ చైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ కృష్ణ యెల్ల తెలిపారు. వ్యాక్సిన్ తయారీకి అవసరమైన బీఎస్ఎల్-3 హై కంటెయిన్మెంట్ సదుపాయం ఒక్క భారత్ బయోటెక్ వద్ద మాత్రమే ఉందని, అమెరికా, చైనాల వద్ద కూడా లేదని డాక్టర్ కృష్ణ యెల్ల పేర్కొన్నారు. ఇంకా ఆయనేమన్నారో ఆయన మాట్లల్లోనే..
దేశంలోని 10 కేంద్రాల్లో 1200 మందిపై ప్రయోగం
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్జిన్ వ్యాక్సిన్‌ను మొదటి దశలో దేశంలోని 10 కేంద్రాల్లో 1200 మందిపై ప్రయోగిస్తున్నాం. ఇప్పటి వరకు వైరస్ సోకని వారికి ఈ టీకాను ఇస్తాం. ఫలితంగా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన నిరోధకశక్తిని శరీరం తయారుచేసుకుంటుంది. 28వ రోజున ఆ వ్యక్తి నుంచి రక్తనమూనాలు సేకరించి దానిలో లైవ్ వైరస్‌ను ప్రవేశపెడతాం. అలా పెట్టినప్పుడు వైరస్ పెరగకూడదు. తర్వాత సిరాలజీ అధ్యయనం చేయాలి. ఆ విషయంలో మాకు పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో భాగస్వామ్యం ఉన్నందున ఆ అధ్యయనాన్ని ఇద్దరం కలిసి చేస్తాం. వైరస్ రెట్టింపు కావడానికి 15 రోజులు పడుతుంది. ప్రతి పరీక్ష ఫలితం రావడానికి 2 నుంచి 3 వారాల సమయం పడుతుంది. మొదటిదశ ట్రయల్స్ 30 రోజుల్లో పూర్తయ్యాక.. రెండోదశ మొదలుపెడతాం. మొత్తం పరీక్షలకు, వ్యాక్సిన్ సమర్థత నిర్ధారణకు 3 నెలలైనా పడుతుంది. ట్రయల్ విజయవంతంగా నడిస్తే, దానికి సమాంతరంగా వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా కొనసాగిస్తాం.
మా దారి సరైనదే..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే, మేం అభివృద్ధి చేస్తున్న టీకా ఇందుకు భిన్నమైనది. ఇది వైరస్‌లోని ఆర్ఎన్ఏను అచేతనంగా మార్చుతుంది. చైనా కూడా ఇలాంటి పద్ధతినే ఎంచుకుంది. కాబట్టి మా దారి సరైనదే. మరో రెండు రకాలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పరీక్షిస్తున్నాం. ఒకటి ఫిలడెల్ఫియాలోని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీతో కలిసి డీ-యాక్టివేటెడ్ రేబిస్ వ్యాక్సిన్ ప్లాట్‌ఫాం కాగా, యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్తో కలిసి చేస్తున్న ‘నాసల్ వ్యాక్సిన్’ ప్లాట్‌ఫాం రెండోది. దాదాపు వందమంది శాస్త్రవేత్తలు రెండు నెలలుగా రాత్రీపగలు శ్రమిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బీఎస్ఎల్- 3 ఫెసిలిటీలో కరోనా ‘లైవ్’ వైరస్‌తో పనిచేస్తున్నారు. తమ ద్వారా ఇతరులకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు వైరస్ విస్తరిస్తుందనే అనుమానంతో చాలామంది ఇళ్లకు కూడా వెళ్లడం లేదు.
ఆ సదుపాయం మా వద్ద మాత్రమే ఉంది
బీఎస్ఎల్-3 అంటే బయో సేఫ్టీ లెవెల్- 3 అని అర్థం. వ్యాక్సిన్ ఆవిష్కరణ, తయారీ ప్రక్రియలో వైరస్ ల్యాబ్ నుంచి, లేదంటే తయారీ సదుపాయం నుంచి గాలి, నీరు లేదంటే అక్కడ పనిచేస్తున్న శాస్త్రవేత్తల ద్వారా బయటకు వెళ్లి ఇతరులకు సోకి శరవేగంగా విస్తరించే ప్రమాదం ఉంటుంది. అటువంటి ముప్పు తలెత్తకుండా ఉండాలంటే బీఎస్ఎల్-3 స్థాయి సదుపాయం ఉండాలి. బీఎస్ఎల్- 3 స్థాయి ల్యాబొరేటరీలు ఎన్నో ఉన్నాయి, కానీ తయారీ సదుపాయం భారత్ బయోటెక్‌కు మాత్రమే ఉంది. చైనాలో కొత్తగా ఇటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయటానికి ఇటీవల అక్కడి ప్రభుత్వం 200 మిలియన్ డాలర్లు కేటాయించింది. అమెరికాలో కన్సాస్‌లో ఈ సదుపాయాన్ని ఇప్పుడు నిర్మిస్తున్నారు. ఇతర వ్యాక్సిన్ల తయారీకి ఇలాంటి సదుపాయం అవసరం లేదు. రేబిస్ వ్యాక్సిన్ తయారు చేయాలంటే బీఎస్ఎల్- 2 స్థాయి సరిపోతుంది. కానీ కరోనా వైరస్ విస్తరించే వేగం అధికంగా ఉండడంతో బీఎస్ఎల్- 3 సదుపాయం తప్పనిసరి.
