(సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు 97వ జయంతి)
నవలా నాయకుడంటే ఆయనే!
తెలుగువారి నవలానాయకుడు ఎవరంటే – ముందుగా వినిపించే పేరు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వర రావుదే. తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ నవలల ఆధారంగా తెరకెక్కిన అనేక తెలుగు చిత్రాల్లో అక్కినేని కథానాయకునిగా నటించి మురిపించారు. ఆ స్థాయిలో నవలానాయకునిగా అలరించిన నటుడు తెలుగునాట మరొకరు కనిపించరు. ఇక ఏయన్నార్ పేరు వినగానే అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చేది ‘దేవదాసు’ చిత్రమే. ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ రాసిన ‘దేవదాసు’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో అక్కినేని అభినయం ఆయనను జనం మదిలో ‘ట్రాజెడీ కింగ్’గా నిలిపింది. ఆ తరువాత మరెన్నో నవలల ఆధారంగా రూపొందిన చిత్రాల్లోనూ అక్కినేని అభినయం అభిమానులను ఎంతగానో అలరించింది. “దేవదాసు, చరణదాసి, బాటసారి, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు, ఆత్మీయులు, బంగారు కలలు, విచిత్రబంధం, ప్రేమనగర్, సెక్రటరీ” ఇలాంటి నవలల ఆధారంగా రూపొందిన చిత్రాలన్నిటా ఏయన్నార్ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు.
ప్రేమకథా చిత్రాల్లోనూ ఆయనే!
ఇక ప్రేమకథా చిత్రాల్లోనూ అక్కినేని అభినయం ఎంతగానో అలరించింది. అక్కినేని అదృష్టమేమో కానీ, ప్రఖ్యాతి గాంచిన లైలా-మజ్ను, సలీమ్- అనార్కలి, దేవదాసు-పార్వతి వంటి భగ్నప్రేమకథా చిత్రాల్లో ఆయన నటించే అవకాశం కలిగింది. అందుకే తెలుగునాట మజ్ను, సలీమ్, దేవదాసు పేర్లు ప్రస్తావనకు రాగానే ముందుగా ఏయన్నార్ గుర్తుకు వస్తారు. నిజానికి సుఖాంత ప్రేమకథలకే జనం బ్రహ్మరథం పడతారు. అందులోని అభినయమూర్తుల నటననూ శ్లాఘిస్తారు. కానీ, విషాదాంత ప్రేమకథలను చూసి కన్నీరు కారుస్తారే తప్ప, అభినందించి, జేజేలు పలుకరు. అయితే అక్కినేని అభినయ ఫలితంగా విషాదాంత ప్రేమకథలు సైతం తెలుగునాట విజయం సాధించాయి. ఆయన నటజీవితంలోనే అద్భుత విజయం సాధించిన చిత్రంగా నిలచిన ‘ప్రేమాభిషేకం’ విషాదాంతమే. ఈ చిత్రం ప్లాటినమ్ జూబ్లీ (75 వారాలు) చూసిన తొలి తెలుగు చిత్రంగా నిలచిపోయింది.
ఆ వాక్యమే కారణం!
అక్కినేని ఆరంభఃలో జానపద నాయకునిగా రాణించారు. నటరత్న యన్టీఆర్ ఆగమనంతో జానపద నాయకుడంటే యన్టీఆరే అన్న పేరు లభించింది. ఏయన్నార్ నెమ్మదిగా సాంఘికాలవైపు మరలారు. అప్పుడే ఆయనకు ‘దేవదాసు’ వంటి ఛాలెంజింగ్ రోల్ తారసపడింది. జానపద చిత్రాల్లో నటించే అక్కినేని ‘దేవదాసు’గా అలరించలేడని ఎందరో విమర్శించారు. ఆ విమర్శలను సవాల్ గా తీసుకొని ‘దేవదాసు’ పాత్రలో జీవించారు ఏయన్నార్. ‘దేవదాసు’ గా నటించిన ట్రాజెడీ కింగ్ అనిపించుకున్న ఏయన్నార్, ఆ ముద్రనుండి బయట పడటానికి యన్టీఆర్ కథానాయకునిగా నటించిన ‘మిస్సమ్మ’లో కామెడీ రోల్ చేశారు. నిజజీవితంలో విగ్రహారాధన అంటే గిట్టని అక్కినేని తెరపై ‘విప్రనారాయణ’గానూ అలరించారు. పెద్దగా చదువుకోని నాగేశ్వరరావు అనేక చిత్రాల్లో విద్యాధికునిగా నటించి మెప్పించారు. ఇలా తన నటజీవితంలో ఎదురైన సవాళ్ళను అక్కినేని ఎదుర్కొని గెలిచారు, చిత్రసీమలో ఎంతో కాలం నిలిచారు. “స్వీయలోపంబెరుగుట పెద్ద విద్య” అన్నారు మీర్జా గాలీబ్. ఆ వాక్యాన్ని ఏయన్నార్ ఎంతగానో అభిమానించారు. తనలోని లోపాలేంటో తెలుసుకున్నారు. వాటిని తన కెరీర్ కు అనువుగా మలచుకున్నారు. యన్టీఆర్ రాగానే తాను పౌరాణిక, జానపదాలకు ఆయనతో సరితూగనని వాటికి దూరంగా జరిగారు. ప్రేమకథా చిత్రాలను, కుటుంబ కథా చిత్రాలను ఎంచుకున్నారు. వాటిలో తన పర్సనాలిటీకి తగ్గట్టుగా నటించారు. జనాన్ని ఆకట్టుకున్నారు. ఒకవేళ పౌరాణిక, జానపద, చారిత్రకాల్లో నటించే అవకాశం వచ్చినా, వాటిలో తనకు సరిపోయే పాత్రలయితేనే అంగీకరించేవారు. ఎదురుగా ఎంతోమంది మేటి నటులు ఉన్నా, అక్కినేని ఎంతో కాలం చిత్రసీమలో రాణించగలగడానికి మీర్జా గాలిబ్ చెప్పిన మాటను పాటించడమే కారణం. అదే విషయాన్ని ఏయన్నార్ ఎన్నో వేదికలపై సగర్వంగా చెప్పుకున్నారు.
భావితరాలకు స్ఫూర్తి పాఠం
చిత్రసీమలో రాణించాలనుకొనేవారికి అక్కినేని అభినయ జీవతం ఓ పాఠ్యపుస్తకం అనే చెప్పాలి. ఎందుకంటే కేవలం నాలుగవ తరగతి చదువుకున్న ఓ పిల్లాడు చిత్రసీమలో అడుగుపెట్టడం, కథానాయకునిగా రాణించడం, కొన్ని దశాబ్దాలపాటు అలరించడం, నటునిగానే కాకుండా నిర్మాతగా, స్టూడియో అధినేతగా నిలవడం, చివరకు ‘అన్నపూర్ణ స్టూడియోస్’ అనే సామ్రాజ్యాన్ని నెలకొల్పి, ఎందరికో జీవనభృతి కల్పించడం – ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. అందుకే చిత్రసీమలో రాణించాలనుకొనేవారికి అక్కినేని నటజీవితం ఓ పాఠంగా ఉపకరిస్తుందనే చెప్పాలి. ఇక తెలుగునాట అక్కినేని అంతగా విశిష్ట పురస్కారాలు అందుకున్న నటులూ కనిపించరు. దేశంలో అత్యంత ప్రతిస్ఠాత్మకంగా భావించే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులనూ అందుకున్నారు. తెలుగునాట ‘పద్మవిభూషణ్’ అందుకున్న తొలి నటుడు కూడా ఆయనే. అక్కినేని కీర్తి కిరీటంలో ఈ ప్రభుత్వ అవార్డులు కాకుండా, జనం మెచ్చి ఇచ్చిన ఎన్నో అవార్డులూ, రివార్డులు మేలిమి రత్నాలుగా వెలుగొందుతూనే ఉన్నాయి. తెలుగు సినిమా ఉన్నంత కాలం అక్కినేని నాగేశ్వరరావు అభినయాన్ని స్మరించుకుంటూ ఉండవలసిందే!