బ్రహ్మయ్య అండ్ కంపెనీలో ప్రధాన భాగస్వామి
గవర్నర్ దత్తాత్రేయ, చంద్రబాబు సంతాపం
ప్రముఖ చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థ బ్రహ్మయ్య అండ్ కంపెనీలో ప్రధాన భాగస్వామి, సీనియర్ ఆడిటర్ దేవినేని సీతారామయ్య(93) కన్నుమూశారు. కేన్సర్‌తో బాధపడుతూ ఆదివారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సీతారామయ్యకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తన్నేరుకు చెందిన సీతారామయ్య విజయవాడలోని బ్రహ్మయ్య కంపెనీ ప్రధాన భాగస్వామిగా గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహితులు. ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా, టీటీడీ మాజీ చైర్మన్‌గా, హెరిటేజ్ కంపెనీలో డైరెక్టర్‌గా, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రా చాంబర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు డైరెక్టర్‌గా సేవలందించారు. సీతారామయ్య మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. 1983 నుంచి ఆయనతో పరిచయముందని తెలిపారు. ఆయన అల్లుడు కోటేశ్వర్రావుకు ఫోన్ చేసి మాట్లాడారు. సీతారామయ్య మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. టీటీడీ చైర్మన్‌గా సీతారామయ్య విశేష సేవలందించారని కొనియాడారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. సీతారామయ్యకు నివాళులర్పించారు. సీతారామయ్య మరణించడం విచారకరమని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
టీటీడీ మాజీ చైర్మన్ మృతి విచారకరం: టీడీపీ నేతలు
టీటీడీ మాజీ చైర్మన్, ప్రముఖ ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కో సీనియర్ భాగస్వామి, విజ్ఞాన జ్యోతి వ్యవస్థాపకులు దేవినేని సీతారామయ్య మృతి పట్ల టీడీపీ ఎంపీ సుజనాచౌదరి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ మంత్రి దేవినేని ఉమ విచారం వ్యక్తం చేశారు. సీతారామయ్యగారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. సీతారామయ్యగారి కుటుంబసభ్యులకు నేతలు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.