అక్కడా, ఇక్కడా అదే మాట!

Editor

అక్కడా, ఇక్కడా అదే మాట!

దేశంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. రాజ్యాంగ పరంగా తమకు దక్కాల్సిన హక్కుల కోసం గొంతెత్తే వారిని ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిగానో, ఉగ్రవాదులుగానో, దోపిడీదారులు, దగాకోరులుగానో ప్రభుత్వాలు అభివర్ణిస్తున్న తీరు ఆవేదన కలిగిస్తోంది. ప్రభుత్వాలకు ఏకపక్షంగా మద్దతు లభిస్తే జరిగే, జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలు తమ పొట్ట కొడతాయని భయపడుతున్న పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళనకు దిగారు. దాదాపు రెండు నెలలుగా మైనస్ డిగ్రీల చలిలో అల్లాడిపోయారు. నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భూమిని నమ్ముకున్న రైతు కంటే తమకే ఎక్కువ తెలుసన్న ధోరణిలో ఉన్న ప్రభుత్వం తెచ్చిన చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పింది. ఒకవేళ వెనక్కి తీసుకుంటే తమ ప్రతిష్ఠ మసకబారుతుందన్న ఉద్దేశంతో మొండి పట్టుదలకు పోయింది.

అయినప్పటికీ వెనక్కి తగ్గని రైతుల ఉద్యమాన్ని నీరు కార్చాలని సర్కారు భావించింది. సాగు చట్టాల వల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటో రైతులకు వివరించి చెప్పాల్సింది పోయి రైతుల్లో లుకలుకలు తెచ్చేందుకు ప్రయత్నించింది. ‘విభజించు పాలించు’ ప్రణాళికను అమలు చేసింది. తమ ‘అనుకూల’ రైతులతో సాగు చట్టాలు మంచివేనని చెప్పింది. వాటితో రైతుల భవిష్యత్తు బంగారుమయం అయిపోతుందని నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం అటునుంచి నరుక్కొస్తున్న సమయంలోనే గణతంత్ర దినోత్సవం నాటి రైతుల ట్రాక్టర్ పరేడ్, ఎర్రకోట ముట్టడి ఘటనలు ప్రభుత్వానికి అనూహ్యంగా కలిసి వచ్చాయి.

ర్యాలీ కాస్తా హింసాత్మకంగా మారడంతో కేంద్రానికి ఆయుధం దొరికొంది. ఎర్రకోటపై రైతులు జెండా ఎగరవేయడం తిరుగులేని అస్త్రంగా మారింది. ఆందోళన చేస్తున్న వారందరూ ఉగ్రవాదులేనంటూ దేశద్రోహం కేసు నమోదు చేసింది. బీజేపీలోని కొందరు నేతలైతే ఆందోళన చేస్తున్న రైతులకు పాకిస్థాన్‌తో నేరుగా సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపించడాన్ని చూసి దేశ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రైతు నేతలపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. మరోవైపు, ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను ప్రభుత్వం అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేయిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇంచుమించు ఇలాంటి ప్రయత్నమే జరుగుతోంది. గత ప్రభుత్వంపై నమ్మకంతో వేలాది ఎకరాలను మరోమాటకు తావులేకుండా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్న అమరావతి రైతులు, ఇప్పుడు తమకు న్యాయం కావాలంటూ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అమరావతిని తరలించవద్దని, భూములిచ్చిన తమకు, నమ్మి ఓటేసిన ప్రజలకు అన్యాయం చేయొద్దని మొత్తుకుంటున్నారు. అయినా ప్రభుత్వం మొండి పట్టుదలకు పోతోంది. నిర్ణయం మార్చుకుంటే ప్రతిష్ఠకు భంగమని భావిస్తున్న ప్రభుత్వం రైతులను తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా చిత్రీకరిస్తోంది. పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణిస్తోంది. న్యాయం కావాలంటూ జరుగుతున్న ఉద్యమంలో అక్కడ ఢిల్లీలోను, ఇక్కడ అమరావతిలోనూ పదులు సంఖ్యలో రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు స్వప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాయి.

అన్నింటి కంటే బాధాకరమైన విషయం.. రైతుల ఉద్యమాలకు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడం. కర్షకుడు ఏ ప్రాంతానికి చెందినవాడు కాకపోయినా, దేశ క్షేమాన్ని కాంక్షించేవాడు అయినా ప్రాంతీయ మకిలి అంటిస్తూ, వారి సమస్యలను ఆ ప్రాంతానికి మాత్రమే చెందినవిగా ప్రజలు భావిస్తున్నంత కాలం రైతుల ఆవేదన అరణ్య రోదనగానే మిగులుతుంది. ప్రజలు కార్యకర్తలుగా విడిపోయి, రాజకీయ పార్టీలకు విధేయులుగా మారితే బలమైన ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఇంతకుమించి ఊహించడం అత్యాశే అవుతుంది.

స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైతులు కదం తొక్కారు. చంపారన్ ఉద్యమంతో తెల్లదొరల మెడలు వంచారు. చంపారన్ ఉద్యమ స్ఫూర్తితో ఆ తర్వాత మరెన్నో రైతు ఉద్యమాలు జరిగాయి. ఖేడ్ సత్యాగ్రహం, బార్డోలీ రైతుల ఉద్యమం వంటివి బ్రిటిష్ పాలకులను గడగడలాడించాయి. నాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన రైతులు నేడు సొంత ప్రభుత్వాలతో పోరాడాల్సిన దుస్థితి రావడం దురదృష్టకరం. రైతుల జీవితాలు బాగుపడాలంటే మరో ఎన్జీ రంగా ఈ గడ్డపై పుట్టాలేమో!

Share: