మహాత్ముడి ప్రశ్నతో వ్యవసాయంలోకి దిగా: గొట్టిపాటి బ్రహ్మయ్య

G

పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య గురించి, బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు ఆయన అనుభవించిన కష్టాల గురించి ఈ తరానికి తెలియడం చాలా అవసరం. అందుకోసమే గత కొన్ని నెలలుగా ఆయన ఆత్మకథ ‘నా జీవన నౌక’ నుంచి ఒక్కో నెల ఒక్కో అధ్యాయాన్ని ప్రచురిస్తున్నాం. మహాత్మాగాంధీతో ఆయన సాన్నిహిత్యం గురించి, హరిజనోద్యమంలో మహాత్ముడితో తన ప్రయాణం గురించి చెప్పిన ‘ఆంధ్రదేశంలో మహాత్ముని హరిజన ఉద్యమ ప్రచారం’ అధ్యయనం నుంచి యథాతథంగా మీకోసం..
————– ———————

1929లో మహాత్ముడు ఖద్దరు ఉద్యమం కోసం సంచారం చేసినట్టుగానే, 1933 డిసెంబరులో ఆంధ్రదేశమంతా కూడా సంచారం చేశారు. ఆంధ్రదేశ హరిజన సంఘాధ్యక్షులు దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు, ప్రధాన కార్యదర్శి మాగంటి బాపినీడుగార్ల ఆధ్వర్యంలో ఈ సంచార కార్యక్రమం జయప్రదంగా నిర్వహించబడింది. ఆయా జిల్లాలలో జిల్లా హరిజన సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కార్యక్రమాన్ని నిర్వహించారు. మా తూర్పు కృష్ణా జిల్లా హరిజన సంఘాధ్యక్షుడు డాక్టర్ మరిగంటి శేషాచార్యులు, ప్రధాన కార్యదర్శి వీరపనేని గోపాలకృష్ణయ్యగార్లు కార్య సంఘ సభ్యుడిగా ఉండి, నేను వీరికి చేయూత నిస్తూ ఉండేవాడిని. ఈ సంచారంలోనే ముదునూరులో త్యాగధనుడు అన్నె అంజయ్యగారి కృషి ఫలితంగా, ఆ ఊరి దేవాలయంలో హరిజన ప్రవేశం గాంధీగారి ఆధ్వర్యాన జరిగింది. అలాగే, సిద్ధాంతంలో జస్టిస్ పార్టీ నాయకుడు అడుసుమిల్లి గోపాలకృష్ణయ్యగారి కృషి ఫలితంగా, మహాత్ముని ద్వారానే దేవాలయ హరిజన ప్రవేశం జరిగింది. మరిగంటి శేషాచార్యులుగారు ఈ హరిజన సంఘం తరపున బందరులో హరిజనులకు ఉచిత చికిత్సాలయము (ఆసుపత్రి) ఏర్పాటు చేసి, తన మిత్రులైన డాక్టర్ల సహాయంతో నడుపుతూ ఉండేవారు. అది ఈనాటికీ జయప్రదంగా రోటరీ క్లబ్బువారి యాజమాన్యమున నడుస్తూ ఉన్నది. ఇందుకు శేషాచార్యులుగారిని, బందరులోని వారి మిత్రుల్ని నేను అభినందిస్తున్నాను. ఈ సంచారంలో బందరు మాత్రమే చేర్చబడింది. తగినంత వ్యవధి లేకపోవడంతో చేతను, అది వర్షాకాలం అగుటచేతను దివి తాలూకా చేర్చబడలేదు.

బందరులో ఆంధ్ర జాతీయ కళాశాలలోనే మహాత్ముని బస, బహిరంగ సమావేశం దిగ్విజయంగా జరిగింది. కళాశాల స్థాపకులు కీర్తిశేషులు కోపల్లె హనుమంతరావు పంతులు గారు, ముట్నూరి కృష్ణారావుగారు- వీరందరూ 1906 నుంచి కూడా అంటరానితన నిర్మూలన కోసం పాటుపడినవారే. వారి గురువర్యులు బ్రహ్మమతావలంబ బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు నోబుల్ కళాశాలలో అధ్యాపకులుగా ఉన్నప్పుడు, ఈ నాయక త్రయమే గాక, ఆంధ్ర దేశంలో మహాత్ముని ఉద్యమంలో చేరి అగ్రనాయకులుగా పేరుపొందిన శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు ప్రభృతులను ఎంతోమందిని తమ బోధనల ద్వారా అస్పృశ్యతా నిర్మూలనకు పాటుపడునట్లు చేసియున్నారు. వారి ప్రబోధనలు ఈ ఉద్యమంలో ఎంతో సత్ఫలితాలనిచ్చాయి. శ్రీ వెంకటరత్నం నాయుడుగారి ప్రియ శిష్యుడు వేమూరి రామకృష్ణారావు గారి చిన్న తమ్ముడు వేమూరి రాంజీరావు గారు జీవితాంతమూ బ్రహ్మచారిగా ఉండి, ‘‘దీనబంధు’’ అనే పత్రికను స్థాపించి, హరిజనోద్యమానికి తన జీవితమును ధారపోశారు. దీనబంధు రాంజీరావుగా ప్రతిష్ఠనార్జించుకున్నారు. ఆయన స్థాపించిన హరిజనపాఠశాల ఆయన కాలంలోనే హైస్కూలై, మంచి హాస్టలు కలిగి, నేటికీ దిగ్విజయంగా ప్రభుత్వ యాజమాన్యమున నడపబడుతున్నది. హరిజన నాయకులైన శ్రీ వేముల కూర్మయ్య, శ్రీ తానేటి వీరరాఘవులు ప్రభృతులు ఈ పాఠశాలలో చదివి పెరిగి పెద్దవారైనవారే. ఇట్టి బందరు హరిజనోద్యమంలో మహాత్మునికి అండదండలుగా ఉండడం సహజం.

నేను, దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు, బాపినీడు గార్లకు ముందుగానే ఉత్తరాలు రాసి బాపినీడుగారిని కలుపుకుని, చల్లపల్లిని కూడా ఆ కార్యక్రమంలో చేర్పించాను. నేను రూపొందించిన కార్యక్రమానుసారంగానే మహాత్ముడు చల్లపల్లి దయచేశారు. బందరు నుంచి చల్లపల్లి వరకు మహాత్ముని కారులోనే నేనూ ఉన్నాను. ఈ దేవాలయ ప్రవేశ సందర్భంలో ఘంటసాలలో జరిగిన విషయమంతా వారికి చెప్పాను. వారు ఆనందించారు. చల్లపల్లిలో శ్రీమంతు రాజా హైస్కూలు ఆవరణలో 1933 డిసెంబరు 17న రాత్రి 8 గంటలకు బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది. అది తాలూకాలోనే ముఖ్యకేంద్రమగుటచేత ఆ తాలూకాలోని అన్ని గ్రామాల నుంచి కూడా తండోపతండాలుగా తిరునాళ్లకు వచ్చినట్టు తరలివచ్చారు. వారిని సర్ది జాగ్రత్తగా కూర్చోబెట్టడం చాలా కష్టమైంది. చల్లపల్లి జమీందారి ఉద్యోగులు కొంతమంది చల్లపల్లి గ్రామంలోని వలంటీర్లు, ఘంటసాల నుంచి వచ్చిన వలంటీర్లు కలిసి ప్రజలను ప్రశాంతంగా కూర్చుండజేశారు.

చల్లపల్లి జమీందారి తరపున దివాన్ పంజాల వెంకటేశం చౌదరిగారు వెయ్యి రూపాయలు ఈ నిధికి వాగ్దానం చేయడం జరిగింది. వాగ్దానం ప్రకారంగా వారు నాకా మొత్తం ఇవ్వడం, అది తాలూకా హరిజన నిధి కింద చేర్చి హరిజన విద్యార్థులకు పుస్తకాలు వగైరాలు ఇచ్చుట ద్వారా ఖర్చుపెట్టడం జరిగింది. శ్రీ జమీందారుగారికి, దివాన్ గారికి నా అభినందనలు అందజేశాను. మహాత్ముని హెచ్చరిక అనుసరించి స్త్రీల ఆభరణాలను మహాత్మునికి అర్పించారు.

దివి తాలూకా హరిజన సేవా సంఘం

17-12-1933వ తేదీన మహాత్ముడు చల్లపల్లి విచ్చేసినప్పుడు వారి హరిజన సేవా నిధికై ఉచిత విరాళములను, కానుకలను ఒసగి తోడ్పడిన సోదర సోదరీమణుల నామముల నిచ్చుట ప్రకటించుచు వారెల్లరకును, దివి తాలూకా హరిజన సేవా సంఘ పక్షమున కృతజ్ఞతా పూర్వక నమస్మృతులర్పించుకున్నాము.

1. చల్లపల్లి గ్రామవాసులు రూ. 150
2. ఘంటసాల గ్రామవాసులు రూ.116
3. పురిటిగడ్డ ఖాదీ సంస్థలు రూ. 116
4. నాగాయితిప్ప గ్రామవాసులు రూ. 27-30
5. తాడేపల్లి గ్రామవాసులు రూ. 20
6. నసరపాలెం రూ. 20
7. పెదప్రోలు రూ. 10
8. కాజీ రూ. 16
9. దాలిపర్రు రూ. 15
10. ఇతర వసూళ్లు మొత్తం రూ. 400
సభలో వసూలు చేయబడిన మొత్తం రూ. 400
వసూలైన నూలు సుమారు రూ. 100
వస్త్రముల సుమారు విలువ రూ. 50
నాదెళ్ల రంగనాయకమ్మగారు రూ. 12-49
కావూరి కోదండరామయ్యగారు 1 గడియారం, వెండి గొలుసుతో సహా
కొర్రపాటి అంకమ్మగారి కుమారుడు వెంకట శివరామకృష్ణ ప్రసాదు గారు హరిజనులకు నివాసయోగ్యమైన స్థలము 1/2 ఎకరము
కొర్రపాటి అంకమ్మగారి కుమార్తె భ్రమరాంభగారు బంగారు గాజుల జత
గొట్టిపాటి సరస్వతమ్మగారు బంగారు గాజుల జత
దేవభక్తుని బసవనాగమ్మగారు బంగారు గాజుల జత
కొర్రపాటి లక్ష్మమ్మగారు బంగారు గాజుల జత
నాదెళ్ల భాస్కర హృదయాలయము బంగారు గాజుల జత
గుత్తికొండ అచ్చయ్యగారు బంగారు ఉంగరము
కళారు వెంకట త్రిపురాంబగారు బంగారు ఉంగరము
కొర్రపాటి రాజా రామమోహనరావుగారు బంగారు ఉంగరము
చండ్ర దుర్గా అన్నపూర్ణమ్మగారు బంగారు ఉంగరం
నూలిచ్చిన వారి పేర్లను, వస్త్రములను సమర్పించిన వారి పేర్లను వ్యక్తిగతముగ తమకు తోచిన దానము లొసంగిన వారి పేర్లను స్థల విస్తీర్ణ భీతిచే ప్రకటింపజాలనందుకు చింతిల్లుచు వారెల్లరకు నా అభినందనలు తెలుపుతున్నాను.

గొట్టిపాటి బ్రహ్మయ్య, కార్యదర్శి
హరిజన సేవాసంఘము, దివి తాలూకా
(కృష్ణా పత్రిక నుంచి గ్రహించబడినది)

మహాత్ముని ఉపన్యాసము 20 నిమిషాలపాటు సాగింది. అందులో హరిజన ఉద్యమాన్ని గురించి ప్రజల హృదయాలకు హత్తుకునేలా బోధించారు. ఘంటసాలలో హరిజనులకు దేవాలయ ప్రవేశం జరిగినందులకు ఆనందిస్తూ గ్రామస్థులను ప్రశంసిస్తూ వారి ననుసరించవలసిందిగా ప్రజలను హెచ్చరించారు. ఖద్దరు నిధి వలెనే ఎక్కడ పోగుచేసిన ధనాన్ని అక్కడ హరిజన ఉద్యమ వ్యాప్తికై మహాత్ముడు ఇచ్చి వెళ్లారు. తరువాత హరిజన ఉద్యమానికి ప్రాముఖ్యమునిస్తూ కల్లు దుకాణాల పికెటింగు, విదేశీ వస్త్ర దుకాణాల పికెటింగులు నిర్ణయ కాలంలో చేస్తూ ఉండేవారము. ఈ పికెటింగుల సందర్భములో బందరులో స్వచ్ఛంద సేవలకు భోజన వసతి కలుగజేయుటకు ధన సేకరణ సందర్భమున మా గ్రామంలో శ్రీ వేమూరి లక్ష్మయ్యగారు సహాయ సంపత్తి పూర్తిగా ఇచ్చేవారు.

స్వంత వ్యవసాయం

1929వ సంవత్సరంలో ఖద్దరు ప్రచార సందర్భంలో మహాత్ముని కారులో నేను ఉన్నప్పుడు, నా వృత్తిని గురించి తెలుసుకుని, ‘స్వంత వ్యవసాయం చేస్తున్నావా? భూమి ఉన్నవాడివి స్వంతంగా వ్యవసాయం చెయ్యకపోతే ఎలా?’ అని మహాత్ముడు అన్నారు.

‘‘నేను ఒంటరి వాణ్ణే. వ్యవసాయం చేస్తూ రాజకీయాలలో తిరగడం కష్టతరం అయింది’’ అని చెప్పాను. కానీ భూమి గలవాడు స్వంతంగా వ్యవసాయం చెయ్యడం ధర్మం. అని నాలో స్థిర అభిప్రాయం ఏర్పడింది. జైలు నుంచి వచ్చిన తర్వాత 1931లో నేను ఎడ్లను కొని స్వంతంగా వ్యవసాయం పెట్టాను. ఆవులను కూడా కొన్నాను. ఘంటసాలలో ఉన్నప్పుడు నిత్యమూ పొలంలోకి వెళ్లడం, వ్యవసాయం శ్రద్ధగా చూసుకోవడం చేస్తూ ఉండేవాడిని. 1932లో జైలుకు వెళ్లినప్పుడు కూడా మా మామగారి అజమాయిషీలో, మా బావ మరుదులే నా భూమిని సేద్యం చేయించేవారు. 1934లో జైలు నుంచి వచ్చిన తర్వాత ఆర్థిక మాంద్యం ఏర్పడి పరిస్థితులు తారుమారు అయ్యాయి. ధాన్యం ధర బొత్తిగా పడిపోయింది.

అప్పుడు నాకు కొంత వడ్డీ వ్యాపారం ఉండేది. ఆ పరిస్థితుల్లో నాకు రావాలసిన బాకీలు వసూలు చేసుకుని, కొంత భూమి కొనుక్కోవాలని అభిప్రాయపడ్డాను. నాకు బాకీలు ఉన్న వారిందరినీ కబురు చేసి, నూటికి నెలకు ఒక రూపాయి వడ్డీ వున్న వాళ్లను, అర్ధ రూపాయి తీసుకుంటాను. డబ్బు తీసుకుని రావాల్సిందిగా కోరాను. వారికి వడ్డీలో సగానికి సగం తగ్గించడం వల్ల బాకీలు దాదాపు అన్నీ వసూలయ్యాయి. మా బంధువులలో వడ్డీ వ్యాపారం చేసేవారు దానిని చాలా తెలివి తక్కువగా భావించి, మందలించారు. ఈ డబ్బుతో నేను మరికొంత మెట్టభూమిని కొన్నాను. అది వరకు ఒక అరక వ్యవసాయం ఉంటే, రెండవ అరక కూడా కట్టి వ్యవసాయం సాగించాను. చాలా శ్రద్ధాభక్తులతో చేయించే వాడిని. నేను నిత్యం పొలం వెళ్లి పశువులను మేపడం వంటి పనులను చేస్తూ ఉండేవాడిని.

ఇంటి వద్ద నేను ఎప్పుడూ పశువుల చావడి వద్దనే ఉండేవాడిని. అక్కడే నా కచేరి కూడా. నా కొరకు ఎవరు వచ్చినా ముందు నా పశువుల చావడిలోకే వచ్చేవారు. భూమికి సరైన ఎరువులు వేసి, ఎక్కువ పంట పండించే వాడిని. పశువులను బాగా మేపేవాడిని. ప్రతి సంవత్సరము ఒకటి, రెండు గిత్తలను కూడా అమ్మేవాడిని. మా ఆవులు ఎక్కువగా కోడె దూడల్ని పెట్టేవి. మంచి మంచి పాడి పశువులు, ఎడ్లు వగైరాలు చెప్పదగినవి వుండవి. మా గ్రామంలో
ఆదర్శ వ్యవసాయయదారునిగా నాకు మంచిపేరు వుండేది. రాను రాను కాలంమారి మళ్ళీ భుముల ధర పెరగడం, మెట్టభుములు మాగాణి భుములు కావడం దీనినిబట్టి మొదట వడ్డీలు సగానికి సగం రాయితీచేసి, రావలసిన బాకీలు వసూలు చేసినప్పుడు నన్ను తెలివితక్కువ వాడుగా భావించిన బంధువులే యిప్పుడు తెలివైన వానిగా ప్రశంసంచారు.

జీవితభీమా కంపెనీ (ఆంధ్ర)

నేను తాలుకా బోర్డు అధ్యక్షుడిగాను, మీర్జాపూర్ ఎన్నికల దావాలో వాదిగాను, కొంత ప్రతిష్ట, ప్రజారంజకత్వము సంపాదించుకొన్న తర్వాత – డాక్టరు పట్టాభి సీతారామయ్య గారు, చెరుకువాడ వెంకట నరసింహంగారు. వీరు స్థాపించిన ఆంధ్ర జీవిత భీమా కంపెనీకి నన్ను బెజవాడలో ఆర్గనైజరుగా నియమించిన కంపెనీకి లాభదాయకంగా వుంటుదని భావించారు. ఆ సంగతి అనేకసార్లు నరసింహంగారు నాతో చెప్పి జీవిత భీమా కూడా ప్రజాసేవ కిందే జమకట్టదగిందిగా, వారి సహజ ధోరణిలో చెబుతూ ఉండేవారు. నేను సమాధానం చెప్పేవాణ్ణికాదు. ఒక రోజున పట్టాభిగారు నాతో ‘‘నరసింహంగారు భీమా
కంపెనీకి ఆర్గనైజరుగా మిమ్ములను వుండమని ఎన్నిసార్లు కోరినా, మీరు సమాధానం చెప్పడం లేదని నాతో చెప్పారు. మీ అభిప్రాయం ఏమిట‌‌‌‌‌‌’’ని అడిగారు. ‘‘నాకు కొన్ని సందేహాలున్నాయండి. అవి మీ వద్ద తీర్చుకొన్న తర్వాత వారికి సమాధానం చెబుదామనుకున్నాను’’ అని చెప్పాను. ఆ సందేహాలేమిటని నన్నడిగారు.

‘‘మీరు నన్ను చిన్నవాడినైనా ‘‘బ్రహ్మయ్యగారూ’’ అని సంబోధిస్తున్నారు. నేను ఆర్గనైజరునైన తర్వాత కూడా మీరీ విధంగానే సంబోధిస్తారా? అప్పుడు నేను మీ వద్దకు ఫైల్స్ తీసుకొని వస్తే ఇప్పుడు మాదరిగానే కూర్చోమంటారా? లేక నిలబెట్టి మాట్లాడుతారా?’’ అని అడిగాను.
‘‘ఇవా మీ సందేహాలు? అట్లయితే ఆ ఉద్యోగం మీకక్కర్లేదు లెండి’’ అన్నారు. తర్వాత నరసింహంగారితో ఈ సంభాషణ విషయం చెప్పాను. వారు నవ్వుకున్నారు.

Share: