అలాగే ఉంటుంది… కానీ ఇది కొత్త కథ!

alage untundhi

వికృతరూపుడైన శిశుపాలుని ఎవరు తాకితే, ఆ రూపం పోతుందో వారి చేతిలోనే అతనికి మరణం అని అతని జాతకం. మేనత్త కొడుకైన శిశుపాలుని శ్రీకృష్ణుడు తాకగానే అతనికి మంచి రూపం వచ్చింది. జాతక రీత్యా ఉన్న శాపం తలచుకొని మేనత్త తల్లడిల్లింది. అప్పుడు శ్రీకృష్ణుడు అత్తను ఊరడించాడు. తనకు తాను శిశుపాలుని శిక్షించనని, నూరు తప్పులు కాస్తానని, ఆపైన దండించక తప్పదనీ చెప్పాడు. శ్రీకృష్ణుడు ఆ మాట అనగానే శిశుపాలుని కన్నతల్లి ఎంతగానో ఊరడిల్లింది. తన తనయుడు నూరు తప్పులు చేయకుండా చూసుకుంటానని ఆశపడింది. చివరకు రాజసూయం అనంతరం శ్రీకృష్ణునికి అగ్రపూజ చేస్తున్న సమయంలో తూలనాడి నూరుతప్పులు పూర్తి చేసుకొని జాతకరీత్యా శ్రీకృష్ణుని చేతిలోనే హతమయ్యాడు శిశుపాలుడు. ఈ కథ ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవలసి వస్తుందంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఆయన అభిమానులకు అవేవీ తప్పులుగా కనిపించక పోవచ్చే. సాక్షాత్తు న్యాయస్థానాలే ముఖ్యమంత్రి చర్యలను తప్పు పడుతున్నాయి. ఇప్పటికి 93 సార్లు ఏపీ సీఎమ్ చర్యలను కోర్టులు తప్పు పట్టాయి. వాటిని చూసి కోర్టులు ఆయనకు మొట్టికాయలు వేశాయని ప్రతిపక్షాలవారు సంబరపడుతున్నారు. ఇదేమీ ద్వాపర యుగం కాదు. నూరు తప్పులు కాగానే జగన్ పని అయిపోయిందని అనుకోవడానికి కలియుగం. అందునా ఎత్తులుపైఎత్తులు వేసేవారిదే కాలం. గడచిన ఎన్నికల సమయంలో జగన్ ఎన్ని ఎత్తులు పైఎత్తులు వేయకపోతే, ఎంతో అనుభవమున్న చంద్రబాబునాయుడును చిత్తు చేయగలడు చెప్పండి.

చెప్పేదెవరు?

జగన్మోహన్ రెడ్డి పాలన చేపట్టిన దగ్గర నుంచీ కోర్టుల దృష్టిలో తప్పులు చేస్తూనే ఉన్నారు. అంతేనా, రాష్ట్ర హైకోర్టును కాదని, అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ నూ ఆశ్రయిస్తున్నారు. అక్కడా చీవాట్లు తింటున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పలుమార్లు జరిగింది. అయినా ఆయన కోర్టులను సైతం ధిక్కరిస్తూ సాగుతున్నారు. జనం దృష్టిలో ఇది ఎలా కనిపించినా, ఆయన అభిమానులు మాత్రం తమ నాయకుడు మొనగాడని, ఎవరినీ లెక్క చేయడనీ ఎంతో ధీమాగా ఉన్నారు. తమ నాయకుడికి కూడా ‘లా’ బాగా తెలుసునని, అయితే చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేస్తున్నారనీ వారి భావన. ఎవరు ఎంత మేనేజ్ చేసినా, కోర్టులు తప్పు పట్టినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవలసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా! మరి జగన్ కు ఈ విషయంలో ఎవరూ సలహాలూ, సూచనలూ ఇవ్వడం లేదా? కేవలం తన బొమ్మ వల్లే తాను కాకుండా 150 మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారని జగన్ ప్రగాఢ విశ్వాసం. అంత మెజారిటీ ఉన్నకారణంగా ఎవరూ జగన్ కు ఇది తప్పు, అది ఒప్పు అని చెప్పడానికి సాహసించడం లేదు. పోనీ, జగన్ ను పైకి విమర్శిస్తున్నా, లోపల కాపాడుతూ ఉన్న వారయినా, ఆ పాటి సూచనలు చేయలేరా? చేయవచ్చు. కానీ, అతని తప్పులనే ఎత్తి చూపిస్తూ, రాబోయే కాలంలో ఏపీలో పాగా వేయాలని వారు చూస్తున్నారాయె. అందువల్ల వారు ఎందుకు సలహాలూ, సూచనలూ చేస్తారు? చెప్పినా, 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు సాధించిన విజయగర్వంతో ఉన్న జగన్ వింటారా?

అవునా… నిజమా!?

జగన్మోహన్ రెడ్డి కూడా విద్యాధికుడు. అందువల్ల చట్టం గురించి ఆయనకు తెలియనిది కాదు. అయినా ఇంత అడ్డగోలుగా ఆయన సాగుతున్నారంటే ఏదో కారణం ఉండి ఉంటుందనీ కొందరు అభిప్రాయపడుతున్నారు. జగన్ కు వద్ద సైతం ఎంతోమంది విద్యాధికులు, మేధావులు సలహాదారులుగా ఉన్నారు. వారికి చట్టం, దాని విలువలు తెలియనివి కావు. ఎవరో ఒకరు కనీసం జగన్ కు కాకపోయినా, ఆయన సన్నిహితులకు ఈ విషయంలోని పూర్వపరాలు చెప్పక ఉండరు. మరి జగన్ ఇలా ప్రవర్తించడానికి కారణం? లోకుల దృష్టిలో సదా ఈ చర్చ సాగుతూ ఉండాలని, లోపల తనకు కావలసినవి ఇష్టానుసారం చేసుకుంటూ పోవచ్చునని అందుకే జగన్ ఇలా ప్రవర్తిస్తున్నారనీ కొందరి అభిప్రాయం. గతంలో తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొనే ఎంతో సంపాదించిన జగన్, ప్రస్తుతం అధికారంలోనే ఉండి కొల్లగొట్టాడా అని వారి అనుమానం. ఇలా కొల్లగొట్టే నేపథ్యంలోనే తాను చేసే పనులు బయటపడకుండా, అందరి దృష్టినీ మరల్చడానికే జగన్ కోర్టుల్లో నిలవవనీ తెలిసినా, కొన్ని విషయాల్లో అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారని అనుమానపడుతున్న వారి మాట. ఇందులో నిజానిజాలెంతో కాలమే నిర్ణయిస్తుంది కానీ, జగన్ అడ్డగోలు పోకడలు మాత్రం జనం గమనిస్తున్నారు.

కోర్టుల చీవాట్లే దీవెనలట!

తమ నాయకునికి కోర్టుల్లో పడుతున్న చీవాట్లే దీవెనలని జగన్ అభిమానుల అభిప్రాయం. కోర్టులను ఎవరు ఎంతగా మేనేజ్ చేసినా, జగన్ వైపే జనం ఉన్నారని వారంటున్నారు. మరి జగన్ వైపే జనం ఉంటే, అలాంటి జనాన్ని నమ్మించి ఆయన మోసం చేయడం ఎంతవరకు సబబు అన్నది ఇతరుల ప్రశ్న. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రతిపాదించిన రాజధానికి అంగీకారం తెలిపిన జగన్మోహన్ రెడ్డి, ఈ రోజున మూడు రాజధానుల ముచ్చట ఎందుకు తెచ్చాడని ప్రశ్నిస్తున్నారు. అందుకు జగన్ అభిమానులు మూడు ప్రాంతాల అభివృద్ధికై జగన్ కు ఇప్పుడు ఆలోచన వచ్చిందని చెబుతున్నారు. ఒక్క రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడానికే నిధులు లేవన్న జగన్, మరి మూడు రాజధానులను ఎలా అభివృద్ధి చేస్తారు అన్నది ఇతరుల ప్రశ్న. విశాఖ, కర్నూలు ఇప్పటికే అభివృద్ధి చెందాయని, వాటిలో ఓ చోట పాలన, మరో చోట న్యాయస్థానం నెలకొల్పినట్టయితే మరింతగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనీ జగన్ అభిమానుల సమాధానం. మరి రాయలసీమ ప్రాంతవాసులకు పాలనావ్యవస్థతో పని పడితే, విశాఖ అంత దూరం పోవలసిందేనా? అంటే ప్రజలవద్దకే పాలనను తెస్తాడు తమ నాయకుడని వారి సమాధానం. ఉత్తరాంధ్ర, కోస్తా ప్రజల న్యాయవ్యవహారాల కోసం వారికి అందుబాటులో ‘బెంచ్’లు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి, అక్కడి వారు కర్నూలు దాకా రావలసిన పనిలేదనీ ఈ అభిమానులు చెబుతున్నారు. మరి రాష్ట్ర హైకోర్టులో చీవాట్లు పడగానే, సుప్రీమ్ కోర్టును వారి నాయకుడు ఎందుకు ఆశ్రయిస్తున్నారో చెప్పగలరా? కేంద్రపరమైన వ్యవహారాల్లో లబ్ధి కోసం ఢిల్లీకే ఎందుకు వెళ్ళాలి. విశాఖపట్టణంలో కూర్చునే కేంద్రంతో పనులు చేయించుకోవచ్చును కదా! ఈ ప్రశ్నలకు ఆ అభిమానుల వద్ద సమాధానం ఉండదు. అలాంటప్పుడే కోర్టులో మొట్టికాయలే తమ నాయకునికి దీవెనెలు అంటూ సర్ది చెప్పుకుంటున్నారు.

అదో ముచ్చట!

ఎవరు ఎలా చెప్పుకున్నా, మూడు రాజధానుల ముచ్చట కారణంగా అమరావతి కోసం పంటపొలాలను ఇచ్చిన రైతులకు అన్యాయం జరిగినట్టే! ఆ ప్రాంతంలో కేవలం ఓ సామాజిక వర్గానికే మేలు జరుగుతోందని, అందువల్లే తమ నాయకుడు తెలివిగా అన్ని ప్రాంతాల వారికి న్యాయం చేసేందుకు మూడు రాజధానుల ముచ్చట తెచ్చాడని అభిమానుల మాట. అలా అనుకున్నా, అమరావతి ప్రాంతప్రజలను ఆయన మోసం చేసినట్టే కదా! చంద్రబాబును చూసి వాళ్ళు భూములు ఇచ్చిఉండవచ్చు. కానీ, తరువాత వచ్చిన నాయకులు సైతం రాజధాని కోసం త్యాగంచేసిన వారిని ఆదుకోవాలి కదా. అలా కాకపోయినా, ఒప్పందం ప్రకారం రైతులకు జూన్, జూలై మాసాల్లోనే కౌలు చెల్లించాలి కదా.ఈ ‘కదా’లన్నీ ప్రతిపక్షాలు సృస్టిస్తున్న కథలేనని, తమ నాయకుడు అమరావతి ప్రజలకు అన్యాయం చేయడని ఓ మంత్రి వర్యులు సెలవిచ్చారు. అదీ తమకు ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన కౌలును సకాలంలో చెల్లించమని రైతులు రోడ్డుకెక్కితే, వారిని నిర్దాక్షిణ్యంగా అమర్యాదపూర్వకంగా అరెస్టులు చేసిన తరువాత కౌలు చెల్లించడానికి ముందుకు వచ్చారు. ఇక్కడా కోర్టులు ఈ అరెస్టులను తప్పు పట్టడంతోనే దిగివచ్చారు తప్ప, నిజానికి రాజధానికి భూములిచ్చిన రైతులపై అభిమానంతో కాదు. కోర్టులు తమను తప్పు పట్టిన ప్రతీసారి అది ప్రతిపక్షాలు చేస్తున్న మేనేజ్మెంట్ అంటూ చెప్పుకొనే దుస్థితిలోనే 15 నెలల వైసీపీ పాలన సాగింది. మరి రాబోయే కాలంలో జనం ఇంకెన్ని చూడాలో!

ద్వాపరయుగంలో శిశుపాలుని తప్పులను ఎత్తి చూపడానికి ఎవరూ సాహసించలేదు. అలా ఎత్తి చూపిన పెద్దలను సైతం అతను లక్ష్య పెట్టలేదు. కానీ, నూరు తప్పులు పూర్తి కాగానే శ్రీకృష్ణుడు శిశుపాలుని కాలుని వద్దకు పంపాడు. ఇక్కడ జనమే శ్రీకృష్ణులు అన్నీ గమనిస్తుంటారు. ద్వాపరంలో నూరు తప్పుల లెక్క, ఈ కలియుగంలో పాలనాకాలం మొత్తం ఎన్ని తప్పులు చేసినా జనం సహిస్తూనే ఉంటారు. ఓటు అనే సుదర్శన చక్రంతో ఎవరు తప్పు చేసినా ఓటమి పాలు చేయక మానరు.

Share: