చదువుకోవడం కోసం తాను పడిన కష్టం మరెవరూ పడకూడదనుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన విద్యాఫలాలు అందాలని భావించారు. ఆ ఆలోచన ఆయనతో విద్యావ్యాప్తికి బాటలు వేయించింది. ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పారు. లక్షలాదిమంది పేద విద్యార్థులకు విద్యను దగ్గర చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాకుసుమాలు పూయించిన ఆయన పేరు లయన్ డాక్టర్ చావా లక్ష్మీనారాయణ. సేవను పరమార్థంగా మార్చుకుని, ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న లక్ష్మీనారాయణ నేటి యువతకు ఆదర్శం.
తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని నెల్లిపాక బంజరు గ్రామంలో జన్మించారు లక్ష్మీనారాయణ. తల్లిదండ్రులు చావా భద్రమ్మ-వీరయ్య. ఒకటో తరగతి నుంచి 9 వరకు ఆయన విద్యాభ్యాసం స్వగ్రామంలోనే జరిగింది. పదో తరగతిని పాల్వంచలో పూర్తిచేయగా.. ఇంటర్, డిగ్రీ భద్రాచలంలో చదివారు. ఆయన చదువుకునేటప్పుడు సరైన వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అప్పుడే ఆయన మదిలో ఓ ఆలోచన మెరిసింది. చదువు కోసం తనలా మరెవరూ ఇబ్బంది పడకూడదని భావించారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని అప్పుడే కంకణం కట్టుకున్నారు.
1992లో తొలి అడుగు..
లక్ష్మీనారాయణ తన ఆలోచనలకు త్వరలోనే కార్యరూపం ఇచ్చారు. గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక పరమైన విద్య కూడా అవసరమని భావించిన ఆయన కొందరు మిత్రులతో కలిసి 1992లో ‘క్రాంతి’ పేరుతో ఐటీఐని ఏర్పాటు చేశారు. అలా, నాడు నాటిన విద్యా విత్తనం ఇంతింతై వటుడింతై అన్న రీతిలో దినదిన ప్రవర్థమానంగా ఎదిగింది. గ్రామీణ ప్రాంతాలలో ఇంజనీరింగ్ కళాశాలలు స్థాపించి సాంకేతిక విద్యను అందరికీ అందించేందుకు కృషి చేశారు. అలాగే, మరెన్నో నాన్-ఇంజినీరింగ్ కళాశాలు స్థాపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఆయన స్థాపించిన కళాశాలలు వటవృక్షంలా ఎదిగి నేడు లక్షలాదిమందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. నిష్ణాతులైన యువతను దేశానికి అందిస్తున్నాయి. కాలేజీల స్థాపనలో లక్ష్మీనారాయణ ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ధైర్యంగా ముందడగు వేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు.
లక్ష్మీనారాయణ స్థాపించిన విద్యా సంస్థలు:
* 1992లో భద్రాచలంలో క్రాంతి ఐటీఐ
* 1997లో భద్రాచలంలోనే ఇంజనీరింగ్ కశాశాల
* 1998లో పాల్వంచలో మదర్ థెరిస్సా బీఈడీ కాలేజీ
* 1999లో పెద్దపల్లిలో మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల
* 2001లో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో లేనోర ఇంజనీరింగ్ కళాశాల
* 2007లో ఖమ్మం జిల్లా పెనుబల్లిలో శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాల
* 2007లో కొత్తగూడం జిల్లా వేపాలగడ్డలో అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాల
* 2008లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఇంజనీరింగ్ కళాశాల
* 2014లో భద్రాచలంలో డిగ్రీ కాలేజీ, శ్రీరామ ఐటీఐ
* 2014లో సారపాకలో శ్రీరామభద్ర ఐటీఐ
అవార్డులు.. ప్రశంసలు:
ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుతో విద్యావ్యాప్తికి కృషి చేస్తున్న చావా లక్ష్మీనారాయణ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. విద్యారంగంలో ఆయన చేస్తున్న కృషికి గాను 2003లో అమెరికన్ బయోలాజికల్ ఇనిస్టిట్యూట్ వారు ‘మ్యాన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇచ్చి గౌరవించారు. 2004లో గ్లోబల్ ఎకనమిక్స్ కౌన్సిల్, న్యూఢిల్లీ ‘ప్రౌడ్ ఆఫ్ ఇండియా’ అవార్డుతో లక్ష్మీనారాయణను సత్కరించింది. 2006లో థాయిలాండ్‌లో ‘ఇంటర్నేషనల్ మిలీనియం’ అవార్డు అందుకున్నారు. 2011లో నేపాల్ రాజధాని కఠ్మాండులో ‘ఏషియా ఫసిఫిక్ ఎక్స్‌లెన్స్’ అవార్డు అందుకున్నారు. 2013లో న్యూ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీ (యూఎస్ఏ) బెంగళూరులో డాక్టరేట్ ప్రదానం చేసింది.
విద్యారంగంలో మార్పులపై అధ్యయనం:
విద్యాసంస్థలను స్థాపించడంతోనే డాక్టర్ లక్ష్మీనారాయణ సరిపెట్టలేదు. విద్యను రోజురోజుకు మరింత నాణ్యంగా అందించడమెలాగో ఆలోచించేవారు. ఇందులో భాగంగా వివిధ దేశాల్లో పర్యటించి అక్కడి విద్యావిధానాన్ని అధ్యయనం చేశారు. సాంకేతిక విద్యలో వస్తున్న మార్పులను గుర్తించి వాటిని తన కళాశాలల్లో అమలు చేయడం ద్వారా మరింత ఉన్నతమైన ఫలితాలు రాబట్టగలిగారు. ఆయన కళాశాలల్లో చదువుకున్న ఎందరో విద్యార్థులు నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ ఉన్నత హోదాల్లో ఉన్నారు.
లయన్స్ క్లబ్ ద్వారా సేవలు:
సేవను పరమార్థంగా భావించే డాక్టర్ లక్ష్మీనారాయణ తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలన్న ఉద్దేశంతో 1998లో లైన్స్ క్లబ్లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. తన సేవా కార్యక్రమాలతో అందరి మనసులు గెలుచుకున్నారు. లయన్స్ క్లబ్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రెసిడెంట్‌గా, జోన్ చైర్మన్‌గా, రీజియన్ చైర్మన్‌గా సేవలు అందించారు. అలాగే, 2010 నుంచి 2017 వరకు ‘లైఫ్ ఆఫ్ ఇండియా’ జోనల్ సభ్యుడిగా ఉన్నారు.
లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు:
తొలి నుంచీ సేవా తత్పరత కలిగిన లయన్ డాక్టర్ లక్ష్మీనారాయణ భద్రాచలం ఏజెన్సీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బస్ షెల్టర్లు, విద్యార్థులకు ఉచిత భోజన వసతి, ఉచితంగా బోర్లు వేయించడం, మెడికల్ క్యాంపుల నిర్వహణ, నేత్రవైద్య శిబిరాలు, ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు, అవసరమైన వారికి ఉచితంగా మందుల పంపిణీ, వరద బాధితులకు దుస్తుల పంపణీ, గృహోపకరణాల పంపిణీ వంటివి చేపట్టి వారి మనసులు గెలుచుకున్నారు. ఆయన సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
భద్రాద్రి కమ్మ సేవా సమితి సెక్రటరీగా:
తన జీవితాన్ని పూర్తిగా సేవకే అంకితం చేసిన లక్ష్మీనారాయణ ఇప్పటి వరకు 6 ఇంజినీరింగ్ కళాశాలలు, మరెన్నో నాన్-ఇంజినీరింగ్ కాలేజీలు స్థాపించారు. భద్రాచలంలో ప్రతి ఏడాది జరిగే బాలోత్సవం, భద్రాద్రి కళాభారతి నాటికల పోటీల కార్యక్రమానికి ఆయన ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. అలాగే భద్రాద్రి కమ్మ సేవా సమితికి సెక్రటరీగా ఉన్నారు.
వైవాహిక జీవితం:
చావా లక్ష్మీనారాయణ 1983 జూన్ 8న ఇరవెండి గ్రామానికి చెందిన ధనలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి శ్రీకాంత్, డాక్టర్ రవికాంత్ ఇద్దరు కుమారులు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన శ్రీకాంత్-డాక్టర్ శ్రావ్య దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. డాక్టర్ శ్రావ్య ఎంబీబీఎస్, అనస్తీషియా చేశారు. శ్రీకాంత్- డాక్టర్ శ్రావ్య దంపతులకు మూడేళ్ల కుమారుడు శ్రీహాన్ ఉన్నాడు. డాక్టర్ రవికాంత్-డాక్టర్ తనూజ దంపతులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఎంబీబీఎస్, ఎండీ, రేడియాలజీ చేసిన డాక్టర్ రవికాంత్ బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్ చేసిన డాక్టర్ తనూజ గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్‌గా పనిచేస్తున్నారు. లక్ష్మీనారాయణ తమ్ముడు చావా శ్రీనివాసరావు. ఆయన భార్య రమాదేవి. శ్రీనివాసరావు-రమాదేవి దంపతుల కుమారుడు చావా అభిలాష్ బీటెక్, ఎంఎస్ చేసి అమెరికాలో స్థిరపడ్డారు.
లక్ష్మీనారాయణ విజయం వెనక:
తాను సాధించిన ప్రతీ విజయం వెనక తన అర్ధాంగి ధనలక్ష్మి పాత్ర ఎంతో ఉందని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. సేవా కార్యక్రమాల్లో తాను బిజీగా ఉంటే కుటుంబ వ్యవహారాలు ఆమే చూసుకునేదని, ఫలితంగా తనపై ఒత్తిడి తగ్గడంతో మిగతా విషయాలపై దృష్టి కేంద్రీకరించగలిగానని లక్ష్మీనారాయణ చెప్పారు. అలాగే, పిల్లల ఎదుగుదలలోనూ ఆమెదే కీలక పాత్ర అని అన్నారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి తన భార్యే కారణమన్నారు. అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ తాను సరైన దారిలో వెళ్లేలా ప్రోత్సహించారని గుర్తు చేస్తున్నారు.
ఫోన్: 98666 98961