ఐదు నెలల నిర్బంధ జీవితానికి ఈ నెల నుంచి విముక్తి లభించింది. లాక్డౌన్లు, అన్‌లాక్‌ల నుంచి జనం తేరుకుంటున్నారు. భయాలను అటకెక్కించేసి రోడ్లపైకి వస్తున్నారు. ఇది సంతోషించదగ్గ విషయమే. కరోనా కారణంగా పూర్తిగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం అన్‌లాక్‌తో ఒక్కొక్కటిగా తెరిచే ప్రయత్నం చేసింది. ఇప్పుడు చివరి దశకు వచ్చేశాం. అన్‌లాక్-4తో దేశం మొత్తం దాదాపు తెరుచుకుంది. సినిమా హాళ్లు, వినోద పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వాటికి మినహా దాదాపు అన్నీ తెరుచుకున్నాయి. మెట్రో రైళ్లు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరిగి కార్యాలయాలు, వ్యాపార సంస్థలు కళకళలాడనున్నాయి.
వంద మందికి మించకుండా సామాజిక, విద్య, వినోద, సాంస్కృతిక, మత, రాజకీయ పరమైన సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇక, కొవిడ్ కారణంగా వెలవెలబోయిన పెళ్లి పందిళ్లు మళ్లీ కళకళలాడనున్నాయి. ఇప్పటి వరకు ఆంక్షలను ఎత్తివేసిన ప్రభుత్వం వందమంది వరకు పాల్గొనవచ్చని చెప్పడం శుభపరిణామం. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఇప్పటి వరకు నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. ఫలితంగా ప్రజలకు బోలెడంత ఊరట లభించింది. అయితే, సాధారణ ప్రజల్లో మాత్రం ఇంకా భయం ఉండనే ఉంది. బయట అడుగుపెట్టేందుకు ఇప్పటికీ జంకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలు సడలించినప్పటికీ మునుపటి సాధారణ జీవితం ఎప్పటికి సాధ్యమవుతుందన్న ప్రశ్నలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.
భయాన్ని అటకెక్కించేశారు
భారతీయుల మనోధైర్యానికి ఇది మచ్చుతునక. కరోనా కేసులు అప్పుడప్పుడే వెలుగుచూస్తున్న వేళ జనం మొత్తం భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ప్రతి రోజు దేశంలో వేలాది కేసులు వెలుగుచూస్తున్నా, మన చుట్టూ పదుల సంఖ్యలో రోగులు ఉన్నా ఏమాత్రం భయం లేకుండా రోడ్లపైకి వచ్చేశారు. అది మనల్నేం చేస్తుందన్న ధీమా ఇటీవల అందరిలోనూ కనిపించింది. అప్పటి వరకు ఉన్న భయాన్ని మూటకట్టి అటకపై పడేశారు. నిజానికి దేశంలో కేసులు ఎక్కువ కావడానికి ఇది కూడా ఒక కారణం.
ఇక, చైనాలో 86 వేల కేసులు నమోదైన వేళ భారతదేశంలో నమోదైన కేసులు పది లోపే. కానీ ప్రస్తుతం చైనా అక్కడే ఆగిపోగా భారత్ మాత్రం అమెరికా, బ్రెజిల్‌తో పోటీపడుతోంది. 35,42,733 కేసులతో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారత్.. తాజాగా మరణాల్లోనూ అదే స్థానానికి చేరుకుంది. మెక్సికోను దాటేసి 63,469 మరణాలతో అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానంలో నిలిచింది.
ఏపీ, తెలంగాణలోనూ అంతే..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్లక్ష్య ధోరణే ఇందుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసైనా కరోనాను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమని ఒకరు, బ్లీచింగ్ పౌడర్‌కే కరోనా చచ్చిపోతుందని మరో ముఖ్యమంత్రి ప్రకటనలు చేసి ప్రజల్లో అప్పటి వరకు ఉన్న భయాల్ని తాత్కాలికంగా పోగొట్టినా, ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలను కరోనా హాట్స్పాట్లుగా మార్చిందన్న విమర్శలున్నాయి. ఏపీలో గత కొన్ని రోజులుగా పదివేలకు తక్కువ కాకుండా కేసులు వెలుగు చూస్తుండగా, తెలంగాణలోనూ రోజు వారీ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ప్రతిపక్షాల హెచ్చరికలను బేఖాతరు చేసిన ఫలితం ఇప్పుడు కళ్లారా కనిపిస్తోంది.
ఏది ఏమైనా కరోనా రక్కని ఎదుర్కోవడంలో అటు ప్రభుత్వాలతోపాటు ఇటు ప్రజలు కూడా ప్రదర్శించిన ధైర్యసాహసోపేతాలు ప్రశంసనీయం. లేకుంటే దేశం మరింత సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. నిజం చెప్పాలంటే దేశంలో చాలా వరకు మరణాలు కరోనా కంటే భయమే కారణమన్న కొత్త నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాబట్టి, కరోనా వస్తే మనకేదో అయిపోతుందన్న భయాన్ని పక్కనపెడితే మిగిలేదంతా సంతోషమే. త్వరలోనే మంచి రోజులు రావాలని, జనం సుఖసంతోషాలతో మునుపటి జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుందాం.