ఆడలేక…చంద్రబాబుపై… అక్కసు!

raju

“ఇంట్లో పోరు తాలలేనివాడు. బయటివాళ్ళపై రంకేలు వేశాడంట”- ఇదో పాత సామెత! అయితే ఈ సామెత ఇప్పటికీ వాస్తవంగా మన కళ్ళకు కనిపిస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ సామెతను ఈ నాటికీ నిజం చేయడంలో చరిత్ర సృష్టించారు. తన సొంత పార్టీ ఎంపీ, నరసాపూర్ లోక్ సభ్య ప్రతినిధి అయిన కనుమూరి రఘురామ కృష్ణంరాజుతో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ఏ కారణంగా కలహం రేగిందో కరెక్టుగా ఎవరూ చెప్పలేరు. కానీ, జగన్ పై రఘురామ కారాలు మిరియాలు నూరడం చాలా రోజులుగా సాగుతోంది. సొంత పార్టీ ఎంపీ అధిష్ఠానంపైనే దుమ్మెత్తి పోస్తున్నా, పార్టీ అధ్యక్షునిగా జగన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదో ఎవరికీ అర్థం కాదు. అందువల్ల జగన్ పై రఘురామ విమర్శలు, అతనిపై జగన్ పార్టీ సోషల్ మీడియా చేసే వ్యాఖ్యానాలు అన్నీ నాటకమే అనుకున్నారు. కానీ, జగన్ సోషల్ మీడియా రఘురామపై చేసే వ్యాఖ్యలు శ్రుతిమించాయి. దాంతో రఘురామ కూడా ఏమీ తగ్గలేదు. ఆయన కొన్ని ఛానల్స్ ను వేదికగా చేసుకొని జగన్ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిపై రఘురామ పలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. వాటిని నమ్మినవారు నమ్మారు. నమ్మనివారు నమ్మలేదు. కొందరు అసలు పట్టించుకోలేదు. రఘురామకు అంత ధైర్యం రావడానికి కేంద్రంలోని కొందరు పెద్దలు అండగా ఉండడమే కారణమని వినిపించింది. ఆడలేనమ్మ ఏదో చేసినట్టు – ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబే రఘురామతో అలా మాట్లాడిస్తున్నాడనీ కొందరు వైసీపీ వర్గాల అభిప్రాయం. కొందరయితే చంద్రబాబు తెరవెనుక సూత్రధారి అంటూ మైకులు పుచ్చుకొనీ ఈ మధ్య చేసిన హడావిడి చూస్తే, పైన ఉదహరించిన పాతకాలపు సామెత గుర్తుకు రాకమానదు. వాళ్ళు, వాళ్ళ ఎంపీ తగువులాడు కొని, తీరా అందుకు చంద్రబాబు కారణమని చెప్పడం ఎంతవరకు సబబు!?

పలు కారణాలు…

రఘురామ అంతగా చెలరేగి పోవడానికి పలు కారణాలు వినిపించాయి. అందులో ఒకటి – 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి తరపున ఆయన నియమించుకున్న వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పలుమార్లు సర్వేలు నిర్వహించాడట. ఆ సర్వేలో ఎటు చూసినా, నరసాపూర్ లోక్ సభ స్థానం నుంచి రఘురామ కృష్ణంరాజు గెలిచి తీరుతాడన్న ఫలితం వచ్చిందట. ఒకప్పుడు జగన్ తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన రఘురామ అప్పటికే కొంతకాలంగా ఆయనకు దూరంగా ఉంటున్నారు. అందుకూ పలు కారణాలు చెబుతారు. అదలా ఉంచితే, రఘురామ ఏ పార్టీ టిక్కెట్ పై నిలిచినా గెలుస్తాడని, చివరకు అతను ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుపు అతనిదేనని ప్రశాంత్ కిశోర్ కు తెలిసిపోయింది. ఈ సమయంలో అలాంటి క్యాండిడేట్ తమవైపు ఉంటే నరసాపూర్ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైసీపీకి అనుకూలంగా ఉంటుందని ప్రశాంత్ కిశోర్ భావించారు. అందువల్ల ఎలాగైనా రఘురామను మళ్ళీ దగ్గరకు తీసుకోవాలని ప్రశాంత్ కిశోర్, జగన్ కు సూచించారు. అయితే జగన్ ఆయన మాటను మొదట్లో పెడచెవిని పెట్టారు. చివరకు వ్యూహకర్త ప్రశాంత్ చెప్పిన మాట వినడానికి అంగీకరించి, రఘురామతో దోస్తీకి సై అన్నారు జగన్. ఆ సమయంలో రఘురామను పిలిచి, ప్రసన్నం చేసుకున్నారు. ఎటూ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అంటే ఎంతో అభిమానం ఉన్న రాజు సులువుగానే జగన్ చెంతకు చేరిపోయారు. పైగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మనని చెప్పుకొనే కేవీపీ రామచంద్రరావుకు, ఈ రఘురామ స్వయానా వియ్యంకుడు. కావున, జగన్ పిలుపు రాగానే రఘురామ ఆనందగీతం పాడుకుంటూ వైసీపీలో చేరిపోయారు. తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు రఘురామకు ఎంతో ముఖ్యపాత్ర ఉంటుందని, జగన్, ఆయన సన్నిహితులు చెప్పారు. ఆ మాటలను రఘురామ కూడా విశ్వసించారు. దాంతో జగన్ కోరినట్టుగా, తన నరసాపూర్ ఎంపీ ప్రచార ఖర్చులు భరిస్తూనే చుట్టూ ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని వైసీపీ అభ్యర్థులకూ రఘురామ సరైన సమయంలో ధనసాయం చేశారట. ఆ లెక్కలన్నీ పార్టీ అధికారంలోకి రాగానే సరిచేస్తానని జగన్ మాట కూడా ఇచ్చారట! అయితే జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోగానే, రఘురామను మెల్లగా దూరం పెట్టసాగారు. అందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధానకారకులని రఘురామ మద్దతుదారులు చెబుతున్నారు. జగన్ ను తాను కలవకుండా చేస్తున్నది సజ్జల అని రఘురామకు తెలిసిపోయింది. దాంతో ఢిల్లీలో కూర్చుని సొంత పార్టీపైనే విమర్శలు సాగించడం మొదలు పెట్టారు రఘురామ.

ఓవర్ యాక్షన్…

రఘురామ విమర్శల్లో నిజాలు ఉన్నా, తమ పార్టీలోనే ఉంటూ తమనే విమర్శించడం వైసీపీ వర్గాలకు నచ్చలేదు. హుటాహుటిన రఘురామపై అనర్హత వేటు వేయించాలని జగన్ తన పార్టీకి చెందిన మిగతా 22 మంది లోక్ సభ ఎంపీలను ఢిల్లీ పంపించారు. అయితే అక్కడ కూడా రఘురామ ఓ టెక్నికల్ పాయింట్ తో వీరి వాదననే తోసిపుచ్చారు. దాంతో సోషల్ మీడియా వేదికగా రఘురామపై అసభ్య పదజాలంతో పోస్టులు ప్రారంభించారు. సభ్యసమాజం వినలేని పదాలన్నీ ఆ పోస్టుల్లో చోటు చేసుకున్నాయి. కొందరయితే రఘురామ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టిన మరుక్షణమే ఖతం చేస్తామనీ భయపెట్టారట. దీనిని కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకువెళ్ళిన రఘురామకు ‘వై’కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అప్పటినుంచీ ఢిల్లీ నుంచి రఘురామ తమ సొంత పార్టీచేసే తప్పులను ఎత్తి చూపిస్తూ పోస్టులు చేయసాగారు. సామాజిక మాధ్యమంలో వైసీపీ సోషల్ మీడియా, రఘురామ ఎవరికి ఎవరూ తగ్గకుండా సాగారు. రఘురామ మరో అడుగుముందుకు వేసి కొన్ని ఛానల్స్ ను ఎంచుకున్నారు. సంచలనమే ప్రాణంగా సాగుతున్న నేటి ఎలక్ట్రానిక్ ఛానల్స్ కు రఘురామ వంటి వారి మాటలు లాభదాయకంగానే కనిపించాయి. దాంతో రఘురామను సదరు ఛానల్స్ సాదరంగానే ఆహ్వానించాయి. సోషల్ మీడియాలో రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసిన వారిపై రఘురామ ఛానల్స్ వేదికగా సమరం సాగించారు. అందులో కొందరు అమ్మాయిలనూ ఆయన దూషించడం అందరూ చూసిందే. అయితే సదరు అమ్మాయిలు కూడా ఏ తీరున శ్రుతిమించారో సోషల్ మీడియాల్లో చూస్తే తెలుస్తుంది. ఏది ఏమైతేనేమి? ఇక్కడే జగన్ రెడ్డి సామాజిక వర్గం వారు ఆగ్రహోదగ్రులై రఘురామకు తగిన శిక్ష పడేలా చూడాలని పథకం వేశారు. అందుకు తన 60వ పుట్టినరోజు జరుపుకోవడానికి మే 14న రఘురామ హైదరాబాద్ వస్తాడని కాపు కాసి, మరీ ఆయనను అరెస్ట్ చేయించారు. ఇక్కడ ఏపీ సి.ఐ.డి. ఏలాంటి నియమనిబంధనలు పాటించలేదు. ఓ పార్లమెంట్ సభ్యుణ్ణి అరెస్ట్ చేసే ముందు, లోక్ సభ స్పీకర్ కు తెలియజేయాలన్న అంశాన్ని మరచిపోయారు. ఎంచక్కా అరెస్ట్ చేసిన తరువాత లోక్ సభ స్పీకర్ కు ఉత్తరం ద్వారా తెలిపారు. అదలా ఉంచితే, రఘురామ అరెస్ట్ లో నియమాలను పక్కకు నెట్టడమే కాదు, గౌరవనీయులయిన పార్లమెంట్ సభ్యుణ్ణి చూసే తీరున కాకుండా ఓ క్రిమినల్ ను పట్టుకుపోయినట్టుగా అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళారు. అక్కడ సి.ఐ.డి.ఆఫీస్ లో ఇంటరాగేషన్ పేరుతో రఘురామను చిత్రహింసలకు గురిచేసినట్టు, రఘురామ సి.ఐ.డి. కోర్టులోనే స్వయంగా చెప్పారు. దాంతో సెషన్స్ కోర్టు రెండు ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించి, రిపోర్ట్ ఇవ్వమంటే, దానినీ తోసిరాజన్నారు ఏపీ సిఐడీలు. హైకోర్టు జోక్యంతోనే కాసింత జంకారు. రఘురామకు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు సూచించినా, దానినీ అమలు చేయకుండా ముందు రఘురామను జైలులో వేసి, ఆయనను ఓ ఖైదీగా గుర్తిస్తూ నంబర్ కూడా వేశారు. ఈ సమయంలోనే రఘురామ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఊరట లభించింది. సుప్రీమ్ సూచనల మేరకు రఘురామను సికిందరాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో గాయాలు అయ్యాయా లేదా అన్న దానిపై పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. రఘురామ ఎడమకాలి వేలు ఒకటి తీవ్రగాయాలకు లోనయిందని, పరీక్షించిన వైద్యనిపుణులు నిర్ధారించారు. దానిని సుప్రీమ్ కోర్టు సైతం విశ్వసించింది. అందుకు ఏపీ ప్రభుత్వం, సిఐడీ, గుంటూరులో సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యురాలుకు నోటీసులు జారీ చేసింది. అయినా, ఇంకా ఏపీ ప్రభుత్వ పెద్దలు, అక్కడి పోలీసు శాఖలోని కొందరు ఓవర్ యాక్షన్ మానడం లేదు.

tv5

raju1

ఇదో విచిత్రం!

రఘురామ తనయుడు భరత్ తన తండ్రి కేసును సీ.బీ.ఐ. పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని సుప్రీమ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కేవలం కేంద్రప్రభుత్వం, సీబీఐను మాత్రమే ప్రతివాదులుగా చేర్చాలని భరత్ తన పిటీషన్ లో కోరారు. అందులో నుండి ఏపీ ప్రభుత్వం, ఏపీ సిఐడీని ప్రతివాదుల నుండి తప్పించాలనీ కోరడంతో సుప్రీమ్ భరత్ అభ్యర్థనను మన్నిస్తూ తీర్పు నిచ్చింది. ఇందులో ప్రతివాదులుగా ఏపీ గవర్నమెంట్ ను, అక్కడి సి.ఐ.డి.నీ చేర్చకపోవడంపై ఏపీ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సుప్రీమ్ కోర్టు న్యాయవాది ధవే అభ్యంతరం చెప్పారు. తమ లాయరే అభ్యంతరం చెప్పారు అంటే తమకు వ్యతిరేకంగా సుప్రీమ్ కోర్టు సూచనలు ఉన్నాయని తెలుసుకోలేని అమాయకులు కొందరు సుప్రీమ్ కోర్టులో రఘురామ తనయునికి చుక్కెదురు అయిందని చాటింపు వేశారు. తరువాత అసలు విషయం తెలుసుకున్నాక నాలుక్కరచుకున్నారు. అది వేరే విషయం. ఈ నాటకీయ పరిణామాలన్నిటి వెనుకా చంద్రబాబు నాయుడు ఉన్నారన్నది వైసీపీ శ్రేణుల అభియోగం. ఇక్కడ వారి అవివేకం సుస్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి కేంద్రం తరపున పలు కేసుల్లో వాదించిన సుప్రీమ్ కోర్టు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని రఘురామ తన లాయర్ గా నియమించుకున్నారు. ఈ రోహత్గి ఎవరయ్యా అంటే జగన్ పై ఉన్న కేసులను సుప్రీమ్ లో ఆయన తరపున వాదించిన వారే! అంటే – కొన్ని కేసుల్లో కేంద్రానికి, తరువాత ఆర్థిక నేరాల కేసుల్లో జగన్ కు, ఇప్పుడు రఘురామకు సుప్రీమ్ లో ఒకరే న్యాయవాది అన్న మాట! మరి కథ అక్కడే తిరుగుతోంది, మధ్యలో చంద్రబాబును ఆడిపోసుకోవడం ఏమిటో ఎవరికీ అర్థం కాదు.

ప్రతీసారి ఆయన పేరే!

చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేస్తాడు అన్న మాటను పట్టుకొని అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయినా, ఇంకా ఆ మాటలతోనే ప్రయాణం చేస్తున్న వారిని ఏమనాలి? చంద్రబాబుకు ఒకప్పుడు సన్నిహితుడైన ఎన్.వి.రమణ ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉండడమే ఇందుకు కారణమని కొందరి భావన. అత్యున్నత పదవుల్లో ఉన్నవారు స్వపర భేదాలకు అతీతంగా పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి ఎన్.వి.రమణ కూడా చంద్రబాబు మాట వినేసి, జగన్ రెడ్డిని ఇక్కట్లకు గురిచేస్తారని ఎవరూ భావించరు. పైగా ఈ కథలో రఘురామ ఎవరో కాదు స్వయానా వైసీపీ పార్టీ ఎంపీ. ఇది పూర్తిగా వైసీపీ ఇంటిపోరు. మరి చంద్రబాబు పేరును ప్రతీసారి వైసీపీ వర్గీయులు ఎందుకని జపిస్తున్నారు? చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు. పైగా ఆయనది బలమైన ప్రతిపక్షం కూడా కాదు. అయినా, చంద్రబాబు అంటే వైసీపీవారికి ఎందుకంత భయం? ఆయనకు ప్రజల్లో ఉన్న బలం మెల్లగా వైసీపీ శ్రేణులకు తెలిసిపోతోంది.
అదీగాకుండా రఘురామను అరెస్ట్ చేసి, ఆయనను చిత్రహింసలకు గురిచేశారన్న విషయం తెలిశాక, రఘురామ సతీమణి మీడియా ముందుకు వచ్చి, తన భర్తకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణహాని ఉందని ప్రకటించారు. అందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, సిఐడీ ఆఫీసర్ సునీల్ కుమార్ కారకులవుతారనీ ఆమె ఆరోపించారు. ఆమె ప్రకటన చూసిన తరువాత ఎంతోమందికి జాలి కలిగింది. అప్పటి దాకా తమ సామాజిక వర్గాన్ని రఘురామ దూషించాడని భావించిన వారు సైతం, ఆయన భార్య టీవీలో కనిపించిచేసిన ఆరోపణలు చూశాక జాలి చూపారు. రఘురామకు ఏమీ కాకూడదని కోరుకున్నారు. అదే సమయంలో రఘురామ అరెస్ట్ విషయమై రాష్ట్రపతి కోవింద్ కు, ఏపీ గవర్నర్ కు , కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి రఘురామ ప్రాణాలు ప్రమాదంలోఉన్నాయి రక్షించమని చంద్రబాబు లేఖలు రాశారు. ఇది చూశాక మళ్ళీ మామూలే, రఘురామ వెనుక చంద్రబాబు ఉన్నాడని వైసీపీ శ్రేణుల ప్రచారం! కానీ, స్వయంగా వైసీపీ సోషల్ మీడియాకు చెందిన ఓ వనిత వచ్చి, రఘురామ విషయంపై ఆయనకు అనుకూలంగా స్పందించిన తీరు చూశాక చాలా స్వరాలు సన్నగిల్లాయి. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే, ‘అసలు రఘురామ కేసులో ఏపీ ప్రభుత్వానికి సంబంధమే లేదని, అది రఘురామకు సీఐడీకి మధ్య మాత్రమే సాగుతోందని’ ప్రకటించారు. తరువాత ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికి అన్నట్టు అసెంబ్లీలో ఒక్కరోజు బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హాజరు కాలేదని వాపోయారు. ఓ సీనియర్ నాయకుడై ఉండి, సూచనలు సలహాలు ఇవ్వవలసిన బాధ్యత చంద్రబాబుకు లేదా అనీ కొందరు ప్రశ్నించారు. మరి కోవిడ్ నియంత్రణకు ఓ సీనియర్ లీడర్ గా చంద్రబాబు సూచించిన సలహాలను జగన్ రెడ్డి ఏ మేరకు పాటించారో? ఇక ఏపీ బీజేపీ నాయకుడు సోమూ వీర్రాజు అయితే, అందరూ మాట్లాడుకుంటున్న రఘురామ కేసుకు తగిన ప్రాధాన్యమివ్వకుండా, చంద్రబాబు అసెంబ్లీకి హాజరు కాకపోవడమే నేరంగా మాట్లాడారు. వీటన్నిటినీ చూసిన తరువాత ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అర్థమై పోతుంది. బహుశా, అందుకే కాబోలు సర్వోన్నత న్యాయస్థానం సైతం రఘురామకు ఏపీలో కాకుండా సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలని సూచించింది.

బోధపడుతోందా!?

రఘురామను పరీక్షించి, రిపోర్టు ఇచ్చిన ఆర్మీ వైద్యులలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు లేకపోవడం కూడా వైసీపీ శ్రేణులను బాధకు గురి చేసింది. లేకపోతే, సాక్షాత్తు వాళ్ళ నాయకుడు జగన్ రెడ్డి, సుప్రీమ్ కోర్టు ఛీఫ్ జస్టిస్ రేసులో ఉన్న ఎన్.వి.రమణపై ఆరోపణలు చేస్తూ పిటీషన్ దాఖలు చేసినట్టుగా, చంద్రబాబును ఆడిపోసుకొనేవారు. ఇప్పుడయితేనేమి, అయినదానికీ, కానిదానికీ ఏపీలో అధికార పార్టీవారికి ఏ సమస్య వచ్చినా, అందుకు చంద్రబాబు కారణమంటూ కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు. నిజానికి 18 మంది సభ్యులతో సాగుతున్న చంద్రబాబుకు ఏ ఒక్క సభ్యుడు చేజారినా, ఆయన ప్రతిపక్ష నాయకుని హోదా పోతుంది. అంత బలహీనంగా ఉన్న చంద్రబాబుపై 151 సీట్లు సాధించిన వైసీపీ ఎందుకని విరచుకు పడుతోంది? అనూహ్యమైన బలమున్న వైసీపీ, చంద్రబాబు అసెంబ్లీకి వస్తేనేమి, రాకపోతేనేమి అంటూ తన పాలనలో తాను సాగిపోవాలి. కానీ, పనికట్టుకొని చంద్రబాబుపైనే విమర్శలు చేస్తూ ఉన్నారంటే, అసలు తత్వం బోధపడుతోందన్న మాట! ఇన్ని జరిగినా రఘురామ కేసు విషయంలో జగన్ విజయం సాధించాడంటూ కొందరు మేధావులు ప్రకటించడం మరింత విడ్డూరం. అంటే ఆ మేధావుల ముసుగు తొలగిపోయింది. వారంతా కూడా వైసీపీకి అనుకూలురే అన్న సత్యం జనానికి తెలిసిపోయింది.

మరి అదెలా…

ఇక రఘురామతో పాటు ఆయనతో ప్రసారాలు కొనసాగించిన రెండు ఛానళ్ళ పైనా కూడా రాజద్రోహనేరం ఆరోపించి కేసులు పెట్టింది ఏపీ సిఐడి. అందుకు స్పందిస్తూ ఏబీయన్-ఆంధ్రజ్యోతి ఎమ్.డి. వేమూరి రాధాకృష్ణ ఇలాంటి కేసులు ఎన్ని పెట్టుకున్నా జంకేది లేదని, తాము ఎప్పుడూ సత్యంవైపే నిలుస్తామనీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈ విషయంలో ఆర్కే వెనుక చంద్రబాబు ఉన్నాడని వైసీపీ శ్రేణులు కొత్తగా పాడేదేమీ లేదు. ఎప్పటి నుంచో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొన్ని ఛానళ్ళను ‘ఎల్లో’ మీడియాగా అభివర్ణిస్తూనే ఉన్నాయి. ఇక రఘురామ కాలుకు తగిలిన గాయాలను గురించి జగన్ కు వంత పాడే రెండు ఛానళ్ళు అదే పనిగా, రఘురామ కాళ్ళపై ఉన్నది సోరియాసిస్ అని, ఎడిమా ఉందని చాటింపు వేశాయే తప్ప, అవి దెబ్బలు కాదనే దబాయించాయి. అందువల్ల ఆ ఛానళ్ళను, సాక్షి ఛానల్ తో కలిపి ‘బ్లూ’ మీడియా అంటున్నారు జనం. మరి ఈ రంగుల హడావిడిలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కరోనాను నిర్లక్ష్యం చేస్తున్నారన్నది వాస్తవం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతోమంది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ బాట పడితే, వారిని అనుమతించని తెలంగాణ పోలీసులు, రఘురామను అరెస్ట్ చేయడానికి వచ్చిన పాతికమందికి పైగా ఏపీ సిఐడీవారిని అనుమతించడం ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు. అందుకూ చంద్రబాబే కారణమని చెప్పేవారు ఏపీలో కనిపిస్తారు. జనం అన్నీ గమనిస్తుంటారు. మరచిపోతారులే అనుకోవడం పాలకుల అవివేకం అవుతుంది.

Share: