త్రిపురనేని జవాబులు కులనిర్మూలనమా? శాశ్వతీకరణమా?

tripuraneni-8-20

భారతదేశంలో కుల వ్యవస్థ కొన్ని శతాబ్దాల నుంచీ సమాజంలో పాతుకు పోయింది. వృత్తిని బట్టి కులాలు ఏర్పాడ్డాయి. కానీ, వృత్తులు మార్చుకోవడానికి అవకాశాలున్నాయి, స్వాతంత్య్రం ఉంది. అయినప్పటికీ వృత్తి మారినా, కులం మాత్రం మారడంలేదు. ఒక్క హిందువులోనే కాకుండా మతం మార్చుకున్నవారిలో కూడా, అంటే క్రైస్తవులలో, ముస్లింలలో కూడా కులాలున్నాయి? వాటి ప్రకారం హిందూ కులాలకు ఏఏ ప్రయోజనాలు చేకూరుతున్నాయో వాటిని ముస్లింలలోని కులాలకు, క్రైస్తవులలోని కులాలకు వర్తింప జేయాలని, ఆ మతాలలోని కుల సమూహాలు ఉద్యమించి కృతకృత్యువుతున్నారు. ఉదా॥ ముస్లింలలో దూదేకులవారు జంతువును కోసి మాంసం అమ్మేవారు, తమను బీసీలో చేర్చాలని కోరారు, కోరికను సాధించుకున్నారు. అలాగే మతం మార్చుకున్న మాల కులం వారు బీసీలో ఒక గ్రూపులో చేర్పించుకున్నారు. దళిత క్రైస్తవులనే మరో కులాన్ని సృష్టించుకున్నారు. కుల నిర్మూలనం కావాలని, కులాల వలన సమాజంలో అశాంతి ఉత్పన్నమవుతోందని, కులాలు సమసమాజ నిర్మాణానికి అడ్డుపడుతాయని డా॥ అంబేద్కర్‌, స్వామి దయానంద సరస్వతి, మహాత్మాగాంధీ మరెందరో సంఘ సంస్కర్తలు ఉద్యమాలు చేపట్టారు. మన రాజ్యాంగం ప్రకారం ప్రతిపౌరుడు తన ఇష్టం వచ్చిన వృత్తిని చేపట్టవచ్చు. అన్ని కులాలలోనూ విద్యావంతులైనవారు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, అకౌంటెంట్స్‌గా, న్యాయవాదులుగా, ఉపాధ్యాయులుగా మరెన్నో వృత్తులలో ప్రవేశించి రాణిస్తున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి ప్రభుత్వపు ఉద్యోగాలలో ప్రవేశిస్తున్నారు. బ్రాహ్మణులు చెప్పుల కొట్లు పెడుతున్నారు. కమ్మవారు వ్యాపారం చేస్తున్నారు. లాండ్రీ యంత్రాలను పెట్టి వస్త్రాలను శుభ్ర పరుస్తున్నారు, ఇస్త్రీ చేస్తున్నారు. రజకులు డ్రైవర్లుగా, న్యాయవాదులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా రాణిస్తున్నారు. క్షురకులు కూడా ఎన్నో ఇతర వృత్తులలో విద్యవలన ప్రవేశిస్తున్నారు. విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చి పారంపరిక వృత్తులలో నుంచి వేరే వృత్తులలోకి ప్రవేశించే అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం, సమాజం సహాయపడాలి. విద్యాపరంగా, రాజ్యాంగపరంగా వృత్తి స్వేచ్ఛను కలిగి ఉన్నప్పుడు, కులాలను శాశ్వతీకరణ చేసే విధంగా, ప్రభుత్వాతల, రాజకీయ వేత్తల చర్యలు అధికాధికమవుతున్నాయి. ఎస్సీకు, బీసీకు చివరికి ఎఫ్‌సిలో కూడా రిజర్వేషన్‌ కావాలని, వాటిని శాశ్వతీకరణ చేయాని ఉద్యమాలు సాగుతున్నాయి. రిజర్వేషన్స్‌ కు ప్రాతిపదికనే జరుగుతుండడం మూలానా, కులవృత్తుల నుంచీ వేరైనవారు కూడా తమ కులం పేరిట రిజర్వేషన్‌ పొందాలని కోరుకుంటున్నారు. రిజర్వేషన్‌ను కులాలను శాశ్వతీకరణం చేసే దిశలో మరో వాదం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతోంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుగారి హయాంలో కులాల పేరిట సంక్షేమ కార్పొరేషన్లు నిర్మించబడ్డాయి. కాపుకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు కార్పోరేషన్లు వెలిశాయి. ప్రస్తుత ప్రభుత్వం ఇంకా ఎన్నో కులాలకు కార్పొరేషన్లు, సంక్షేమాన్ని చేకూర్చే మిషతో ఏర్పరుస్తోంది. వెనుకబడిన తరగతులోని వివిధ కులాల కోసం కొత్తగా 28 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం వున్న 24తో కలిపి మొత్తం కార్పొరేషన్ల సంఖ్య 52కు చేరనుంది. వీటిలో 10 లక్షల నుంచి జనాభా వున్న కులాల కోసం 6 లక్షల నుంచి 10 లక్షల లోపు ఉన్న వాటికి 27, లక్షలోపు వాటికి 19 కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. కొన్ని కులాలకు ఎక్కువ సొమ్ము ఇస్తున్నారని, మాకు తక్కువ ఇస్తున్నారని కులాల మధ్య పోరు పెరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం చర్యల వల్ల హిందూ సమాజం కులాల పోరాటం వల్ల చీలిపోతుంది. హిందువులను కులాల వారీగా చీల్చి పరస్పర వైరుధ్యాన్ని పెంచి నిర్వీర్యం చేయటం పర్యవసానం అవుతుంది. మైనారిటీ అనగా ముస్లిం, క్రైస్తవులను మతరీత్య ఐక్యపరచడం, బలపరచడం, హిందువులను కులాలుగా చీల్చి, బలహీన పరచడం ప్రభుత్వపు చర్యల వల్ల జరుగుతుంది. ఇదంతా సంక్షేమం పేరిట జరగడం చింతాజనకం. హిందువుల దేవాలయాలను మాత్రమే ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకుని, వాటి ట్రస్ట్‌ బోర్డులో ప్రభుత్వాన్ని చేపట్టిన రాజకీయ నాయకులు, తమ మద్దతుదారులను నియమిస్తున్నారు. ఇటువంటి వారు రాజకీయ ప్రయోజనం చేత నియమితులైనవారు కాబట్టి, వారు వారి ప్రయోజనాల కోసమై దేవాలయాల సంపత్తిని, ఆస్తులను హిందూ ధర్మరక్షణకు, ప్రచారానికి కాక రాజకీయ ప్రయోజనాలకై మళ్ళిస్తున్నారు. ఒక మైనారిటీ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, ఆ మతస్తులకు ట్రస్టుబోర్డులో ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో దేవాలయ కర్మాచారులలో ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ విధంగా హిందూ సమాజానికి ఎంతో అన్యాయం జరుగుతుంది. మతం మార్చుకున్నవారు ఆ సత్యాన్ని ప్రభుత్వపు రికార్డులో నమోదు చేయకుండా హిందూ, ఎస్సీలుగా ప్రమాణ పత్రాలను పొంది, హిందూ దళితులకు ఉద్దేశింపబడిన ప్రయోజనాలను కబళిస్తున్నారు. ఇలా జరగకూడదని సుప్రీంకోర్టులో వ్యాజ్యం దశాబ్దాలుగా విచారణకు రాకుండా పడి ఉంది.

హిందువు తమ ధర్మాన్నుంచి పరంపర నుండి దూరమవుతున్నారు. కొన్ని ఉదా॥ను చూడండి.

తెలంగాణలో ఒక జిల్లాలో పేరు పొందిన కమ్యూనిస్టునేత తన పుత్రులకు (నిగితా) కృశ్చేవ్‌ అని, (శ్రీపాద అమృత) డాంగే అనే పేరు పెట్టారు. తెలుగునాట మరి కొందరు తమ సంతానానికి అజయ్‌ఘోష్‌ (ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ జనరల్‌ సెక్రటరీ) స్టేషన్‌ అని హిల్ట్‌ అని విదేశీయ పేర్లతో పాటు గాంధీ, నెహ్రూ, బోస్‌, గోఖలే, ఠాగూర్‌, తిలక్‌ వంటి పేర్లు విచక్షణా రహితంగా పెట్టుకున్నారు. ఇటీవల వీటన్నిటినీ తలదన్నినట్లుగా, మౌనిక, విప్లవ, అరణ్య, అనుష్క, క్రాంతి, అనూష, ఖ్యాతి వంటి పేర్లను పెడుతున్నారు. సరస్వతీ, లక్ష్మి, సీత, శారద, వెంకటేశ్వర, కృష్ణ వంటి మన ధర్మానికి సంబంధించిన పేర్లను పెట్టడం లేదు. పేర్లను వ్రాసినప్పుడు ఇంటిపేరుతో ప్రారంభం కాకుండా, ఇంటిపేరును చివరకు పెడుతున్నారు. చివరకు కొంతమంది రచయితలు కూడా తమ పేర్లకు ముందు కుదింపు ఇంగ్లీషు అక్షరాలను వాడుతున్నారు. బి.కె. నాయుడు, కొత్తగా కుదింపు చేయబడిన పాశ్చాత్యుల ఉచ్ఛరించడానికి వీలుగా వుండే రెండు శబ్దాలతో పేర్లను పెడుతున్నారు. ఉదా॥ నిలేష్‌, పరేష్‌, పీయూష్‌, రాజేష్‌. ఈ క్రొత్త వాడకం వల్ల మన సంస్కృతి నుంచీ, భాష నుంచీ, వారసత్వాన్నుంచీ, దూరం అయిపోతున్నాం. పేరులో ఎంతో అర్థం ఉండాలి. దాన్ని ఉచ్ఛరించి, పరమార్థంపై అవగాహన పెంచుకోవాలి. అందరినీ, తెలుగువారినీ అర్థిస్తున్నాను. ఇంటి పేరు పూర్తిగా తెలుగులో పేరుకు ముందు వ్రాయాలని, పేర్లను సాంప్రదాయిక పద్ధతిలో పెట్టాలని.

Share: