నవీన కాలమ్

Naveena m

పెళ్లి సంబంధాలు వెతుక్కోవడంలో ఇటీవల విపరీతమైన కంగారు పెరిగింది. ఇరువైపులా బాగానే ఉందనుకున్నాక హడావిడిగా, ఆర్భాటంగా తాంబూలాలు ఇచ్చిపుచ్చేసుకుని చివరికి హమ్మయ్య అనుకుంటున్నారు. ఇలా కంగారు కంగారుగా సంబంధాలు ఓకే చేసుకున్న వాటిలో ఆ తర్వాత చెడిపోతున్న సంబంధాలు చాలానే ఉన్నాయి. మీకు మీరుగా కుదుర్చుకున్న సంబంధాలను పక్కనపెడితే, మధ్యవర్తులు (బ్రోకర్లు) కుదిర్చే వాటిలో ఈ తొందర మరింత ఎక్కువగా ఉంటుంది. వారు తొందర పెడుతున్నారని వీరికి, వీరు తొందరపెడుతున్నారని వారికి చెప్పి మొత్తానికి సంబంధాలు కుదిర్చేసి వారికి అందాల్సిన తాంబూలాదులు అందుకుని, ఆపై మాకు సంబంధం లేదన్నట్టు జారుకుంటున్నారు.

అయితే, సంబంధాల విషయంలో ఒకసారి ముందుకెళ్లాలనుకుంటే, ఎంత చిన్న విషయమైనా ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. ఇకపై బంధువులు కావాల్సిన మీ మధ్య మధ్యవర్తితో పనేముంటుంది? అప్పటి వరకు ఆగిన వారు మరో రెండుమూడు రోజులో, లేకుంటే రెండుమూడు వారాలో ఆగినా పర్వాలేదు కదా. ఇరు కుటుంబాల పెద్దలు కలిసి ఎటువంటి రహస్యాలు లేకుండా మాట్లాడుకుని, పిల్లల సమ్మతంతో నూటికి నూటయాభై శాతం సరే అనుకున్నాకే సంబంధం కుదుర్చుకోండి. తొందరపడి తీసుకుని నిర్ణయించేది పెళ్లి అనిపించుకోదు. పదేపదే ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది.

ఒక్కోసారి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నాక కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సంబంధాన్ని వద్దనుకునే వారికి చిన్న మనవి. కారణాలు ఏవైనా ఇలా ఆగిపోయిన తర్వాత ఒకరిపై ఒకరు బురద జల్లుకోకండి. మీకు.. మీకు కుదరలేదు కాబట్టి వద్దనుకున్నారంతే. ఆ పిల్లలకు మళ్లీ తగిన సంబంధం కుదరాలి కాబట్టి అభాసుపాలు కాకూడదన్న సంస్కారం ప్రతి ఒక్కరిలో ఉండాలి. మనం ఒకటి అంటే మధ్యలో వాళ్లు మరోటి కల్పించి చెప్పడంతో అప్పటి వరకు లేని కొత్త కథ తెరపైకి వస్తుంది. అది విని అవతలివారు ఇంకో కథను సిద్ధం చేస్తారు. అప్పటికే ఉన్న బాధను ఇది రెట్టింపు చేస్తుంది. కాబట్టి మూవ్ అనుకుంటూ ముందుకెళ్లిపోవడమే ఉత్తమం. కాస్తంత సమయం తీసుకుని సరిపడే మరో సంబంధాన్ని వెతుక్కోవడమే. విడాకులు తీసుకున్న వారైనా అంతే.

గృహహింస, ఇంపొటెన్సీ వంటి కారణాలతో విడిపోయిన సందర్భాలలో మాత్రం ఇది వర్తించదు. ఈ రెండు విషయాల్లోనూ నిజాలు తప్పనిసరిగా బయటపెట్టాలి. లేకుంటే మళ్లీ అలాంటి సమస్యలే ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రెండో వివాహం కోసం ఎవరైనా మన దగ్గరికి విచారణ కోసం వచ్చినప్పుడు పై రెండు కారణాల్లో తప్పనిసరిగా ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఇక, మనస్పర్థలతో విడిపోయిన వారు తమ తప్పు లేదని నిరూపించుకునేందుకు అవతలి వారిపై బురద జల్లడం తగదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు. తప్పు ఎవరిదైనా కావొచ్చు. కానీ, సంస్కారం కోల్పోయేలా దుష్ప్రచారాలు చెయ్యొద్దు. మన జీవితం మారినా పడిన మచ్చ మాత్రం తరతరాలు అలాగే ఉండిపోతుంది. ఫలితంగా ఇబ్బందులకు గురవుతారు. అందుచేత పెళ్లి కుదుర్చుకోవడానికి తొందరపాటు తగదు. అలాగే, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు నిశ్శబ్దాన్ని మించిన విజ్ఞత మరోటి ఉండదు.

Share: