ఇప్పటి వరకూ ఏ చిత్రసీమలోనూ ఏ నటవారసునికీ లభించనటువంటి గౌరవం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞకు దక్కింది. ఇప్పటిదాకా ఒక్క సినిమాలోనైనా కనిపించని మోక్షజ్ఞను తమ హీరో నటవారసునిగా అభిమానులు అభినందిస్తూనే ఉన్నారు. ఇది ఈ నాటి ముచ్చట కాదు. మోక్షజ్ఞ జన్మించిన రోజునే అభిమానులు ఊరూవాడా సంబరాలు చేసుకున్నారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా సెప్టెంబర్ 6వ తేదీ వచ్చిందంటే చాలు నందమూరి బాలకృష్ణ అభిమానులు మోక్షజ్ఝ పుట్టినరోజు వేడుకలను ఏదో ఒక రూపంలో జరుపుతూనే ఉన్నారు. అతనికి ఇప్పటికే స్టార్ హీరోస్ లాగా బర్త్ డే గ్రీటింగ్స్ తెలుపుతూ పత్రికా ప్రకటనలు కూడా వెలువడ్డాయి. కరోనా కారణంగా గత యేడాది కాసింత హంగామాకు బ్రేక్ పడింది. కానీ, ఈ సారి మోక్షజ్ఞ పుట్టినరోజు మరింత ఘనంగా జరిగేలా ఉందని తెలుస్తోంది. అందుకు కారణం ఇప్పటి దాకా మోక్షజ్ఞ తెరంగేట్రంపై అంతగా క్లారిటీ రాలేదు. కానీ, మొన్న తన పుట్టినరోజు నాడు జూన్ 10న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని తేల్చి చెప్పారు. ఆదిత్య 369కు సీక్వెల్ గా రూపొందే ఆదిత్య 999 ద్వారా మోక్షజ్ఙ చిత్రప్రవేశం ఉంటుందని తెలుస్తోంది.
మోక్షజ్ఞ చిత్రానికి తానే కథను సమకూరుస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. ఆదిత్య 369 చిత్రానికి దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలోనే మొదట ఈ చిత్రాన్ని రూపొందించాలని బావించారట. అయితే వయసురీత్యా సింగీతంకు శ్రమ ఇవ్వడం దేనికని భావించారట. సింగీతం కూడా ఆ చిత్రానికి బాలయ్యనే దర్శకత్వం వహించమని సూచించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి తప్పకుండా బాలకృష్ణ మెగాఫోన్ పట్టేలాగే ఉందని స్పష్టమవుతోంది. 1974లో బాలకృష్ణ తెరంగేట్రం చేసింది తన తండ్రి మహానటుడు యన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల చిత్రం ద్వారా. అదే సెంటిమెంట్ తో తనయుడు మోక్షజ్ఞ తొలి చిత్రానికి తానే దర్శకత్వం వహించాలని బాలయ్య కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇక ఆదిత్య 369కు సీక్వెల్ గా రూపొందుతున్న చిత్ర కథ ఏమిటి అనే చర్చ కూడా సాగుతోంది. ఆదిత్య 369లాగే ఇందులోనూ హీరో టైమ్ మిషన్ ఉపయోగిస్తాడని తెలుస్తోంది. కథాపరంగా ఆదిత్య 369 చిత్రంలో హీరో కృష్ణ కుమార్, తన కాబోయే మామ ప్రొఫెషర్ రామదాస్ కనిపెట్టిన టైమ్ మిషన్ లో ప్రేయసి హేమాతో కలసి వేరే కాలానికి వెళతాడు. ముందుగా భూతకాలంలోకి వెళ్ళి శ్రీకృష్ణ దేవరాయల కాలం చేరుకొని, అక్కడ నుండి మళ్ళీ టైమ్ మిషన్ లో భవిష్యత్ లోకి ప్రయాణిస్తాడు. ఆ కాలయంత్రం వారిని 2504 సంవత్సరానికి తీసుకు వెళ్తుంది. అక్కడ నుండి వర్తమానానికి వచ్చి విలన్ తో ఫైట్ చేస్తాడు. ఆ టైమ్ మిషన్ పేలిపోతుంది. అందులో ఉన్న కృష్ణకుమార్, విలన్ ఇద్దరూ చనిపోయారని అందరూ భావిస్తారు. అయితే కృష్ణకుమార్ ప్రమాదాన్ని ముందే ఊహించి, తాను ఓ చోట స్పృహ తప్పి పడిపోయి, తిరిగి వచ్చి తనవారిని కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. ఇదీ ఆదిత్య 369 కథ. ఈ సినిమా వచ్చి ఈ జూలై 18తో 30 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ సినిమా విడుదలైన మూడు సంవత్సరాలకు 1994 సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ జన్మించాడు. అందువల్ల ఆదిత్య 369 సీక్వెల్ లోనూ మోక్షజ్ఞ అదే తేదీన బాలకృష్ణ, మోహిని దంపతులకు జన్మించినట్టు చూపించనున్నారట. అసలే తల్లి తండ్రి కూడా సైంటిస్ట్ కావడంతో మొదటి నుంచీ సినిమాలో మోక్షజ్ఞ పాత్రకు కూడా టైమ్ మిషన్ ను తయారు చేసే యోచనలోనే ఉంటాడట. అలా తాత పోలికలు వచ్చిన మోక్షజ్ఞ మొత్తానికి కాంతివేగంతో పయనించే ఓ టైమ్ మిషన్ ను తయారు చేస్తాడట. ఇంతకు ముందు సినిమాలో భూమిపైనే మరో కాలానికి హీరో పయనిస్తాడు. కానీ, ఈ సీక్వెల్ లో హీరో మరో గ్రహానికి చేరుకుంటాడట. అక్కడి పరిస్థితులను, గమనించి, అక్కడి వారికి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యంలోని గొప్పతనం ఏమిటి? అన్న అంశాలపై అవగాహన కలిగిస్తాడట!ఈ వ్యవహారం చూస్తోంటే యన్టీఆర్ యమగోలలో తొలుత స్వర్గలోకం, తరువాత నరకలోకం పోయి అక్కడి జనాన్ని చైతన్యవంతం చేసినట్టుగా అనిపిస్తోంది. అదలా ఉంచితే, ఆ గ్రహంలో మానవులు సైతం సుఖంగా జీవించడానికి అనువైన వాతావరణం ఉందని, హీరో తన పరిశోధనతో భూగ్రహానికి సమాచారం చేరవేస్తాడట. ఆ తరువాత ఏమయింది అన్నదే ఆదిత్య 369 సీక్వెల్ కథ అని చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏపాటివో కానీ,కథ చూస్తోంటే అన్ని లెక్కలు బాగానే వేసి కథను తయారు చేశారనిపిస్తోంది.
ఇక మోక్షజ్ఞ తొలి చిత్రంగా రూపొందబోయే ఆదిత్య 369 ఎప్పుడు మొదలవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానంగా మరికొన్ని లెక్కలు వినిపిస్తున్నాయి. ఆదిత్య 369 విడుదలయిన జూలై 18న ఈ చిత్రం లాంఛనంగా ఆరంభిస్తారని కొందరు చెబుతున్నారు. కాదు, మోక్షజ్ఞ ఈ యేడాదితో 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడని, అందువల్ల సెప్టెంబర్ 6న ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని మరికొందరి మాట. యన్టీఆర్ తొలిసారి హీరోగా నటించిన షావుకారు చిత్రం ఆయనకు 27 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే విడుదలయింది. అదే తీరున 27 సంవత్సరాలు నిండిన తరువాత మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందనీ అందుకే సెప్టెంబర్ 6న ఈ సినిమా మొదలు కానుందని చెబుతున్నారు. మరి ఈ కథల్లో ఏది నిజమవుతుందో చూడాలి. ఏది ఏమైనా ఈ కథలు వింటూ ఉంటే మోక్షజ్ఞ కోసం అభిమానులే కథలు తయారుచేసేలా ఉన్నారనిపిస్తోంది. ఇంతటి అభిమానాన్ని ఇప్పటి దాకా ఏ నటవారసుడూ చవిచూడలేదు. ఈ స్థాయి అభిమానాన్ని ఒక్క సినిమాలో కూడా నటించకుండానే సొంతం చేసుకున్న నందమూరి మోక్షజ్ఞ అదృష్టాన్ని ఏమని వర్ణించాలి?