ప్రజలపై భారం కానంత ధరలో..
కోవాక్జిన్ వ్యాక్సిన్ ధర ఎంత అనేది ఇప్పుడే చెప్పలేం. అయితే, అతి తక్కువలో అందరికీ అందుబాటులో ఉంచాలనేదే మా లక్ష్యం. ప్రస్తుత టీకా కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పైసా తీసుకోలేదు. ఈ క్లిష్ట పరిస్థితులను మేం అవకాశంగా మలచుకోదలచుకోలేదు. అందుకే మా సొంత డబ్బుతో ప్రాజెక్టు నడుపుతున్నాం. మా కంటే కూడా మరెవరూ ఇవ్వలేనంత తక్కువ ధరలో మాత్రం వ్యాక్సిన్‌ను అందిస్తామని చెప్పగలను. వ్యాక్సిన్ తయారీలో పోటీ మా ఉద్దేశం కాదు. ఈ వ్యాక్సిన్‌కు బలమైన శాస్త్ర పునాది ఉంది. ఒకసారి అన్ని అనుమతులూ వచ్చిన వెంటనే 100-200 మిలియన్ డోస్‌లు ఉత్పత్తి చేయాలనేది మా లక్ష్యం. ఇత కంపెనీలు, ఇతర దేశాలు మాకు పోటీ కానే కాదు. కరోనాపై గెలవాలన్నదే మా ఆకాంక్ష. గత 22 ఏళ్లలో 16 వ్యాక్సిన్లు మేం అభివృద్ధి చేశాం. టైఫాయిడ్‌లాంటి వ్యాధికి ప్రపంచంలోనే తొలిసారి వ్యాక్సిన్‌ను ఉత్పత్తిచేశాం.
ట్రయల్స్ విజయవంతమైతే ఉత్పత్తి సమస్య కాదు
క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే ఉత్పత్తి పెద్ద సమస్య కాబోదు. వెంటనే మార్కెట్లోకి వచ్చేస్తుంది. అయితే, ఇది రెగ్యులేటర్లపై ఆధారపడి ఉంటుంది. మొదటి, రెండోదశ క్లినికల్ ట్రయల్స్ డేటా స్పష్టంగా ఉంటే నియంత్రణాధికార సంస్థల ముందు రెండే అవకాశాలు ఉంటాయి. తొలి అవకాశం కింద టీకాకు ఆమోదముద్ర వేసి వెంటనే విక్రయాలకు అనుమతిస్తాయి. సంతృప్తి చెందకపోతే మాత్రం మూడోదశ ట్రయల్స్ నిర్వహించమని కోరుతాయి. కాబట్టి ఈ వ్యాక్సిన్ కచ్చితంగా ఎప్పుడు వస్తుందన్నది చెప్పడం కష్టం. అయితే, ఈ ఏడాది చివరికల్లా రావచ్చని మాత్రం చెప్పగలను. నిజానికి వ్యాక్సిన్ తయారీకి సాధారణంగా 15 ఏళ్లు పడుతుంది. మేం అభివృద్ధి చేసిన రొటావైరస్ టీకా మార్కెట్లోకి తీసుకురావడానికి 16 ఏళ్లు పట్టింది. దాంతో పోలిస్తే ప్రస్తుత కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధిలో చాలానే ముందున్నాం.
—————
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ 1996లో ఏర్పాటైంది. డాక్టర్ కృష్ణ యెల్ల, ఆయన సతీమణి సుచిత్ర కలిసి దీనిని స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు మానవాళి మనుగడ కోసం వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తూనే ఉన్నారు. వైరస్లు, బ్యాక్టీరియాలపై యుద్ధం చేస్తూనే ఉన్నారు. సౌత్ కాలిఫోర్నియాలోని మెడికల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న డాక్టర్ కృష్ణ యెల్ల అమ్మ పిలుపుతో స్వదేశం తిరిగొచ్చి తొలుత ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అయితే, అది ఎందుకో ఆయనకు తృప్తి ఇవ్వలేదు. దీంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి భార్యతో కలిసి భారత్ బయోటెక్‌ను స్థాపించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపైనా, మల్లీ నేషనల్ కంపెనీలు పట్టించుకోని విషయాలపైనా దృష్టి సారించాలని ఆనాడే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
నిజం చెప్పాలంటే భారతదేశంలో ఓ శాస్త్రవేత్త వ్యాపారవేత్త కావడం డాక్టర్ కృష్ణ యెల్లతోనే ప్రారంభమైంది. విజయం సాధించాలంటే బీపీ పెరగాలని చమత్కారంగా చెప్పే డాక్టర్ కృష్ణ యెల్ల భారత్ బయోటెక్ పేరును విశ్వవ్యాప్తం చేశారు. హెపటైటిస్-బి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం తాను సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా చెప్పుకునే ఆయన.. ఇప్పుడు కరోనా వైరస్‌పై పోరులోనూ ముందున్నారు. మానవాళిపై దాడిచేసే ఇలాంటి ప్రాణాంతక వైరస్ల నుంచి ఈ భూగోళాన్ని రక్షించే బాధ్యతను మోస్తున్న ఆయన కృషి చిరస్మరణీయం.