మహానాయకులను మననం చేసుకోవడం, వారి గొప్పదనాన్ని స్మరించుకోవడం రాజకీయాల్లో పరిపాటి. వారు ఏ పార్టీలకు చెందినవారయినా, గతించిన తరువాత వారిని గౌరవంగా చూడటమూ సత్ సంప్రదాయమే. ఇక కొందరు రాజకీయనాయకులు నేరచరితులైనప్పుడు వారు గతించిన తరువాత కూడా వారి తప్పిదాలను ఎత్తి చూపించడమూ మామూలే. కానీ, మనం పుట్టిపెరిగిన నేలకు గౌరవప్రతిష్ఠలు తీసుకు వచ్చిన మహానాయకులను, వారి జ్ఞాపకాలను తూలనాడడం ఏ పార్టీవారికీ శ్రేయస్కరం కాదు. కేవల రాజకీయ లబ్ధికోసం మహానాయకులను, వారి జ్ఞాపకాలను తూలనాడితే అలాంటి వారు చరిత్రలో హీనులుగానే మిగిలిపోతారు. ఈ సత్యాన్ని రాజకీయాల్లో ఉన్నవారు, అందులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశించేవారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 2020లో జరుగుతోన్న గ్రేటర్ హైదరాబాద్ మహానగర సంస్థ ఎన్నికల్లో కొందరు కుచ్ఛితపు మనస్కులు తెలుగునేలకు కీర్తిప్రతిష్ఠలు సంపాదించి పెట్టినవారిని కించపరిచేలా వ్యాఖ్యానించడం గర్హనీయం. మొట్టమొదటి దక్షిణాది ప్రధానిగా నిలచిన పి.వి.నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ లో ప్రప్రథమ కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా కీర్తినొందిన యన్.టి.రామారావు – వారి జ్ఞాపకార్థం వెలిసిన నందనవనాలను కూల్చివేస్తామని ఎమ్.ఐ.ఎమ్ పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను సర్వత్రా ఖండిస్తున్నారు.
రాజకీయ లబ్ధికోసమే…
గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో తమ స్థానాలను పదిలం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ శాయశక్తులా ప్రయత్నిస్తే, ఎప్పుడూ తమ పట్టున్న స్థానాల్లో విజయం సాధిస్తూ వస్తో్న్న ఎమ్.ఐ. ఎమ్. కూడా అదే తీరున సాగింది. దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్య విజయం సాధించిన బీజేపీ మునుపెన్నడూ లేని ఉత్సాహంతో నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమ సత్తా చాటే ప్రయత్నం చేసింది. ఇక ఒకప్పుడు గ్రేటర్ లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్, టీడీపీలు రెండూ తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఊపును చూసిన వాళ్ళు ముఖ్యంగా ఎమ్.ఐ.ఎమ్. తమ బలాన్ని ఏ మాత్రం కోల్పోరాదనే కృతనిశ్చయంతో కుహనా రాజకీయాలకు తెరతీసింది. అందులో భాగంగానే అక్బరుద్దీన్ ఒవైసీ మహానాయకులు యన్టీఆర్, పీవీని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. అందుకు బీజేపీ నాయకుడు బండి సంజయ్ వెంటనే స్పందించారు. మహానాయకుల జ్ఞాపకార్థం వెలసిన నందనవనాలను తొలగించి చూడమని, అదే జరిగితే రెండు గంటల్లోనే దారుసలామ్ ను కూల్చివేస్తామని ప్రతి సవాల్ విసిరారు. దాంతో హైదరాబాద్ మహానగరంలోని ఎందరో యన్టీఆర్, పీవీ అభిమానులకు బీజేపీపై సానుభూతి కలిగింది. అదీగాక యన్టీఆర్ కు ‘భారతరత్న’ ఇవ్వాలని అందుకు బీజేపీ తరపున తాము కృషి చేస్తామనీ బండి సంజయ్ ప్రకటించడం తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది.
ఇక అక్బరుద్దీన్ లొల్లి ఏంటంటే, ఒకప్పుడు హుసేన్ సాగర్ 4700 ఎకరాలు ఉండేదని, అది ప్రస్తుతం 700 ఎకరాలకే పరిమితయిందని, అందుకు సాగర్ కు చెరోవైపు వెలసిన యన్టీఆర్, పీవీ ఘాట్లు కారణమని అతని అభిప్రాయం. నిజానికి, అతను చెబుతున్నట్టుగా సాగర్ ను ఈ రెండు ఘాట్లు ఏమీ ఆక్రమించలేదు. అంతకు ముందే ఆక్రమితమై, భూభాగంగా ఏర్పడిన ప్రాంతాల్లోనే యన్టీఆర్, పీవీ ఘాట్లు వెలిశాయి. అదీగాక, వారి ఘాట్ల నిర్మాణం దిశగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సమయంలో అక్బర్ పార్టీకి చెందిన వారు అసెంబ్లీలో సభ్యులుగానూ ఉన్నారు. అంతెందుకు స్వయానా అతని అన్న అహ్మదుద్దీన్ ఒవైసీ కూడా అప్పట్లో శాసనసభ్యునిగా ఉన్నారు. అప్పుడు ప్రభుత్వం ఘాట్ల నిర్మాణం కోసం చర్యలు తీసుకున్న సమయంలోనూ ఎమ్.ఐ.ఎమ్. పార్టీ నాయకులెవరూ అభ్యంతరం చెప్పలేదు. మరి అక్బర్ ఎన్నికల సమయంలో అదే పనిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని అన్ని పార్టీల వారూ ఖండించారు. అయితే మహానాయకులు పీవీ, యన్టీఆర్ కు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నిదానంగా స్పందించడం ఎంతోమందిని ఆశ్చర్య పరచింది. ఇక పీవీ వారసులు కానీ, యన్టీఆర్ వారసులు కానీ, ఈ విషయంలో ఏ మాత్రం స్పందించకపోవడమూ చర్చనీయాంశమే అయింది. అక్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తక్షణమే బండి సంజయ్ స్పందించడాన్ని అందరూ అభినందించారు.
కొన్ని అనుమానాలు …
మహానగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్, ఐమ్ఐఎమ్ పార్టీలు దోస్తానా చేసినట్టే చేసి, ఎవరికి వారు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. అదంతా రాజకీయ నాటకం అన్నారు చాలామంది. ఇక అక్బర్ వ్యాఖ్యల వెనుక ప్రోత్సాహం ఇచ్చింది బీజేపీనేననీ కొందరి అనుమానం. ఎందుకంటే మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో హైదరాబాద్ లో వెలసిన ఎమ్ఐఎమ్ పార్టీ ఏకంగా ఐదు స్థానాలు సంపాదించింది. ఈ ఉత్సాహంలోనే అక్బర్ కన్నూమిన్నూ కానక పిచ్చికూతలు కూశాడనీ కొందరు అంటున్నారు. అయితే బీహార్ ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ విజయం వెనుక బీజేపీ వ్యూహం ఉందని, అక్కడి ముస్లిమ్ ఓటర్లను ఆకర్షించేందుకు తద్వారా కాంగ్రెస్ కూటమికి పెద్ద దెబ్బ కొట్టేందుకు ఎత్తుగడ వేసి విజయం సాధించిందని కొందరు అంటున్నారు. అదే విధంగా హైదరాబాద్ లోనూ తెలుగువారిని, విశేషంగా ఆంధ్ర ప్రాంతపు వాసులను ఆకర్షించడానికి బీజేపీ వేసిన ఎత్తుగడలో భాగంగానే అక్బర్ నోట పనికిమాలిన మాటలు వెలువడ్డాయనీ అభిప్రాయపడుతున్నారు. నిజానికి బీజేపీకి హిందూమత పార్టీగా ముద్ర ఉండగా, ఎమ్ఐఎమ్ ముస్లిములు పార్టీ అని పేరులోనే ఉంది. ఈ రెండు పార్టీలకు భాగ్యనగరంలో దశాబ్దాలుగా వైరం ఉంది. అందువల్లే అక్బర్ వ్యాఖ్యానించగానే, బండి సంజయ్ స్పందించాడనీ కొందరు చెబుతున్నారు.
ఎన్నెన్నో ప్రశ్నలు…
అక్బర్ ఏ కారణంగా పీవీ, యన్టీఆర్ ఘాట్లను కూల్చివేస్తామని అన్నాడో కానీ, అతనికి అసలు ఆ మహానాయకుల గురించి ఏమైనా తెలుసా? అనే అనుమానమూ కలుగుతోంది. పీవీ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయానికి అక్బర్ కన్ను తెరిచాడో లేదో? ఇక యన్టీఆర్ అఖండ విజయం సాధించి, తెలుగునేలపై నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకుడు అన్న విషయం కూడా అతనికి తెలుసో లేదో? భారత ప్రధానిగా మన తెలుగు బిడ్డ పీవీ చేపట్టిన అనేక ఆర్థిక సంస్కరణల కారణంగానే ఈ నాడు ఎంతోమంది జనం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగుతున్నారన్న సత్యమైనా అతనికి తెలియదేమో? బడుగు వర్గాలకు బాసటగా నిలచి, ఈ రోజున ఎందరో బీసీ నాయకులు రాష్ట్ర కేంద్ర స్థాయిల్లో వెలుగు చూడటానికి కారకులు యన్టీఆర్ అన్న అంశమైనా అతనికి తెలుసా? ఇలా ఈ మహానాయకుల నందనవనాలను కూల్చివేస్తామన్న అక్బర్ అజ్ఞానాన్ని గురించి తలచుకున్న వారిలో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇలాంటి రాజకీయ అజ్ఞాని ఇంకా గెలుపు సాధిస్తూ పోతే, అతణ్ణి నమ్ముకున్న జనానికి కూడా ఏదో ఒకరోజున నష్టం వాటిల్లక మానదనీ హైదరాబాద్ నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఏం చేయాలి?
చర్చోపచర్చలు ఎలా సాగినా, మరణించిన మహానాయకులను గౌరవించడం, వారి పేరున వెలసిన జ్ఞాపకాలకు అప్రతిష్ఠ కలుగకుండా చూసుకోవడం రాజకీయనాయకుల విధి. అంతేకానీ, తమ గెలుపు కోసం వారి పేర్లను చర్చల్లోకి తీసుకురావడం గర్హనీయమే అవుతుంది కానీ, అది ఎవరికీ గర్వకారణం కాదు. ఈ వ్యాసం రాసే సమయానికి ఇంకా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలు పూర్తి కాలేదు. విజయం ఎవరిని వరిస్తుందో తేలలేదు. కానీ, మన మహానాయకులను అగౌరవ పరచిన వారికి తగిన బుద్ధి జనం చెప్పివుంటే అది అభినందనీయమే! అలా కాకుండా ఈ వ్యాఖ్యలు చేసిన వారి పార్టీకీ జై కొట్టిన జనాన్ని ఏమీ అనలేం. మన వాళ్ళకు మన నాయకులను గౌరవించే సంప్రదాయం ఏమీ లేదని సరిపుచ్చుకోవడం తప్ప ఏమీ చేయలేం. అయితే తాత్కాలిక విజయాల కోసం ఇలాంటి పన్నాగాలు పన్నేవారికి ఏదో ఒకరోజున జనం బుద్ధి చెప్పకమానరు అనే సత్యాన్ని ఎవరూ మరచిపోరాదు.