మా అందరిదీ ‘సి’ క్లాసే.. జైలులో అలా ఉండేవి మా పాట్లు పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య

G

పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన వేసిన ప్రతీ అడుగు జనహితం కోసమే.. దేశం కోసమే. ఆయన ఆత్మకథ ‘నా జీవన నౌక’ జీవితపు విలువలను నేర్పిస్తుంది. ఆత్మకథ తనదే అయినా తన గురించి తక్కువ చెప్పి ఇతరుల గురించి, స్వరాజ్య సాధనలో వారు అనుభవించిన కష్టనష్టాల గురించే ఎక్కువగా ప్రస్తావించారు. నమ్మిన విలువలకు ఎంతగా ప్రాణం ఇచ్చారో ‘నా జీవన నౌక’ చెబుతుంది. గత వందేళ్లలో మన సాంఘిక వ్యవస్థలో ఎన్ని మార్పులు వచ్చాయో, జీవితపు విలువులు ఎంతగా మారాయో ఈ ఆత్మకథ చదివిన వారికి అర్థమవుతుంది. గత కొన్ని నెలలుగా ‘నా జీవన నౌక’లోని కొన్ని అధ్యాయాలను అందిస్తూ వస్తున్నాం. ఈసారి ఆయన జైలు జీవితంలో ఎదురైన అనుభవాలను వర్ణించిన ‘జైలు జీవితంలోని ముచ్చట్లు.. అనుభవాలు’ యథాతథంగా మీకోసం..

———-
1932వ సంవత్సరంలో మేం జైలుకు వెళ్లిన సందర్భాలలో మా జైలు జీవితాన్ని గురించి చెప్పడం అవసరమని భావిస్తున్నాను. మేం నలుగురం.. సూరయ్య, ఆంజనేయులు, వెంకట సుబ్బారెడ్డి, నేను కలిసి జైలుకు వెళ్లామని ఇదివరలోనే రాశాను. మా నలుగురిని నాలుగు బ్లాకుల్లోకి విడదీసి పంపించారు.

నేను VI ‘బి’ బ్లాకులో ఉన్నాను. (సర్దార్) గౌతు లచ్చన్న గారు కూడా నాతోనే ఉన్నారు. లాహోర్ కుట్ర కేసులో యావజ్జీవ శిక్ష విధింపబడిన శ్రీయుతులు సిన్హా, శివశర్మగార్లు ఆ బ్లాకులోనే ఉన్నారు. మా కంటే చాలా చిన్న వయస్కులు. నేను రెండేళ్లు శిక్ష పడిన వాడిని. వారు యావజ్జీవ శిక్ష విధింపబడినవారు. వారు రోజూ ఉత్సాహంతో ఆడుతూ పాడుతూ మాతో రాజకీయాలు చర్చిస్తూ నిత్యోల్లాసంగా ఉండేవారు. వారి ఆనందంలో మేమూ భాగం పంచుకునే వాళ్లం. ఈ సిన్హా గారే 1947లో నా మిత్రులు అన్నె అంజయ్యగారి కుమార్తె చిరంజీవి శ్రీరాజ్యంను వివాహం చేసుకున్నారు. అంజయ్య, సిన్హాగార్లను వారి జైలు జీవితం మామ అల్లుళ్లుగా చేసింది. మా అందరిదీ ‘సి’ క్లాసే.

అయితే జైళ్లకు కొత్త కాదు కనుక మేం మొదటి రోజు నుంచి తృప్తితోనే గడిపాం. సిన్హా, శివశర్మ గార్లకు మజ్జిగ, నూనె వగైరా ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. వాటిని మేం వారితో కలిసి అనుభవించాం. సిన్హా, శివశర్మగార్ల కత్తితో నేను గడ్డం చేసుకుని, వారికిచ్చిన నూనెను తలకు రాసుకుని పరిశుభ్రంగా ఉండేవాడిని. మిత్రులు సూరయ్య, ఆంజనేయులు, వెంకట సుబ్బారెడ్డిగార్లు జుట్టుకు నూనె లేకుండా వున్నందున వారికి నూనె సప్లయి చేసేందుకు మార్గన్వేషణ చేయాల్సి వచ్చింది. నేను రోజూ నా తలకు నూనె ఎక్కువగా రాసుకుని రావడం, హెచ్చుగా ఉన్న నూనెను నా తలమీదిది తీసుకుని వారు ముగ్గురూ తలా ఒక రోజున రాసుకోవడం జరుగుతూ ఉండేది. జైలులో మా పాట్లు ఇలా ఉండేవి.

వివిధ జిల్లాల నుండి వచ్చిన వారిని వేరు వేరు బ్లాకులలో పెట్టి ఒక చోట కలవకుండా చేయాలనేది జైలు అధికారుల పథకం. అన్ని జిల్లాల ప్రతినిధులం ఒక చోట చేరి ఆయా జిల్లాలలో కాంగ్రెసు కార్యకలాపములను నూతనంగా జైలుకు వచ్చిన మిత్రుల ద్వారా తెలుసుకుని తృప్తిని, ఆనందాన్ని పొందుట, మా బ్లాకులలో ఉన్న మిత్రులకు తెలుపుట, మా కర్తవ్యంగా భావించాం. అందుకోసం ఆసుపత్రికి ప్రతి బ్లాకు నుంచి మిత్రులు వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్నాం.

జైలులో రంగునీళ్లు సీసాలలో నింపి ఖైదీల జబ్బులను సరిగా తెలుసుకోకుండానే వాళ్ల నోళ్లలో పోయుట ఆచారం. అలానే రాజకీయ నేరస్థులకు చేయడమే కాక సామాన్య ఖైదీలను సంబోధించు అలవాటు పడిన నోరు అగుటచే డాక్టరు మమ్మల్ని కూడా ‘ఒరే’ అని సంబోధించడం ప్రారంభించేసరికి మా ఆగ్రహం తారస్థాయినందుకొని కర్తవ్యమును గురించి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. మా బ్లాకులోనే ఉన్న శ్రీ వంగర శివరామ దీక్షితులు ఇది చాలా చిన్న విషయము, దీని గురించి పెద్ద రభస లేపవద్దు, దీనిని సరిచేసే భారం నాపై ఉంచండి అన్నారు. మరునాడు మేమిద్దరం ఆసుపత్రికి వెళ్లాం. డాక్టరు లావుపాటి మనిషి. ఆయనను ఒరే మొద్దబ్బాయి ఏమిటిరా విశేషాలు అని దీక్షితులు అతి చనువుతో ప్రశ్నించేటప్పటికి డాక్టరు నివ్వెరపోవడం గమనించి, మనం విశాఖపట్నం మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం క్లాసులో సహాధ్యాయులం. జ్ఞాపకం లే, అప్పుడు నిన్ను మొద్దబ్బాయి అని పిలిచివాళ్లం మర్చిపోయావేమిటి నా పేరు దీక్షితులు. చదువులోను, అల్లరిలోను అప్పుడు మనదే ఫస్ట్ మార్కు అని ఏదో అనబోతూ ఉండగా డాక్టరు దీక్షితులు గారిని ఆసుపత్రి లోపలి గదిలోకి పిలిచి, ఎంత మనం సహాధ్యాయులమైనా ఖైదీల ముందు ఒరే అని సంబోధిస్తే నా పెద్దరికం ఉంటుందా బ్రదర్ అని డాక్టర్ అడగడం; సరే రాజకీయాలలో జైలుకు వచ్చిన వారి స్థాయి, గౌరవ ప్రతిపత్తి ఎట్టిదో గమనించకుండా నీవు అందరినీ ఒరే అని సంబోధిస్తున్నావు. దీనిని మా వాళ్లు ఏదో పెద్ద ఎత్తున ఆందోళన లేవనెత్తి సూపరింటెండెంటు శ్రీ శంకర్ వద్దకు తీసుకువెళ్లేటట్లు ఉన్నారు. స్నేహితుడగుటే నిన్న హెచ్చరించడానికి వచ్చాను అని చెప్పడం, రాజీగా అందరం గౌరవ మర్యాదలతో పిలుచుకొనుటకు ఒప్పందం జరిగింది.

ఈ దీక్షితులు గారిది విజయనగరం. మహారాజు వారి పురోహితుని కుమారుడు. సంస్థానంలోని పెద్ద, పిన్నలందరితోనూ చనువు గలదు. ఎఫ్ఏ చదువుతూ రాజకీయ రంగంలో ప్రవేశించి లాఠీదెబ్బలు సైతం చవిచూశారు. రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యులుగా కలుసుకుంటూ ఉండేవాళ్లం. నిత్యం కారాకిళ్లీ నములుతూ అందరితో పరిహాసాలాడుతూ ఉండే నిత్య సంతోషి ఆయన.

విజయనగరం వెళ్లిన ప్రతి కాంగ్రెసు మిత్రుడు షడ్రసోపేతమైన ఆయన ఆతిథ్యం స్వీకరించడం పరిపాటే. ఆయన ఇంటినిండా దోసపళ్ల వంటి అందచందాలు కలిగిన బిడ్డలు. వారి జైలు యాత్ర చేసిన శ్రీమతి వారిని మాస్టారూ అంటూ పిలుస్తూ పరిహాసాలాడుతూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. అయితే, ఇట్లా ఎప్పుడూ అయ్యవార్లు గారి నట్టిల్లే ఏమిటి బ్రదర్ కుటుంబ పోషణ ఎట్లా చేస్తున్నావు అంటే, బేషుగ్గా కావలసినంత పరపతి ఉంది. మనం అప్పు అడిగితే లేదనే వాళ్లు ఉండరు. మహారాజావారి పురోహితులం గదా? ఎపుడో ఒకప్పుడు దేవిడీలోకి వెళ్ల రాణీ సర్కారు గారికి కష్టసుఖాలు చెప్పుకుని డబ్బు తీసుకొచ్చి సర్దుతూ ఉంటాను. కాంగ్రెసులో నా కార్యనిర్వహణకు వారి సహకార సానుభూతులు పూర్తిగా ఉన్నవి. రేవారాణీగారు (అని జ్ఞాపకం) నన్ను ఒరే అబ్బాయి అని ప్రేమగా పిలుస్తూ, ఆదరిస్తూ కాంగ్రెస్ మహాసభలకు సైతం వెళ్లుటకు ప్రయాణ ఖర్చులు ఇస్తూ ఉంటారు అని చెప్పారు.

1983లో ప్రాథమిక సభ్యత్వములను తనిఖీ చేసే నియమాల ప్రకారం చేర్పించని సభ్యులను తీసివేయటకు ఎనిమిది మంది ఇన్‌స్పెక్టర్లను నియమించుటకు నిర్ణయించుకున్నాం. అప్పుడు వారికి ఉత్తరం రాసి పిలిపించి అధ్యక్షులు డాక్టర్ పట్టాభిగారికి వీరిని పరిచయం చేశాం. పట్టాభిగారు వీరు నిర్వర్తించవలసిన కార్యక్రమ వివరాలు చెప్పి శ్రద్ధగా చేయండి అనగా, ‘‘మీరు ఉద్యోగం ఇచ్చి చూడండి. నా తడాఖా బొమ్మలాడిస్తాను’’ అనేటప్పటికి డాక్టరు గారు నవ్వుకుని నా వైపు చూశారు. నేనేదో సమాధానం చెప్పాను. దీక్షితులుగారు ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత వారు పేరుకు తగినట్లు దీక్షగా చేసిన పనిని చూసి పట్టాభిగారు తృప్తిపడి ఆనందంతో వారిని మెచ్చుకున్నారు.

మమ్ములనందరినీ పగలు ఒక విశాలమైన ఆవరణ గలిగినటువంటి బ్లాక్సు మధ్యపెట్టి కాపలా పెట్టేవారు. మేం విశ్రాంతి తీసుకునేవాళ్లం. మాలో పశ్చిమ గోదావరి జిల్లా లంకల కోడేరు కాపురస్తుడు వస్తాదు వెంకట్రాజు గారు, గంజాం జిల్లా నుంచి వచ్చిన సన్నాయి మాస్టారు, ఇంకా ఒకరిద్దరు కుస్తీలు పట్టేవారు ఉన్నారు. వారందిరితో వస్తాదు రాజుగారు కుస్తీలు పట్టి మమ్మల్ని ఆనందింపజేసేవారు.

జైలులో సహచరులు

మాకు ఒక్కొక్క బ్లాకుకు ఒక్కొక్క ప్రతినిధిని ఎన్నుకోవడం ఉండేది. మా రాజకీయవాదులందరికీ మద్దూరి అన్నపూర్ణయ్యగారు, నేను సమష్టిగా నాయకులుగా ఎన్నుకోబడ్డాం. కర్నూలులో ప్రకాశం పంతులుగారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నీరుకొండ రామారావు గారు అప్పటికి మైనరు కుర్రవాడు. చిన్నవాళ్ల బ్లాకులో ఉండేవాడు. ఒక రోజున ఒక వార్డరు ఆయనను కొట్టిన వర్తమానం మాకు అందింది. దానిమీద మేమందరం భోజనం చేయబోమని భీష్మించాం. మా జైలు సూపరింటెండెంట్ డాక్టరు శంకర్ మంచివాడు. పట్టాభిగారి సహాధ్యాయుడు. తాను అధికారరీత్యా విచారించి వార్డెన్‌ను శిక్షించగలనని స్వయంగా మా ఇరువురితో చెప్పి ఉపవాసం మానవలసిందిగా మమ్మల్ని కోరారు. వార్డెన్ చేత మాకు క్షమాపణ చెప్పిస్తేనేగానీ ఉపవాసం మానబోమని మా అందరి నిర్ణయంగా చెప్పాం. అందుచేత ఉపవాసం విరమించలేదు.

అప్పటికి 150 మంది వరకు ఉన్నది మా సంఖ్య. మమ్ములను 50 మందిని ఒక జట్టుగా విడదీసి ఆ రాత్రికి రాత్రే రైలులో బళ్లారి పంపారు. మిగతావారు తరువాత రెండు జట్లుగా బళ్లారి వచ్చారు. మరురోజు ఉదయం బెజవాడ రైలు స్టేషనులో దిగేసరికి శ్రీ ఎర్నేని లక్ష్మీనారాయణ వగైరా మిత్రులు మాకు ఆతిథ్యమిచ్చారు. తృప్తిగా భుజించి రైలు ఎక్కాం.

విప్లవకారులు

బళ్లారి జైలులోనికి వెళ్లే సరికి ముందుగా మాకు ‘లాహోర్’ కుట్రకేసులో యావజ్జీవ శిక్ష విధించబడిన శ్రీయుతులు బటు కేశ్వరదత్, మహావీర్‌సింగ్, డాక్టర్ గయాప్రసాద్‌లు కనిపించారు. శ్రీ మహావీర్ కాళ్లకు బేడీలు వేసివున్నవి. ‘‘ఎందుకు బేడీలు వేయవలసి వచ్చిందని’’ అడిగాము. కఠిన శిక్ష అయిన వాళ్లకు ప్రత్యేకంగా పనిచేయకుండా వుండేటట్టు మంచి భోజన సదుపాయాలు అదివరకు ఉన్నాయి.

‘‘ఇంకా రాజకీయ ఖైదీలు వస్తున్నారు. మీకు ప్రత్యేక సదుపాయాలు ఇస్తే వారికి ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి మీకిచ్చిన సదుపాయాలను రద్దు చేస్తున్నాం. మీరు వండ్రంగి కార్ఖానాకు వచ్చి పని చెయ్యాలని ఒత్తిడి’’ చేశారు. వారందుకు అంగీకరించలేదు. దానిమీద సంఘర్షణ వచ్చింది. మహావీర్ సింగ్ యువకుడు, బలిష్ఠుడు. అతడిని వార్డరు ఒకడు రెచ్చగొట్టి అనవసరంగా కోపం తెప్పించిన సందర్భంలో ఆ వార్డుకు రెండు ప్రహరణాలు తగలక తప్పలేదు. అందుకు బేడీలు వేశారు. ఈ మిత్రత్రయానికి, జైలు ఉద్యోగులకు జరుగుతూవున్న ఈ సంఘర్షణను చూస్తూ అప్పటికి మద్రాసు నుంచి వచ్చిన ఒక జట్టు ముప్పది అయిదుమంది తమకేమీ పట్టనట్టు ఊరుకున్నారు. పైపెచ్చు వారిలో కొంతమంది ‘‘మేం అహింసావాదులం. వారు టెర్రరిస్టులు’’ అని ముచ్చటించారు కూడా.

ఈ మాటలు శ్రీదత్తు వగైరా మిత్రుల హృదయాలకు నొప్పి కలుగచేసినవి. ఈ విషయమంతా వారు మాతో చెప్పారు. తరువాత మేం అందరం సంప్రదించుకుంటూ వుండేవారం. వారితోబాటు సరిసమానంగా కలసి అవినాభావ సంబంధంగా వర్తించాలని అందరం అంగీకరించాం. వారిని ఆత్మీయులుగా, సగౌరవంగా చూసేవాళ్లం. మా ఆసరా వాళ్లకు ఉన్నదనే ఆనందం వాళ్లకు కలిగింది. మాగంటి సీతారామదాసు, వీరమాచనేని వెంకట నారాయణ, మంగళంపల్లి చంద్రశేఖరన్, కాకుమాని లక్ష్మయ్య, నూకల వీరరాఘవయ్య, కాట్రగడ్డ మధుసూధనరావు, పేట బాపయ్య, గుళ్లపల్లి రామబ్రహ్మం, స్వామి నారాయణానంద, కేఎల్ నరసింహారావు, ముదిగంటి జగ్గన్నశాస్త్రి, మద్దూరి అన్నపూర్ణయ్య, గౌతు లచ్చన్న, కొల్లిపర సూరయ్య, కొడాలి ఆంజనేయులు ఇంకా చాలామంది మిత్రులం ఆ జైలులో ఉన్నాం. మాకు ఒకే నాయకుడు ఉండడం ఉచితమని నేను భావించి మద్దూరి అన్నపూర్ణయ్య గారిని నాయకుడిగా నేనే సూచించాను. అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.

శ్రీదత్తు వగైరా ముగ్గురూ తమకు వెనక ఉన్న సౌకర్యాలను పునరుద్ధరణ చెయ్యవలసిందని, మహావీర్‌సింగ్‌కు ఉన్న బేడీలు తీసివేయవలసిందని, అలా చెయ్యని నాడు ఉపవాసం ఆరంభిస్తామని చెప్పారు. అలాగే వారు ఉపవాసం ప్రారంభించారు. మేం అందరం సంప్రదించుకుని, వారితోపాటు దీర్ఘోపవాసం కాకుండా మూడు రోజుల ఉపవాసం వారి ముగ్గరి ఆమోదంతో మేం చేశాం. ఒక రోజున లాఠీచార్జి కూడా జరిగింది. అందులో శ్రీ గౌతు లచ్చన్న వగైరా మిత్రులకు దెబ్బలు కూడా తగిలాయి.

శ్రీ లచ్చన్న

గౌతు లచ్చన్న మహాత్ముని పిలుపును అనుసరించి విద్యకు స్వస్తి చెప్పి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని స్వరాజ్య సంరంభంలో పాల్గొన్న విద్యార్థి. 1930లో బర్హంపురం జైలులో మేం కలిశాం. 1932 రాజమహేంద్రవరం, బళ్లారి జైలులో కలిసి ఉన్నాం. 1934లో విడుదల అయిన తర్వాత అచార్య రంగాగారి నాయకత్వాన జరిగిన రైతు ఉద్యమంలో భాగస్వాములమయ్యాం. ఆయన నిడబ్రోలు రైతు విద్యాలయ విద్యార్థి. 1958లో శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1946 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘ సంయుక్త కార్యదర్శిగా దీక్షతో రాత్రింబవళ్లు శ్రమ చేసిన శ్రమ జీవి, దేశభక్తులు శ్రీ లచ్చన్న. శ్రీ ప్రకాశం గారి ఆంధ్ర మంత్రివర్గంలో సభ్యుడిగా, రాష్ట్ర విభజన సంఘ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ నిర్మాణ బాధ్యత, భారం వహించిన ప్రధాన నాయక శ్రేణిలో వారున్నారు. ఆచార్య రంగాగారి ప్రధాన సహచరుడిగా, ఆయనకు నచ్చిన రాజకీయవేత్తగా ప్రజల ప్రశంసలందుకుంటున్నారు. ఆయన నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు. దీక్ష దక్షతలుగల దేశభక్తుడు. 1968 ఎన్నికలలో ఆయన శాసనసభకు, పార్లమెంటుకు కూడా జయంపొందిన ప్రజా రంజకుడు. ఆంధ్రదేశం మొత్తంమీద ఏ నాయకుడు ఆయనంత ప్రజారంజకుడు కాదని రుజువు చేసుకున్న ప్రతిభాశాలి.

శ్రీ యశ్వంత సిన్హా

స్వరాజ్య సంరంభంలో 1931 సంవత్సరంలో రాయవేలూరు జైలులో రాజకీయ బాధితులుగా కలిసే ఉన్నాం. యోగ వ్యాయామాలలో వీరికి ప్రావీణ్యత ఉండడంతో జైలులో మిత్రులకు వ్యాయామమును, ఆసనాలు వగైరా బోధించేవారు. వీరి హిమాలయ పర్యటన విశేషాలను గూర్చి ఉపన్యసిస్తూ ఉండేవారు. వీరికి ఇప్పుడు 75 సంవత్సరములు. వృద్ధులు, ఏమాత్రం స్థిరాస్తి గాని, నిల్వధనం గానీ లేదు. ప్రభుత్వం ఈయనకు రాజకీయ బాధితునిగా నెలసరి పెన్షను ఇచ్చుట న్యాయము, ధర్మము అయివున్నది.

Share: