చూస్తుంటే రాజకీయాల రంగు వెలిసిపోతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు రాజకీయాన్ని యజ్ఞంలా భావించేవారు. అందులో దిగిన వారు నిరంతరం దేశ హితం కోసం, ప్రజల బాగు కోసం కష్టపడేవారు. ఈ క్రమంలో కుటుంబాలను సైతం పట్టించుకునేవారు కాదు. ప్రజలే సర్వస్వంగా, వారి కష్టాలు తమవిగా భావించేవారు. ఈ క్రమంలో ఆస్తులు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో కొంత మార్పు వచ్చింది. స్వలాభాపేక్ష కలిగింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక కొంత ‘వెనకేసుకోవడం’ మొదలుపెడుతూనే ప్రజా సమస్యలపైనా దృష్టి సారించేవారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేశారు. అధికారంలో ఉండగా అవినీతి ఆరోపణలు వస్తే తప్పుకున్న గొప్ప నేతలు కూడా ఉన్నారు.
30 ఏళ్ల క్రితం రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలు నేడు ఇంతగా భ్రష్టుపట్టిపోవడానికి బీజాలు నాడే పడ్డాయి. మూడు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో దూకుడు మొదలైంది. అధికారమే పరమావధిగా భావించడాన్ని నేతలు మొదలుపెట్టారు. అందినకాడికి దోచుకోవడంతో ప్రారంభించి తరతరాలకు తరిగిపోనంత ఆస్తిని సంపాదించుకోవడం మొదలుపెట్టారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను తమ వైపు తిప్పుకుని ఆడించడం మొదలు పెట్టారు. ప్రజలను దేవుళ్లుగా భావించిన వారు తామే ప్రజలపాలిట దేవుళ్లమని చెప్పించుకోవడం మొదలుపెట్టారు. నాటి నుంచి క్రమంగా మారుతూ వస్తున్న రాజకీయాలు దశాబ్దం క్రితం ఓ కొత్త ఒరవడిలోకి మళ్లాయి.
అది ప్రజలైనా, ప్రతిపక్షాలైనా ఎదురుదాడికి దిగడం మొదలైంది. అధికారం ఉంటే ఏమైనా చెయ్యొచ్చన్న ధీమా పెరగింది. దీంతో అధికారం కోసం అడ్డుదారులు తొక్కడం మొదలైంది. నోట్లతో ఓట్లను కొనే నేర్పు తెరపైకి వచ్చింది. వందలు, వేలు, అవసరమైతే ప్యాకేజీలు ప్రకటించి మరీ కుటుంబాల ఓట్లను గంపగుత్తగా కొనుగోలు చేయడం బహిరంగ రహస్యమైంది. ‘అధికారం చేపట్టి ఇన్నేళ్లు అయింది కదా.. ఏం చేశారయ్యా’ అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. ‘అధికారంలో ఉన్నన్నాళ్లు మీరేం చేశారు?’ అని ఎదురుదాడికి దిగుతున్నారు. అంటే మీరు చేయలేదు కాబట్టి, మేం కూడా చేయబోం. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రోడ్లు ఎందుకు వెయ్యలేదని ప్రశ్నిస్తే మీరు వేశారా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. నోట్లు తీసుకుని ఓట్లేస్తే ప్రజల బతుకులు ఇలాగే ఉంటాయనడానికి ఇదో నిదర్శనం.
రాజకీయాలు ఇటీవల మరింత దిగజారాయి. ప్రతిపక్షాలు ఉంటే గొంతెత్తుతాయన్న ఉద్దేశంతో వాటి గొంతు నులిమేందుకు అధికారంలో ఉన్నవారు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్షాలు చీటికీమాటికీ తమను ప్రశ్నించకుండా ఉండాలంటే వాటిని నయానో, భయానో లొంగదీసుకోవడమో, లేదంటే ప్రలోభపెట్టి పార్టీ నేతలను తమవైపునకు తిప్పుకోవడమో చేస్తూ ప్రతిపక్షం అనే పదం వినిపించకుండా చేసుకుంటున్నారు. లేదంటే పోలీసులు, కేసులు, సీబీఐ, ఐడీ, ఈడీ లాంటి చెప్పినట్టు వినే దర్యాప్తు సంస్థలు ఉండనే ఉన్నాయి.
ఇదంతా ఒక ఎత్తు. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల తీరు మరో ఎత్తు. సాధారణంగా అధికారంలోకి రావానుకునే వారు తాము గెలిచి అధికారం చేపడితే ఏం చేస్తామో చెబుతారు. ఇళ్లు కట్టిస్తాం, భవిష్యత్ మార్చేస్తాం. ఉద్యోగాలిచ్చేస్తాం. రైతులకే పెద్దపీట, రుణాలు మాఫీ చేస్తాం. ప్రాజెక్టులు కట్టేస్తాం. ఏ పనీ చేయకుండానే నెలకు ఎంతోకొంత ఇస్తాం వంటి హామీలను ఇప్పటి వరకు ఇస్తూ వస్తున్న నేతలు ఇప్పుడు తమ పంథా మార్చారు.
తాము అధికారంలోకి వస్తే చేసే మొదటి పని ముఖ్యమంత్రిని జైలుకు పంపడమేనంటూ ప్రతిపక్ష పార్టీలు ఊదరగొడుతున్నాయి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తీరు కనిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే జగన్ను జైలుకు పంపిస్తామని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలోనూ బీజేపీ నేతలు ఇదే చెబుతున్నారు. అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ను తాము అధికారంలోకి రాగానే కటకటాల వెనక్కి పంపిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదేపదే పబ్లిక్ మీటింగులలో చెబుతున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్నో, జగన్నో జైలుకు పంపడానికే ప్రతిపక్షాలను అధికారంలోకి తీసుకురావాలన్న మాట. వారి రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ప్రజలు వారికి ఓట్లేసి గెలిపించాలన్నమాట. అంతేకానీ ప్రజలకు ఏదో వెలగబెడతారని కాదన్నమాట. ఇక్కడ ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ప్రజలు కూడా అలాంటి పార్టీలకు వంతపాడడం. చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండి, వివేకంతో ఆలోచించగలిగేవారు కూడా అలాంటి పార్టీలకు మద్దతు ఇస్తుండడం శోచనీయం. ప్రస్తుతం రాజకీయాలన్నీ కులాల ప్రాతిపదికన నడుస్తుండడం, ప్రజలు కూడా అదే చట్రంలో తిరుగుతుండడంతో ఇంతకుమించి ఆశించడం అత్యాశే అవుతుంది.
రూటు మార్చుకుంటున్న రాజకీయాలు!
Share:
Most Popular
అస్తమించని రవి 🙏
September 8, 2021
మన సినిమాలకు ఇక ఓటీటీలే శరణ్యమా!?
September 8, 2021
అల్లూరి వారసులుగా గర్జిస్తాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
September 8, 2021