మహాభారతంలో ఏం జరిగిందో గుర్తెరిగితే మేలు: వడ్డే శోభనాద్రీశ్వరరావు

Vsb

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మూడు రాజధానుల అంశం, అమరావతి రైతుల పోరుబాట, ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టుల ఆగ్రహం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ దుస్థితి, ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలను చర్చిస్తూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రాసిన ‘పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డాం’ వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు, ప్రజా వ్యతిరేక విధానాలను శోభనాద్రీశ్వరరావు దునుమాడారు. అమరావతి విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తన వైఖరి మార్చుకోవాలని, మహాభారతంలో ద్రౌపదికి జరిగిన అవమానం వలన మొత్తం కౌరవ వంశమంతా తుడిచిపెట్టుకుపోయిన విషయాన్ని గుర్తెరగాలని హెచ్చరించారు. వేలాది మంది మహిళల ఆవేదన, ఆగ్రహం జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి శ్రేయస్కరం కాదని గ్రహించాలని సూచించారు. శోభనాద్రీశ్వరరావు రాసిన ‘పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డాం’ పుస్తకంలోని ఆయన ప్రస్తావించిన అంశాలలో కొన్ని యథాతథంగా మీకోసం..

అర్హులందరికీ పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇరిగేషన్ ప్రాజెక్టులు మున్నగు పథకాలను అమలు చేసిన స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల అభిమానం వలన, నవరత్నాల పేరుతో ఆకర్షణీయమైన, సంక్షేమ పథకాలను అమలు చేసేదానికి, ఒక్క పర్యాయం అవకాశం ఇవ్వమని పాదయాత్రలో జగన్మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి అధికశాతం ప్రజలు స్పందించి అవకాశం కల్పించారు. ఎన్నికల నాటికే అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు అవసరమైన సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టులు ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగుల నివాస భవన సముదాయాల నిర్మాణాలను కొద్ది వందల కోట్ల ఖర్చుతో పూర్తిచేసేసి, ప్రశాంతంగా తాను వాగ్దానం చేసిన నవరత్నాలను అమలు చేసుకుంటూ పాలించడానికి బదులుగా జగన్‌మోహన్‌రెడ్డి తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళుతున్నారు. రాజ్యాంగం గురించి గానీ, ప్రజాస్వామ్య విలువల గురించి కానీ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ పరిధులు, చట్టాలు మున్నగు వాటి గురించి కనీస అవగాహన లేకుండా, తనకు తోచినది తప్ప అనుభవశీలురైన సలహాదారులు చెప్పేది వినకుండా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరించడం అత్యంత దురదృష్టకరం.

పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు:

ఉచిత ఇసుక విధానం రద్దు, స్థానిక సంస్థల భవనాలకు వైకాపా రంగులు, పేదలకు ఇండ్ల స్థలములు ఇవ్వాలనే సాకుతో పలు దశాబ్దాలుగా పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డు భూములు, బంజరు భూములను సంబంధిత చట్టాలను విస్మరించి దౌర్జన్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను వినియోగిస్తూ బలవంతంగా స్వాధీనం చేసుకుంటూ పేదల పొట్టకొడుతుండడం, అమరావతి రాజధాని కొరకు ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు అందజేసిన రైతులపై అక్రమ కేసులను బనాయిస్తూ కోర్టు ఉత్తర్వులను విస్మరిస్తూ, తనకు తోచిన విధంగానే జగన్ నడుస్తుండడం ఆశ్చర్యకరం. తన పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు కాబట్టి, తాను చెప్పిందే వేదంగా ప్రజలు స్వీకరించాలని, నవ్యాంధ్రప్రదేశ్ తానొక రాజునని, తన మాటను ఎవరూ జవదాటడానికి వీలులేదని, తనమాటే చెల్లుబాటు అవ్వాలని ఆయన ఆలోచిస్తూ ఉండడం, అతడి అనుభవ రాహిత్యాన్ని, రాక్షస ప్రవృత్తిని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. అందుకు ఉదాహరణే ఇటీవల స్థానిక సంస్థలకు నామినేషన్ల సందర్భంలో రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని దౌర్జన్యకాండ, హింస చోటుచేసుకోవడం.

కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిన మార్గదర్శక సూత్రాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర అధికారులతో సంప్రదించి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌‌కు ‘‘కులాన్ని-వర్గాన్ని’’ స్వయానా ముఖ్యమంత్రి ఆపాదించడం ఎంతమాత్రమూ తగదు. సర్వీసు మొత్తంలో వివిధ బాధ్యతలను ఉన్నత, నైతిక విలువలతో నిర్వర్తించి రాష్ట్ర గవర్నర్ కార్యదర్శిగా దీర్ఘకాలం సేవలు అందించి గవర్నర్ సూచన మేరకు రాజ్యాంగబద్ధ పదవి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్న వ్యక్తిపైన శాసనసభా స్పీకర్, పలువురు మంత్రులు, వైకాపా కార్యదర్శి విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన తీరుపట్ల సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటూ ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని 5 నుంచి 3 సంవత్సరాలకు తగ్గించిన ఆర్డినెన్స్‌ను, 75 సంవత్సరాల వయసు వున్న రిటైర్డు జస్టిస్ కనగరాజ్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జీవోను కొట్టివేసినా, రమేశ్‌కుమార్‌ను తిరిగి ఎన్నికల కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం ఎంతమాత్రమూ సరికాదు.

మహాభారతంలో ద్రౌపదికి జరిగిన అవమానం వలన, మొత్తం కౌరవ వంశమంతా తుడిచిపెట్టుకుపోయింది. అమరావతి నుండి రాజధానిని తరలించవద్దని 220 రోజులకు పైగా క్రమశిక్షణతో, శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న వేలాది మహిళల ఆవేదన, ఆగ్రహావేశాలు జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి శ్రేయస్కరం కాదని గ్రహించాలి.

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అనేక బిల్లులను ఆమోదించినప్పటికీ, లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మెజారిటీ సభ్యులు ప్రాథమిక విద్యాబోధన మాతృభాష తెలుగు మాధ్యమంలోనే కొనసాగడం మంచిదనే భావనతో వ్యతిరేకించడం మరియు అమరావతిలో రాజధాని నిర్మాణం జరిగి కొనసాగుతూ ఉండగా మూడు రాజధానుల బిల్లును లోతైన పరిశీలన కొరకు సెలక్టు కమిటీకి పంపాలని మెజారిటీ సభ్యులు వెలిబుచ్చిన అభిప్రాయానికి అనుగుణంగా కౌన్సిల్ చైర్మన్ ప్రకటించినందుకు ఆగ్రహించిన ముఖ్యమంత్రి కౌన్సిల్‌నే రద్దు చేయాలని నిర్ణయించడం అత్యంత అవివేకమైన చర్య. సెలక్ట్ కమిటీని వేయకుండా 3 రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో పిటిషన్లు పరిశీలనలో ఉండగా, రెండవ పర్యాయం అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి, గవర్నర్ ఆమోదమునకు పంపడం ఎంతమాత్రం తగదు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం లక్షాదిమంది రైతులు, పేదలు ఎదుర్కొంటూవున్న సమస్యలను పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకొనకపోవడం, పాలనాపరమైన వైఫల్యాల వలన క్రమేపీ ప్రజాదరణ కోల్పోతున్నదని, రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైకాపా ప్రభుత్వం వస్తే ‘‘మన రాష్ట్రం పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడిన చందం అవుతుందని’’, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తాయని పలువురు మిత్రులకు చెబుతూ ఉండేవాడిని. ఈనాడు అక్షరాలా అదే జరుగుతూ ఉంది.

వరుసగా పలు సందర్భాలలో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి వ్యాఖ్యలు/ఉత్తర్వులు దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుండైనా తన ఆలోచనా విధానాన్ని, పరిపాలనా తీరును మార్చుకోకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోవలసి వస్తుందని ముఖ్యమంత్రి గ్రహించాలి. అంతేకాక రాజ్యాంగబద్ధ పాలనను అమలు చేయకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 మరియు 356ల ననుసరించి గవర్నర్ పాలన విధించే అవకాశం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి గ్రహించాలి. రాజ్యాంగంలోని నిబంధనలు, చట్టాలను అనుసరించి అమరావతి నుంచి రాజధానిని వైజాగ్ తరలించడం అసాధ్యమని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గ్రహించి, భేషజాలకు పోకుండా, మూర్ఖపు పట్టుదలను విడనాడి అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని ప్రకటించి తన గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.

vsb1

నాడు ముద్దు-నేడు వద్దు:

రాష్ట్ర శాసనసభలో గుంటూరు-విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు నాడు ప్రధాన ప్రతిపక్షమైన వైకాపాతో సహా అన్ని పక్షాలు ఆమోదం తెలపడమేకాక, ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు తెలపడమే కాక రాజధానికి కనీసం 30 వేల ఎకరాలు అవసరం ఉంటుందనే భావన వ్యక్తం చేశారు. అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 23 ఏప్రిల్ 2015న నోటిఫై చేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఏపీ పునర్ విభజన చట్టం 2014, సెక్షన్ 94 (3) ప్రకారం అమరావతిలో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, మౌలిక వసతుల కొరకు రూ. 1500 కోట్లను కేంద్ర ప్రభుత్వం అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1650 కోట్ల మేరకు వ్యయపర్చి కేంద్రానికి వినియోగ పత్రాలను అందించింది. నీతి ఆయోగ్ మరొక రూ. 1000 కోట్లను కూడా అమరావతి రాజధాని నిర్మాణాలకు అందజేయాలని ఏటా రూ. 333 కోట్ల చొప్పున మూడేళ్లలో అందించాలని సిఫార్సు చేసినా కేంద్రం విడుదల చేయలేదు.

రాజధానికి అవసరమైన వ్యవస్థలన్నీ ఏర్పడి వున్నాయి:

8.4 ఎకరముల విస్తీర్ణంలో జి+5 నిర్మాణానికి వీలుగా డిజైన్ చేసి ప్రస్తుతానికి జి+2గా 2.52 లక్షల చదరపు అడుగల కార్పెట్ ఏరియాతో 23 కోర్టు హాళ్లుగా రూ. 176 కోట్లు ఖర్చు చేసి నిర్మించిబడిన సుందరమైన జ్యుడీషియల్ కాంప్లెక్స్ భవనంలో జనవరి 1, 2019 నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పనిచేస్తూ ఉంది. 45 ఎకరాలలో 5 సచివాలయం బ్లాకులను, 1 బ్లాకులో 1.2 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో శాసనసభ, శాసనమండలి ఏర్పాటై 2017 సంవత్సరం మార్చి నుంచి వినియోగింపబడుతూ ఉన్నాయి.

రూ. 2,989 కోట్లతో అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల స్థాయి అధికారులకు బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగులకు బహుళ అంతస్తుల భవనాల నివాస సముదాయాల నిర్మాణం కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని 70 శాతం, కొన్ని 50 శాతం, కొన్ని 30 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికి సుమారు రూ. 1300 కోట్లు చెల్లించారు. మిగలిన రూ. 1680 కోట్లను ఖర్చు పెడితే 186 బంగ్లాలు, 3889 ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. నూతన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ జరుగుతున్న పనులను సంపూర్ణంగా ఆపివేసింది. పలు కాంట్రాక్టు సంస్థలు తమ మిషనరీ, ఉద్యోగులు, కార్మికులతో సహా వెళ్లిపోయాయి. ఎన్నికల ముందు వరకు కోలాహలంగా విద్యుత్ దీపాల కాంతుల్లో రాత్రిపూట కూడా పనికొనసాగుతూ స్థానిక పేద ప్రజలే కాక బీహార్, ఒరిస్సాల నుంచి వచ్చిన వేలాదిమంది కార్మికులు కూడా పనిచేస్తూ ఉండేవారు. ఆ భవన నిర్మాణ కార్మికులందరూ వెళ్లిపోయారు. స్థానికంగా ఉన్న పేదలకు ఇప్పుడు పనులు లేక దూరప్రాంతాలకు పనుల నిమిత్తం వెళ్లవలసి వస్తూ ఉంది.

జగన్‌మోహన్‌రెడ్డి పిచ్చి తుగ్లక్ పాలనలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు

సుమారు 50 మందిని పొట్టన పెట్టుకున్న నూతన ఇసుక విధానం: 2019 మే చివర్లో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ‘‘ఉచిత ఇసుక విధానము’’ను రద్దు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అన్ని ఇసుక రేవులలోనూ సంపూర్తిగా ఇసుక తవ్వకం, రవాణా నిలిపి వేస్తూ ఆదేశాలివ్వడం జరిగింది. సెప్టెంబరు 4, 2019న కొత్త ఇసుక విధానం ప్రకటించడం జరిగింది. అప్పటి వరకు భవన నిర్మాణ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. మన రాష్ట్రంలో నిర్మాణ రంగంలో 20 లక్షల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీరుకాక వడ్రంగులు, కమ్మరులు, సెంట్రింగ్, ఎలక్ట్రికల్ మున్నగు అనుబంధ వ్యాపకాలలో పది లక్షల మంది జీవనోపాధి పొందుతూ వున్నారు. నిర్మాణ రంగం కార్మికులలో ఎక్కువమంది పేదరికంలో ఉండి రోజువారీ కూలీ సంపాదనపై ఆధారపడి బతుకులీడుస్తూ ఉంటారు. వారిలో చాలామంది కుటుంబ సభ్యుల విద్య, వైద్య, సామాజిక అవసరాల నిమిత్తం అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ ఉంటారు. ఇసుక సప్లయ్ దాదాపు 4 నెలలపాటు పూర్తిగా నిలిచిపోవడంతో లక్షలాది కార్మికులు కనీవినీ ఎరుగని ఇబ్బందులకు, కష్టనష్టాలకు లోనయ్యారు. మనోవేదనతో, గుండెపోటుతో కొందరు, ఆత్మహత్యలతో మరికొందరు మొత్తంగా 50 మందికిపైగా కార్మికులు తనువులు చాలించడం అత్యంత విచారకరం.

ఉచిత ఇసుక పాలసీని నూతన ప్రభుత్వం మార్చవచ్చు. కానీ ఇన్ని నెలలపాటు సంపూర్ణంగా ఇసుక సరఫరాను నిలిపివేస్తే సంభవించగల పరిణామాలను ముందుగా అంచనా వేయకపోవడం మూర్ఖత్వం. అంతకుమునుపు టీడీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిమేరకు, కొంతమంది నాయకులు పొరపాట్లు చేసి ఉండవచ్చు. ఆనాడు వినియోగదారుడికి ట్రాక్టర్ ఇసుక 10 కిలోమీటర్ల దూరంలో సుమారు రూ. 1500కు లభించగా, అదే ఇసుక ఈనాడు టన్ను రూ. 375 చొప్పున నాలుగున్నర టన్నులకు రూ. 1687, రవాణా చార్జీ రూ. 1378 వెరసి రూ. 3065 ఒక ట్రాక్టరు ఇసుకకు వినియోగదారుడు చెల్లించవలసి ఉంటుంది. కానీ ఆన్‌లైన్లో లోపాలను సరిదిద్దకపోవడంతో పాటు ఇతర కారణాల వలన వినియోగదారులు రూ. 6,000లు పైన చెల్లించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా ఉన్నతస్థాయి రాజకీయ నాయకుల ప్రభావం, అధికారుల చేతివాటంతో అవినీతి పర్వం చాలా పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. నూతన ఇసుక విధానం వలన వినియోగదారుడి పైన దాదాపు నాలుగు రెట్ల భారం పడింది.

రాజధాని మార్పు రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టు:

అమరావతి నుంచి సెక్రటేరియట్, హెచ్ఓడీ ఆఫీసులను విశాఖపట్నమునకు తరలించాలని, 1 జనవరి 2019 నుండి అమరావతిలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలు తరలించాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రగతికి గొడ్డలిపెట్టు అవబోతోంది. నాడు ప్రతిపక్ష నేతగా అమరావతిలో రాజధాని నిర్ణయాన్ని సమర్థించి, కనీసం 30 వేల ఎకరాలు రాజధానికి ఉండాలని శాసనసభ సాక్షిగా మాట్లాడిన జగన్ మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రిగా ‘‘మాటమార్చి-మడమతిప్పి’’ నేడు ఇటువంటి నిర్ణయం తీసుకొనడం అనేక కోణాలలో మన రాష్ట్ర ప్రగతిపై ప్రభావం చూపనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, పరిశ్రమలు పెట్టాలని ముందుకు వచ్చే ఇన్వెస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం పట్ల నమ్మకం సడలుతుంది. ఇప్పటికే సోలార్ విద్యుత్ ప్లాంట్ల పీపీఏల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం విదేశీ పెట్టుబడిదారులలో ఆందోళన కలిగించడం, వారు కేంద్రానికి తెలియజేయడం, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టడం తెలిసినదే. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వ విధానం, ప్రోత్సాహకాల కొనసాగింపు అంశాలపై ఇన్వెస్టర్లకు గ్యారంటీ లేనప్పుడు వారు ముందుకు రారు. పరిశ్రమలు పెట్టరు. పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడి ఉపాధి కల్పన ఎండమావి అవుతుంది. దీని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంపైన, పన్ను వసూళ్లపైన పడుతుంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ వున్న లక్షలాదిమంది యువతీయువకుల ఆశలపై నీళ్లు చల్లడమే అవుతుంది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును నీరుకార్చటం తగునా?

మాట తప్పను-మడమ తిప్పను అన్న వైఎస్ జగన్ లోగడ తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని కోరి, ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉండి దాదాపు 9 మాసాలు కావస్తున్నా ముద్దాయిలను గుర్తించకపోగా, సీబీఐ ఎంక్వైరీ వద్దని కోర్టును కోరడం ఆశ్చర్యకరం. వివేకానందరెడ్డి కుమార్తె, భార్యల అభ్యర్థనపై ఏపీ హైకోర్టు సీబీఐ విచారణ జరగాలని నిర్ణయం తీసుకోవడం, మరియు వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని తగు రక్షణ కల్పించాలని వారు కోరడం వైఎస్ జగన్‌కు తలవంపులు కాదా!

Vsb2
————————–

కోట్స్‌లలో పెట్టండి.. వీలైనన్ని పెట్టండి.
———————

‘‘తన పార్టీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు కాబట్టి, తాను చెప్పిందే వేదంగా ప్రజలు స్వీకరించాలని, నవ్యాంధ్రప్రదేశ్ తానొక రాజునని, తన మాటను ఎవరూ జవదాటడానికి వీలులేదని, తనమాటే చెల్లుబాటు అవ్వాలని ఆయన ఆలోచిస్తూ ఉండడం, అతడి అనుభవ రాహిత్యాన్ని, రాక్షస ప్రవృత్తిని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది’’
———————

‘‘రాజ్యాంగబద్ధ పదవి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్న వ్యక్తిపైన శాసనసభా స్పీకర్, పలువురు మంత్రులు, వైకాపా కార్యదర్శి విజయసాయిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన తీరుపట్ల సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటూ ఉంది’’
——————–
‘‘మహాభారతంలో ద్రౌపదికి జరిగిన అవమానం వలన, మొత్తం కౌరవ వంశమంతా తుడిచిపెట్టుకుపోయింది. అమరావతి నుండి రాజధానిని తరలించవద్దని 220 రోజులకు పైగా క్రమశిక్షణతో, శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్న వేలాది మహిళల ఆవేదన, ఆగ్రహావేశాలు జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి శ్రేయస్కరం కాదని గ్రహించాలి’’
——————-
‘‘రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైకాపా ప్రభుత్వం వస్తే ‘‘మన రాష్ట్రం పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడిన చందం అవుతుందని’’, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తాయని పలువురు మిత్రులకు చెబుతూ ఉండేవాడిని. ఈనాడు అక్షరాలా అదే జరుగుతూ ఉంది’’
—————
‘‘నాడు ప్రతిపక్ష నేతగా అమరావతిలో రాజధాని నిర్ణయాన్ని సమర్థించి, కనీసం 30 వేల ఎకరాలు రాజధానికి ఉండాలని శాసనసభ సాక్షిగా మాట్లాడిన జగన్ మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రిగా ‘‘మాటమార్చి-మడమతిప్పి’’ నేడు ఇటువంటి నిర్ణయం తీసుకొనడం అనేక కోణాలలో మన రాష్ట్ర ప్రగతిపై ప్రభావం చూపనుంది’’
———–
‘‘వివేకానందరెడ్డి కుమార్తె, భార్యల అభ్యర్థనపై ఏపీ హైకోర్టు సీబీఐ విచారణ జరగాలని నిర్ణయం తీసుకోవడం, మరియు వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని తగు రక్షణ కల్పించాలని వారు కోరడం వైఎస్ జగన్‌కు తలవంపులు కాదా!’’

Share: