మన హీరోలు ఏం చేస్తున్నారు?

am

కరోనా కల్లోలంతో సినిమా రంగం సైతం అతలా కుతలమై పోయింది. ప్రపంచవ్యాప్తంగా చిత్రసీమ కోలుకోవడానికి ఓ రెండేళ్ళు పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కరోనాకు వ్యాక్సిన్ వచ్చే దాకా షూటింగ్స్ వద్దని నందమూరి బాలకృష్ణ, ఘట్టమనేని మహేశ్ బాబు వంటి టాప్ స్టార్స్ నిర్ణయించుకున్నారు. కరోనా అన్ లాక్ మొదలైనా, థియేటర్లకు ఎవరూ పచ్చజెండా ఊపలేదు. దాంతో సినిమా షూటింగ్స్ మొదలయినా, థియేటర్లకు సరైన ఫీడ్ రాదు. ఒకవేళ సినిమా థియేటర్లు తెరచుకున్నా, చప్పున దొరికే టాప్ స్టార్స్ మూవీస్ ఏవీ లేవు. దాంతో మోడరేట్ హీరోల చిత్రాలతోనే కాలం గడపాల్సి ఉంటుంది. అందుకూ సిద్ధమే అన్నా, ఏ థియేటర్ లోనైనా కరోనా పొడసూపిందనుకోండి. ఆ సినిమా హాలు పరిస్థితి అంతే సంగతులు కొన్ని రోజుల పాటు మూసేస్తారు. ఇలాంటి భయాందోళనలో సినిమా థియేటర్లు తెరిచి ఏం సాధిస్తామంటూ ఎగ్జిబిటర్స్ నిర్లిప్తంగా ఉన్నారు. మొదట్లో కొందరు సింగిల్ థియేటర్ల వారు ప్రభుత్వం అనుమతి ఇస్తే, సినిమా థియేటర్లు తెరవడానికి తాము సిద్ధమే అంటూ ఢంబాలు పలికారు. ఇప్పుడు మాత్రం కిక్కురుమనకుండా ఉన్నారు. మరి ఈ లాక్ డౌన్ సమయంలో మన హీరోలు ఏం చేస్తున్నట్టు? కొందరు పాకశాస్త్ర ప్రావీణ్యం ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్ట్ చేసి అభిమానులకు ఆనందం పంచుతున్నారు. మరికొందరు గ్రీన్ ఛాలెంజ్ లు విసురుకుంటూ సాగుతున్నారు.

అక్కడా… మహేశ్ దే హంగామా!?

మహేశ్ బాబు సోషల్ మీడియాలో చేసినంత హంగామా మరెవరూ చేయలేదనే చెప్పాలి. అతను ఏదో ఒక విధంగా తన ఫ్యామిలీ పిక్స్ ను సామాజిక మాధ్యమంలో చొప్పించేవాడు. దాంతో అతనికి అక్కడా ఇక్కడా అన్న తేడాలేకుండా అంతటా ఓ స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అసలే మహేశ్ ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిడర్. అందువల్ల కొందరు తమ ప్రాడక్ట్స్ కు సంబంధించిన ప్రచారాన్ని కూడా ఈ సోషల్ మీడియా వేదికగా చేయమని మహేశ్ ను కోరారు. దాంతో కొన్ని ప్రాడక్ట్స్ కు మహేశ్ సామాజిక మాధ్యమంలోనే ప్రచారం సాగించాడు. అంటే షూటింగ్స్ లేక ఖాళీగా ఉన్నా, మహేశ్ వద్దకే యాడ్స్ నడచి వస్తున్నాయన్న మాట! యంగ్ సూపర్ స్టార్ క్రేజ్ ఎలాంటిదో అర్థమైపోతోంది కదా! ఇక మహేశ్ నిర్మాతగా అడివి శేష్ తో ‘మేజర్’ అనే చిత్రం నిర్మిస్తున్నాడు. షూటింగ్స్ చేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించగానే ‘మేజర్’ షూటింగ్ షురూ చేశారు. అయితే ఈ షూటింగ్ స్పాట్ లో ఓ వ్యక్తికి కరోనా సోకింది. దాంతో షూటింగ్ ను ఆపేశారు. తక్కువ మందితో షూటింగ్ చేస్తే ఏమీ కాదనే నమ్మకంతో దర్శకుడు శశికిరణ్ తిక్క ‘మేజర్’ చిత్రీకరణ మొదలెట్టాడు. కానీ, కరోనా ఓ వ్యక్తికి సోకింది. దీంతో మహేశ్ ఆ షూటింగ్ ను రద్దు చేయడమే కాదు, వ్యాక్సిన్ వచ్చే వరకు తన సినిమాలే కాదు, తాను నిర్మించే చిత్రాలు కూడా మొదలు పెట్టరాదని నిశ్చయించుకున్నాడు.

am

మాటంటే మాటే!

యంగ టైగర్ యన్టీఆర్ మాత్రం ఎప్పుడెప్పుడు ఈ కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వస్తుందా, తాను నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్.’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నాడు. టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉన్న యన్టీఆర్ కాల్ షీట్స్ కోసం అప్పుడే కొందరు నిర్మాతలు కర్చీఫ్ వేయడానికి సిద్ధమయ్యారు. ఓ సినిమా తీసేందుకు ఓ నిర్మాత జూనియర్ యన్టీఆర్ కు భారీ మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇచ్చాడట. అయితే ఇప్పటికీ ఈ కరోనా కల్లోలం తగ్గు ముఖం పట్టకపోవడంతో అంత మొత్తం కారణంగా సదరు నిర్మాతకు వడ్డీ నష్టం వాటిల్లుతుందని భావించాడట యంగ్ టైగర్. ఇలా ఆలోచించిన యన్టీఆర్, సదరు నిర్మాతకు తాను తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి తిరిగి ఇచ్చాడట. అంతేకాదు, షూటింగ్స్ మొదలయ్యాకే అడ్వాన్స్ తీసుకుంటానని, తప్పకుండా అతనికి సినిమా చేస్తాననీ మాటిచ్చాడట యంగ్ టైగర్.

an

బుల్లెబ్బాయ్ అదో తీరు…

అక్కినేనివారి బుల్లెబ్బాయ్ అఖిల్ కు ఇప్పటి దాకా సరైన సక్సెస్ దరి చేరలేదు. అయినా పట్టువదలని విక్రమార్కునిలా అఖిల్ సాగుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకు అఖిల్ మూడు చిత్రాల్లో నటించగా, ఒక్కటంటే ఒక్కటి విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం అఖిల్ తాను నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్’పైనే బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా రాబోయే సంక్రాంతికి జనం ముందు నిలవనుంది. మరి ఇంత గ్యాప్ లో ఏం చేయాలి అనుకున్న అఖిల్ ‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంతకు ముందు ‘కిక్, అశోక్, రేసుగుర్రం’ వంటి మాస్ మసాలా చిత్రాలు తెరకెక్కించిన సురేందర్, ఆ స్థాయిలోనే అఖిల్ తో ఓ సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించనున్నారట. అక్కినేని వారి బుల్లెబ్బాయ్ మరి ఈ చిత్రాలతోనైనా సక్సెస్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలని ఆ కుటుంబ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

aa

అన్నది మరో తీరు…

తమ్ముడు అఖిల్ ఇలా సాగుతుంటే, అన్నయ్య నాగచైతన్య ప్లాన్స్ మరోలా ఉన్నాయట. ఇప్పటికే నాగచైతన్య లవర్ బోయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. గత సంవత్సరం ‘మజిలీ’, ‘వెంకీ మామ’ చిత్రాలతో భలేగా సందడి చేశాడు నాగచైతన్య. ముఖ్యంగా తన భార్య సమంతతో కలసి చైతూ నటించిన ‘మజిలీ’ అతని కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలచింది. నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీపై అభిమానుల్లో భలే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల డైరెక్టర్. అందునా సాయిపల్లవి నాయికగా నటించింది. ఈ కారణాల వల్ల ఈ ప్రేమకథను ఎప్పుడు చూద్దామా అని అక్కినేని ఫ్యాన్స్ ఆత్రుతతో ఉన్నారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల కూడా ఆగింది. అక్కినేని ఫ్యామిలీకి ప్రేమకథలకు ఏ నాటి నుండో లింకు ఉంది. అందువల్ల నాగచైతన్య దరికి అన్నీ ప్రేమకథలే వస్తున్నాయట. అయితే తనపై పడ్డ లవర్ బోయ్ ఇమేజ్ ను చెరిపేసుకోవడానికి నాగచైతన్య తంటాలు పడుతున్నాడట. అందులో భాగంగానే తమ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలసి ‘మనం’ తీసి విజయం సాధించిన విక్రమ్ కుమార్ తో పనిచేయడానికి సిద్ధమయ్యాడట. అయితే విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో చైతూ నటించబోయే చిత్రం ప్రేమకథ కాదు. హారర్ మూవీ అట! గతంలో విక్రమ్ కుమార్ ‘పదమూడు’ అనే హారర్ సినిమా తీసి అలరించాడు. అందువల్ల ఈ సారి తనకు ఆ తరహా హారర్ కావాలని అదేపనిగా నాగచైతన్యనే కోరినట్టు సమాచారం.

ann

వెబ్ దునియాలో నాని

కరోనా కల్లోలంలో థియేటర్లు ఇంకా తెరచుకోలేదు. దాంతో మన నిర్మాతల దృష్టి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై పడింది. హీరో కమ్ ప్రొడ్యూసర్ అయిన నాని కూడా ఈ సారి ఓటీటీ కోసం ఓ వెబ్ సీరీస్ నిర్మించేందుకు సిద్ధమయ్యాడట. ఇంతకు ముందు ‘అ!’, ‘హిట్’ అనే రెండు చిత్రాలను నిర్మించాడు నాని. వాటిలో ఆయన నటించలేదు. ప్రస్తుతం నాని నటించిన ‘వి’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమా పూర్తయ్యాక కూడా ఇంకా వేచిచూస్తే, నిర్మాతకు తడిసిమోపెడవుతుంది. అందువల్ల ‘వి’ చిత్ర నిర్మాత దిల్ రాజు, ఆ చిత్రాన్ని కొంత నష్టానికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘అమేజాన్ ప్రైమ్’ కు విక్రయించాడట. డిజిటల్ ఫార్మాట్ లో విడుదలవుతున్న తొలి క్రేజీ చిత్రం ‘వి’ అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి దాకా ఓటీటీల్లో నేరుగా విడుదలైన చిత్రాలన్నీ చిన్న చిత్రాలే. కాస్త పేరున్న స్టార్ నాని నటించడం వల్ల ‘వి’ చిత్రానికి భలే క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో నటశేఖర కృష్ణ అల్లుడు, మహేశ్ బాబు చెల్లెలి భర్త అయిన సుధీర్ బాబు మరో కీలక పాత్ర పోషించాడు. దాంతో ‘వి’ సినిమాను చూడాలని సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఇదిలా ఉంటే నాని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కోసం నిర్మించనున్న వెబ్ సీరీస్ కు సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ సాగుతోంది. సినిమా నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్న నాని, ఈ వెబ్ సీరీస్ తో ఓటీటీల్లో ఎలాంటి పేరు సంపాదిస్తాడో చూడాలి.

annn

టాప్ స్టార్స్ కథేంటి?

సినిమా షూటింగ్స్ కు పర్మిషన్ ఇస్తే వెంటనే చేస్తామని ఓ గ్రూప్ తయారై అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఓకే అన్నా కూడా షూటింగ్స్ మొదలు పెట్టలేని పరిస్థితే! ఆ గ్రూపులో ముఖ్య పాత్రధారి అయిన నాగార్జున ‘వైల్డ్ డాగ్’ అనే మూవీలో పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఆ చిత్రం షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇక మరో టాప్ స్టార్ వెంకటేశ్ తమిళంలో విజయం సాధించిన ‘అసురన్’ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘నారప్ప’లో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం కూడా తుది మెరుగులు దిద్దుకుని విడుదల కావలసి ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదలలో కూడా జాప్యం తప్పదు. మళయాళంలో విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం రీమేక్ రైట్స్ ను యువనిర్మాత సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నాడు. ఈ రీమేక్ లో వెంకటేశ్ నటిస్తాడని తెలుస్తోంది.

av

మాట తప్పలేదు… మడమ తిప్పలేదు…

ఇక టాప్ హీరో అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచిన నందమూరి బాలకృష్ణ మొదటి నుంచీ ఒకే మాట మీద ఉన్నారు. కరోనా వైరస్ సమసిపోయాకే షూటింగ్స్ గురించి, థియేటర్ల ఓపెనింగ్ గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు. అందుకు కట్టుబడి ఉన్నారు. ఈ గ్యాప్ లో ‘బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్’ ఛైర్మన్ గా అందరిలోనూ కరోనా కట్టడిపై అవగాహన కలిగేలా చేస్తున్నారు. అంతేకాదు, కరోనాను నియంత్రించడంలో బాగా పనిచేస్తున్న హోమియో మెడిసిన్స్ ను కూడా ఆయన సినిమా రంగంలోనూ, తన ఆసుపత్రిలోనూ పంపిణీ చేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం నియోజకవర్గంలోనూ రూ.55 లక్షలు ఖర్చు పెట్టి కరోనా నియంత్రణ కోసం వసతులు ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు రోజుకో టైటిల్ వినిపిస్తోంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ టీజర్ విడుదలై ఇప్పటికే అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అందువల్ల ఈ చిత్రంపై బాలకృష్ణ అభిమానుల్లోనే కాదు, యావత్ సినిమా అభిమానుల్లో ఓ స్పెషల్ క్రేజ్ నెలకొందని చెప్పవచ్చు.

ab

Share: