మద్రాసు స్టేషన్లో రైలు దిగి నియో మోడరన్ లాడ్జికి వెళ్ళి, రూములో తన చిన్న ట్రంకు పెట్టెను పెట్టి, స్నానం చేసి, స్టూడియోలో ఎల్.వి.ప్రసాద్ గారిని కలవడానికి యన్టీఆర్ వెళ్లారు.
ప్రసాద్ ఆయన్ని సౌహార్ద్రతతో పలకరించారు. యన్టీఆర్ కూడా ఆయనతో మనసు విప్పి మాట్లాడారు. ‘‘మీరు అనుభవజ్ఞులు. నాకు ఇప్పుడు ఇరవై అయిదేళ్ళు. గవర్నమెంటు ఉద్యోగం ఉంది. అది వదిలేస్తే నాకు మరో ఉద్యోగం దొరకదు. నేను సినిమాకు పనికి వస్తానా? నాకు అర్హత ఉందా లేదా చెప్పండి. ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ దలచుకోలేదు. ఇక్కడ హీరోగా నిలదొక్కుకోగలనా? కాదు అంటే వెనక్కి వెళ్ళిపోతాను’’ అని యన్టీఆర్ ప్రసాద్ గారి సలహా కోరారు. ‘‘మీకేం తక్కువ. ఒడ్డూ పొడుగూ, అందం, వాచికం, అభినయం, శ్రద్ధా, పట్టుదలా అన్నీ మీలో పుష్కలంగా ఉన్నాయి. అయితే వీటన్నిటికీ అదృష్టం తోడవ్వాలి. అది కలిసివస్తే మీరు అచిరకాలంలోనే టాప్ ఆర్టిస్టు అవుతారు’’ అని ప్రసాద్ యన్టీఆర్ వెన్నుతట్టారు. ఆనాడు ఎల్.వి.ప్రసాద్ గారితో జరిగిన సంభాషణను నెమరేసుకుంటూ ‘‘అప్పుడే అదృష్టంతో పోరాడటానికి నిశ్చయించుకున్నాను’’ అన్నారు యన్టీఆర్.
తర్వాత బి.ఏ.సుబ్బారావు గారిని కలుసుకోవడానికి యన్టీఆర్ వెళ్లారు. వారి ఆఫీసు శోభనాచల స్టూడియోలో ఒక మూల షెడ్డులో ఉండేది. తెల్లటి లాల్చీ, పంచెలో యన్టీఆర్ స్టూడియోలో అడుగు పెట్టారు. ‘‘అన్నగారి ముఖం సాముద్రికం ప్రకారం త్రిసమవదనం. అంటే నుదురుపై శిరోజు మూలం నుంచి భూమధ్యం వరకూ, అక్కణ్ణించి నాసికాగ్రం వరకూ, అక్కణ్ణించి చుబుకం చివరి అంచు వరకూ మూడు భాగాలు కొలిస్తే మూడూ వెంట్రుకవాసి కూడా తేడా లేకుండా సమానంగా ఉండడం, ఇలాంటి వర్చస్సు కోటి మందిలో ఒకరికి ఉంటుందట’’ అని రచయిత మహారథి చెప్పారు.
బి.ఏ.సుబ్బారావు దూరంనుంచే చూపరులను కట్టిపడేసే యన్టీఆర్ ముఖాన్ని చూసి, ఎల్.వి.ప్రసాద్ ఆఫీసులో తాను చూసిన ఆల్బంలో
ఉన్న యన్టీఆర్గా పోల్చుకుని, తన అసిస్టెంట్ డైరెక్టర్ తాపీ చాణక్యతో ‘‘అదిగో మన హీరో’’ అని సగర్వంగా యన్టీఆర్ని చూడమన్నారు. యన్టీఆర్ నేరుగా ఆయన వద్దకే వచ్చి ‘‘సుబ్బారావు గారు ఎవరండీ’’ అని అడిగారు. తన కళ్ళముందు నిలబడ్డ యువకుడు ఫోటోలో కంటే అందంగా రాజసంతో ఉట్టిపడుతున్నాడు. సుబ్బారావు ఆనందానికి హద్దుల్లేవు. పరిచయమైన తర్వాత ‘‘మీ ఉత్తరం అందుకుని వచ్చానండీ. ఏ టెస్టులు చేయబోతున్నారు? స్క్రీన్ టెస్టా, వాయిస్ టెస్టా? లేదంటే రెండూనా?’’ అని యన్టీఆర్ వినమ్రతతో అడిగారు. బి.ఎ.సుబ్బారావు నవ్వి, చేతులు అడ్డంగా ఊపుతూ ‘‘నాకీ పరీక్షలపై నమ్మకం లేదు. మిమ్మల్ని చూశాను. మీతో మాట్లాడాను. మీరే మా హీరో. మా సినిమాలో జయంత్’’ అన్నారు. యన్టీఆర్ని కలుసుకున్న తరువాత బి.ఏ.సుబ్బారావుకు తన నిర్ణయం పట్ల విశ్వాసం మరింత పెరిగింది. ప్రతిభావంతుడు, తళుకులీనే అందగాడు, త్వరలో స్టార్ కాబోతున్న నటుణ్ణి కనుక్కోగలిగానని ఆయన చాలా ఆనందించారు. ‘‘వెల్దాం పదండి. ఎల్.వి.ప్రసాద్ గారిని కలుద్దాం’’ అన్నారాయన తృప్తిగా.
వెంటనే యన్టీఆర్ అగ్రిమెంటుపై సంతకం చేయించాలని బి.ఏ.సుబ్బారావు ఉత్సాహంగా
ఉన్నారు. ఎల్.వి.ప్రసాద్ మాత్రం తొందరపాటు తగదని, ఒక్కసారైనా తెరపై చూడకుండానే యన్టీఆర్ని హీరోగా తీసుకోవడంలో రిస్కు ఉందని మరోసారి హెచ్చరించారు. ఇది బి.ఏ.సుబ్బారావుకు దర్శక నిర్మాతగా, యన్టీఆర్‌కు హీరోగా మొదటి సినిమా. వాళ్లిద్దరిలో ఏ ఒక్కరూ తప్పటడుగు వేయడం ఆయనకు ఇష్టం లేదు. యన్టీఆర్ కెమెరా ముందు ఎలా నటిస్తారో, స్క్రీనుపై ఎలా ఉంటారో నిర్దుష్టంగా తెలుసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటే అన్నివిధాలా శ్రేయస్కరం అని ఆయన అభిప్రాయం. అందుకే ‘మనదేశం’ చిత్రంలో ఒక చిన్న వేషం వేస్తున్న యన్టీఆర్ నటన మొదట చూడమని బి.ఏ.సుబ్బారావుకు సలహా ఇచ్చారు. ఎల్.వి.ప్రసాద్ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపి, తనకేమాత్రమూ అనుమానం లేదని, యన్టీఆర్ తన చిత్రంలో జయంత్ పాత్రకు అన్ని విధాలా సరిపోతారని సుబ్బారావు చెప్పారు. అదే ఊపులో ఒప్పందం కూడా చేసుకున్నారు. ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో నటించేందుకు యన్‌టిఆర్ అగ్రిమెంటుపై సంతకం చేశారు. యన్టీఆర్‌కు వెయ్యిన్నూటా పదహారు రూపాయలు పారితోషికంగా ముట్టజెప్పారు. అది యన్‌టిఆర్ నట జీవితంలో మొట్టమొదటి పారితోషికం.
ఎల్.వి.ప్రసాద్ స్టార్ డైరెక్టర్. ఆయనతో పనిచేయడం నటునిగా తన వృత్తికి ఉపయోగపడుతుందని యన్టీఆర్‌కు తెలుసు. ‘మనదేశం’లో యన్టీఆర్ పోషించవలసిన పాత్ర పోలీస్ సబ్ – ఇన్ స్పెక్టరు. మొదట ఈ పాత్రను ఆఫర్ చేసినప్పుడు నిరాశపడ్డ యన్టీఆర్ కనీసం సమాధానం చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు నటునిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రాగానే ఆ పాత్రను పోషించడానికి ఉత్సాహం చూపించారు. ‘మనదేశం’ చిత్ర నిర్మాత మీర్జాపురం రాజా భార్య కృష్ణవేణి. ఆ సినిమాలో హీరోయిన్ కూడా. ఎల్.వి.ప్రసాద్ ఆమెకు యన్టీఆర్ని పరిచయం చేశారు. రెండు వేల రూపాయల పారితోషికంపై ‘మనదేశం’ సినిమాలో నటించడానికి ఆవిడే యన్టీఆర్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజుల్లో స్టార్ అయిన నాగయ్యకు ‘మన దేశం’ సినిమాలో నటించినందుకు తొంభై వేలు ఫీజు ఇచ్చారని చెప్పుకునేవారు. ‘మనదేశం’ హీరో సిహెచ్. నారాయణరావు పారితోషికం ఇరవై అయిదు వేలు. చిన్నపాత్రను పోషిస్తున్న కొత్త నటునికి ఆ రోజుల్లో రెండు వేల రూపాయల పారితోషికం చాలా ఎక్కువే కానీ ఎందుకో ఆమె యన్టీఆర్‌కు ధారాళంగానే ఇచ్చారు. రెండు సినిమాల్లో నటించడానికి ఒప్పందం కుదిరిన తర్వాత యన్టీఆర్ విజయవాడకు ఆనందంగా తిరిగి వచ్చారు. తన జీవితానికి భరోసా, భద్రత సమకూరాయని ఆయన భావించారు. సబ్ – రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే సినిమా జీవితంపై పూర్తి అవగాహన లేనందువల్ల, ఆర్థికంగా మద్రాసులో కుటుంబాన్ని పోషించగలనన్న విశ్వాసం లేనందువల్ల, భార్యను, కొడుకును విజయవాడలోనే తన తల్లిదండ్రుల పంచన వదిలి, ఒంటరిగా మద్రాసు వెళ్ళాలని యన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, పెదనాన్న షోకు రామయ్య ఆయనకు ఘనంగా వీడ్కోలు చెప్పారు.
అప్పట్లో డి.వి.ఎస్.మణ్యం నెం.1, లోఢీ ఖాన్ స్ట్రీట్, టి.నగర్లో ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉండేవారు. ‘మనదేశం’ సినిమాలో తన పార్టు షూటింగు పూర్తయ్యేవరకు యన్టీఆర్ ఆ ఇంట్లోనే ఉన్నారని, మణ్యం ఇంట్లో బజ్జీలను ఆయన మహా ఇష్టంగా తినేవారని అప్పట్లో జర్నలిస్టుగా పనిచేసి, తరువాతి కాలంలో పాటల రచయితగా సుప్రసిద్ధులైన వేటూరి సుందరరామమూర్తి చెప్పారు. అయితే రచయిత మహారధి కథనం ప్రకారం అప్పట్లో నెం.5, కుప్పుస్వామి స్ట్రీట్‌లో తన సహ విద్యార్థి వెంకటరత్నంతో కలసి ఒక గదిలో ఉండేవారు. ‘మనదేశం’ సినిమా షూటింగ్ మొదటిరోజున యన్టీఆర్‌ను తీసుకువెళ్లడానికి శోభనాచల స్టూడియో నుంచి ఓ డొక్కు కారు వచ్చింది. పక్క ఇళ్లలో ఉండే చిన్నపిల్లలు ఆ కారునే రోల్స్ రాయిస్ కారు అని వింతగా చెప్పుకున్నారని మహారథి అన్నారు.
యన్టీఆర్ని సినీరంగంలో డైరెక్ట్ చేసిన తొలివ్యక్తి ఎల్.వి.ప్రసాద్. ‘మన దేశం’ సినిమాలో షూటింగ్ కోసం యన్టీఆర్ ఖాకీ దుస్తుల్లో సబ్ ఇన్స్పెక్టర్గా సెట్లో కాలు పెట్టారు. ఆయనపై చిత్రీకరించిన మొదటి షాట్ స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన ప్రజలపై లాఠీ ఛార్జి చేయడం. ఎల్.వి.ప్రసాద్ తీయబోయే సీనుని, కెమెరా పొజిషనుని యన్టీఆర్‌కు చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమకారుల్లా నటిస్తున్న జూనియర్ ఆర్టిస్టులపై పోలీసు యూనిఫాంలో ఉన్న యన్టీఆర్ లాఠీచార్జి చేయాలి. కెమెరా రోలయింది. డైరెక్టర్ ‘యాక్షన్’ అని అరిచారు. యన్టీఆర్ పరుగెత్తుతూ జనంలోకి వెళ్లి వెనకాముందూ చూసుకోకుండా లాఠీతో అందరినీ చితకబాదుతూ చెల్లాచెదురు చేశారు. డైరెక్టర్ ‘కట్… కట్’ అని అరిచారు. ఆ మాటలు ‘మనదేశం’లో నాగయ్య యన్టీఆర్ జూనియర్ ఆర్టిస్టుల హాహాకారాల హెరులో యన్టీఆర్‌కి సరిగ్గా వినిపించలేదు. తాను జనాలను ఇంకా విజృంభించి బాదాలని డైరెక్టర్ చెబుతున్నారని యన్టీఆర్ అనుకున్నారు. డైరెక్టర్ చాలాసార్లు అరిచిన తరువాత చివరకు యన్టీఆర్ ఆపి, తన పవర్ ఫుల్ నటనకు తప్పకుండా అభినందిస్తారనుకుంటూ డైరెక్టర్ దగ్గరకు వచ్చి నిలబడ్డారు. కానీ దర్శకుడు యన్టీఆర్ని అభినందించలేదు సరిగదా చిరాకుగా, మహా కోపంగా ఆయన్ని చూసి ‘‘ఇది సినిమా నటించాలి. కొట్టినట్లుగా నటిస్తే చాలు. నిజంగా కొట్టక్కరలేదు’’ అని బాగా అక్షింతలు వేశారు. అది విన్న యన్టీఆర్ ‘‘పోలీసులు నిజంగా అలా బాదుతారు సార్’’ అని అమాయకంగా నసిగారు.
దర్శకుడు రీటేక్ చెప్పారు. కానీ జూనియర్ ఆర్టిస్టులు ఎక్కడా ఐపు లేరు. లారీని కత్తిలా రaళిపిస్తూ తమను కొడుతూంటే, వాళ్ళంతా చెల్లాచెదురై భయంతో పరుగు లంకించుకున్నారు. స్టూడియో అంతటా గాలించి వాళ్లందరినీ పోగుచేయడం ఒక సమస్య అయింది. ఎలాగోలా రెండో టేకులో ఏ సమస్యా లేకుండా షాటును చిత్రీకరించారు. తెరపై నటించడంలో యన్టీఆర్ మొదటి పాఠం నేర్చుకున్నారు. నాటకం వేరు. సినిమా వేరు. వెండితెర నటుడిగా యన్టీఆర్ తనను తాను తీర్చిదిద్దుకోవడం ఆనాటితో మొదలైంది.
‘మనదేశం’ సినిమా మొదటి సీన్ షూటింగులో ఆయన హీరో సిహెచ్. నారాయణరావుతో కలిసి నటించారు. ఆ సీన్ షూటింగు పూర్తయిన తరువాత తనకు సినిమారంగంలో రాణించే అవకాశం ఉందా, నిలదొక్కుకోగలనా అని హీరో గారిని యన్టీఆర్ వినయంగా అడిగారు. ‘‘మీకు మంచి పర్సనాలిటీ ఉంది. గొంతు బాగుంది. సంభాషణలు బాగా చెబుతున్నారు. నాటకానుభవం కూడా ఉంది కనుక తప్పకుండా ముందు ముందు మంచి అవకాశాలు వస్తాయి. స్టార్డం సాధించగలరు’’ అని సిహెచ్.నారాయణరావు ఆయనకు ధైర్యం చెప్పారు.
తరువాతి కాలంలో విధి వక్రించి సిహెచ్.నారాయణరావు చిన్న వేషాలు వేశారు. ఆయనకు తన సినిమాల్లో వేషాలిప్పించడం కోసం యన్టీఆర్ కూడా ఇతోధికంగా సాయం చేసారు.
1988లో యన్టీఆర్ని కలిసిన శాస్త్రవేత్త, రచయిత వి.ఎస్.ఆర్.మూర్తి బహుశా అంతకుముందు యన్టీఆర్ని ఎవరూ అడగడానికి సాహసించని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న: ‘‘మీ అభిమాన నటుడు ఎవరు?’’ యన్టీఆర్ వాత్సల్యంతో మూర్తి వంక చూసి ‘‘ఇంకెవరు? సిహెచ్.నారాయణరావు గారు. నిండు విగ్రహం. ప్రసన్న ముఖం. చదువుకున్న వారు. సంభాషణా శైలి అత్యంత సహజం. ఆంగికం అన్నిటినీ పలికిస్తుంది. మాటలో, చూపులో పలుచటి ఆభిజాత్యం. వారు మాకు సర్వదా గౌరవనీయులు’’ అన్నారు.
యన్టీఆర్ సినిమారంగంలో అడుగిడిన తొలినాళ్లలో ఎల్.వి.ప్రసాద్ ఆయనకు మార్గదర్శకులు. ఆయన యన్టీఆర్‌కు అమూల్యమైన సలహాలు ఇచ్చారు. షూటింగ్ లేని సమయంలో స్టూడియోలకు వెళ్ళి ఇతరుల నటన పరిశీలించమని, మెళకువలు నేర్చుకోమని ఆయన సూచించారు. యన్టీఆర్ ఆయన సలహా పాటించి, స్టూడియోల్లో షూటింగులు చూస్తూ ఎక్కువ సమయం గడిపేవారు. అప్పటికే సినీరంగంలో లబ్ధప్రతిష్ఠులైన నాగయ్య, అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) వంటి వారి నటనను పరీక్షగా చూసేవారు. అశోక్ కుమార్ వంటి హిందీ నటులు హాలీవుడ్ సినిమాలు చూసి నటనలో మెళకువలను, డైలాగులు పలికే విధానాన్ని, ముఖాభినయాన్ని, ఆంగీకాభినయాన్ని నేర్చుకుంటుంటే యన్టీఆర్ నటిస్తూనే, మిగత నటులను శ్రద్ధగా పరిశీలించి తన నటనకు మెరుగులు దిద్దుకున్నారు. ఎల్.వి.ప్రసాద్ సలహా మేరకే యన్టీఆర్ ప్రతిరోజూ సాయంత్రం మెరీనా బీచ్‌కి వెళ్లి సముద్రపు హోరులో డైలాగులు ప్రాక్టీస్ చేసేవారు.
ఇంకొక సలహా వ్యక్తిగతమైనది. యన్టీఆర్‌కు అప్పట్లో జర్దా కిళ్ళీ అలవాటు ఉండేది. బెజవాడ రాములుగారి జర్దా కిళ్ళీ చలనం లేకుండా నమలటంలో తన మిత్రబృందంలో యన్టీఆర్‌కు పెద్ద పేరు. ‘‘సినీ నటులకు కిళ్ళీ ఒప్పదు’’ అన్నారు ఎల్.వి.ప్రసాద్. ‘‘పంటికి పట్టిన గార వల్ల తెరమీద ముత్యాల్లా కనపడవలసిన పలువరుస ముక్కిపోయినట్లు కనిపిస్తుంది. ఎలాగూ తెరమీద జీవితం కొనసాగించాలనుకున్నారు గనుక ఈ అలవాటు మానివేయగలిగితే మంచిది’’ అని ఆయన సలహా చెప్పారు. ఆ ఒక్క మాటతో యన్టీఆర్ కిళ్ళీ అలవాటు మానుకున్నారు.
పూర్ణం లాడ్జిలో ఒక రూంలో యన్టీఆర్, టి.వి.రాజు, తాతినేని ప్రకాశరావు, యోగానంద్, రజనీకాంత్ ఉండేవారు. టి.వి.రాజు సంగీత దర్శకునిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే మిగిలిన ముగ్గురూ దర్శకత్వంపై దృష్టి పెట్టారు.
‘పల్లెటూరి పిల్ల’ సినిమా తారాగణంలో మొదట ఏఎన్నార్ లేరు. ఆరోజుల్లో శ్రీకృష్ణుడి వేషానికి సుప్రసిద్ధుడైన (ఈలపాట) కల్యాణం రఘురామయ్య ఆ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. కానీ రిహార్సల్ సమయంలో పోట్లగిత్తను చూసి ఆయన బెదిరిపోయారు. దానితో పోట్లాట ఆయన్ని కలవరపరిచింది. రెండు మూడుసార్లు రిహార్సల్ తర్వాత తన వల్ల కాదన్నారు. ఆ పాత్రకు తను సరిపోనని చెప్పేశారు. దాంతో బి.ఏ.సుబ్బారావుకు ఏం చేయాలో తోచని పరిస్థితి. ఏఎన్నార్ శ్రేయోభిలాషి అయిన దుక్కిపాటి మధుసూదనరావుకు ఈ విషయం తెలిసి, ఏఎన్నార్ ఆ పాత్రకు సరిపోతారని, ఆయన కాల్షీట్లున్నాయని బి.ఏ.సుబ్బారావుకు చెప్పారు. యన్టీఆర్ కంటే ఏఎన్నార్ నాలుగేళ్లు సీనియర్. అప్పటికే హీరోగా నిలదొక్కుకున్నారు. రెండవ హీరోగా, అదీగాక ఒకరిని బుక్ చేసిన తర్వాత రెండవ ఛాయిస్ క్రింద ఏఎన్నార్‌ని ఎలా సంప్రదించాలో తెలియక బి.ఏ.సుబ్బారావు సతమతమౌతున్న సమయాన, ‘పల్లెటూరి పిల్ల’ హీరోయిన్ అంజలీదేవి ఏఎన్నార్‌తో సంప్రదించే బాధ్యత తనపై వేసుకున్నారు. ఏఎన్నార్ ఆ పాత్రను పోషించడానికి అంగీకరించడంతో ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో ఏఎన్నార్, యన్టీఆర్ కలిసి నటించారు.
‘పల్లెటూరి పిల్ల’లో మొదటి సీనులో అంజలీదేవి కోపంతో యన్టీఆర్ని లాగి చెంపపై కొట్టాలి. అంజలీదేవి సుతారంగా ఆయన చెంపను తాకారు. కొట్టినట్లు నటించారు. అయితే తొమ్మిది టేకుల తర్వాత కూడా దర్శకుడికి తృప్తి లేదు. అంజలీదేవి హీరోను అలా కొడ్తున్నానని విలవిలలాడిపోయారు. ఇంకో టేక్ తీసుకుందామా అని దర్శకుడు యన్టీఆర్ని అడిగారు. పర్ఫెక్షన్ కోసం ఎన్ని టేక్ లైనా పరవాలేదన్నారు యన్‌టిఆర్. తరువాతి టేక్‌లో అంజలీదేవి తన చేతిని మెరుపులా కదిలించి యన్టీఆర్ని బలంగా చెంపపై దెబ్బ వేశారు. షాట్ ఓకే అయింది. యన్టీఆర్ నిశ్చలంగా ఉన్నా గానీ ఆయన మొహం ఎర్రబారింది. కొంచెం సేపటికి గాని ఆయన తేరుకోలేదు. ఒక కొత్త నటుణ్ణి అన్ని సార్లు చెంపపై కొట్టినందుకు అంజలీదేవి కళ్లనీళ్ళపర్యంతమయితే బి.ఏ.సుబ్బారావు, యన్‌టిఆర్ సీను బాగా వచ్చింది కదా అని ఆమెను ఊరడిరచారు. పోట్లగిత్తతో పెనుగులాడే సన్నివేశం ‘పల్లెటూరి పిల్ల’ సినిమాకు కీలకమైన సన్నివేశం. దాన్ని ఒక స్టంట్ మేన్‌తో చిత్రీకరించిన తర్వాత యన్‌టిఆర్‌తో క్లోజప్ షాట్లు తీసి కలపాలని బి.ఏ.సుబ్బారావు ఆలోచన. కానీ ఆ సీను తానే స్వయంగా చేస్తానని, డూప్ అక్కర్లేదని యన్టీఆర్ అన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన బలిష్టమైన పొగరుమోతు గిత్త అది. సీన్ ప్రకారం యన్టీఆర్ గిత్త ముకుతాడుని, ఒక కొమ్ముని పట్టుకుని దాన్ని లొంగదీసుకోవాలి. కెమెరా రోల్ అవ్వడం ప్రారంభం కాగానే డెరెక్టర్ ‘యాక్షన్’ అని అరిచిన వెంటనే, ఆ గిత్తకు యన్టీఆర్‌కి మధ్య నిజమైన పోరాటం మొదలైంది. ఎంత ఒడుపుగా కొమ్ములు పట్టుకుని గిత్తను ఆపాలని ప్రయత్నించినా ఆయనకది సాధ్యం కాలేదు. ఒక చేత్తో ముకుతాడును, మరొక చేతితో కొమ్మును గట్టిగా పట్టుకుని గిత్తను కొద్ది సేపు ఆపగలిగారు. యన్టీఆర్ చేతిలోంచి ముకుతాడు జారిపోయింది. ఆయన పట్టుకోల్పోయారు. డైరెక్టర్ కంగారుగా చేతులు తిప్పుతూ, సైగలు చేస్తూ గిత్తని వదిలిపెట్టి పక్కకు వచ్చేయమని గట్టిగా అరిచారు. యన్టీఆర్‌కి ఆయన మాటలు వినిపించలేదు. ఆయన తన రక్షణ కోసం గిత్తని నిలువరిస్తూనే ఉన్నారు. అది రెచ్చిపోతూనే ఉంది. ఈసారి గిత్త కొమ్ముల మధ్య యన్టీఆర్ని పైకెత్తి, కొమ్ము విసిరింది. యన్టీఆర్ కుడికన్ను క్రింద మొహం చీరుకుపోయి రక్తం కారింది. చెయ్యి ఫ్రాక్చర్ అయింది. కాకపోతే ఆ పోరాటం మొత్తం కెమెరాలో బంధించారు. సినిమాలో పోట్లగిత్తతో యన్టీఆర్ వీరోచితంగా పోరాడే సీన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
‘‘నేనే డూప్ వద్దన్నాను. అలా పట్టుబట్టడం మూర్ఖత్వమని ఆ సంఘటన తర్వాత నాకు జ్ఞానోదయమైంది. ఆ సంఘటన నా నటనలో ఎమోషనల్ డోస్ తగ్గించుకోవడానికి సాయపడిరది. నటిస్తున్న పాత్రను సొంతం చేసుకోవడం కంటే దానిని పండిరచడం ముఖ్యమని నేను అర్థం చేసుకున్నాను. అది నా నటజీవితంలో విలువైన పాఠం’’ అని యన్టీఆర్ గతస్మృతులు నెమరేసుకున్నారు. యన్టీఆర్ కుడిచేతి ఎముక విరిగింది. పుత్తూరు వైద్యమని ఒకాయన కట్టు కట్టారు. కాని అసలు పుత్తూరు వైద్యులు మార్కండేయ రాజుగారు సెంట్రల్ లాడ్జిలో ఉన్నారు. ‘‘మా పేరుతో చాలామంది వైద్యం చేసి మా పేరు నాశనం చేస్తున్నారు’’ అని ఆయన వాపోయి, కట్లు ఊడదీసి, పైన ఒక రాయి, క్రింద ఒక రాయి పెట్టి నరాలు విరగొట్టి ఆపైన కట్టు కట్టారు. కొన్ని రోజులు షూటింగు రద్దయింది. ఆ తర్వాత కొన్ని రోజులు కట్టు కనపడకుండా వదులుగా ఉన్న షర్టు వేసుకుని షూటింగులో పాల్గొన్నారు. కొన్ని రోజుల అనంతరం ఒక తెల్లవారుజామున షూటింగు పూర్తిచేసుకుని ప్రొడ్యూసర్ కారులో తిరిగి వస్తుండగా ఆ కారు చెట్టుకు గుద్దుకుంది. మళ్లీ కుడిచేతికి దెబ్బ తగిలింది.
చేతికి కట్టు కట్టుకుని, షూటింగు లేక రూంలో పడుకున్న సమయంలో అన్నను చూడడానికి చెప్పాచెయ్యకుండా త్రివిక్రమరావు మద్రాసుకు వచ్చారు. కట్టు చూసిన త్రివిక్రమరావు మ్రాన్పడిపోయి, అన్నని కనిపెట్టుకుని ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. అప్పట్నుండి జీవితకాలమంతా ఆయన యన్టీఆర్‌కు అండగా ఉన్నారు.
యన్టీఆర్‌కు చాప మీద పడుకునే అలవాటు. అలా ఎందుకని అడిగితే అది తనకు చిన్నప్పటి అలవాటు అన్నారు. తరచి అడిగితే, యన్ టిఆర్ తన హృదయాన్ని ఆవిష్కరించారు. చిన్నతనంలో వారింట్లో ఒకటే మంచం ఉండేది. తండ్రి, తమ్ముడు త్రివిక్రమరావు దానిపై పడుకునేవారు. తల్లీ, తనూ చాపపై పడుకునేవారు. ఇంటికి అతిథులు వచ్చినపుడు, ఆ ఒక్క చాపనూ వాళ్ళకిచ్చి, కటిక నేలపై తనూ, తన తల్లి పడుకునే వారమని యన్టీఆర్ చెప్పారు.
వయసు వచ్చిన తర్వాత కూడా, ఎప్పుడైనా తన తమ్ముడితో కలిసి ఒకే మంచం ఉన్న గదిలో ఉండవలసి వస్తే, అతనితో మంచం మీద పడుకుంటే పక్కమీద అటూఇటూ దొర్లినపుడు అతని నిద్రపాడవుతుందని, మంచం తమ్ముడికిచ్చి తాను చాప వేసుకునేవారు యన్టీఆర్.
త్రివిక్రమరావుకి చదువు అబ్బలేదు గాని పనులు చేయడంలో దిట్ట. అన్ని విషయాల్లోనూ ఆయన సమర్థుడే. అన్నగారిని కంటికి రెప్పలా చూసుకునేవారు. యన్‌టిఆర్ కూడా అన్ని విషయాలకూ తమ్ముడి మీద ఆధారపడేవారు. నాటకాలు వేసేటప్పుడు నేషనల్ ఆర్ట్ థియేటర్స్ నిర్వహణ బాధ్యతలు ఆయనే చూసుకునేవారు. సినిమాల్లో నటించడానికి మద్రాస్ వెళ్లాలా వద్దా అని యన్‌టిఆర్ ఆలోచిస్తున్నప్పుడు త్రివిక్రమరావు అవకాశాన్ని వదులుకోవద్దని అన్నగారిని ప్రోత్సహించారు. సంపాదన మొదలైన తర్వాత కూడా ఉమ్మడిగానే ఉన్నారు. అన్న రాముడికి తమ్ముడు త్రివిక్రమరావు లక్ష్మణుడే.
(కె. చంద్రహాస్ ` కె. లక్ష్మీనారాయణ
రచనలో వెలువడిన
‘యన్.టి.ఆర్. సమగ్ర జీవిత కథ’ పుస్తకం నుండి.
ఫోన్: 8008 44 9678 )
చిత్రసీమలో యన్టీఆర్ తొలి అడుగులు
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021