ఆకలిబాధతో వీధి అరుగుల మీద నిద్రపోయాం – పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య

G

పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య జీవిత చరిత్ర ‘నా జీవన నౌక’ నుంచి ప్రతి నెలా ఓ అధ్యాయాన్ని ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. దేశహితం కోరే ఆయన దేశ శ్రేయస్సు కోసం అవిరళ కృషి చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. ఆయన ప్రతీ ఆలోచన, ప్రతీ అడుగు భరతమాత కోసమే. బ్రహ్మయ్య జీవితం నేటి యువతకు చుక్కాని కాగలదన్న ఉద్దేశంతో ఆయన స్వీయకథను ఒక్కో అధ్యాయంగా ప్రచురిస్తున్నాం.
1922లో గయ కాంగ్రెసుకు దేశబందు చిత్తరంజన్‌దాస్ గారు అధ్యక్షత వహించారు, అప్పుడు గాంధీగారు జైలులో వున్నారు. గాంధీగారి శాసనసభా బహిష్కార వాదనను బలపరిచే వర్గానికి శ్రీ రాజగోపాలాచార్యులుగారు నాయకత్వం వహించారు. సిద్ధాంతరీత్యా చిత్తరంజన్‌దాస్ గారు వీరితో విభేదించి తమ అధ్యక్ష పదవికి రాజీనామా యిచ్చారు. దాసుగారితో చాలా సన్నిహితుడుగా వున్న ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు దాసుగారి స్థానే కొండా వెంకటప్పయ్య పంతులుగారిని రెండు వర్గాల వారిచేత కాంగ్రెసు అధ్యక్షుడుగా ఎన్నుకోబడేటట్లు చేశారు. ఆయన ప్రధాన కార్యదర్శిగా వున్నారు. ఆంధ్రదేశంలో మొదటి కాంగ్రెసు 1923లో కాకినాడలో చాలా జయప్రదంగా జరిగింది. షడ్రసోపేతంగా భోజనాల యేర్పాట్లు, అన్ని సౌకర్యాలు చేయడం స్వచ్ఛంద సైనికులు నియమబద్ధంగా వ్యవహరించడం, అందరి ప్రశంసలను అందుకోడం జరిగింది.
ఉత్తరాది వారు ఇప్పటికీ కాకినాడ కాంగ్రెసు ఏర్పాట్లను మెచ్చుకుంటూ వుంటారు. దీని ప్రధాన బాధ్యత, ఆధ్వర్యం మహర్షి బులుసు సాంబమూర్తిగారిది. వీరు ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి. 1920కి పూర్వం నెలకు వేలు సంపాదించే క్రిమినల్ లాయరుగా ఆయన ప్రసిద్ధి పొందారు. బులుసు వారి యిల్లు ఆనాడు అన్న సత్రంగా ప్రసిద్ధి. కాకినాడలో కాంగ్రెసు జరిగే రోజులలో ఆయన ఏకైక పుత్రుడు బందరు జాతీయ కళాశాలలో చదువుకుంటూ వుండేవాడు. అక్కడ నుంచి జ్వరంతో రైలులో కాకినాడకు ప్రయాణము చేసి వచ్చాడు. అది టైఫాయిడ్ కావడంచేత చిన్నతనంలోనే ఆయన మృత్యువాత బడడం సంభవించింది. ఏకైక పుత్రుని మరణానికి భరింపరాని దుఃఖం కలిగినా స్థితప్రజ్ఞతతో నిగ్రహించుకొని, కాంగ్రెసు కార్యకలాపాలకు ఎట్టి లోటులేకుండా దిగ్విజయంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఏకైక నాయకులు. ఆయనది సుగ్రీవాజ్ఞ. పేదవారు లగాయతు ఆగర్భ శ్రీమంతుల వరకు అందరు ఆయన కనుసన్నలలోనే మెలగేవారు.
డాక్టర్ పట్టాభిగారు (కాకినాడలో గంజాం వెంకటరత్నం గారి అల్లుడు) బందరు నుంచి ముందుగానే వెళ్ళి ఆ కార్యకలాపాలలో సాంబమూర్తిగారికి అండదండలుగా వున్నారు. ఈమహాసభకు ఆహ్వాన సంఘాధ్యక్షుడు కొండా వెంకటప్పయ్య పంతులుగారు. అఖిల భారత కాంగ్రెసు ప్రధాన కార్యదర్శిగా వున్న ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు నల్లని ఆకాలీ దుస్తులతో వేదికపై ప్రత్యక్షమై కార్యకలాపాలను చాకచక్యంతో నడిపారు. సభాధ్యక్షుడు మౌలానా మహమ్మదాలీ సభా కార్యక్రమం సమర్థతతో నిర్వర్తించారు. కాంగ్రెసు అధ్యక్షుల ఉపన్యాసాలలోఆయన ఉపన్యాసం పెద్దది. సభలో గమనించదగిన కొన్ని విశేషాలు:
1920 నాగపూరు కాంగ్రెసుకు అధ్యక్షత వహించిన సేలం విజయ రాఘవచార్యులు గారు విషయ నిర్ణయ సమావేశంలో ఉపన్యసిస్తూ స్వరాజ్య పార్టీ వారి శాసనసభల ప్రవేశాన్ని ఘాటుగా విమర్శించారు. అందుకు కోపోద్రిక్తుడైన పండిత మోతీలాల్ నెహ్రూగారు ”ప్రాక్టీసు చేస్తూ వున్న లాయరు మమ్ము విమర్శంచడమా?” అని ఎత్తి పొడిచారు. దానిపై ఆయన ”అవును” నేను లక్షలు గడించిన తర్వాత కాంగ్రెసులోకి వచ్చినవాడను కాను. విద్యార్ధి దశ నుంచి నేను కాంగ్రెసులో వున్నవాడిని. చిన్ననాటి నుంచి నా సంపాదన ప్రజాసేవలో కాంగ్రెసు కార్యక్రమ నిర్వహణకు ఖర్చుపెడుతున్నాను. మహాత్ముని అనుమతి పొందే నేను తిండా కొరకు ప్రాక్టీసు చేస్తున్నాను. నన్ను మహాత్మునివంటి వారు అర్థం చేసుకొనగలరు. కానీ మీబోటి వారు అర్థం చేసుకోలేరని’’ గద్గద స్వరంతో సమాధానం చేప్పారు. సభ్యులందరి సానుభూతి విజయరాఘవాచారిగారి వైపే మొగ్గింది. అప్పుడు మహమ్మదాలీ లేచి “ఇద్దరు కురు వృధ్ధులు, పూర్వపు అధ్యక్షులు వాదులాడుకుంటుండగా చిన్నవాడిని నేనేమి చేయగలను? నిస్సహాయుడను” అన్నారు. ఇలా ఆ మహమ్మదాలీ అనగానే పండిత మోతీలాల్ నెహ్రూగారు లేచి తాను ఆచార్యుల వారిని గూర్చి అన్న మాటలను ఉపసంహరించుకుంటూ క్షమాపణ చెప్పారు. మోతీలాల్ హృదయం కష్టపడే విధంగా మాట్లాడినందుకు విజయ రాఘవచార్యులుగారున్నూ విచారం వెలిబుచ్చారు. అందరు ఆనందంతో పరవశులయ్యారు.
కాంగ్రెసు మహాసభలో పట్టాభి సీతారామయ్యగారు మాట్లాడుతుండగా ఆయనకిచ్చిన సమయం అయిపోయినది. గంటకొట్టిన మరు సెకన్‌లోనే వేదికనుంచి దిగి తను కూర్చునే చోటువరకు బిగ్గరగా మాట్లాడుతూ వాక్యం పూర్తిచేసి అందరి కరతాళ ధ్వనులను అందుకున్నారు.
డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యంగారు స్వచ్ఛంద సైనికులకు నాయకుడు. ఆయన సైనిక దుస్తులలోనే తీర్మానం మీద మాట్లాడుటకు వేదికపైకి వచ్చాడు. ఆయన మాట్లాడుతుండగానే మహ్మదాలీ బెల్ కొట్టాడు. ఆయన వాక్యం పూర్తిచేయకుండానే ఆపి వెళ్లిపోయాడు. ఆయన హఠాత్తుగా వెళ్లిపోయేటట్టు చేసినందులకు మహ్మదాలీ నొచ్చుకున్నట్టు కనబడ్డాడు.
ఆయన తర్వాత ఉపన్యాసకుడు అయిన రాజగోపాలాచారిగారు డాక్టర్ సుబ్రహ్మణ్యంగారి మిగతా వాక్యం ఇది అయి ఉంటుందని ఊహించి చెప్పి తన ఉపన్యాసం సాగించాడు. ఈ ముగ్గురు కరతాళ ధ్వనులను అందుకున్నారు. దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మగారు తెలుగులో మృదుమధురంగా భాగవత భారతాదులలోని పద్యాలు చదువుతూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
బెంగాల్ ప్యాక్ట్ మరొక విషయం: చిత్తరంజన్‌దాసు గారు బెంగాలుకు సంబంధించినంత వరకు ముస్లింలతో రాజకీయాలలో రాజీ (బెంగాలీ ప్యాక్ట్) చేసుకున్నారు. మహ్మదీయుల యెడ ఆయన ఉదారంగా ప్రవర్తించారు. ఈ ప్యాక్ట్ అఖిల భారత స్థాయిని కాంగ్రెసు అంగీకరించుట, భవిష్యత్తులో దేశంలో హిందూ, మహ్మదీయ ఐక్యతకు అవసరమని ఆయన నొక్కి చెప్పాడు. ఇందులకు రాజగోపాలాచారి ప్రభృతులు అంగీకరించలేదు. బెంగాలు నుంచి వచ్చిన శ్రీ శ్యామసుందర చక్రవర్తి (అమృత బజార్ పత్రిక) కూడా వ్యతిరేకించాడు. ఇందుకు చిత్తరంజన్‌దాసు గారికి కోపం వచ్చింది. ‘‘అవును బెంగాల్‌ను విడిచి దేశ రాజకీయాలను మీరు నిర్వహించుదురుగాని లెండి’’ అని కోపంతో అన్నారు.
ఆ సాయంత్రం ఆయన సభలో పాల్గొనలేదు. ఆనాటి విషయాలు ఈనాడు సింహావలోకనం చేసుకుంటే, ఆ త్యాగమూర్తి దేశబంధు చిత్తరంజన్ దాసు సూచించిన బెంగాల్ ప్యాక్టులు (బెంగాల్ ముస్లిం హిందూ ఒడంబడిక) అంగీకరించి ఉంటే దేశ విభజన జరిగి ఉండేది కాదేమో! ఆనాడు ఆయన తీర్మానాన్ని కాంగ్రెస్ అంగీకరించలేకపోవట దురదృష్టకరమని భావిస్తున్నాను.

గాంధీజీ ప్రశంస

ఆంధ్రులను గురించి మహాత్ముని ప్రశంసా వాక్యలను ఇందు పొందుపరుస్తూన్నాను.
”ఆంధ్రులు పుష్టిగా వుంటారు. వారు శక్తివంతులు. వుదార స్వభావులు. ప్రేమాదరాలను చూపగలరు. తమ దేశ భవిష్యుత్తులో వారికి విశ్వాసం వున్నది. ఆడవారేగాక, మగ వారు కూడా బంగారు నగలు దండిగా పెట్టుకుంటారు. నా కంటబడడమే పాపంగా వాటిని నేను స్వాహా చేస్తూ వచ్చాను. తిలక్ స్వరాజ్యనిధికి నాకు కావాలనగా స్త్రీ పురుషులు వాటిని సంతోషంగా యిచ్చివేశారు. ఆరు రోజులలో యాభై వేల రూపాయల నగలను వారు నాకిచ్చారు. మరిన్ని అందజేస్తామని వాగ్దానం చేశారు. కోరుకుంటే ఆంధ్రులే తమ నగలనివ్వడం ద్వారా తిలక్ స్వరాజ్యనిధికి కావలసిన కోటి రూపాయలను బహుశా సమకూర్చగలరు.
ఆంధ్రదేశం నన్ను సమ్మోహితం చేసింది. చాలాకాలంగా బీహార్ నా అభిమాన రాష్ట్రం. ఆంధ్రదేశం ఇప్పుడు నా నిశ్చయంగా ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్నది. ఆంధ్రకు దిట్టమైన ప్రజాసేవకులున్నారు. దానికి సాధన సంపత్తి వున్నది. కవిత్వమే వున్నది. దానికి దేశంపట్ల భక్తివిశ్వసాలున్నాయి. స్వార్ధం, త్యాగబుద్ధి వున్నది. దానికి అనేకమైన జాతీయ విద్యాలయాలున్నవి. జాతీయోద్యమానికి అది పెక్కుమంది న్యాయవాదులను సమకూర్చింది. ఖద్దరు పరిశ్రమకు అక్కడ చాలా అవకాశాలున్నాయి. పత్తి పండుతుంది. సాగునీటి వనరుల కూడలి. రెండు మహానదులున్నాయి. ఒకనాడు ఎంతో ప్రసిద్ధిగాంచిన ఓడరేవులు ఎన్నోవున్నాయి” – 1921 నాటి ఆంధ్ర పర్యటన (Collected works of Mahatma Gandhi VOL-19)
1921 సంవత్సరంలో మహాత్మునికి ఆంధ్రలయెడ కల్గిన సద్భావాని కణుగుణంగానే 1929లో కూడా అన్ని జల్లాలలోని ప్రజలు ఉదారంగా వర్తించుట మనకు ఆనందదాయకం, గర్వకారణం.
గ్రామాలలో మా కాంగ్రెసు పచ్రారం
గ్రామాలవెంట తిరిగి కాంగ్రెసు సందేశాన్ని ప్రజలకందజేసి ఆచరింపజేయుట మా విధి కృత్యంగా 1920లో భావించాము. శ్రీ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య (పండిత) నేను తరచు గ్రామాలవెంట వెళ్ళేవారము.
ఒక రోజున ఉదయం 9 గంటలకు భోజనం చేసి ఘంటసాల నుంచి బయలుదేరి మైలు దూరంలో వున్న బోళ్ళపాడు వెళ్ళాము. ఆ ఊరంతా యాదవులే. శ్రీ వెంకట సుబ్బయ్య, నేను మాట్లాడాము. అప్పుడు మా ఉపన్యాసాలలో కల్లు, సారా తాగవద్దని, అంటరానితనం పాటించరాదని గ్రామాలలో తగాదాలు లేకుండా ఐక్యమత్యంతో వుండాలని, ఏమైనా అభిప్రాయ భేదాలు వస్తే గ్రామస్థులే పంచాయతీల ద్వారా పరిష్కరించుకోవాలని, వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించాలని, కాంగ్రెసు చరిత్ర మహాత్ముని సందేశం వారికి నచ్చేటట్టు చెప్పాము.
తరువాత ఒక మైలు దూరంలో వున్న మల్లంపల్లి వెళ్ళాము. అక్కడ యాదవులు కల్లు సారా వృత్తిగాగల గౌడలు వున్నారు. కల్లుగీత కూడదనే మా ప్రచారం వారికి గిట్టనిది అయినప్పటికి మేము చెప్పినది శ్రద్ధాభక్తులతో విని మమ్ములను గౌరవంగా ఆ గ్రామం నుంచి సాగనంపారు.
తరువాత కాజ వెళ్ళాము. అది పెద్ద గ్రామం, వ్యవహార దక్షతగల బ్రాహ్మణులు, కొంతమంది మహమ్మదీయులు, విశేష జనసంఖ్యలో రెడ్లు, గౌడలు కలరు. పెద్ద సమావేశమే జరిగింది అన్ని వృత్తుల వారు ఆప్యాయతతో మేము చెప్పేది విని కాంగ్రెసు ఉద్యమం యెడ సానుభూతి సద్భావాలు వెల్లడించారు.
తరువాత 1930 సంవత్సరం నాటికి ఆ ఊరిలో యువకులు రామిరెడ్డి, సుబ్బారెడ్డి, పేకేటి వీరారెడ్డి, పేకేటి రంగారెడ్డిగార్లు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైళ్ల యాత్రకు వెళ్లడం, ప్రముఖ కాంగ్రెస్ కార్యకర్తలుగా గణనీయమైన కాంగ్రెసు ప్రచారం చేశారు.
అప్పటికి సాయంత్రం నాలుగు గంటలైంది. ఉదయం 9 గంటలకు భోజనం చేసిన మాకు ఆకలి మండుకు పోతోంది. ఈనాటి వలే ఆనాడు పల్లెటూళ్లలో కాఫీ హోటళ్లు లేవు. గృహస్థుల ఇళ్లలో కూడా కాఫీ, టీ, పానీయాల అలవాట్లు లేవు. మమ్ము ఎరిగినవారు ఆ ఊళ్లో ఉన్నప్పటికీ మాకు ఆతిథ్యమిస్తే వారిని కూడా జైళ్లకు పంపుతారనే భయం వారికుంది. ఆ స్థితిలో ఒక మిత్రుడు మీటింగ్ అయిన తర్వాత చాటుగా వారింటికి తీసుకెళ్లి మజ్జిగ ఇచ్చారు. దానితో మా ప్రాణాలు కుదుటపడ్డవి.
తరువాత పద్దారాయుడు తోట వెళ్లాము. అక్కడ మాట్లాడాము. ఆ తర్వాత మద్దిపట్ల అనే గ్రామం వెళ్లాము. సాయంకాలం ఏడు గంటలకు సభ ప్రారంభం. 9 గంటల వరకు జరిగింది. జనం బాగానే వచ్చారు. ఒక రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ మమ్ములను అనేక ప్రశ్నలు వేసి వేధించాడు. మాకు చిన్నతనం. అప్పటికి జైళ్ల యాత్ర చేయలేదు. ఉపన్యాసాలు కూడా ధాటిగా చెప్పడానికి అలవాటు పడలేదు. ఆయన ఉద్యోగ దర్పంతో వేసే ప్రశ్నలకు తట్టుకుని సమాధానం చెప్పాము. ప్రజలు ఆనందించారు.
సభ సమాప్తి అయిన తర్వాత ఎవరింటికి వారు వెళ్లారు. మాకు ఆహారం ఏమీ లేదు. మాకు పరిచయం కలిగి కాంగ్రెస్‌కు సానుభూతిపరుడైన ఆ గ్రామ కరణంగారు ఆ రోజునే బందరు వెళ్లారు. ఆకలి బాధ, ఎనిమిది మైళ్ల దూరంలో ఉన్న మా గ్రామానికి నడిచి వెళ్లే శక్తిలేదు. పైగా చీకటి. మేము కట్టుబట్టలతో వచ్చాము. వేరే బట్టలు లేవు. పక్కబట్టలు కూడా లేవు. పై ఉత్తరీయం చుట్టి తలకింద పెట్టుకుని అలసిపోయిన ప్రాణంతో వీధి అరుగుల మీద పడుకుని నిద్రపోయాము. రాత్రి పొద్దుపోయిన తర్వాత 11,12 గంటల వేళ ఒక ఆచార్యుల వారు మమ్ములను తట్టిలేపి నెమ్మదిగా తమ ఇంటికి భోజనానికి రావలసినదిగా చెప్పి తీసుకెళ్లారు. ఆయన చూపిన ఆప్యాయత, ప్రేమ మరువరానిది. కొబ్బరి తురుములో కలిపిన పొట్లకాయ కూర, పెరుగు, పచ్చళ్లు, వెన్నకాచిన నెయ్యితో మాకు భోజనం పెట్టారు. బతుకు జీవుడా అని ఆ రాత్రి వారింటనే పరుండి తెల్లవారుజామున లేచి గ్రామస్థులకు కనబడకుండా, మాకు వారిచ్చిన ఆతిథ్యం తెలియనీయకుండా ఘంటసాల తిరిగి వచ్చాము.
ఈ విధంగా మా ప్రచార కార్యక్రమాలు జరిగాయి. ప్రజలకు కాంగ్రెసు యందు, మహాత్ముని యందు భక్తి తత్పరతలున్న, వారు దేశ భక్తి గలవారైనా ఆనాటి ప్రభుత్వం ఎడల భయం, పోలీసు జులుముకు ఎదురు తిరగడానికి నిస్సహాయులుగా ఉండేవారు.

Share: