ఒకప్పుడు తెలుగు సినిమా అంటే యన్టీఆర్, ఆయన పేరు వింటే తెలుగు సినిమా గుర్తుకు వచ్చేవి. తెలుగు సినిమాకు యన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అని చెప్పుకున్నా, చిత్రసీమలోకానీ, తెలుగునేలపై కానీ ఎప్పుడు ఏ ఆపద నెలకొన్నా, విపత్తు సంభవించినా ముందుగా అన్న నందమూరి తారక రామారావు స్పందించేవారు. అందుకే అప్పట్లో తెలుగు చిత్రసీమలో యన్టీఆర్ ను అందరూ ‘పెద్దాయన’ అని గౌరవించేవారు. రాయలసీమ క్షామ నివారణ సమయంలోనూ, పోలీస్ సహాయనిధి సేకరణలోనూ, ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ఇవ్వడంలోనూ అన్నిటా యన్టీఆర్ ముందున్నారు. దివి సీమ ఉప్పెన సమయంలోనూ, అంతకు ముందు ఉత్తరాది, దక్షిణాది తారల క్రికెట్ మ్యాచ్ సమయాన యన్టీఆర్-ఏయన్నార్ కలసి పనిచేశారు. అయినా అప్పుడు కూడా నందమూరి తారకరామారావుదే ప్రధాన భూమిక. ఉత్తరాది, దక్షిణాది తారల క్రికెట్ మ్యాచ్ లో నార్త్ టీమ్ కు దిలీప్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరించగా, సౌత్ టీమ్ కు యన్టీఆర్ కెప్టెన్. దివిసీమ ఉప్పెన సమయంలో యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ విరాళాల సేకరణకు బయలుదేరినా, చివరిదాకా నిధి సేకరణకు పూనుకున్నది తారకరాముడే. అదే పంథాను తెలుగు చిత్రసీమ కొనసాగిస్తూ వస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు అన్నది పరిగణించకుండా తమను ఆరాధించి, అభిమానించే జనానికి ఏ వైపరీత్యం ఎదురైనా మన తెలుగు సినిమా తారలు ముందుకు వచ్చి, తగిన సాయం అందించడానికి సిద్ధమయ్యేవారు. ఈ సారి కూడా అదే తీరున ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సి.సి.సి.) వెలసింది. అయితే లాక్ డౌన్ కారణంగా అప్పటికప్పుడు మరో ఛారిటీ ఏర్పాటు చేయడం వీలు కాకపోవడంతో చిరంజీవి ఆధ్వర్యంలోని ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’కే విరాళాలు ఇస్తూ ఉన్నారు సినీతారలు.
అవునా… ఇది నిజమేనా!?
అంతా సజావుగానే సాగుతూ వచ్చింది. యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ సైతం ‘సి.సి.సి.’కి రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. అదీ బాగానే ఉంది. ఈ సి.సి.సి. లో మొదటి నుంచీ చిరంజీవి పర్యవేక్షణ సాగుతోంది. చిరంజీవి నేతృత్వంలోనే నాగార్జున, మరికొందరు నిర్మాతలు, దర్శకులు ఓ టీమ్ గా ఏర్పడి ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును కలసి, త్వరలోనే షూటింగ్స్ జరుపుకోవడానికి అనుమతి ఇవ్వమని కోరారు. అందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించి, తగిన రోడ్ మ్యాప్ తయారు చేసిన తరువాత నియమనిబంధనలతో అనుమతి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కొన్ని పర్యాయాలు చిరంజీవి ఇంటిలో సమావేశమై, సినిమాటోగ్రఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చర్చలు జరిపారు. తత్ఫలితంగానే తరువాత చిరంజీవి, మరికొంతమంది సినిమా ప్రముఖులు కేసీఆర్ ను కలవగలిగారు. ఈ విషయాలేవీ తనకు తెలియవని, న్యూస్ పేపర్స్, ఛానల్స్ ద్వారానే తనకు తెలిసిందని మే 28న యన్టీఆర్ జయంతి సందర్భంగా యన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ తెలియజేయడం చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ తెలుగు చిత్రసీమలో ఓ టాప్ హీరో. అదీగాక యన్టీఆర్ కుటుంబానికి చెందిన ప్రముఖుడు. అలాగే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షలు విరాళం ఇవ్వడమే కాకుండా, సి.సి.సి.కి కూడా రూ.25 లక్షలు విరాళం అందించినవారు. అలాంటి హీరోకు ఎవరూ ఏ విషయాన్ని చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే ఓ వర్గం కావాలనే నందమూరి కుటుంబం ఉనికిని చిత్రసీమలో లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందని సినీవర్గాలు అంటున్నాయి.
ఎందుకలాగా!?
నందమూరి కుటుంబ సభ్యులను తక్కువ చేసినంత మాత్రాన, సంఘంలోనూ, రాష్ట్రంలోనూ యన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఆదరణ, గౌరవానికి తరుగేమీ రాదు. అయితే తెలుగు సినిమా జనం ఎప్పుడూ ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీకి జై కొడుతూ ఉంటుంది. అదీ తప్పేమీ కాదు. ఎందుకంటే కళాకారులు అందరికీ కావలసినవారు. కానీ, బాలకృష్ణను ఓ కళాకారునిగా కాకుండా ఓ రాజకీయ పార్టీకి చెందినవాడిగా చూస్తూ, ఆయనను ఇతరులు పక్కకు పెట్టడమే ఇప్పుడు శోచనీయం. గతంలోనూ ప్రస్తుతం సి.సి.సి.కి నేతృత్వం వహిస్తున్న చిరంజీవిని ముందుకు నెట్టి, ఆయనను ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కు అధ్యక్షునిగా చేస్తూ, ఆ సంఘాన్ని స్థాపించారు. అప్పటికి చిరంజీవి పూర్తి స్థాయిలో హైదరాబాద్ కు మకాం మార్చలేదు. ఆ సమయంలోనూ పలువురు తారలను కలుపుకొని అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డిని అప్పటి ‘మా’ సభ్యులు కలిశారు. ఆ సమయంలోనూ బాలకృష్ణను మరవడం గమనార్హం. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి చెందినవారు కాబట్టి, ఆయనను ఆ సమయంలో కలుపుకోలేక పోయారని వినిపించింది. ఆ తరువాత చాలా ఏళ్ళు బాలకృష్ణ ‘మా’ సభ్యునిగా ఉండలేదు. తరువాత మురళీమోహన్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో బాలకృష్ణ సభ్యునిగా చేరినట్టు సమాచారం. ఆ తరువాత బాలకృష్ణకు అందరు అధ్యక్షులు తగిన గౌరవం ఇస్తూ వచ్చారు. ఆయన కూడా ‘మా’ కు తన వంతు సలహాలు, సూచనలు ఇచ్చిన సందర్భాలున్నాయి. కొన్నేళ్ళ క్రితం కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలను వరదలు ముంచెత్తినప్పుడు బాలయ్యనే ప్రధాన భూమిక పోషించి, విరాళాలు సేకరించారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు సినిమా రంగం నుండి పెద్ద మొత్తం విరాళంగా రావడానికి దాసరితో కలసి బాలకృష్ణ చేసిన కృషి అసలు కారణం అని అందరికీ తెలుసు. అలాంటి బాలయ్యను ఇప్పుడు ‘సి.సి.సి’ చేస్తున్న ఏ వ్యవహారంలోనూ కలుపుకోక పోవడం గమనార్హం. అందుకే బాలకృష్ణ మే 28న ‘తెలుగు సినిమా పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన విషయమే తనకు తెలియదని’ పేర్కొన్నారు.
ఎప్పటికీ ఆయన ఆయనే!
ఈ వ్యవహారాలను బట్టి చూస్తే తెలుగు సినిమా రంగంలో ఇంకా వర్గపోరు ఉందనే తెలుస్తోంది. ఒకప్పుడు సినిమా రంగంలో యన్టీఆర్, ఏయన్నార్ మధ్య వైషమ్యాలు నెలకొన్న సమయంలో వర్గాలు ఉన్నా, చిత్ర పరిశ్రమ ఏదైనా చేయాలంటే కలసి కట్టుగా చేసేవారు. అప్పట్లో చిత్రసీమ మద్రాసులో ఉండేది. యన్టీఆర్ మద్రాసులోనే ఉండేవారు. కాబట్టి తెలుగు సినిమా రంగంలో ఏదైనా సమస్య నెలకొన్నా, విపత్తు సంభవించినా పరిష్కారం కోసం యన్టీఆర్ దగ్గరకే సినీజనం ముందుగా వెళ్ళేవారు. ఆయన తగిన పరిష్కారం చూపించేవారు. ఏయన్నార్ సైతం ఏదైనా సమస్య తన దగ్గరకు వచ్చినా ‘పెద్దాయన సలహా కూడా తీసుకోండి’ అని చెప్పేవారే కానీ, ఏ నాడూ విరుద్ధంగా ప్రవర్తించేవారు కాదు. యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీ నెలకొల్పిన తరువాత మద్రాసులో యన్టీఆర్ వర్గం, కాంగ్రెస్ వర్గం అన్నవి తయారయ్యాయి. కాంగ్రెస్ వర్గానికి అప్పట్లో ఆ పార్టీలో చేరిన కృష్ణ నేతృత్వం వహించేవారు. అయినా ఆయన కూడా యన్టీఆర్ మాటకే విలువనిచ్చేవారు. ఆ తరువాత హైదరాబాద్ లో తెలుగు సినిమా రంగం స్థిరపడిన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ బాలకృష్ణ ఏ నాడూ తనకే పెత్తనం కావాలని అడిగింది లేదు. అందరితో పాటు తానూ అని ఎప్పుడూ ముందుకు సాగారే తప్ప, ఎవరినీ బాలయ్య వద్దనుకున్నది కనిపించదు. కానీ, అదే పనిగా ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ సంస్థ బాలకృష్ణను దూరంగా పెట్టడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది “ఎప్పుడూ నందమూరి ఫ్యామిలీయే ఆధిపత్యంలో ఉండాలా?” అని కొందరు భావిస్తున్నట్టూ తెలుస్తోంది. ఇందులో నిజానిజాలేపాటివో కానీ, యన్టీఆర్ అనే మహాశక్తిని అడ్డుకోవడం అంత సులువు కాదని అందరికీ తెలుసు. అందుకు నిదర్శనంగా యన్టీఆర్ 98వ జయంతిన ఆయనపై సోషల్ మీడియా వేదికగా అగణిత నీరాజనాలు వెలువడ్డాయి.
సినీ పెద్దలూ… ఆలోచించండి!
అసలే కరోనా కారణంగా తెలుగు సినిమా రంగం కల్లోలంలో చిక్కుకుంది. ఈ సమయంలో తెలుగు చిత్రసీమలో వర్గపోరు ఏ మాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా అందరినీ కలుపుకొంటూ పోయి, ప్రస్తుత సినిమా సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది. ఈ విషయంలో అన్న నందమూరి తారకరామారావును ఆదర్శంగా తీసుకొని ఆయన కుటుంబసభ్యులు కూడా వ్యవహరించాలి. అదే రీతిన ఇతరులు సైతం వర్గపోరు, ఆధిపత్య కాంక్షలు పక్కకు పెట్టి నందమూరి కుటుంబసభ్యులతో కలసి మెలసి సాగాలి. అప్పుడే తెలుగు చిత్రసీమలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. తద్వారా సమస్యల పరిష్కారంలో సమైక్యత చోటు చేసుకుంటుంది.