కరోనా కల్లోలంతో తెలుగు సినిమా ఛిద్రమైపోయింది. సినిమా షూటింగ్స్ మొదలు పెట్టాలంటేనే సినీజనం భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు తాము షూటింగ్స్ బంద్ చేసుకున్న తెలుగు సినిమా జనం ఆ మధ్య ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులను కలసి మళ్ళీ షూటింగ్స్ కు అనుమతి ఇవ్వమని కోరారు. కరోనా కట్టడి కాకుండా షూటింగ్స్ ఏంటని కొందరు చీదరించుకున్నారు. అయినా కరోనా కట్టడికి తగ్గ నియమనిబంధనలు అనుసరించి, షూటింగ్ జరపాలని భావించారు. ముందుగా టీవీ సీరియల్స్ షూటింగ్ మొదలయింది. అక్కడ శివపార్వతి వంటి సీనియర్ నటి కరోనా పాలు కావడంతో మళ్ళీ వెనక్కి తగ్గారు. కొందరు తమ సినిమాల ప్రారంభోత్సవం జరుపుకున్నారే కానీ, ముందుకు అడుగువేయలేకపోయారు. ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ హీరోస్ తమ చిత్రాల షూటింగ్స్ పాల్గొనడం విశేషంగా మారింది.
వాళ్ళే మొనగాళ్ళా!?
అక్కినేని నాగార్జున తన రాబోయే చిత్రం ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా ప్యాచ్ వర్క్ లో నాగ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుపుకున్నారు. తండ్రిని చూసి తనయులు నాగచైతన్య, అఖిల్ కూడా తమ చిత్రాల షూటింగ్స్ ను అతి త్వరగా పూర్తిచేసి తదుపరి చిత్రాలను కూడా మొదలు పెట్టే యోచనలో ఉన్నారు. దాంతో నాగచైతన్య తాను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక అఖిల్ తన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ షూటింగ్ లోకి అడుగు పెట్టాడు. అక్కినేని కథానాయకులు మాత్రమే ధైర్యం చేసి షూటింగ్స్ లో పాల్గొన్నారని వారి అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే నాగార్జున, ఆయన తనయుల చిత్రాలు ముగింపు దశలో ఉన్న సమయంలో కరోనా కల్లోలం ఆరంభమయింది. ఇక బాలకృష్ణ, చిరంజీవి వంటి అగ్రశ్రేణి హీరోల చిత్రాలు ఆరంభదశలోనే ఉన్నాయి. కావున వారి షూటింగ్స్ మొదలు కావాలంటే ఎక్కువమంది చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంటుంది. ఎక్కువమంది ఉండడం వల్ల ఎవరికి ఏమి ఉందో తెలియని పరిస్థితి. ఒకవేళ తెగించి షూటింగ్ మొదలు పెడితే ఎవరి వల్లనైనా ఎవరికైనా కరోనా సోకితే, మొత్తానికే మోసం వస్తుందని, తద్వారా ఎంతోమంది నటీనటుల డేట్స్ మిస్ అవుతాయని భయపడుతున్నారు దర్శకులు, నిర్మాతలు. ఇదిలా ఉంటే నాగ్, ఆయన తనయులు మాత్రం తమ చిత్రాల షూటింగ్స్ పూర్తిచేసి సాధ్యమైనంత త్వరగా వాటిని విడుదల చేయాలనీ ఆశిస్తున్నారు. పైగా పేరున్న హీరోల సినిమాల కోసమే మూతపడ్డ సినిమా థియేటర్లు ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ స్టార్ హీరో సినిమాతో ముందుగా థియేటర్లు తెరచుకుంటాయో చూడాలనీ జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎప్పుడో ఆ పరిస్థితి!?
కరోనా మహమ్మారి వీరవిహారం చేయకమునుపే చాలా కేంద్రాలలో స్టార్ హీరోస్ సినిమాలు విడుదలయితేనే థియేటర్లను తెరవడం, కలెక్షన్లు తగ్గగానే కొద్ది రోజులు మూసేయడం చేస్తూ ఉండేవారు. మళ్ళీ టాప్ హీరోల చిత్రాలు రాగానే మెయిన్ థియేటర్లతో పాటు సైడ్ హాల్స్ కూడా తెరచుకొనేవి. వసూళ్ళు తగ్గుముఖం పట్టేవరకు అన్ని థియేటర్లలో టాప్ హీరోల సినిమాలు సందడి చేసేవి. తరువాత చల్లగా మూసుకొనేవి. సాధారణ పరిస్థితిలోనే సినిమా థియేటర్ల తీరు ఇలా ఉంటే, ఇక కరోనా భయం నెలకొన్న ఈ పరిస్థితుల్లో థియేటర్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, తెరచుకొనే థియేటర్లు ఎన్ని, వాటికి తగ్గ సినిమాలు దొరికేది ఎన్నడు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటికి కాలమే సమాధానం చెప్పాలని సినీజనం అంటున్నారు.