మన *స్వయంవరం* హీరో తొట్టెంపూడి వేణు గుర్తున్నారుగా! తనదైన అభినయంతో పలు చిత్రాలలో అలరించిన వేణు, 2013లో చివరి సారిగా *రామాచారి* చిత్రంతో తెరపై కనిపించారు. తరువాత హీరోగా ఆయన అస్సలు కనిపించలేదు. మధ్యలో తన దరికి చేరిన కీలక పాత్రల్లో నటించారు. కానీ, అవేవీ వేణుకు అంతకు ముందులా ఆనందం పంచలేదు. దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత వేణు *రామారావు ఆన్ డ్యూటీ* అనే చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రవితేజ హీరోగా రూపొందనున్న ఈ చిత్రాన్నిశరత్ మండవ తొలిసారి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కిస్తున్నారు. ఇందులో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ నాయికలుగా నటిస్తున్నారు.
తొట్టెంపూడి వేణు *చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, కళ్యాణరాముడు, ఖుషీ ఖుషీగా, పెళ్ళాం ఊరెళితే, పెళ్ళాంతో పనేంటి* వంటి చిత్రాలలో నటించి మంచిపేరు సంపాదించారు. ఆయన నటించిన *స్వయంవరం* చిత్రంతోనే రైటర్ గా త్రివిక్రమ్ కు, దర్శకునిగా విజయ్ భాస్కర్ కు మంచి గుర్తింపు లభించింది. 2012లో జూనియర్ యన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన *దమ్ము*లో ఓ ముఖ్యపాత్రలో కనిపించారు వేణు.
ప్రముఖ రాజకీయనాయకుడు, పారిశ్రామిక వేత్త నామా నాగేశ్వరరావు, వేణుకు బావ. గతంలో పలుమార్లు నామా నాగేశ్వరరావు తరపున తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు వేణు. ఓ నాటి మచిలీపట్నం ఎమ్.పి. మాగంటి అంకినీడుకు వేణు మనవడు. అలాగే ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ కు కూడా వేణు సమీప బంధువు. *దమ్ము*లో నటించిన తరువాత నుంచీ వ్యాపారం చూసుకుంటూ సాగుతున్నారు వేణు. *రామారావు ఆన్ డ్యూటీ* చిత్రంలో ఇప్పటి వరకు తాను పోషించనటువంటి వైవిధ్యమైన పాత్ర లభించిందని, అందుకే ఈ చిత్రాన్ని అంగీకరించానని వేణు చెబుతున్నారు. నూతన దర్శకుడు శరత్ మండవ అయినా వేణుకు మళ్ళీ బ్రేక్ ఇస్తారేమో చూడాలి.