ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, రెవిన్యూ శాఖను ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు నిర్వహించడం జమీందారీ రైతులకు ఉత్సాహం కలగజేసింది. జమీందార్లు చూపే నిరంకుశత్వాన్ని ప్రతిఘటించేందుకు రైతులందరూ సంఘటితమయ్యారు. అప్పట్లో మునగాలలో జమీందారీ రైతు సమస్యలు చాలా కష్టంగా తయారయ్యాయి. బెజవాడలో జరిగిన రైతులు జమీందారు ప్రతినిధుల సమావేశంలో బీఎన్ మూర్తి కృషి ఫలితంగా గొట్టిపాటి బ్రహ్మయ్యను మధ్యవర్తిగా ఇరువర్గాలు అంగీకరించారు. ఆ సమస్యను బ్రహ్మయ్య చాలా కష్టపడి పరిష్కరించారు. 10 జనవరి 1938లో 17 షరతులతో ఓ అవార్డును ఇచ్చారు. అది ‘బ్రహ్మయ్య అవార్డు’గా ప్రఖ్యాతి చెందింది. సమస్యను బ్రహ్మయ్య పరిష్కరించిన తీరుపై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తాయి. బ్రహ్మయ్య తన ఆత్మకథ ‘నా జీవన నౌక’లో ఈ విషయాన్ని కూలంకషంగా వివరించారు. అది యథాతథంగా మీకోసం..
—————-
మునగాల జమీందారుగారికిన్నీ, రైతులకున్నూ కలిగిన వివాదములును గూర్చిన రాజీ పరిష్కార సందర్భమున పరిష్కర్త గొట్టిపాటి బ్రహ్మయ్యగారి ఎదుట రైతుల తరపున మునగాల రైతు సంఘము వారు దాఖలుచేసిన వారి కోర్కెలను గూర్చి రైతుల తరపునను, జమీందారుగారి తరపునను చెప్పుకున్న వాదనలను విని ఇందులో జతపరచిన నిర్ణయముల ఇచ్చుటయైనది.
ఈ నిర్ణయముల ప్రకారము రైతులకు సంమంధించిన కోర్కెలు నిర్వర్తింపబడును. ఇందులకు ఇరు పక్షములవారును అంగీకరించటయైనది. సదరు నిర్ణయముల ప్రకారము జమీందారుగారు – రైతుల మధ్య వ్యవహారములన్నియు పరిష్కారం కావలెను. ఇందులను గూర్చి వచ్చిన సందేహములు, తగాదాలు గూర్చిన అంత్య పరిష్కారము బ్రహ్మయ్యగారిదే అయియున్నది.
1. పట్టాలు :- ముందు పట్టాలలో సర్వే నంబర్ల వారా భుములకు హద్దలువేసి ఇవ్వవలెను.
2. ఈనాములను గూర్చి :- చాకలి, మంగరి కుమ్మరి, వడ్రంగి, పురోహితం వగైరా వృత్తులవారి అనుభవంలో వున్న చాకిరీ ఈనాములను గూర్చి జమీందారుగారు వ్యాజ్యములు వేసి జయంపొంది యుండిరి. సదరు భూములకు పై వృత్తుల వారికి పట్టాల నివ్వవలెను.
ఆతరపు జమీందారీ రైతు భూమి`శిస్తు రేటు (అతరావు రేటులు హెచ్చుతగ్గులుంటే ఆ రేటులు Average రేటు… పల్లానికి పల్లపు రేటు-మెరకకు మెరక రేటు)లో సదరు ఇనాములకు పట్టాలను యిచ్చుటకు నిర్ణయం. వీరు యెవరికి నిర్బంధముగా చాకిరీ చేయ వలసిన బాధ్యత లేదు.
టి.డి. ఈనాములు- ఈనాముకంటె గల హెచ్చు పరిమాణం గల భూమికి అతరావు జమీందారి శిస్తు రేటుతో పట్టా ఇవ్వవలెను. ఆ ఈనాందారుకే. ఈ విషయమున ఈనాందారు చేస్తున్న అప్పీళ్ళు వదులుకుందురు. అన్నిరకముల ఈనాందార్లకు ఇదే వర్తించును. అయితే సర్వధుంబాలా ఈనాములు యెట్టి సర్వీసులతో నిమిత్తం లేకుండా, సర్వహక్కులతో, సర్వ కాలములు అనుభవించుటకు ఆధారములు గలవారు అట్లుగా సంపూర్ణ హక్కులతో అనుభవించవలెను. అట్లుగా ఆధారములు చూపని, భుములకు పైమాదిరిగానే శిస్తులు కొట్టుకొనవలెను. ఈ పట్టాలు పూర్తికాగానే ఇందులకు సంబంధించిన వ్యాజ్యములు ఉప సంహరించుకొవలెను.
3. హక్కుదారులకు తెలియకుండా రెవెన్యూ వేలం వేయబడిన భుములు యితరులకు విక్రయింపబడినవి, రాజాగారికని, వారి బంధువుల పేరిటను, వుద్యోగస్తుల పేరను కొట్టివేయబడిన భుములను గూర్చి:
1930 సంవత్సరం నుంచి సేల్ అయిన భుములను అట్టి భుములకు గాను ఇవ్వవలసిన సేల్ మొత్తమును దరిమిలా Improvement అయిన కిమ్మత్తును రైతులు ఇచ్చే ఎడల వారికి వారి భుములకు పట్టాలనివ్వవలెను. సదరు భుములను మరొక రైతుకు న్యాయముగా పట్టా ఇవ్వబడి ఆయన హక్కు భుక్తములో వుండిన ఎడల అందులకు గూర్చి ఎట్టి చర్య తీసుకోనక్కరలేదు.
4. దౌర్జన్యముగా రాజాగారు భుక్త పరుచుచుకున్న భుములను గూర్చి :
ఈ భుములు తమవని రైతులు ఆధారము చూపవలెను. సదరు భుములను జమీందారుగారు యే ఆధారములను పురస్కరించుకుని స్వాధీనపరచుకొనెనో జమీందారుగారు చూపవలెను.
5. ప్రతిఫల రహితమైన ప్రామిసరీ నోట్లు :-
ప్రతిఫల రహితమైన ప్రామిసరీ నోట్లు రాజాగారి పేరనున్నట్లయితే, వారి బంధువులు, అనుచరులు పేరనున్నట్లయితే, అన్నియు ఇచ్చివేయవలెను. శిస్తు బాకీలు తేల్చి ఆ మొత్తముల వారి అనుకూలుర పేర్లకు రాయించుకున్న నోట్లు చెల్లును
6. సాముదాయక భుముల ఆక్రమణ :-
అట్టి ఆక్రమణలను జమీందారుగారు వదిలివేయవలెను.
7. రైతు సొంత నూతి కింద సాగుకు పల్లం రేటు వసూలు చేయట వగైరా :
(1) 1908 తరువాత చెట్లన్నియు రైతులవే. అంతకుముందు చెట్లు. తరువాత చెట్లు ఏవో తేల్చుటకు డిప్యూటీ తహశీల్దారు గారికి వదలుటయైనది. వారి తుది నిర్ణయం..
2. ఇందులో కల్లుగీతలకు ఇచ్చిన చెట్ల రుసుము. వారి నిర్ణయముల ప్రకారము చెందును. వాటికి నంబర్లు వేయుటను గూర్చి రైతులు గాని, జమీందారుగారు కాని అభ్యంతరం పెట్టరాదు.
3. మెరక భుములలో సొంత నూతి కింద సాగుకు పల్లపు రేటు వసూలు చేయనేరదు.
(4). పట్టాగాని, భూమికాని లేకుండా శిస్తు వసూలు చేయరాదు.
8. వర్తకులకు సరకులకై డబ్బు యివ్వలేదని :
ఈ విషయమై దర్యాప్తు చేయించి ఇవ్వవలసిన యావత్తు పైకం లిమిటేషనుతో నిమిత్తము లేకుండా ఎస్టేటువారు యివ్వవలెను.
9. రైతుల క్రయ దస్తావేజులున్ను, పాత పట్టాలున్ను తీసుకుని ఇవ్వబడలేదు. యివ్వవలెను.
10. గ్రామ ఉద్యోగములు-వారసులు కానివారిని నామినేటు చేయుటను గూర్చి క్రమమైన కోర్టులో నిర్ణయించుకొనవలెను.
11.క్రిమినల్ కేసులను గూర్చిః-
మేము జోక్యము తీసుకొనజాలము.
12.రైతుల తాలుకు పశువులు చెరువు పడకలలో మేయుటకు గల హక్కులను గూర్చిః
ఇందులకు గూర్చి కలెక్టరుగారికి పిటీషను పెట్టుకొని నిర్ణయించుకొనవలెను.
13. సాంఘిక బహిష్కారం :
ప్రతిఫలం ఇచ్చి నౌకరీ చేయించుకునే సందర్భంలో ఎస్టేటువారు గాని, రైతులు గాని అట్టి కూలి, నౌకరీ, చేయవద్దని ఎవరికినీ బోధించరాదు. సాంఘిక బహిష్కారం కూడదు.
14. శిస్తులు చెలించే విషయం : ప్రతి గ్రామ భుముల ప్లానులు శిస్తులు వసూలు చేసే జమీందారీ ఉద్యోగి వద్ద శిస్తులు వసూలు సమయములో వుండవలెను. రైతులు వారి భూముల పరిమాణములను గూర్చి సందేహాలు తీర్చవలసిందిగా కోరినప్పుడు సదరు భూముల పరిమాణం సరిగా వున్నదని ఆ ఉద్యోగి సదరు ప్లాను దాఖలు భూమిని సదరు రైతులకు చూపి పరిమాణమును గూర్చి ఆయనను తృప్తిపరచవలెను. ఇందులను గూర్చి కుమార రాజాగారు ప్రత్యేక శ్రద్ధ వహించవలెను. రైతులందరు శిస్తు ఇవ్వవలెను.
15. పల్లపు భూమిని మెరకగా మార్చుటను గూర్చి : ల్యాండ్ యాక్టు ప్రకారము ఆరు సంవత్సరములు పల్లపు సాగు కాని భూమిని దరఖాస్తుపై మెరకగా ఎస్టేటు వారు మార్చ వలెను.
(సం) ఎమ్.ఆర్. రెడ్డి
(సం) కొ.వె. నరసింహారావు,
,, నా. వెంకట్రామనర్సయ్య,
,, కందుల రాములు,
,, ఎన్. ప్రసాదరావు
,, ఉప్పుల రామయ్య,
,, వె. రంగారావు
,, గొ.. బ్రహ్మయ్య,
10-1-39 పరిష్కర్త
ఎర్నేని సుబ్రహ్మణ్యంగారు
ఎర్నేని సుబ్రహ్మణ్యంగారు 1920లో V ఫారం చదువుతూ, చదువుకు స్వస్తిచెప్పి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు కృష్ణా జిల్లా జస్టిస్ పార్టీకి బలవత్తరమైన శక్తినిచ్చే జిల్లాగా వున్నది.
పెద్ద మద్దాలిలో జస్టిస్ పార్టీ మహాసభ ఒక రోజున జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి పానగల్లు రాజా, ఆయనతోటి మంత్రులు సర్. కె.వి. రెడ్డినాయుడు ఎ.పి. పాత్రోగార్లు ఆ సభకు వచ్చారు. ఆ రోజునే పోటీగా పెద్దమద్దాలికి రెండుమైళ్ల దూరానగల బల్లిపర్రులో కాంగ్రెసు వాదుల మహాసభ జరుపుకున్నాము. ఆ సభలో ప్రధాన వక్తలు గంపలగూడెం కుమారరాజా, కాకుమాను లక్ష్మయ్య, కానూరి చిన వెంకటదాసయ్యగార్లు ఆనాటి వరకు విద్యార్థిగా ఉండి చదువు సంధ్యలకు స్వస్తి చెప్పినవాడైన, ఆనాటి సభలో సుబ్రహ్మణ్యంగారు బాగా మాట్లాడారు. తర్వాత అనేక గ్రామాల వెంట తిరిగి మేము కలిసి కంగ్రెస్ ప్రచారం చేయటం జరిగింది.
1930 ఉప్పు సత్యాగ్రహంలో మహాత్ముడు నడిపిన దండయాత్రలో ఆంధ్రుల ఏకైక ప్రతినిధి ఈయన. ఈయన భార్య కుమార్తెలు, ఈయన తల్లి సోదరీమణులు, మేన కోడళ్ళు, వారి భర్తలు ఈయన సోదరుడు శ్రీ సుర్యనారాయణ, ఆయన భార్య – మొదలగు వీరి కుటుంబ సభ్యులంతా జైలుకు వెళ్ళారు. వీరికి వేసిన జరిమానాలకు వీరి స్వగ్రామం అంగలురులో వీరికున్న నివేశనస్థలం వేలం వేశారు. దానిని ఆ గ్రామస్తులే కొన్నారు. వీరు సెంటు గజం కూడా లేని బికారులయ్యారు. ఆంధ్రదేశంలో ఇంత త్యాగం చేసిన కుటుంబం మరొకటి లేదన్నది అతిశయోక్తికాదు. ఈయన సాధు సుబ్రహ్మణ్యంగా అస్వర్థ నామధేయుడయ్యాడు. మధ్య నిషేధం ఈయన ప్రాణప్రదంగా భావిస్తాడు.
ఈయన కొమరవోలులో గాంధీ ఆశ్రమాన్ని, మండపల్లిలో సేవాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన ‘‘దరిద్రనారాయణ’’ పత్రికను స్థాపించి దానికి సంపాదకుడుగా వున్నారు. దానినే సర్వోదయగా మార్చి చాలాకాలం నడిపారు. సర్వోదయ ప్రెస్ వారు దానిని నిర్వహిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర సంసిద్ధికి బలియైన త్యాగమూర్తి అమరజీవి పోట్టి శ్రీరాములు గారు కొమరవోలు ఆశ్రమంలో వీరికి సహచరులుగా వున్నవారే. అట్టి సేవాముర్తి ఎర్నేని సుబ్రహ్మణ్యంగారిని నా మునగాల అవార్డును అమలు జరుపుటకు వ్యవహర్తగా నేను నియమించాను, వారు 2, 3 నెలలు ఆ ప్రాంతం గ్రామాలన్ని పర్యటించి శ్రమజేసి కొంతవరకు కృతకృత్యులయ్యారు. వారికి నా అభినందనలను, కృతజ్ఞతలు తెలుపుట విధిగా భావిస్తున్నాను.
డాక్టర్ పట్టాభిగారికి కలిగిన అసంతృప్తి
1939లో మళ్ళీ కాకినాడలో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘం ఎన్నిక సమావేశం జరిగింది. ఎట్టి పోటీ లేకుండా ఎన్నికలు కొద్ది మార్పులతో జరిగినవి. భావయ్య చౌదరిగారి స్థానే కళా వెంకట్రావుగారు సంయుక్త కార్యదర్శిగా ఎన్నిక అయ్యారు. వెంకట్రావుగారి స్థానే కార్యవర్గ సభ్యుడుగా బిక్కని వెంకటరత్నంగారు మద్రాసు, రామదాసు పంతులుగారి స్థానే గద్దె రంగయ్యనాయుడుగారు వచ్చారు.
ఆ సంవత్సరం జిల్లా బోర్డు ఎన్నికలు వచ్చినవి. రాష్ట్ర కార్యవర్గ సంఘమే జిల్లా బోర్డు సభ్యులను – జిల్లా కాంగ్రెసు కమిటీ సిఫార్సులపై దరఖాస్తుదారుల నుంచి నియమించడం జరిగింది. జల్లా బోర్డు సభ్యుల ఎన్నికలైన తరువాత కార్యదర్శులలో ఒకరు ఆ జిల్లాకు వెళ్ళి ఎన్నికైన జిల్లా బోర్డు సభ్యుల అభిప్రాయం అధ్యక్ష, ఉపాధ్యక్షులను గురించి తెలుసుకొని ఒక నివేదికను తయారుచేసి, కార్యసంఘ పరిశీలనార్థం వుంచేవారు. ఆ నివేదికలోని విషయాలను గురించి చర్య జరిగిన తరువాత ఎక్కువమంది అభిప్రాయానుసారం అభ్యర్థులు నిర్ణయించబడేవారు. గుంటూరు, నెల్లూరు మునిసిపల్ అధ్యక్షుల ఎన్నిక అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, మేము కార్యదర్శులం ముగ్గురం ఈతూరి ఎక్కువమంది అభిప్రాయం ప్రకారమే నిర్ణయాలు చెయ్యడం ధర్మమని భావించాము. అఖిల భారత రాజకీయ కార్యకలాపాలలో నిమగ్నులైన కారణంచేత పట్టాభిగారు యెక్కువ సమావేశాలకు రాలేకపోయారు.
గుంటూరు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు నిర్ణయాలను కోటిరెడ్డిగారి అధ్యక్షతన మేమే నిర్వహించాం.
కడపలో శ్రీమతి రామసుబ్బమ్మ గారిని, అనంతపురంలో రాయప్పగారిని (షెడ్యూల్డు కులం) ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అధ్యక్షులుగా మేం నిర్ణయించడం కాంగ్రెస్ కమిటీకి గౌరవంగా భావించబడింది. కర్నూలు శ్రీ బీవీ సుబ్బారెడ్డి, చిత్తూరుకు శ్రీ టీఎన్ రామకృష్ణారెడ్డి, గుంటూరుకు శ్రీ కల్లూరి చంద్రమౌళి గార్లు నిర్ణయించబడ్డారు. ఉపాధ్యక్షులుగా కడప పంజం పట్టాభిరెడ్డి, అనంతపురం జి. వెంకటరెడ్డి, కర్నూలు లక్ష్మారెడ్డి, చిత్తూరు సుదర్శనవర్మ, గుంటూరు అవుతు రామిరెడ్డిగార్లను నిర్ణయించాం. తూర్పుగోదావరి అధ్యక్షులు శ్రీ పళ్లంరాజుగారు ఉపాధ్యక్షులు అరుమిల్లి వెంకటరత్నంగారు, ఈ తూర్పుగోదావరి నిర్ణయాలు పట్టాభిగారి ఆధ్వర్యంలోనే జరగడం, అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.
అప్పుడు శ్రీకాకుళం, విశాఖ ఒకే జిల్లాగా ఉండేవి. విశాఖకు శ్రీ పీఎల్ఎన్ రాజు అధ్యక్షుడుగాను, శ్రీ పొట్లూరి స్వామిబాబు ఉపాధ్యక్షుడుగాను, పశ్చిమగోదావరికి డాక్టర్ మాల్పురి రంగయ్య అధ్యక్షుడు, శ్రీ తటపర్తి కృష్ణమూర్తి ఉపాధ్యక్షుడుగాను, నెల్లూరు జిల్లాకు శ్రీ వంగల్లు కోదండరామిరెడ్డి అధ్యక్షుడు, శ్రీ ఎన్ చెంచునాయుడు ఉపాధ్యక్షుడు గాను నిర్ణయించుకుంటిమి. కానీ ఈ నిర్ణయాలలో అధ్యక్షుడు పట్టాభిగారు, కార్యదర్శులము మేము ఏకాభిప్రాయానికి రాలేకపోయాము. ఈ జిల్లాలకు ముందుగా విచారణకు వెళ్లిన వాడిని నేను కావడం చేత, నా రిపోర్టును సమర్థించుకుంటూ పట్టాభిగారి వాదనను నేను వ్యతిరేకించవలసిన పరిస్థితి ఏర్పడింది.
కార్యసంఘ సమావేశాలలో, ఓటింగ్ సందర్భాలలో నేను పట్టుదలగా ఉన్నాను. నా సూచనను మిగతా సభ్యులలో చాలా హెచ్చమంది బలపరిచారు. ఈ సందర్భాలలో పట్టాభిగారు ఎట్టి వ్యతిరేక అభిప్రాయం వెల్లడించకపోయినా, నాపైన కొంత అసంతృప్తి ఏర్పరచుకున్నారేమోనని ఆ తర్వాత పరిణామాల వల్ల తెలుసుకోగలిగాను. నెల్లూరి అధ్యక్షుని ఎన్నిక పట్టాభిగారికి చాలా అసంతృప్తి కలగజేసినది. నెల్లూరు కార్యసంఘ సమావేశం అయిన తర్వాత ఆయన వార్ధా వెళ్లారు. వార్ధా నుంచి ఆయన తిరిగి వచ్చిన తర్వాత బందరులో నేను వారి ఇంట్లో కలుసుకున్నప్పుడు ‘‘బ్రహ్మయ్య గారూ! నేను రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను. నా కార్యదర్శులే నా మాటకు విలువ ఇవ్వడం లేదు. ఇక నేను దేనికి?’’ అని బాధగా మాట్లాడారు. నేను ఏదో విధంగా సంభాషణ ముగించుకుని, ఊళ్లోనే ఉండి మూడు రోజుల వరకు వారికి కనబడలేదు.
తరువాత నాలుగవ రోజున వారిని ఆఫీసులో కలుసుకున్నప్పుడు ‘‘ఈ మూడు రోజులు ఊరికి వెళ్లారా? ఏమిటి? అన్నారు. ‘‘ఊళ్లోనే ఉన్నాను. ఆఫీసు కాగితాలు నేను తెప్పించుకు చూస్తున్నాను. మొన్నటి మీ సంభాషణ వల్ల మీకు కష్టం కలిగించినట్టు తెలుసుకుని చాలా విచారించానని’’ చెప్పాను. మేము ఆ విధంగా వ్యవహరించుటకు కారణాలన్నీ సవివరంగా చెప్పాను. ‘‘సరే ఇందులో మీ స్వార్థమేముంది! దీనిలో మీ తప్పేమీ లేదులే’’ అని సామరస్యంగా మాట్లాడి, అంతటితో ఆ విషయం ముగించేశారు. మొదటి నుంచి స్వతంత్రంగా ఆలోచించుటకు, ఆ విధంగా వ్యవహరించుటకు మమ్ము ప్రోత్సహించినది పట్టాభిగారే. అందుకు పట్టాభిగారికి మేము సర్వదా కృతజ్ఞులము.
ఆంధ్రరాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఆదర్శప్రాయంగా ఉండుటకు జిల్లా బోర్డులో ఒక మహిళా మణిని, ఒక షెడ్యూలు కులమునకు చెందిన వ్యక్తిని, ఒక మహమ్మదీయుడిని అధ్యక్షులుగా నియమించుట ఉచితమని శ్రీ పట్టాభిగారు, నేను అనుకున్నాం. అనంతపురిలో రాయప్పగారిని షెడ్యూల్డు కాస్టు (ముచ్చి) జిల్లా బోర్డు అధ్యక్షునిగా నియమించాం. ఆ కార్యవర్గ సమావేశమునకు పట్టాభిగారు హాజరు కాలేదు. ఉపాధ్యక్షులైన కోటిరెడ్డిగారు అధ్యక్షత వహించారు. పలుకుబడి గల కమ్మ, రెడ్డి అభ్యర్థులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం చేశాం. ఇందులకు కల్లూరు సుబ్బారావుగారు మా కార్యదర్శులలో ఒకరైన సంజీవరెడ్డిగారు హెచ్చుగా శ్రమచేసి సహకరించారు. కడప జిల్లా బోర్డు అధ్యక్షతకు (1) బాలనారాయణరెడ్డి B.A, (3) పట్టాభిరెడ్డి, (4) రామసుబ్బమ్మ గార్లు అభ్యర్థులు. అధ్యక్షులు పట్టాభిగారు హాజరు కానుందున ఉపాధ్యక్షులైన కోటిరెడ్డిగారు అధ్యక్షత వహించవలసి వచ్చినప్పటికీ ఆయన భార్య రామసుబ్బమ్మగారు అభ్యర్థి అగుట చేత ఆ సమావేశానికి ఆయన అధ్యక్షత వహిచలేదు. ఆర్బీ రామకృష్ణ రాజు గారు అధ్యక్షత వహించారు. అభ్యర్థులందరిలోకి హెచ్చు ఓట్లు రామసుబ్బమ్మ గారికే వచ్చినవి. ఆవిడను అధ్యక్షురాలిగా వుంచడానికి కార్యసంఘం వారు నిశ్చయించుకున్నారు.
ఆవిడగాక పై ముగ్గురు అభ్యర్థులలో ఎవరైనా ఒకరు ఉపాధ్యక్షులుగా ఉంటే బాగుంటుందని మేము అనుకున్నాం. వారెవరూ అంగీకరించలేదు. అందుకై నేను రామసుబ్బమ్మ గారితో మీరు అధ్యక్షులైతే పురుషులు ఉపాధ్యక్షులుగా ఉండుటకు అంగీకరించుట లేదు. కోటిరెడ్డిగారు జిల్లా బోర్డు సభ్యునిగా ఉంటే ఆయననైనా ఉపాధ్యక్షునిగా ఉండేవారము. ఇక ఇప్పటి కర్తవ్యము మీరు ఉపాధ్యక్ష పదవికి అంగీకరించుటగా కనబడుచున్నది. మీ అభిప్రాయమేమిటని అడిగాను. ‘‘స్త్రీలు అధ్యక్షులైతే పురుషులు ఉపాధ్యక్షులుగా ఉండేందుకు అంగీకరించనపుడు, ఒక పురుషులు అధ్యక్షుడైతే నేనెందుకు ఉపాధ్యక్షురాలిగా ఉంటాను. కోటిరెడ్డిగారు అధ్యక్షుడైనా నేను ఉపాధ్యక్షురాలిగా ఉండను’’ అని ఆవిడగారు అన్నారు. అయితే, నేను నవ్వుతూ ‘‘మీరు అధ్యక్షులైతే కోటిరెడ్డిగారు ఉపాధ్యక్షునిగా ఉంటారా?’’ అని అన్నాను. సంతోషంగా అంగీకరిస్తానని ఆమె సమాధానం చెప్పింది.
తర్వాత కోటిరెడ్డిగారిని సమావేశమునకు పిలిచి జరిగిన విషయమంతా చెప్పి, రామసుబ్బమ్మగారి సమాధానములను యథాతథంగా వారికి వివరించాము. ఆయన నవ్వుకుంటూ ‘‘రామసుబ్బమ్మ చెప్పినది సత్యమే. నేను అధ్యక్షుడైతే, ఆమె ఉపాధ్యక్షురాలిగా అంగీకరించే ఘటము కాదు. ఆవిడ అధ్యక్షురాలైతే నేను ఉపాధ్యక్షుడిగా ఉండేందుకు ఏమీ అభ్యంతరం లేదబ్బా’’ అని అన్నారు. వారి ఒండొరులలో ఐక్యతకు, సదభిప్రాయానికి, ఔదార్యానికి అనేక నిదర్శనలలో ఇది ఒకటి. రామసుబ్బమ్మ గారిని అధ్యక్షులుగా ప్రకటించాము. తర్వాత గుంటూరు సమావేశంలో పట్టాభిరెడ్డి గారిని ఉపాధ్యక్షుడిగా వారి ఆమోదము పొంది ప్రకటించాం. ఎన్నికలు ఏకగ్రీవంగా, గౌరవప్రదంగా జరిగాయి.